గరిటెడు గాడిద పాలతో పూజా కౌల్ సక్సెస్ స్టోరీ

గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైనను నేమి ఖరము పాలు అది వేమన్న కాలం నాటి పాతమాట.
ఇపుడుప్రపంచమంతా ఖరముపాల వైపు చూస్తూ ఉంది. అసలు ఈ లోకంలో ‘మోక్షం’ ఇక ఖరము పాలలొనే ఉందనే పరిస్థితి వస్తావుంది.అనేక జబ్బులను నయంచేసే సూపర్ ఫుడ్ గాను, సౌందర్య సాధనంగాను వేమన్న చీత్కరంచిన గాడిదపాలకు గుర్తింపు వస్తావుంది. నిజంగానే ఒక వుగ్గు గరిటెడు ఖరము పాలు చాలు జీవితాన్ని మార్చేసే రోజులొస్తున్నాయంటున్నారు వీటి రహస్యం తెలిసిన వాళ్లు.
ఈ రహస్యం తెలిసినందునే క్లియోపాట్ర రోజు గాడిద పాలలోనే స్నానం చేసేది. ఇలా చేస్తే వృద్ధాప్యం దరిదాపుల్లోకి రాదని ఆమెకు నమ్మకం. 77 యేట పోప్ అయిన ఫ్రాన్సిస్ ఇంత ఆరోగ్యంగా ఉండేందుకు కారణం, చిన్నపుడు వాళ్లమ్మ ఆయనకుగాడిద పాలు తాపించడమే. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు.
చెవులకి హెడ్ ఫోన్ తగిలించుకోకుండా, రోజు పొద్దునే వీధుల్లో నుంచి వినిపించే హాకర్స్ స్ట్రీట్ సాంగ్స్ వినే అలవాటు మీకు ఉంటే, గాడిదపాలమ్మో అనే పిలుపు కూడా మీరు వినివుండాలి.
పొద్దునే పాల పాకెట్ పిండి,గరమ్  చాయ్ చేసుకునో లేదా హాటాట్ ఫిల్టర్ కాఫీ కలుపుకునో తాగే అలవాటుంటే మాత్రం ‘గాడిద పాలమ్మో’అనే అరుపు కర్ణ కఠోరంగా అనిపిస్తుంది.
అరిచేవాడు వింతగా కనిపిస్తాడు.
మన పక్కనే తుల్జాపూర్ లోని టాటా ఇన్స్ స్టి ట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ మాస్టర్స్ చేసిన పూజా కౌల్ కు, రిషభ్ తోమార్ కు అలా అనిపించలేదు. ఆ పాటలోనే ఉజ్వల భవిష్యత్తు కనిపించింది. గాడిదపాల గురించి స్పృహ ప్రజల్లో పెంచాల్సిన అవసరముందని ఇద్దరు భావించారు.
టిస్ లో చదివితే వచ్చే మంచి ఉద్యోగాలను కాదని, ఏదో ఒక కొత్త ప్రయోగం చేసి తమకే కాదు, తక్కువ పెట్టబడితో నలుగురికి ప్రయోజనం కలిగించే పనిచేయాలనుకున్నారు.
విజయవంతమయిన వాళ్ల ప్రయోగం గురించి తెలుసుకునే ముందు కొద్దిగా గాడిదపాల గురించి నాలుగు ముక్కలు తెలుసుకుందాం.
నాగరికులనుకునే వాళ్లు గాడిదను, గాడిద పాలను ద్వేషిస్తారు. సాటి మనిషిని గాడిదా అని తిట్టడం వూరికే వచ్చి ఉండదు.దీని వెనక ఏదో సామాజిక కోణం ఉన్నట్లనిపిస్తుంది. ఎవరైనా సోషియాలజిస్టులు ఈ విషయం మనకు చెప్పాలి.
ఎందుకంటే, నాగరిక ప్రపంచం గాడిద పాలను ద్వేషిస్తే, మరొక వైపు సమాజంలోని నిమ్నవర్గాలు గాడిద పాలను శ్రేష్టమయినవిగా చూశాయి.
