Home News కాంగ్రెస్ పార్టీకి “జీవి గంజి” పోసిన రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి “జీవి గంజి” పోసిన రేవంత్ రెడ్డి

284
0
SHARE
తెలంగాణలో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితి నెలకొంది. జాతీయ రాజకీయాలలో మరియు ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ కాలం వారే పరిపాలించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఏపీలో కూడా ప్రాంతీయ పార్టీల హవా నడిచింది. ఆ తర్వాత 2004, 2009లో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో ప్రజల అభీష్టం మేరకు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఆ తర్వాత రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అధికారంలోకి వస్తుందనుకున్నా ప్రజలు కేసీఆర్ కి పట్టం కట్టారు. రెండో సారి కూడా ప్రజలు కేసీఆర్ కే పట్టాభిషేకం చేశారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టిఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతూనే ఉంది. అయితే కాంగ్రెస్ పెద్దలు దీనిని పెద్దగా పట్టించుకోకపోవడంతో నష్టం జరిగిందని పలువురు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్ లు టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. త్వరలోనే తాము కారు ఎక్కబోతున్నట్టు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు అలర్ట్ అయ్యి ఇల్లు చక్కబెట్టే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కూడా కేటిఆర్ చర్చలు జరిపారు. వీరిద్దరి మద్య మధ్యవర్తిత్వాన్ని అసదుద్దీన్ నడిపారు. సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డికి చేవేళ్ల ఎంపీ టికెట్, సబితకు మంత్రి పదవి ఇస్తారని కూడా చర్చ జరిగింది. అయితే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పెద్దలు ఉత్తమ్ కుమార్  రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క సబితతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సబితా వారి పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ విధానాలు మారకపోవడం వల్లే గెలవలేకపోయామని ఓడిపోయినా కొందరిలో మార్పు రావడం లేదని ఆమె నిలదీసినట్టు తెలుస్తోంది.
సబితా ఇంద్రారెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చాలా ఆప్తురాలు. చెల్లెమ్మ అని ఆయన ఆప్యాయంగా పిలిచేవారు. దేశంలోనే తొలి సారిగా  హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళగా సబితా  ఇంద్రారెడ్డి నిలిచిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా సబితా ఇంద్రారెడ్డికి పేరుంది. సబితా ఇంద్రారెడ్డి పార్టీని వీడితే పెద్ద దెబ్బ ఎదురవుతుందని, అధికారపక్షానికి ఇది పాజిటివ్ గా మారి మరింత దెబ్బకొట్టే అవకాశం దక్కుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గమనించారు.
సోమవారం సాయంత్రం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డితో భేటి అయ్యారు. దాదాపు గంట పాటు వారితో చర్చించారు. అక్కడి నుంచే పార్టీ అధినేత రాహుల్ గాంధీతో ఫోన్లో వారిని మాట్లాడించారు. సమస్య పరిష్కారమయ్యేలా చూసిన రేవంత్ రెడ్డి.. సబితా పార్టీ మారకుండా చేశారు. రేవంత్ ,సబిత, కార్తీక్ రెడ్డి మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం రాహుల్ తో భేటి కానున్నారు.
రేవంత్ రెడ్డి చూపిన చాతురతను అంతా ప్రశంసిస్తున్నారు. ఆరిపోతున్న దీపాన్ని వెలిగించారని, పార్టీకి జీవిగంజి పోశారని అంతా చర్చించుకుంటున్నారు. పార్టీ కీలక నేతలు వచ్చి చర్చించినా వినని సబితా రేవంత్ తో చర్చించాక తన మనసు మార్చుకున్నారు. రేవంత్ రెడ్డి సరైన సమయంలో చర్చలు జరిపారని లేకపోతే పార్టీ పరిస్థితి మరింత గందరగోళంగా తయారయ్యేదని చర్చ జరుగుతోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి సరైన సమయంలో ఎంట్రీ ఇచ్చి చక్రం తిప్పారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మరోసారి తన రాజకీయ చతురతను ప్రదర్శించారని అంతా కొనియాడారు.

 

ఈ వార్త కూడా చదవండి

 

కాంగ్రెస్ లో కుంపటి పెడుతున్న ఆ సొంత నేత ఎవరు?