శ్రీశైలం నిండినా దిక్కులేదు, సీమకు గోదావరి నీళ్లంట!!!

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
శ్రీశైలం నిండినా రాయలసీమకు నీరు అందలేదు ! తెలంగాణ నుంచి తెచ్చే గోదావరితో సీమకు నీరు అంటే ఎలా నమ్మాలి ?
కృష్ణానది పరవళ్లు తొక్కి ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయం నిండి పోయింది. నాగార్జున సాగర్ జలాశయంకు రోజుకు 7 లక్షల క్యూసెక్కుల చొప్పున దాదాపు 60 టీఎంసీల నీరు విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో కరువు తీరిపోయినది అంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ శ్రీశైలం జలాశయం ఉన్న రాయలసీమ జిల్లాల్లో మాత్రం త్రాగడానికి అయినా నీరు విడుదల చేస్తారా ? అని ప్రజలు ఆందోళనచెందుతున్నారు. ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడింది. రేపు గోదావరి నీటిని శ్రీశైలంకు తరలిస్తే రాయలసీమలో ఇంత కన్నా బిన్నమైన పరిస్థితులు ఉంటాయా అంటే అనుమానమే ?
 నీరు విడుదలకు అవకాశాలు అవరోధాలు
రాయలసీమ నాలుగు జిల్లాలకు నీరు అందాలంటే పోతిరెడ్డిపాడు , మాల్యాల , ముచ్చిమర్రి ద్వారా ప్రాజెక్టులకు సరఫరా చేయాలి. అది శ్రీశైలం బ్యాక్ వాటర్ తోనే సాధ్యం అవుతుంది. మాల్యాల , ముచ్చిమర్రి ఎత్తిపోతల పథకాలు. వీటి ద్వారా రోజుకు అర టీఎంసీ నీరు లిప్టు చేయడానికి అవకాశం ఉంది. ఇక కీలకమైన పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని వదలడానికి వెసులుబాటు ఉన్నా హెడ్ రెగ్యులెటర్ నుంచి బనకచర్ల వరకు తగిన చర్యలు తీసుకోవడానికి 15 సంవత్సరాలు కావస్తున్నా మన పాలకులకు మనసు రాలేదు. పలితం నేడు 30 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. దీని విలువ 2.5 టీఎంసీలు మాత్రమే. అంటే రోజుకు 3 టీఎంసీలు మాత్రమే విడుదల చేయడానికి అవకాశం ఉంది.
రాయలసీమలో వివిధ చిన్నా పెద్దా జలాశయాల సామర్థ్యం దాదాపు 120 టీఎంసీలు. శ్రీశైలం నిండి వరద వస్తుంది. దాదాపు వారం రోజులు వరద ఉన్నా శ్రీశైలం నుండి సాగర్ జలాశయంకు రోజుకు 60 టీఎంసీల నీరు విడుదల చేసుకున్నా నాగార్జున సాగర్ నిండిపోతుంది.
రాయలసీమలో మాత్రం 30 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ చేసుకునే దుస్థితి. వరద ఉన్నది , 120 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంది కానీ సీమలో తగిన చర్యలు తీసుకోక పోవడం వల్ల ఇలాంటి సమయంలో కూడా నీరు వాడుకోలేని పరిస్థితి.
ప్రభుత్వం చేయాల్సిన పని
క్రిష్ణ నీరు పుష్కలంగా వస్తున్నా ఉపయోగపడని రాయలసీమలో తెలంగాణ నుంచి గోదావరి నీటిని శ్రీశైలంలో నింపితే రాయలసీమకు ఎలా అందుబాటులోకి వస్తుంది. కీలకమైన కొన్ని నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం వెంటనే చేయడానికి పూనుకోవాలి.
1. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం 1.50 లక్షల క్యూసెక్కులకు పెంచుతూ ఎన్టీఆర్ చేసిన నిర్ణయాన్ని అమలుచేసి ఆ ప్రవాహాన్ని అందుకునే స్థాయిలో కాల్వల నిర్మాణం పూర్తి చేయాలి. అది జరిగితే వరదల సమయంలో రోజుకు 12 టీఎంసీల నీటిని డ్రా చేయడం ద్వారా 70 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు.
2. కృష్ణతో బాటు అపారంగా నీటిని తీసుకువస్తున్న తుంగభద్ర నీటిని నిల్వ చేసుకోవడానికి వీలుగా గుండ్రేవుల నిర్మాణం పూర్తి చేసి 25 టీఎంసీలు నిల్వ చేయవచ్చు.
3. కుందు నదిపై రాజోలు , జోలదరాసి , ఆదినిమ్మాయని బ్యారేజిలను పూర్తి చేయడం వల్ల మరో 5 , 6 టీఎంసీలు నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది.
4. అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మాల్యాల , ముచ్చిమర్రి ఎత్తిపోతల పథకం సామర్ధ్యం పెంచి వాటికి అనుసంధానంగా కాల్వల వెడల్పు చేసి హంద్రీనీవా ద్వారా మరింత నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
ఈ ఏర్పాట్లు చేయడానికి దాదాపు 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఫలితంగా 150 టీఎంసీల నీరు వాడుకోవచ్చు. దాదాపు 5 జిల్లాకు ఉపయోగపడే పోలవరంకు 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్దపడిన ప్రభుత్వం. నాలుగు జిల్లాలు , ఏపీలో 40 శాతం విస్తీర్ణం కలిగిన రాయలసీమ కోసం 20 వేల కోట్లు ఖర్చు చేయడం కనీస ధర్మం.
రాయలసీమలో పై ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేయకపోతే నేడు కృష్ణ నీటితో సీమకు ఎలా ప్రయోజనం కలుగుడం లేదో రేపు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి గోదావరి నీటిని శ్రీశైలం జలాశయం నింపినా రాయలసీమ ఒరిగేది ఏమి ఉండదు.
తరతరాలుగా మోసపోయిన రాయలసీమకు న్యాయం చేయడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు రావాలి. రాజకీయాలకతీతంగా నాయకులు , ప్రజలు బయోద్వేగాలతో కాకుండా బాధ్యతతో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావలి. అలాంటి చైతన్యం సీమ ప్రజలకు వచ్చినప్పుడే రాయలసీమ కన్నీటి చరిత్రకు ముగింపు.
(పురుషోత్తమ రెడ్డి,రాయలసీమ మేధావుల ఫోరం,తిరుపతి)

https://trendingtelugunews.com/harish-rao-shits-focus-to-social-from-politics/