GOOD NEWS ఆర్మీ ఉద్యోగాలకు సింగరేణి రెసిడెన్షియల్ శిక్షణ

సింగరేణి ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఆర్మీలో ఉద్యోగాలు కల్పించడానికి సింగరేణి సంస్థ ఒక వినూత్న ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఆర్మీలో చేరాలనుకొనే యువతకు ప్రాథమిక అర్హతా పరీక్షలు నిర్వహించి కనీస అర్హత గల 450 మందిని ఎంపిక చేసి వీరికి 3 నెలల పాటు రెసిడెన్షియల్ తరహాలో ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

1

ఇంతపెద్ద మొత్తంలో యువతకు 3 నెలల కాలం పాటు ఉచిత భోజన, వసతులు కల్పించి ప్రీ ఆర్మీ రిక్రూట్ మెంట్ శిక్షణ ఇవ్వడం రాష్ట్రంలోనే ప్రథమం అని, ప్రభుత్వ సంస్థలు ఇటువంటి చొరవ చూపడం చాలా అరుదు అని ఆర్మీ రిక్రూట్ మెంట్ విభాగం అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఏదో మొక్కుబడిలా కాకుండా, పూర్తి చిత్తశుద్ధితో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని, శిక్షణ పొందిన వారిలో నూటికి నూరుశాతం ఆర్మీలో ఉద్యోగాలు పొందేలా చూడాలని సంస్థ ఛైర్మన్ & ఎం.డి. ఎన్.శ్రీధర్ ఆదేశించడంతో డైరెక్టర్ (ఆపరేషన్స్ & పా)  ఎస్.చంద్రశేఖర్ రెసిడెన్షియల్ శిక్షణ శిబిరాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు.
2
3 చోట్ల రీజియన్ క్యాంపులు – రోజంతా శిక్షణలో అభ్యర్ధులు
సింగరేణిలోని 11 ఏరియాల నుండి ఎంపిక చేసిన 450 మంది అభ్యర్ధులకు రీజియన్ల వారీగా 3 క్యాంపుల్లో శిక్షణలను ఇస్తున్నారు. మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం, కార్పోరేట్ ఏరియాలకు సంబంధించిన 150 మందికి రుద్రంపూర్ లో, రామగుండం-1, 2, 3, భూపాలపల్లి ఏరియాలకు చెందిన 150 మందికి రామగుండం-2 ఏరియాలో, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలకు చెందిన మరో 150 మందికి శ్రీరాంపూర్ లో శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఆర్.జి.-2 రీజియన్ శిక్షణ శిబిరాన్ని డైరెక్టర్ (ఆపరేషన్స్ & పా)  ఎస్.చంద్రశేఖర్ ప్రారంభించారు.

3

గతంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ శిక్షణా కార్యక్రమాలను స్థానిక ఎస్.&పి.సి., ఉద్యోగులు లేదా క్రీడాకారులతో ఇప్పిస్తుండేవారు. కానీ ఈ సారి దీనికి భిన్నంగా రిటైర్డు ఆర్మీ అధికారులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎందుకంటే ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో నిర్వహించే వివిధ రకాల పరీక్షలు, వాటికి కావాల్సిన సామర్ధ్యాలు, సామర్ధ్యాల సాధనకు చేయాల్సిన కసరత్తుల గురించి ఆర్మీకి చెందిన వారికే ఎక్కువ అవగాహన ఉంటుంది. ఈ సారి రిటైర్డు ఆర్మీ అధికారుల సహకారం తీసుకోవడం ద్వారా నూటికినూరు శాతం అభ్యర్ధులు ఉద్యోగాలు పొందగలరన్న విశ్వాసాన్ని నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు.
4
దీనితో పాటు రాత పరీక్షలో కూడా మంచి తర్ఫీదునివ్వడానికి సింగరేణి రిటైర్డు ఉపాధ్యాయుల బృందాలను నియమించారు. రాత పరీక్షకు కావాల్సిన మెటీరియల్ ను 3 రీజియన్ కేంద్రాలకు సప్లై చేశారు. ప్రణాళిక ప్రకారం బోధించడంతో పాటు రోజూ పరీక్షలు నిర్వహించి, లోటుపాట్లను సవరిస్తూ, యువకులను రాత పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.

