విశాఖ తీరంలో ఆగని విధ్వంసం…ఇసుక తిన్నెలనూ వదలడం లేదు

విశాఖ తీర ప్రాంతానికి ఆందాన్ని తెచ్చే సహజ సంపద అయిన ఇసుకతిన్నెలను నాశనం చేయవద్దని, వ్యాపారాభివృద్ధి కోసం ప్రయివేటు పరం చేయడం సబబుకాదని ప్రముఖ పర్యావరణ నిపుణుడు, మాజీ కేంద్ర ప్రభుత్వం కారదర్శి డాక్టర్ ఇఎఎస్ శర్మ రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంలో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ( సి.ర్.జెడ్)-2011నోటిఫికేషన్ తోపాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తు అభివృద్ధి పేరుతొ హోటల్/రెస్టారెంట్లు వ్యాపారాల నిర్మాణం కొరకు ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్ద  ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతున్నదని ఆయన అన్నారు.

విశాఖపట్నం రుషికొండ తీరప్రాంతాన్నిఇలా  అప్పగించాలనుకోవడం వల్ల చాలా అనర్థాలున్నాయని ఆయన  ఆక్షేపణ తెలిపారు.

రుషికొండ గ్రామం సర్వే నెంబర్: 61&55.లో సముద్ర తీరప్రాంత ఇసుక తిన్నెలను వ్యాపారాల కోసం అప్పచెప్పాలనుకోవడం మీద ఆయన ఈ రోజు పర్యావరణ శాఖ కార్యదర్శికి లేఖ రాస్తూ తన అభ్యంతరాలను తెలిపారు.

ఇదే సమయంలో ఇక్కడ ఇసుక తిన్నెలను హోటళ్లకు, రెస్టారెంట్లకు దారాదత్తం చేయడం వల్ల తమ జీవనోపాధి పోతుందని మత్య్సకారుల సంఘం కార్యదర్శి తెడ్డు శంకరరావు రాసిన ఒక వినతిపత్రాన్ని కూడా ఆయన తన లేఖకు  జత చేశారు.

‘మీరు అభివృద్ధి పేరుతొ హోటల్/రెస్టారెంట్లు వ్యాపారాల నిర్మాణం కొరకు  ఏ ప్రాంతాన్ని  ప్రతిపాదించారో ఆ ప్రదేశం సి.ఆర్.జెడ్ జోన్-I పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతం  ఇసుకు తెన్నెలతో సహజసిద్దంగా ఏర్పడిన సుందరమయిన ప్రాంతం. ఇక్కడ అభివృద్ధి నిర్మాణాలు చేపట్టడం నిషేధం. సి.ఆర్.జెడ్ జోన్-I పరిధిలో  కేవలం అనుమతించిన శాశ్వత నిర్మాణాలు మాత్రమే చేసుకోవాలి. రుషికొండ కూడా  సి.ఆర్.జెడ్ జోన్-I ప్రదేశం కాబట్టి  టూరిజం శాఖ నిర్ణయాలుపూర్తిగా చట్ట ఉల్లంఘన అవుతాయి. అంతేకాదు, రిట్ పిటిషన్ (WP) నెంబర్  నెం. 110/2018 & 8177/2007 మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాల దిక్కరణ కూడా అవుతుంది.

‘ఈ కారణాన మీరు అభివృద్ధి పేరుతొ హోటల్/రెస్టారెంట్లు కొరకు ఇచ్చిన ప్రదేశం మా మత్స్యకారుల చేపలవేటకు ఉపయోగించుకునే ప్రదేశం. ఇలా మత్స్యకారుల చేపలవేట కోసం ఉపయోగించుకునే ప్రదేశాలలో ఇతరత్రా వ్యాపారాల  కొరకు మరొకరికి దారాదత్తం ఇవ్వడం వలన మాకు భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురికావలసి వస్తుంది.మా జీవనో పాధి దెబ్బతింటుంది.

‘ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్ద  అభివృద్ధి పేరుతొ హోటల్/రెస్టారెంట్లు వ్యాపారాల కొరకు తీసుకున్న రుషికొండ తీరప్రాంతం( గ్రామ సర్వే నెంబర్: 61&55)లోని  సముద్ర ఇసుక తిన్నెల మీద కొంతమంది ప్రవేట్ వ్యక్తులు 13-04-2019 రాత్రి తొమ్మిది గంటల నుండి అర్దరాత్రి రెండు గంటల వరకు చాలా అసభ్యకరంగా ప్రవర్తించారు. విశాఖ ప్రజలు సిగ్గుతో తలదించికోనేలా వారు అక్కడ మద్యం, గంజాయి లాంటివాటితో జల్సా చేసుకుని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డారు. భవిష్యత్తులో అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేస్తారోఏమో నని భయపడేందుకు ఇది ఒక సూచన, ’ అని  శంకర రావు తన వినతపత్రంలో  పేర్కొన్నారు.

విశాఖపట్నం రుషికొండ తీరప్రాంతంలోని ఇసుక తిన్నెలను సి.ఆర్.జెడ్ 2011నోటిఫికేషన్,  హైకోర్ట్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ హోటల్/రెస్టారెంట్లు వ్యాపారాల కొరకు చేసుకున్న ఒప్పదాలను రద్దు చేసుకోవాలని శంకర్ రావు కోరారు.

ఈ లేఖ మీద చర్యలు తీసుకోవాలని డాక్టర్ శర్మ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్నికోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *