శభాష్ అనిపించుకున్న ఉస్మానియా పోరడు, పదివేల విరాళం

ఉస్మానియా విద్యార్థి ఆకాష్‌ కుమార్‌ కు రూ. 10 వేల విరాళం
ప్రముఖ వ్యక్తుల ఫోటోలను, పేర్లను వారి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా ప్రచారానికి వాడుకుంటున్న ఒక రెడీమేడ్‌ షాపుపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి తెలంగాణ వినియోగదారుల సలహా కేంద్రానికి ఫిర్యాదు చేసి షాపు యజమాన్యంపై విజయం సాధించారు.
హైదరాబాద్‌ నగరంలోని శ్రీమాన్‌ ఫ్యాషన్‌ క్లాథింగ్‌ యజమాన్యం తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం ఇండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫోటోతో దినపత్రికలో ప్రకటనలు జారీచేస్తోంది. విరాట్‌ కోహ్లీ అనుమతి లేకుండా ఫోటోను వాడుకోవడం చట్ట విరుద్ధమని, ఇది వినియోగదారులను మోసం చేయడమేనంటూ ఉస్మానియా యూనివర్సిటీ లా విద్యార్థి బాగ్లేకర్‌ ఆకాష్‌ కుమార్‌, తెలంగాణ వినియోగదారుల వ్యవహారాల విభాగం (రిడ్రెసెల్‌ సెల్‌) సలహా కేంద్రంలో నవంబర్‌ 9, 2018న ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై వెంటనే స్పందించిన సలహా కేంద్రం నిర్వాహకులు షాపు యజమానులకు నోటీసులు జారీ చేశారు. విరాట్‌ కోహ్లీ ఫోటో వాడుకోవడానికి తమకు ఎలాంటి అనుమతులు లేవని, ఇక నుండి వాడుకోబోమని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఫోటో వాడుకున్నందుకు గాను సలహా కేంద్రం రూ. 10 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని వినియోగదారుల సలహా కేంద్రం బి. ఆకాష్‌ కుమార్‌కు అందజేసింది.
విరాళంగా రూ. 10 వేలు
వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను ఉచితంగా పరిష్కరిస్తూ బాధితులకు తెలంగాణ వినియోగదారుల వ్యవహారాల విభాగం అండగా నిలుస్తోందనీ, ఈ కృషికి తనవంతు చేయూతగా ఆకాష్‌ కుమార్‌ ఆ రూ. 10 వేలను విరాళంగా వినియోగదారుల విభాగానికి తిరిగి ఇచ్చేశారు. ఈ చెక్కును మంగళవారం నాడు పౌరసరఫరాల భవన్‌లో తెలంగాణ వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి అకున్‌ సబర్వాల్‌ కు అందజేశారు.
వినియోగదారుల విభాగానికి కృతజ్ఞతలు
తన ఫిర్యాదుపై స్పందించిన తీరు, ఇరువర్గాల వారికి నష్టం జరగకుండా కేసు పరిష్కారంలో వినియోగదారుల వ్యవహారాల, సలహా కేంద్రం చూపిన చొరవ చాలా బాగుందని ఆకాష్‌ కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ కి, వినియోగదారుల రిడ్రెసెల్‌ విభాగానికి ఆకాష్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆకాష్‌ కుమార్‌ స్పందించిన తీరును ఈ సందర్భంగా తెలంగాణ వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి అకున్‌ సబర్వాల్‌ అభినందించారు. ఇటువంటి కేసు తమ విభాగానికి రావడం ఇది తొలిసారి అన్నారు. వివిధ రూపాల్లో సమాజంలో జరుగుతున్న మోసాలను గుర్తించి ప్రభుత్వానికి తగిన సమాచారం ఇవ్వాలని, ఈ విషయంలో వినియోగదారులు కూడా తమ వంతు పాత్రను పోషించాలన్నారు. ఆకాష్‌ కుమార్‌ లాగా ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *