తెలంగాణ అమర్నాథ్  “సలేశ్వరం”

ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురు చూస్తున్న తెలంగాణ అమర్నాథ్ యాత్ర … సలేశ్వరం సాహస యాత్ర ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 17 నుంచి 21 వరకు సలేశ్వరం  జాతర సాగుతోంది. నాగరు కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ సలేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడికి చేరాలంటే అంతా మామూలు కాదు.

అమర్నాథ్ యాత్ర ఎలాగ ఉంటుందో ఈ సలేశ్వరుని యాత్ర కూడా అలాగే ఉంటుంది. చుట్టూ కొండలు, గుట్టుల, వాగులు, వంకలు, చెట్లు చేమతో నిండి ఉంటుంది. అసలు ఈ తెలంగాణ అమర్నాథ్ యాత్ర సలేశ్వరం చరిత్ర తెలుసుకుందాం..

నింగి నుంచి నేలకు దిగుతున్న ఆకాశ గంగను తలపించేలా మహత్తర జలపాతమది.ఈ ప్రకృతి రమణీయ ప్రదేశం ఒకప్పుడు సర్వేశ్వరంగా పిలువబడి ప్రస్తుతం సలేశ్వరంగా ప్రసిద్ధిగాంచింది. శైలమంటే కొండ. కొండలో ఈశ్వరుడున్న ప్రదేశం కావటంతో శైలేశ్వరం అనే పేరుతో కూడా పిలుస్తారు.

దట్టమైన అడవి ప్రాంతంలో కొండలు,గుట్టల మధ్య కొలువైన సలేశ్వర క్షేత్ర బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి సమయాన జరుగుతాయి. వేయి అడుగుల లోతున ఉన్న లోయలోని సలేశ్వరం లింగమయ్యను భక్తులు దర్శనం చేసుకుంటారు.

నిటారు కొండలు,పచ్చని చెట్లు, రాళ్లు రప్పల మధ్య గంటల తరబడి నడుస్తూ దర్శనానికి ‘వస్తున్నాం లింగమయ్య’ అని, తిరిగి వెళ్లేటప్పుడు ‘పోయోస్తాం లింగమయ్య’ అంటూ భక్తుల నినాదాలతో కారడవి “శ్రీ రామలింగేశ్వర స్వామి” నామస్మరణతో మారుమోగుతుంది.లోయ మార్గంలో ఒక్కొక్కరు మాత్రమే నడవడానికి దారి ఉండటంతో వచ్చిపోయే వారు ఒకరిని ఒకరు పట్టుకుని లోయలోకి దిగాలి.

సలేశ్వరం లోయలో వేయి అడుగుల ఎత్తు నుంచి గలగల పారే జలపాతం దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంటుంది. పైనుండి చల్లని నీరు ధారగా వస్తుంది. జనం పెరిగే కొద్దీ నీటిధార పెరుగుతుంది.ఈ జలపాతంలో స్నానం చేస్తే సర్వరోగాలు పోతాయని,ఆయుష్షు పెరుగుతుందని భక్తుల విశ్వాసం.

ఆలయ ద్వారానికి కుడివైపున వీరభద్రడు,దక్షుడి విగ్రహాలు, ఎడమవైపున రెండు సిద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఆలయానికి ముందు భాగంలో 10 అడుగుల క్రింద సర్వేశ్వర తీర్థం ఉంది. ఈ మార్గంలో వెళ్లే భక్తులకు ప్రకృతి లో చూడదగ్గ ప్రదేశాలు కనిపిస్తాయి. ఏడురంగుల చెరువు, మనిషి ఎత్తున ఉండే పుట్టలు,  గూర్జగుండం, మోకాళ్ళ కురువలు కనువిందు చేస్తాయి.

సలేశ్వరానికి ఈ మార్గాల గుండా వెళ్లవచ్చు.

1.లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామం మీదుగా కాలినడకతో పాటు ట్రాక్టర్ మీద మాత్రమే అతికష్టం మీద సలేశ్వరం చేరుకునే వీలు ఉంటుంది.

2.అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ చేరుకోవాలి. మన్ననూర్  కు 20 కి.మీ.దూరంలో ఉన్న ఫరహాబాద్ చౌరస్తా నుంచి అడవి మార్గంలో 40 కి.మీ.దూరంలో ఉన్న రాంపూర్ పెంటవద్దకు వాహనాలు వెళ్లేందుకు వీలుంటుంది. అక్కడ నుండి 4 కి.మీ.దూరం కొండలు,లోయలు,గుట్టల మధ్య కాలినడకతో సాహసయాత్ర అనంతరం లింగమయ్య దర్శన భాగ్యం కలుగుతుంది.

ఈ అడవుల ప్రాంతంలో చెంచులు నివసిస్తారు. వారికి ఇండ్లు కూడా ఉండవు. చెట్ల మధ్యనే బతుకుతారు. పండ్లు ఫలాలే వారి ఆహారం. జంతువులను వేటాడి తింటారు. చెట్ల కిందే వారి జీవనం. వారికి బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. ఆడవారు డెలివరి సమయంలో సరైన వైద్యం అందక చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. చరిత్ర గల పుణ్యక్షేత్రమైన సలేశ్వరాన్ని తెలంగాణ  ప్రభుత్వం అభివృద్ది చేయాలని, చెంచులకు కూడా సరైన వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *