బ్రేకింగ్ న్యూస్: కోఠి ఆస్పత్రి చిన్నారి బీదర్‌లో దొరికింది

కోఠి ప్రభుత్వాసుపత్రిలో నిన్న అదృశ్యమైన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. పాపను కర్ణాటక బీదర్ ఆస్పత్రిలో కిడ్నాపర్ వదిలి వెళ్లింది. పాప ఆచూకీ లభ్యం కావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాప దొరికిందన్న సమాచారంతో పావ అదృశ్యమైనప్పటి నుంచి తీవ్రవేదనలో ఉన్న కన్న తల్లి ముఖములో నవ్వులు విరబూశాయి. నిన్న మధ్యాహ్నం టీకా వేయిస్తానని నమ్మించి పాపను ఎత్తుకెళ్లిన నిందితురాలు ఎంతకు తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి ఆస్పత్రి సిబ్బందిని నిలదీయగా తమ సిబ్బంది ఎవ్వరూ అలా తీసుకెళ్లలేదనే సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున పాప కిడ్నాప్‌కు గురికావడంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నారు. అలాగే సీసీ కెమెరాల పరీశీలనలో కిడ్నాపర్ ఎంజీబీఎస్ బస్టాండు నుంచి బస్సులో బీదర్‌కు వెళ్లినట్టు గుర్తించారు. దీంతో తెలంగాణ పోలీసులు మూడు టీం లుగా ఏర్పడి బీదర్‌కు వెళ్లారు. అలాగే కర్ణాటక పోలీసులు కూడా ఎనిమిది టీంలుగా ఏర్పడి పాప ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. మొత్తం పదకొండు టీంలు పాప కోసం తీవ్రంగా శ్రమించారు. మీడియా కూడా అంతే విధిగా పాప ఆచూకీ కోసం ప్రచారం చేసింది. పోలీసుల జాయింట్ ఆపరేషన్‌తో పాప బీదర్ ఆస్పత్రిలో ఉన్నట్టు కనుకున్నారు. పాపకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. సీసీటీవీలు పాప ఆచూకీ కనుగొనడంలో కీలక పాత్ర పోషించాయి. 24 గంటల్లోనే పాప ఆచూకీ దొరకడంతో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాపర్ పరారీలో ఉండటంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిడ్నాపర్ పాపను ఎత్తుకెళ్లి అమ్మాలనుకుందా లేకా పెంచుకోవాలనుకుందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *