ఇతగాడి ‘ఇడ్లీ సాంబార్ సక్సెస్ స్టోరీ’ ఇలా తలకిందులయింది…

ఈ ఫోటోలో ఉన్న పెద్ద మనిషి పేరు రాజగోపాలన్ (71). నుదటి మీద తమిళనాడుట్రేడ్ మార్క్ విభూది,  తళత్తళ లాగే తెల్లటి ధోతి..నల్లటి విగ్రహం.. ఎక్కడున్నా కొట్టొచ్చికనబడతాడు.
మామలూగా నయితే, ఇతగాడిదొక అద్భుతమయిన సౌత్ ఇండియా సక్సెస్ స్టోరీ. సౌత్ ఇండియా దోసె ఇడ్లీ, సాంబార్, చట్నీలను గోబలైజ్ చేసిన కిరాణ షాపు వోనర్.ఒక విధంగా హీరో.  ఉల్లిగడ్డల వ్యాపారం చేసుకుని బతికే ఒక పేదవాడి కొడుకు.
చిన్న కిరాణ షాపుతో జీవితం ప్రారంభించి,సాహసం చేసి హోటల్ బిజినెస్ లోకి ఎంటరయ్యాడు.
శరవణ భవన్ పేరుతో అందమయిన, రుచికరమయిన మిడిల్ క్లాస్ మద్రాసీ  విజిటేరియన్ రెస్టరెంట్లను చెన్నైలో ప్రారంభించి, ప్రపంచంలో సౌత్ ఇండియన్ అనేవాడున్న ప్రతిదేశంలో కాలు మోపాడు. ఇడ్లీ వడ దొసెలను అందుబాటులోకి తెచ్చాడు.
బిజినెస్ లో పిచ్చి పిచ్చిగా  విజయవంతమయ్యాడు.
సౌత్ ఇండియన్స్ కే కాదు, ఇతర వాళ్లు కూడ ఇడ్లీ , దోసె, వడ సాంబార్ కు బానిసలను చేసిన ఘరానా.
శుచి,రుచి లలో ఎపుడూ రాజీ పడే రకం కాదు. ఫ్యామిలీతో  బయటకు వెళ్లి చవగ్గా అరిటాకులో మాంచి ఫుల్ భోజనం  చేసి రావాలనుకుంటున్న ప్రతి  మిడిల్ క్లాస్  వెజిటేరియన్ కు ఒక డిసెంట్ అడ్డా అందించినవాడు రాజగోపాలన్.
శరవణ్ భవన్ ఎక్కడ ప్రారంభించిన మరుక్షణం నుంచి కిటకిట లాడుతూ ఉంటుంది. మూడు రోజుల్లో ఎంత నగరమయినా సౌత్ ఇండియా ఇడ్లీ, వడ, సాంబార్ గుభాళించేలా చేసేస్తాడు.
రాజగోపాల్  కోట్లు గడించాడు. దాంతోపాటు మూఢనమ్మకాలను విపరీతంగా పోగేసుకున్నాడు.  దారి తప్పాడు. అంతే, విజయం హిమాలయం నుంచి కాలు జారి దొర్లడం మొదలు పెట్టాడు. నిన్న అంటే జూలై ఏడున, యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించేందుకు చెన్నై కోర్టు లో లొంగిపోవలసి ఉండింది. .
అయితే, హెల్త్ బాగా లేదని చెప్పి వాయిదా కోరాడు. సరెండర్ కాకూడదనే ఒక వారం కిందటే ఆయన ఆసుపత్రిలో చేరాడని మీడియా కథనం. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదని,సరెండర్ అయేందుకు మరింత సమయం కావాలనే కారణాలను …. రేపు కోర్టు పరిశీలించనుంది.
ఇంతకీ రాజగోపాలన్ ఏంచేశాడంటే…
రాజగోపాలన్ కు మూడనమ్మకాలు బాగా ముదిరాయి. ఎవరో స్వామీజీ చెప్పిన సలహా ప్రకారం ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. డబ్బొస్తే విశ్వాసాలు పెరుగుతాయి. ముదురుతాయి.
ఆయన హోటలెక్కడున్నా గోడ మీద రెండేరెండు ఫోటోలుంటాయి. ఒకటి తన కొడుకులతో కలసి దిగిన ఫోటో. రెండోది తనకు ముహూర్తాలుచూసి పెట్టే గురువుది.
ఆయన కొంపముంచింది. ఈ గురువు గారి సలహాయేనని చెబుతారు.
గురువు సలహా ప్రకారం తన దగ్గిర పనిచేసే ఒక వ్యక్తి కూతురు జీవజ్యోతి మీద వయసుతో నిమిత్తం కన్నేశాడు.
పెళ్లిచేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తాను బాసు,దండిగా డబ్బుంది కాబట్టి  నోరు మూసుకుని పెళ్లికి అమ్మాయి ఒప్పుకుంటుందునుకున్నాడు.
ప్రపోజ్ చేశాడు.జీవజ్యోతి తిరస్కరించింది. అయితే, జ్యోతిష్యుడు చెప్పిందాని ప్రకారం ఆయనకు ఆమెతో పెళ్లి కావాలి. అయితే, జీవజ్యోతిఅప్పటికే ప్రిన్స్ శాంతకుమార్ అనే యువకుడిని ప్రేమిస్తూ ఉంది.
రాజగోపాల్ వత్తిడి భరించలేక, ఆమె శాంతకుమార్ ను పెళ్లి చేసుకుంది. అయినా సరే రాజగోపాల్ ఆమెను వదల్లేదు. భర్తను వదిలేసి తన దగ్గిరకు రమ్మన్నాడు. అమె అంగీకరించలేదు. దీనితో ఆయన జీవజ్యోతి భర్తను హత్యచేయించాలనుకున్నాడు.
భర్తను లేపేస్తే గత్యంతరం లేక ఆమె తనదగ్గిరకు వస్తుందని  అత్యాశకు పోయాడు. కిరాయి హంతకులతో మొత్తానికి శాంతకుమార్ ను కిడ్నాప్ చేయించి, హత్య చేయించాడు.
ఇది ఇరవై ఏళ్ల కిందట 2001 జరిగింది. 2004 లో ఈ హత్య కేసులోరాజగోపాలన్ దోషి అని తేలింది. ఆయన దగ్గరున్న కోట్లు కాపాడలేకపోయాయి. హత్యకు పది సంవత్సరాలజైలు శిక్ష పడింది. ఆయన అప్పీలుకు వెళ్లాడు. అక్కడ కింది కోర్టు హత్యానేరాన్ని సమర్థించడమే కాదు, పదేళ్ల శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చారు. శిక్ష అనుభవించేందుకు జూలై 7న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అదీ కథ.