మరొక రాయలసీమ సమావేశం, మరొక సారి సమాలోచనలు…

రాయలసీమలో అశాంతి దండిగా ఉంది. ఎవరినడిగినా రాయలసీమ కు ఎంత అన్యాయం జరిగిందో, జరుగుతున్నదో చెబుతారు. ఈ అంశాంతి చాలా సార్లు ఆందోళనలకు కూడా దారి తీసింది. ఈ ఆందోళనలు అపుడపుడు ఉద్యమాలుగా మారిన సందర్భాలున్నా, ఈ ప్రాంతానికి న్యాయం జరిగేదాకా అవి బలపడలేదు. వచ్చినట్లే వచ్చి పోయాయి. వాటి ప్రభావం చాలా తక్కువ. అందుకే రాయలసీమకు అన్యాయం జరగుతూనే ఉంది. వేసిన ప్రశ్నలే మళ్లీ వేయాల్సి వస్తున్నది. అవే నినాదాలు. స్వాతంత్రానికి పూర్వం వినిపించిన నినాదాలు అవే. స్వాతంత్య్రం వచ్చాక వినపడిన నినాదాలు అవే.

కర్నూలు రాజధానిగా ఏర్పడిన ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కూడా రాయలసీమకు సాధించి ఇచ్చిందేమీలేదు. ఏదయినా వచ్చేది ఉంటే దాన్ని విశాల ఆంధ్రప్రదేశ్ వమ్ము చేసింది. ఇపుడు విభజన తర్వాత మళ్లీ మొదటికొచ్చింది. వ్యవహారం.రాయలసీమకు జరుగుతూ వస్తున్న అన్యాయాలకు తోడు కొత్త కొత్త రూపాల్లో ద్రోహం జరుగుతూనే ఉంది. ఇపుడయినా ఇక్కడి మేధావులు ఆలోచించి రాయలసీమ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ముందుకు రాగలరా?

ఈ ప్రశకు సమాధానం వెదికేందుకు రేపు అంటే మార్చి 17 వ తేదీన కడప హరిత హోటల్ లో ఉదయం పది గంటలకు ఒక సమావేశం నిర్వహిస్తున్నారు.

తమాషా ఏమిటంటే, రాయలసీమలో సమావేశాలకు, సమాలోచనలకు కొదువ వుండదు. కారణమేదయినా కానీయి, ఈ సమాలోచనలు కార్యరూపం దాల్చవు. అందుకే కొందరే ‘మా రాయలసీమ’… ‘మా రాయలసీమ’ అంటూ నికరజలాలు అంటూ టిటిడిలో మా ఉద్యోగాలు అంటూ రోడ్డెక్కి అరవడం కనిపిస్తుంది. రాయలసీమ నాలుగు జిల్లాలు ప్రజలు వీళ్లతో గొంతు కలిపినపుడే ప్రయోజనం ఉంటుంది. లేకపోతే, ఆ నలుగురు కొంత కాలానికి అలసి పోతారు, రాయలసీమ నిలువునా దోపిడికి గురయిపోతుంది.

రాయలసీమ డిమాండ్లు చేంతాడులా పెరిగిపోతూనే ఉన్నాయి. పా…తవి లంటే శ్రీభాగ్ ఒప్పందం వంటివి అట్లాగే ఉన్నాయి. రాష్ట్ర విభజన కొత్త డిమాండ్లను తీసుకువచ్చింది. రాయలసీమకు నిధులు, నీళ్లు వంటి కొత్త డిమాండ్లు వచ్చి చేరాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాలను రాయలసీమ జోన్ కు కాకుండా రాష్ట్రమంతా ఒకే యూనిట్ గా పరిగణించి పూరిస్తారు. ఈ అన్యాయం ఇపుడు తాజాగా జాబితాకెక్కింది.

విచిత్రమేమంటే, ఇపుడున్న ప్రధాన రాజకీయ పార్టీల అజండాలో రాయలసీమ లేనే లేదు. టిడిపి, వైసిపిల నాయకులు రాయలసీమ వారే అయినా, రాయలసీమ అనే మాట ఎత్తకుండా వారు పార్టీలను నడుపుతున్నారు. రాయలసీమ పేరెత్తితే కోస్తాంధ్ర వోట్లు రాలవేమో ననే భయం ఈ పార్టీలలో కనబడుతుంది. ఇది నిరంతర భయం. అంటే రాయలసీమ మూల సమస్య గురించి వారు ప్రస్తావించే అవకాశమే లేదన్న మాట.

ఈ నేపథ్యంలో రేపటి సమావేశంలో రాయలసీమ భవిష్యత్తు గురించి చర్చిస్తారు. సమావేశం మాజీ మంత్రి డాక్టర్ మైసూరారెడ్డి నాయకత్వంలో జరుగుతూ ఉంది. రాయలసీమ కోసం గతంలో ఉద్యమించిన వారు, రాయలసీమ ప్రజాసంఘాలు, రైతు సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు, రచయితలు, మా రాయలసీమ ఇది అనే భావన ఉన్నవాళ్లంతా హాజరుకావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *