Home English ఏ మాటకామాట చెప్పుకుంటే, ‘కల్కి’ సినిమా బాగుంది.(రివ్యూ)

ఏ మాటకామాట చెప్పుకుంటే, ‘కల్కి’ సినిమా బాగుంది.(రివ్యూ)

446
0
SHARE
(సలీం బాష)
ఆ!” సినిమా తర్వాత యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన మరో సినిమా ” కల్కి”.
మొదటి సినిమాతో ప్రేక్షకుల్ని కొంతవరకు విమర్శకులను కూడా ఆకట్టుకున్న వర్మ ఈసారి ఒక సోషలాజికల్ థ్రిల్లర్ ను ఎంచుకున్నాడు. 1980 దశకాల్లో జరిగిన కొన్ని నిజ సంఘటనలు ఈ సినిమా నేపథ్యం.
మరోసారి రాజశేఖర్ పోలీసు పాత్రలో ఈ సినిమాను మొత్తం తన భుజాల మీద మోసే ప్రయత్నం చేశాడు. కొంతవరకు సక్సెస్ కూడా అయినట్లే. పీరియాడికల్ మూవీస్ తో ఒక సమస్య ఉంది. ఆ కాలానికి సంబంధించిన పరిస్థితులను క్రియేట్ చేయడం, నటీనటులను ఆ కాలానికి సంబంధించిన విధంగా తీర్చిదిద్దటం.
ఈ సినిమా చాలా భాగం కొల్లాపూర్ అనే ఒకే ఊరి లో (కొంత భాగం కాశ్మీరు లో) తీసీ సమస్యను తెలివిగా, చాలా వరకు మేనేజ్ చేసి దర్శకుడు ఇబ్బంది ని తొలగించుకున్నాడు. అయితే కాశ్మీరు భాగం బాగా ఖర్చు పెట్టి తీయటం అవసరం లేదనిపిస్తుంది. ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టారు అన్నది దీనివల్ల అర్థం అవుతుంది.
హీరో హీరోయిన్ల ఫ్లాష్ బ్యాక్ చిత్రీకరణ అంత సరిగ్గా అతకలేదు. హీరోయిన్ గా వేసిన ఆదా శర్మకు పెద్దగా పని లేదు. ఆమె వల్ల ఈ సినిమాలో సస్పెన్స్ ముడిపడి ఉంటుందేమో అని ప్రేక్షకులు అనుకోవాలని చేసిన ప్రయత్నం గా అనిపిస్తుంది. అది అంతగా పని చేయలేదు.
దర్శకుడు ఈ సినిమాలో అనేక సంఘటనలను సృష్టించిన విధం ప్రేక్షకులను కొంత గందరగోళ పెట్టినప్పటికీ, సినిమా వేగాన్ని, వాడిని తగ్గించింది. ఈ సినిమాలో ట్రిమ్ చేయవలసిన లేదా తీసేయాల్సిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవి సస్పెన్స్ ను క్రియేట్ చేయడం మాట అటుంచి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తాయి.
అంకుశం లో ఒక పవర్ ఫుల్ పాత్రను చేసి బాగా విజయవంతమైన రాజశేఖర్ ఆశ్చర్యకరంగా ఇన్ని సంవత్సరాల తర్వాత మరోసారి పోలీసు పాత్రను బాగానే పోషించాడు. అయితే పాత్ర చిత్రీకరణ దాన్ని తీర్చిదిద్దడం లో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేదు. .
ఈ సినిమాలో ఫైట్లు కూడా ఓవర్ గా ఉన్నాయి. పైగా ఒక పొలిసు అధికారి ఓపెన్ గా మందు తాగుతూ జీపీ లో రావటం(రాజశేఖర్ ఎంట్రీ సీన్ ఇదే) బాలేదు. ఆ పాత్ర చిత్రీకరణ ఒక పిరియాడికల్ థ్రిల్లర్ స్థాయిని తగ్గించే విధంగా ఉంది. సినిమాకు అది ఒక మైనస్ అయ్యే అవకాశముంది.
యువ దర్శకుడు బ్రిలియంట్ అని చెప్పడానికి చాలా సన్నివేశాలు ఉన్నాయి. కానీ వాటిని అంత బ్రిలియంట్ గా కనెక్ట్ చేయలేకపోవడం వల్ల సినిమా కొన్ని రకాల ప్రేక్షక వర్గాలకువర్గాలకు కనెక్ట్ కాకపోవచ్చు. ఎడిటింగ్ ఇంకా కొంచెం బాగా చేసి ఉండొచ్చు.
