పోలవరం వ్యయాన్ని విభజన చట్టం స్పూర్తితో కేంద్రమే భరించాలి

(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి*)
పోలవరం నిర్వాసితుల పరిహారం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్రం ప్రకటించడంతో దాని చుట్టూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
కారణాలు ఏమైనా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి విభజన చట్టం ఏమి చెపుతుంది అన్న ప్రాతిపదికన చర్చ జరగడం నేడు కీలక అవసరం.
పోలవరం ప్రాధాన్యత
పోలవరం గోదావరికి చివరి ప్రాజెక్టు. 7 మండలాలను ఆంధ్రాలో కలపడంతో శబరి , సీలేరు ఉపనదుల ద్వారా వచ్చే ప్రవాహంతో పోలవరం ప్రాజెక్టుకు నీటి సమస్య ఉత్పన్నం కాదు.
ఎవరు సహకరించినా సహకరించక పోయినా కేంద్రం నిధులు మంజూరు చేస్తే పోలవరం పూర్తి అవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే గోదావరి , కృష్ణా డెల్టాకు మరియు విశాఖ అవసరాలకు సరిపడ నీటి లభ్యత వస్తుంది.
గోదావరి నదిపైనే తెలంగాణ ప్రభుత్వంతో కలిపి దుమ్ముగూడెం సాగర్ టెయిల్ పాండు ప్రాజెక్టును పూర్తి చేస్తే తెలంగాణ అవసరాలకు నీరు లభిస్తుంది. అపుడు రాయలసీమలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుండి సీమకు నీరు ఇవ్వకుండా అన్యాయంగా క్రిందకు తీసుకు వెళ్లే పరిస్థితికి స్వస్తి చెప్పి శ్రీశైలం నీటిని రాయలసీమ , నెల్లూరు , ప్రకాశం మరియు వెనుకబడిన తెలంగాణ ప్రాంతాలకు నీరు విడుదల చేయవచ్చు.
విభజన చట్టంలో పోలవరం
విభజన చట్టం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. చట్టం ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ప్రాజెక్టు అంటే చాలా మంది నదికి అడ్డుగా నిర్మించే నిర్మాణం మాత్రమే అనుకుంటున్నారు.
నదికి అడ్డుగా నిర్మించే నిర్మాణం పూర్తి అయితే వందల టీఎంసీల నీరు కిలోమీటర్ల పొడవునా నిల్వ ఉంటుంది. ఆమేరకు జనావాసాలను తరలించాలి. అది జరగ కుండా ప్రాజెక్టు పూర్తి చేసినా ప్రయోజనం ఉండదు.
ఉదాహరణకు కడప జిల్లాలో గండికోట రిజర్వాయర్ ను వై యస్ నిర్మించారు. దాని సామర్థ్యం 25 టీఎంసీలు. కానీ నేటికీ నిర్వాసితుల సమస్య పరిష్కారం కాక పోవడంతో ప్రాజెక్టు నిర్మించి. దశాబ్దం దాటినా పూర్తి స్థాయిలో నీటిని వాడుకోలేని దుస్థితి.
రేపు పోలవరం నిర్వాసితుల సమస్య పరిష్కారం చేయక పోతే ఇక్కడ జరిగేది కూడా ఖచ్చితంగా అదే. అంతటి ప్రాముఖ్యత కలిగి , ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం ఖర్చు ఉన్న నిర్వాసితుల సమస్య రాష్ట్రం పరిస్కారం చేసుకోవాలని కేంద్రం చెప్పడం సహేతుకంగా లేదు.
ప్రాజక్టు వ్యయంలో సింహభాగం తమకు సంబంధం లేదని చెపితే అది జాతీయ ప్రాజెక్టు ఎలా అవుతుంది.
చట్టాన్ని అమలు చేయకపోతే రాయలసీమకు ముప్పు
విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం అధికారికంగా నిర్వాసితుల సమస్య తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన దరిమిలా ఏపీ అసంబ్లీ చట్టం ప్రకారం కేంద్రమే పొలవరానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరించాలని తీర్మానం చేయాలి.
లేని పక్షంలో పరిమిత నిధులు ఉన్న రాష్ట్రం ఉన్న నిధులను పోలవరంకు కేటాయిస్తే వెనుకబడిన రాయలసీమ , ఉత్తరాంధ్రకు చెందిన కీలక ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసినా అబివృద్ది చెందిన కృష్ణా , గోదావరి డెల్టాకు అదనపు ప్రయోజనం కలుగుతుంది. మరోసారి రాయలసీమ , ఉత్తరాంధ్ర తీవ్రంగా నష్ట పోతుంది.
*యం. పురుషోత్తమరెడ్డి,సమన్వయ కర్త,రాయలసీమ మేధావుల ఫోరం