గోపీచంద్ తో విబేధాలు లేవు, అంతా బోగస్ న్యూస్ : పివి సింధు

తనకు , తన కోచ్ పుల్లెల గోపీ చంద్ కి విబేధాలొచ్చాయన్న వార్తలను భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు ఖండించారు.

ఒక మాలయాళం న్యూస్ పేపర్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఇటీవల తనకు గోపీ చంద్ కు సంబంధాలు బెడిశాయని, ఇక ఆయనతో శిక్షణ తీసుకోలేనని సింధు చెప్పినట్లు ఒక వార్త ప్రచారమవుతూ ఉంది. సిందు ఒక ప్రమోషన్ ప్రోగ్రాం మీద కొచ్చి వచ్చారు.

గోపీ చంద్ ఈ మధ్య తన అకాడెమీ బిజినెస్ మీదకు ఎక్కువ దృష్టి మళ్లించాడని అందువల్ల తాను ఇద్దరు కొరియన్ కోచ్ లనుంచి శిక్షణ తీసుకుంటున్నానని కూడా ఆమె చెప్పినట్లు ప్రచారమవుతూ ఉంది.

ఆమె ఇంటర్వ్యూ ను ఆధారం చేసుకుని వచ్చిన వ్యాసంలో మరొక ఆసక్తికరమయిన విషయం కూడా ఉంది.పూర్వం గోపీ చంద్ తన గేమ్ లో తాను చేసే చిన్నచిన్న పొరపాట్లను టకీమని గుర్తుపట్టి సరిచేసుకోమని సలహా ఇచ్చేవారని ఇపుడాయన ఆలా చేయడం లేదని చెప్పినట్లు మలయాళ పత్రికలో వచ్చింది.

ఇలాంటి వ్యాఖ్యాలను తానెపుడూ ఎక్కడా చేయలేదని సింధు ‘దెక్కన్ హెరాల్డ్’ కు  వివరణ ఇచ్చారు.

‘ అలా నేనెపుడూ మాట్లాడలేదు. ఇలాంటి వార్తలెక్కడి నుంచిపుడుతున్నాయో నాకు ఆశ్చర్యమేస్తాఉంది. గోపీ సర్ తనతో కలసి ఇటీవల ఎందుకు అంతగా పర్యటించడం లేదని ఇంటర్వ్యూలో అడిగారు. కొన్నిసార్లు ఆయన చాలా బిజిగా ఉంటారని మాత్రమే చెప్పాను. అయితే, నాకు తక్షణం సహకరించేందుకు ఎపుడూ ఇద్దరు కొరియన్ కోచ్ లున్నారని చెప్పాను. గోపీ చంద్ తనతో లేడని, తన మీద ఆయన శ్రద్ధ చూపడంలేదని దీనర్థంకాదు. ఆయన నాకు శిక్షణ ఇచ్చే విషయంలో ఇంకా పూర్తిగా మునిగే ఉన్నారు. నేను కూడా ఆయన అకాడమీలో ఇంకా శిక్షణ తీసుకుంటూనే ఉన్నాను,’ అని ఆమె చెప్పారు.

ఈ వార్తలతో ఆమె చాలా ఆందోళన చెందినట్లున్నారు. వీటిని ఖండిస్తూ ట్విట్టర్లో కూడా ఒక వివరణ ఇచ్చారు. ‘ ఈ వార్తల గురించి ఒక చిన్న వివరణ. నేను గోపీసర్ శిక్షణలోనే ఉన్నాను. నా చిన్నప్పటినుంచి ఆయనే నాకోచ్,’ అని ట్వీట్ చేశారు. (ఫోటో సౌజన్యం  దెక్కన్ క్రానికల్)