చివరి 20 నిమిషాల సినిమా కోసం సినిమా మొత్తం చూడగలిగే స్థాయిలో ప్రేక్షకులను కూర్చోబెట్ట కలగాలంటే చాలా కష్టమైన విషయం. సస్పెన్స్ థ్రిల్లర్ లలో ఇది మరీ కష్టం. అయితే యువ దర్శకుడు సాగదీసిన సన్నివేశాల మధ్య లో కొన్ని బ్రిలియంట్ సన్నివేశాలను కలిపి ఆ కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేశాడు, కొండకచో కొంత వరకు సక్సెస్ కూడా అయ్యాడు. ఇదే ఈ సినిమా ను నడిపించాలి. ఇదివరకే రిలీజ్ అయి బాగానే ఉంది అనిపించుకుంటున్న ” ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ” సినిమా ఈ సినిమాకు పోటి కాకపోయినా యువ ప్రేక్షకులు ఆ సినిమా వైపే మొగ్గు చూపే వకాశం ఉంది.
ఈ సినిమాకు సర్ప్రైస్ ప్యాకేజ్ రాహుల్ రామకృష్ణ! ఒక పత్రికకు క్రైమ్ రిపోర్టర్ కూడా పాత్రలో ఉన్నాడు. ఈ సినిమాకు కీలకమైన పాత్ర కూడా ఇదే. సినిమా మొదలునుంచి చివరిదాకా ఉన్న ఈ పాత్ర వల్ల సినిమాకు కొంత లాభమే కలిగింది! సినిమాకు హారర్ ఎలిమెంట్ తో పాటు కామెడీ కూడా అందించిన రామకృష్ణ ద్వారా కూడా సినిమా కొంత సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే సినిమాను ఎలా తీసినా చివరి 20 నిమిషాల్లో ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ లు సినిమాను నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి దర్శకుడు మెయింటెయిన్ చేయాలన్న క్రమంలో తన అనుభవ రాహిత్యాన్ని చూపించాడు. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను , ముఖ్యంగా హీరోయిన్ల సన్నివేశాలు, బ్రిలియంట్ సన్నివేశాల ద్వారా బాగానే కవర్ చేశాడు. సినిమాలో ఉన్న ఒక ఐటెం సాంగ్ బాగానే ఉన్నప్పటికీ అవసరం లేదు. అదేపనిగా చొప్పించినట్లు ఉంది.
ఏమాటకామాటే చెప్పుకోవాలి అంటే ఈ పాట కోసం కూడా కొన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను చూసే అవకాశం ఉంది!!
సినిమా ప్రారంభంలో బొమ్మల ద్వారా కథను మొదలు(కొంత సాగదీసినట్లు అనిపించినా, అవసరమే) పెట్టడం బానే ఉంది. బ్రిలియంట్ సన్నివేశాల చిత్రీకరణకు ఫోటోగ్రఫీ మ్యూజిక్ బాగా ఉపయోగపడ్డాయి. సంగీతం సినిమా మూడ్ ను పూర్తిగా ఎలివేట్ చెయ్యకపోయినా, ఫర్వాలేదు. ఈ సినిమాకు మరో ప్లస్ నర్సప్ప పాత్రలో హిందీ నటుడు “అశుతోష్ రాణా”. క్రూరత్వాన్ని, పల్లెటూరి అహంకారపు దౌర్జన్యాన్నిప్రతిబింబించాడు. నాజర్ తనదైన శైలిలో చేశాడు. నందితా శ్వేత ఫర్వాలేదు. అదా శర్మ అవసరం లేదనిపించేలా ఉంది.
ఈ సినిమా నిర్మాణంలో రాజశేఖర్ భాగస్వామ్యం కూడా ఉంది. యువ దర్శకుడిని నమ్మి సినిమా తీయటం పెద్ద విషయమే. సస్పెన్స్ ఎలిమెంట్ ఉన్న సినిమాలు సక్సెస్ కావడం కాకపోవడం కొంతవరకు ప్రేక్షకుల నోటి దూల మీద కూడా ఆధార పడుతుంది. సస్పెన్స్ చెప్పేస్తే అంతే! చివరి మాటగా చెప్పాలంటే తీయడం కష్టమే, రివ్యూలు రాయడం సులభం! అయినా ఇది పీరియాడికల్ థ్రిల్లర్స్, సస్పెన్స్ సినిమాలను ఇష్టపడేవారు ఫర్వాలేదు చూడొచ్చు అని చెప్పదగ్గ సినిమా. రాజశేఖర్ అభిమానులు మాత్రం కచ్చితంగా చూడొచ్చు. అయితే అంకుశం లో రాజశేఖర్ ను మనసులో పెట్టుకోకుండా అయితేనే!
(సలీం బాష్, సీనియర్ జర్నలిస్టు, రచయిత, ఫోన్ నెం.9393737937)