Home Telugu మిడిలార్డర్  విజృంభిస్తే పంజాబ్ మునుముందుకు

మిడిలార్డర్  విజృంభిస్తే పంజాబ్ మునుముందుకు

91
0
SHARE

(బి వెంకటేశ్వర మూర్తి)

గత మూడేళ్లలో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఐపిఎల్ ప్రదర్శన ఘోరంగా ఉంది. తొలి ఎడిషన్ లో సెమీ ఫైనల్ లో ఓడిపోయి మూడో స్థానంలో నిలిచిన ఉత్తర భారత కింగ్స్ (దక్షిణ భారతంలో పేరులో కింగ్స్ గల జట్టు ధోనీ సేన) 2014 ఒకే ఒక్కసారి ఫైనల్  చేరగలిగింది. మిగతా సీజన్లలో పంజాబ్ జట్టుకు చెప్పుకోడానికి గర్వకారణమేమీ లేదు.

2014 తర్వాత మరీ అధ్వాన్నమైన రికార్డు. గతేడాది మొదటి ఆరు పోటీల్లో ఐదు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన నిలిచిన పంజాబ్, అటు తర్వాత వరుస పరాజయాలతో చివరికి ఎనిమిది జట్ల టోర్నీలో ఏడో స్థానానికి పడిపోయింది.

పంజాబ్ కు మరో ప్రత్యేకమైన రికార్డు ఉంది. గత పదకొండు సీజన్ లలో మొత్తం పదకొండు మంది కెప్టెన్ లు పంజాబ్ కు సారథ్యం వహించడం బహుశా రికార్డు కావచ్చు. పంజాబ్ కు సారథ్యం వహించిన వారిలో భారత స్టార్ లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, విదేశీ స్టార్ లు జయవర్దనే. సంగక్కర, ఆడం గిల్ క్రిస్ట్, డేవిడ్ హుస్సీ లాంటి హేమాహేమీలున్నారు. ఘోరమైన అచ్చు తప్పు లాగా రెండో సీజన్ లో కెప్టెన్ గా కొనసాగుతున్న భారత స్పిన్ స్టార్ రవిచంద్రన్ అశ్విన్, న్యూజిలాండ్ కు చెందిన కొత్త కోచ్ మైక్ హెస్సన్ లకు ఈ సారి టీమ్ కాంబినేషన్ ను సిద్ధం చేసుకోవడం పెద్ద సవాలుగా పరిణమించనున్నది.

ఏది ఏమైనాసరే ఈ సారి జట్టును విజయపథాన పయనింపజేయాలని కృతనిశ్చయంతో ఉన్న టీమ్ మేనేజ్ మెంట్ భారీగా డబ్బులు కుమ్మరించి ఈ ఏడాది వేలంలో 13 మంది కొత్త ఆటగాళ్లను కొనుక్కున్నది. ఆటగాళ్ల వేలం పాట సమయంలో పంజాబ్ కో ఓనర్ బాలీవుడ్ స్టార్ ప్రీతి జింటా చేసే హడావుడి ఈ పాటికి క్రికెట్ అభిమానుల్లో బాగా ప్రసిద్థమైపోయింది. ఇటీవలి ఇండియా-ఇంగ్లండ్ సిరీస్ లో ఓ వెలుగు వెలిగిన ఆల్ రౌండర్ శామ్ కరన్ (బేస్ ప్రైస్ రూ 2 కోట్లు, పాట రూ 7.20 కోట్లు), ఆరేడు రకాల చిత్ర విచిత్రమైన బంతులు బౌల్ చేసి బ్యాట్స్ మెన్ ని ముప్పతిప్పలు పెట్టగలడని అందరూ గొప్పగా చెబుతున్న తమిళనాడు ప్రిమియర్ లీగ్  స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (బేస్ ప్రైస్ రూ 20 లక్షలు, పాట రూ. 8.40 కోట్లు) లకు టీమ్ మేనేజ్ మెంట్ ఏ మేరకు వినియోగించుకుంటుందో, తమ భారీ మూల్యానికి వారు ఏ మాత్రం న్యాయం చేయగలుగుతారనే అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

పంజాబ్ ప్రస్తుత జట్టులో కూడా బ్యాటింగే కొంచెం దుర్బలంగా కనిపిస్తున్నది. గతేడాది లీగ్ దశ మొదటి సగం పోటీల్లో క్రిస్ గేల్, కెఎల్ రాహుల్ ఆరంభ జంట బాగా ఆడిన ప్రతిసారీ జట్టు భారీ స్కార్ లు సాధించి సులభంగా విజయాలు సాధించింది. వారిద్దరు విఫలమైన సందర్భాల్లో మాయాంక్ అగర్వాల్, మన్ దీప్ సింగ్, కరుణ్ నాయర్ లతో కూడిన మిడిలార్డర్ చేతగాక చతికిల పడటంతో జట్టు పరాజయాల పాలయింది. ఈ సారి జట్టు ప్రదర్శన మెరుగు పడాలంటే ఆసీస్ కు చెందిన మోయ్ జెస్ హెన్రిక్స్, విండీస్ కీపర్ బ్యాట్స్ మన్ నికొలస్ పూరన్, దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ దీటుగా ఆడవలసి ఉంటుంది. ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజిబూర్ రెహ్మాన్, వరుణ్ చక్రవర్తి అశ్విన్ కు అండదండగా ఉంటారు. అన్నట్టు మరో అశ్విన్ (మురుగప్ప) కూడా ఈ జట్టులోనే ఉన్నారు.

మహమ్మద్ షమీ, ఆండ్రూ టై లకు తోడు దక్షిణాఫ్రికాకు చెందిన హార్డస్ విల్జోన్, అర్ష్ దీప్ సింగ్, అంకిత్ రాజ్ పుట్ లతో పేస్ బౌలింగ్ కూడా శక్తిమంతంగా కనిపిస్తున్నది.

ఈనెల 25న రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ తొలి మ్యాచ్ జైపూర్ లో ఆడుతుంది.

(వెంకటేశ్వర మూర్తి, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు, బెంగుళూరు)