5

చక్కని వసతి – మంచి భోజన ఏర్పాట్లు
రీజియన్ స్థాయి ప్రీ-ఆర్మి రిక్రూట్ మెంట్ కేంద్రాలలో చక్కని వసతి, బోజన ఏర్పాట్ల కోసం సేవాసమితి కావాల్సిన నిధులను కేటాయించింది. 150 మందికి సరిపడ బెడ్లు, దుప్పట్లు, మంచినీరు వంటివి ఏరియా జి.ఎం. స్థాయి అధికారుల సూచనలపై తగిన విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మంచి శారీరక ధారుఢ్యం పెంపొందించుకోవాల్సి వస్తుంది కనుక మంచి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఉదయం పూట 6 గంటల సమయంలో ఫిజికల్ ట్రైనింగ్ సందర్భంగా రెండు గుడ్లు, గ్లాసు పాలు, ఇక అరటిపండు ఇస్తున్నారు. అనంతరం 8 గంటలకు సాధారణ అల్పాహారంగా 100 గ్రాముల శనగలతో పాటు. రోటీ, పరోటా, ఇడ్లీ, పూర్లీ వంటి ఏదైనా ఒక టిఫిన్ ఇస్తున్నారు. మధ్యహ్నాం సాధారణ, భోజనంతో పాటు వారంలో రెండు సార్లు మాంసాహారం ఇస్తున్నారు. రాత్రివేళ సాధారణ భోజనం పెడుతున్నారు.

6

ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ శిక్షణలు
ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ రీజినల్ శిక్షణ శిబిరంలో శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్ధులు ఉదయం 5 గంటలకు లేచి 6 గంటల కల్లా ఫిజికల్ యాక్టివిటీకి సిద్ధం కావాలి. వామ్ అప్తో పాటు పరుగెత్తడం, దూకడం, బిస్కిలు తీయడం వంటివి చేయిస్తున్నారు. 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్ తర్వాత 9 గంటల నుండి మధ్యహ్నాం 12.45 వరకూ లెక్కలు, సైన్సు, రీజనింగ్, ఇంగ్లీషు సబ్జెక్టులలో థియరీ బోధిస్తున్నారు. 1.30 కి లంచ్, ఆ తర్వాత 3.30 నుండి 6 గంటల వరకూ తిరిగి ఫిజికల్ యాక్టివిటీ, ఆటలు నిర్వహిస్తున్నారు. 7.30 కి రాత్రి భోజనం పెడుతున్నారు. రాత్రి 8 నుండి 9 వరకూ స్ఫూర్తిదాయక పాఠాలు, రివిజన్, రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు.

7

ఆర్మీ ఉద్యోగంలో చేరికపై స్ఫూర్తిదాయక పాట విడుదల
ఇదిలా ఉండగా ప్రీ ఆర్మీ శిక్షణలో పాల్గొంటున్న వారిలో స్ఫూర్తి నింపడానికి సింగరేణి ఉద్యోగి, ప్రజాకవి జయరాజు ఒక పాటను రాయగా ఈ పాట సి.డి. ని జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్ మరియు సింగరేణి సేవా సమితి ఉపాధ్యక్షులు ఆంటోనిరాజా, జనరల్ మేనేజర్ (ఎఫ్.&ఎ) నర్సింహామూర్తి లు బుధవారం (ఆగష్టు 14వ తేదీ) నాడు హైద్రాబాద్ లో విడుదల చేశారు.
సైన్యంలో చేరడం ఎంత గర్వకారణమో, సింగరేణి సేవా సమితి ద్వారా సింగరేణి సంస్థ నిరుద్యోగులకు అందిస్తున్న సేవలు ఎటువంటివో ఈ పాట ద్వారా చక్కగా వివరించారు, ఈ పాటను రీజియన్ క్యాంపుల్లో ప్లే చేయనున్నట్లు సింగరేణి వ్యాప్త కో-ఆర్డినేటింగ్ అధికారి మరియు పి.ఆర్.ఓ  బి.మహేష్ తెలిపారు. సింగరేణి సంస్థ గతంలో ఎన్నడూ ఇంత భారీ ఎత్తున ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీకి ముందస్తు శిక్షణ శిబిరాలు నిర్వహించలేదు.

picture :indianarmy.nic.in

(pressnote from CPRO SCCL)