(పూజాకౌల్, రిషభ్ సాహసయాత్ర స్టోరీ మీకు నచ్చితే, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం trendingtelugunews.com ను ఫాలో కండి, చేయూతనీయండి)
ఇక భారత్ బయట క్రీపూ 460-370 లోనే గాడిద పాల వైద్యగుణాలను గుర్తించారు.
వైద్యపితామహుడిగా పేరున్న హిపోక్రటీస్ అన్ని జబ్బులకు గాడిద పాలను అందించే వారని చెబుతారు.
పిల్లలకు గరిటెడు గాడిద పాలు రోజూ పట్టేవారు ఇప్పటికీ ఉన్నారు. అంటే క్లియోపాట్ర కాలం నుంచి ఇప్పటి మన గ్రామీణుల దాకా గాడిద పాలలో ఉన్న మహత్తర  శక్తిని గ్రహించిన వాళ్లెందరో ఉన్నారు.
అయితే, ఈ మధ్య ఇది సైంటిఫిక్ క్ గా కూడా రుజువయింది.
ఇంకా ప్రచారం వూపందుకోలేదుగాని,త్వరలో ఫారెక్స్ లాగా ప్రపంచమంతా గాడిద పాల పౌష్టికాహారం వచ్చేలా ఉంది. గాడిద పాల సబ్బులు, బాడిలోషన్స్, మాయిశ్చరైజర్లు, చాకొలేట్లు విదేశీ మార్కెట్లలోకి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రవేశించాయి. వెస్టులో గాడిదపాలను ఇప్పటికే గుటగుట తాగేసే వారి సంఖ్య పెరుగుతూ ఉంది.
గాడిద పాలకు మత పెద్దల ఆమోదం కోసం కంపెనీలు చూస్తున్నాయి. మత పెద్దలు ఒక్కసారి ఒ.కె అంటే గాడిదపాలు మార్కెట్ ని కొల్లగట్టే పరిస్థితి వస్తుంది.
ఇలాంటపుడే ‘యూరో లాక్టిస్ ఇటాలియా’ అనే కంపెనీ పోప్ ఫ్రాన్సిస్ కు రెండు గాడిదలను కానుకగా ఇచ్చింది. అంతేకాదు, రోమ్ లోని ప్రతిష్టాకరమయిన చిన్న పిల్లల ఆసుపత్రి Bambin Gesu (బాలయేసు) Hospital కు భారీగా గాడిద పాలు అందించింది. యూరోప్ లో పెద్ద ఎత్తున గాడిదపాలు సప్లై చేసే కంపెనీ ఇది.
గాదిద పాలు లాక్టోజ్ ఎక్కువ , ఫ్యాట్ తక్కువ కావడంతో అది అద్భతమయిన పోషకాహారం కాబోతన్నది. దానికి తోడు ఈ పాలు తల్లి పాల అణునిర్మాణాన్నిపోలి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ఎదగకుండానే పుట్టిన శిశువుల్లో కొందరు అవుపాలను జీర్థించుకోలేరు. దానికి తోడు తల్లి పాలుసమృద్ధిగా ఉండవు. అలా ఉన్నపుడు పరిష్కారం గాడిద పాలేనని శాస్త్రవేత్తలు, చిన్న పిల్లల డాక్టర్లు చెబుతున్నారు.

ఈ మధ్య ఐక్య రాజ్యసమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (FAO) గాడిదపాలు శ్రేష్టమయినవని,బాగా పోషకవిలువలున్నవని అని సర్లిఫికేట్ ఇచ్చింది.
అవుపాల ప్రొటీన్ ఎలర్జీ ఉన్నపిల్లకు ప్రత్యామ్నాయంగా గాడిద పాలు ఇవ్వవచ్చని కూడా ఈ సంస్థ పేర్కొంది.
ప్రపంచంలో అమెరికా వంటి చాలా దేశాల్లో గాడిద పాలు ‘పాల అర్హత’ ఉన్న ఆహార పదార్థాల జాబితాకెక్కింది.
భారతదేశంలో అవుపాల మీద ఉన్న భక్తి భావం గాడిదపాలకు అడ్డొస్తుందేమోననని ఈ వ్యాపారాన్ని ప్రోత్సహించాలనుకునేవారిలో ఒక అనుమానం ఉంది.
అయతే గాడిద పాలను భారత దేశంలో చిన్న పిల్లల ఆహారంగా ప్రమోట్ చేసే అవకాశం ఉందేమో పరిశీలించాలని కేంద్ర పశు సంవర్థక శాఖ అధికారులు ICAR (ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ) ను ఎపుడో కోరారు.
అయితే, ఈ లోపు అక్కడక్కడ గాడిదపాలతో వ్యాపారం చేస్తున్న వాళ్లు బాగా సంపాదిస్తున్నారు. ఇపుడు ఇండియాలో గాడిద పాలను ఎక్కువగా సౌందర్యలేపనాలలోనే ఎక్కువగా వాడుతున్నారు. దీనిని ఆహారం హోదా కల్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పూజా కౌల్, రిషభ్ తోమార్ ల ప్రయోగం
ఈ నేపథ్యంలో కౌల్, తోమార్ ల దృష్టి గాడిద పాల మీద పడింది. టిస్ లో ఉండగాపూజా కౌల్ డెయిరీ ఇండస్ట్రీ మీద ధీసిస్ రాస్తున్నపుడు గాడిద పాల చరిత్ర అధ్యయనం చేయాల్సి వచ్చింది. అపుడు దేశంలో గాడిదల జనాభా తగ్గిపోతూఉందని  ఆమె గమనించారు. 19వ లైవ్ స్టాక్ సెన్సస్ ప్రకారం ఇండియాలో2012 నాటికి ఉన్న గాడిదలు కేవలం 0.32 మిలియన్లే.
అంతకు మునుపు 2007లో జరిగిన సెన్స స్ నాటి జనాభా కంటే ఇది 27 శాతం తక్కువ. ఇదెందుకు జరిగిందో ఆమె కనగొనాలనుకున్నారు. గాడిదలనుసాకే వాళ్లంతా సంచార జాతుల వాళ్లే, కొంతకాలం తర్వాత వాటిప పోషణ భారమై వాళ్లు వాటిని వదలేస్తున్నారు. అందువల్ల అలనాపాలనా కరువవడం, ఆహారం దొరక్కపోవడంతో అవి క్రమంగా అంతరించి పోతున్నాయి.
గాడిదపాల విలువ తెలియకపోవడంతో, సంచార జాతులు వాళ్లకు కూడా ఈ జంతువుల మీద గౌరవ భావం లేకుండా పోయింది.
గాడిలు సాకే వారిలో గాడిద పాల గురించి అవగాహన పెంచేపనికి పూజా కౌల్ , రిషబ్ తోమార్ లు పూనుకున్నారు. దీని వల్ల తామొక కొత్త ప్రయోగం చేసినట్లువుతుంది, సంచార జాతులవారి జీవనోపాధి మెరుగుపడుతుందని వాళ్లు భావించారు.
రు. 28,000 లతో ఆర్గానికో (Organiko) అనే సంస్థను ఏర్పాటు చేసి ముందుకు సాగారు. ఈ లోపు ఒక సబ్బుల తయారీ కంపెనీలో ఇద్దరు శిక్షణ తీసుకుని గాడిద పాలతో సబ్బులు తయారుచేయాలనుకున్నారు.
కొంత మంది గాడిదల యజమానులను ఒప్పించి పాలు సేకరించి రెండురకాల సబ్బులు తయారుచేశారు. డాంకీ మిల్క్ నాచురల్ ఇంగ్రేడియంట్ సోప్, డాంకి మిల్స్ చార్ కోల్ అండ్ హనీ సోప్ అనేవి ఈ రకాలు.
ఇందులో మొదటి సబ్బు చర్మాన్ని శుభ్రం చేయడమే కాదు, మృదువుగా కూడా ఉంచుతుంది. ఇక,రెండోదానికి బ్యాక్టీరియాను చంపే స్వభావం ఉంది. ఇది మొటిమలను, డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. ఈ సబ్బుల  గురించి చిన్న క్యాంపెయిన్ చేపట్టి విక్రయించారు. వాడకం దార్ల అనుభవాలువారిని  అబ్బురపరిచాయి.ఇక ఈ వ్యాపారంలో ఫ్యూచర్ ఉంది అనుకున్నారు. అయితే, వాళ్లిద్దరు ప్యూర్ వ్యాపారస్థుల కాదు. వాళ్లకొక సామాజికధ్యేయం ఉంది. సంచార జాతులతోపాటు, ఇతర కూలీలకుకూడా గాడిదలను పెంచుకునే అవకాశం ఇస్తే వారి ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే, గాడిద పాలు లీటర్ ధర  రు. 2 వేల నుంచి రు 3వేల దాకా ఉంటుంది.
గాడిద పాల సబ్బులు బాగా అమ్ముడు పోతున్నాయి. పూజా కౌల్, రిషభ్ తొమార్ల ప్రయోగం విజయవంతమయింది. వీళ్లకి ఇపుడు గాడిదపాలు సరఫరా చేస్తున్న 25 కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలకు రు. 20 వేల దాకా ఆదాయం వస్తూ ఉంది. వీళ్లిపుడు సంచార జీవితం మానేసి స్థిరపడ్డారు. పిల్లలను స్కూళ్ళకిపంపిస్తున్నారు.
ఈ అద్భతమయిన ప్రయోగానికి బాగా ప్రశంసలొస్తున్నాయి. ఏసియాడ్ లిటరేచర్ సమ్మిట్ 2019 పూజాకు మహిశాపారిశ్రామిక వేత్త అవార్డు నిచ్చింది, ఐఐటి ఢిల్లీ స్టార్టప్ కాంక్లేవ్ 2018అవార్డు, సోషల్ ఆంట్రపెన్యూర్ వారి ఎక్సెలెన్సో అవార్డు లభించాయి.
ప్రస్తుతం ఇపుడు వారు ఆరుగురి సిబ్బందితో ఈ ప్రయోగం మొదలుపెట్టారు.దేశవ్యాపితంగా ఉన్న గాడిదల పెంపకం దార్లను సంప్రదంచి తమ ప్రయోగాన్ని విస్తరింపచేయాలనుకుంటున్నారు. భవిష్యత్తు సూపర్ ఫుడ్ గాడిద పాలు అనే గుర్తింపు ఇండియాలో వచ్చే సరికి పూజా, రషభ్ ల ప్రయోగం విస్తరించాలను, వేలాది మంది సంచారజాతులకు జీవనభరోసా కల్పంచాలని ఆశిద్దాం.
పూజా,రిషభ్ ప్రయోగం వల్ల గాడిదల యజమానులు పాల నుంచి లీటర్ రు. 2000 సంపాదిస్తున్నారు. అయితే, పాలు పితకడవం మీద ఆంక్షలున్నాయి. ప్రతి జంతువు నుంచి కేవలం 200 నుంచి 350 మిల్లీలీటర్ల పాలనే పితకాలి.మిగతా వాటిని గాడిద పిల్లలకే కేటాయించాలి.
గాడిద పాలతో ఒకే ఒక సమస్య ఉంది. దానిని అవుపాల లాగా నిల్వ ఉంచలేదు. వాటి షెల్ఫ్ లైఫ్ బాగా తక్కువ. అందుకే గాడిద పాలుఅమ్మేవాళ్లు జంతువును తమ వెంట తీసుకువచ్చి అప్పటికప్పుడు పాలు పితికి విక్రయిస్తుంటారు.
(పూజాకౌల్, రిషభ్ సాహసయాత్ర స్టోరీ మీకు నచ్చితే, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం trendingtelugunews.com ను ఫాలో కండి, చేయూతనీయండి)