Home Entertainment  ‘ఓ బేబీ’… ఓకే! పెద్దలూ, పిల్లలు హాయిగా చూడొచ్చు! (మూవీ రివ్యూ)

 ‘ఓ బేబీ’… ఓకే! పెద్దలూ, పిల్లలు హాయిగా చూడొచ్చు! (మూవీ రివ్యూ)

180
0
SHARE
(సలీమ్ బాష)
బేబీ అంటే చిన్న పిల్లకు సంబంధించిన సినిమా కాదు. ఒక వయసు మళ్ళిన ఆవిడ పాతికేళ్ల పడుచుగా మారి పోయే కథ. ఈ బేబీ సినిమాకు మూలస్తంభాలు ముగ్గురు పెద్దవాళ్లు! ఈ ముగ్గురి వల్లనే ‘ఓ బేబీ’ .. ఓకే అయింది.
గతంలో ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చాయి.
హాలీవుడ్ లో టామ్ హ్యాంక్స్ నటించిన ” బిగ్” అలాంటిదే. కాకపోతే అందులో చిన్న పిల్లవాడు పెద్దవాడు అవుతాడు. ఇంకా పరకాయ ప్రవేశం, ఆడవాళ్ళు మగవాళ్ళు గా మారడం లాంటి సినిమాలు కూడా వచ్చాయి.
ఓ బేబీ కొంచెం భిన్నమైన కథ. అయితే” ఓ గ్రానీ” అనే దక్షిణ కొరియా సినిమాకి దాదాపుగా రీమేక్ అనుకోవచ్చు.
” అలా మొదలైంది” (2011) తో మొదలైన దర్శకురాలి సినిమా ప్రయాణంలో ఓ బేబీ ఐదోది. మొదటి సినిమాకే నంది అవార్డు పొందిన నందిని రెడ్డి (ఈ సినిమా తర్వాత బెంగాలీ,తమిళ,కన్నడ భాషల్లో రీమేక్ అయింది).
మొదటి మూడు సినిమాలు రొమాంటిక్ కామెడీ లు గా తీసిన దర్శకురాలు ఈసారి ఒక సోషియో ఫాంటసీ సినిమా తీయడం విశేషం.
ఇది కూడా కామెడీ ప్రధానంగా ఉన్నప్పటికీ, మొత్తంగా కామెడీ అని చెప్పలేం. ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చినప్పటికీ, ఒక దక్షిణ కొరియా సినిమాకి రీమేక్ అయినప్పటికీ, సినిమా పిల్లా, పెద్ద చూడొచ్చు అనే విధంగా దీనిని మలచడంలో దర్శకురాలు చూపించిన క్రియేటివిటీ , సంభాషణలు, తెలుగు నేటివీటి కి అనుగుణంగా రాసుకున్న స్క్రీన్ ప్లే, రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీ, సమంత ల నటన ప్రధాన కారణాలు.
ఇంతకు ముందే చెప్పినట్టు ఇది చంటి అనబడే రాజేంద్రప్రసాద్, బేబీ అని అందరూ పిలిచే లక్ష్మి, స్వాతి అనే సమంత చుట్టూ తిరిగే కథ. సమంత సినిమాకు ప్రధాన ఆకర్షణ. చాలా చలాకి గా, తన కోసమే పాత్రను సృష్టించారన్నట్లుగా చేసింది.
తరానికి తరానికి మధ్య అంతరం, ప్రస్తుతం తల్లిదండ్రుల పట్ల పిల్లలు, వారి పిల్లల ప్రవర్తన చూపించిన తీరు బాగుంది. కొన్ని సన్నివేశాలలో హాస్యంలో మేటి అయిన రాజేంద్ర ప్రసాద్ చూపిన నటనకు కళ్ళు చెమరుస్తాయి. హాస్యం లో తిరుగులేని నటుడు విషాదాన్ని కూడా బాగా పండించగలగుతాడని చూపించాడు.
ఒకప్పటి హీరోయిన్ లక్ష్మీ రావు రమేష్ తల్లిగా, పిల్లలకి నానమ్మ గా చాలా బాగా చేసింది. ముఖ్యంగా హాస్పిటల్లో మనవరాలు ఆమెను తిడుతున్నప్పుడు ఆమె చూపిన హావభావాలు చాలా బాగున్నాయి. రావు రమేష్ బాగానే చేసినట్టు చెప్పుకోవాలి.
ఇక చెప్పుకోవాల్సింది సమంత నటన గురించి. ఈ మధ్య కాలంలో సమంత తన నటనతో సినిమాను నడిపించే ప్రయత్నం చేయడం మనం, రంగస్థలం, యూటర్న్, వంటి సినిమాల్లో చూశాం.
ఈ సినిమాలో కూడా సమంత మెచ్చుకోదగ్గగా  నటించడమే కాకుండా, సినిమా చూడడానికి ప్రధాన ఆకర్షణ అయింది.
ఈ సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ సినిమాను పెద్దలు పిల్లలు కలిసి చూసే విధంగా ఉంది.
మొదటి సినిమాకే నంది అవార్డు పొందిన దర్శకురాలు ఈ సినిమాను కూడా మనసు పెట్టి చేసింది అర్థమవుతుంది. చాలాచోట్ల సంభాషణలు కొన్ని సన్నివేశాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను సరిగ్గా చూసుకొని పరిస్థితుల్లో ఈ సినిమా కొన్నిసార్లు మనసుని తాకుతుంది.
ఈ సినిమాకు ప్రధాన బలం సమంత తో పాటు, తెలుగు సంస్కృతికి, ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా ఒక విదేశీ సినిమాను మలిచిన దర్శకురాలి ప్రతిభ కూడా ఉంది.
ఈ సినిమాకు ప్లెసెంట్ సర్ ప్రైజ్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ అండర్ ప్లే!
చాలా రోజుల తర్వాత కనిపించిన (వయసు మళ్లిన పాత్రలో) అప్పటి హీరోయిన్ లక్ష్మి నటన!
ఇంతవరకు ఎన్నో సినిమాల్లో చిన్న పిల్లాడి వేషాలు వేసిన బాల నటుడు “తేజా సజ్జ” ఈ సినిమాలో పెద్దయ్యాడు. లక్ష్మి మనువడి పాత్రలో బానే చేసాడు. మంచి భవిష్యత్తు ఉంది.
మనవరాలి పాత్రలో వేసిన అనిషా కూడా సప్రయిజ్ ప్యాకే. అయితే తల్లిగా ఐశ్వర్య గొంతు కొంత మనల్ని ఇబ్బంది పెట్టినా ఎక్కువ నిడివి లేక పోవటం రిలీఫ్!
సినిమాను  మలుపు తిప్పే అతిధి పాత్రలో జగపతి బాబు ఒకే.
ఈ సినిమాలో నాగ శౌర్య పాత్ర కూడా కొంత మేరకు ఆకట్టుకుంటుంది.
అత్తా కోడలి మద్య కొన్ని సన్నివేశాలు సరదాగా ను, ఆలోచింపజేసేవిగా ను ఉన్నాయి. వారిద్దరి మధ్య నలిగిపోయే పాత్రలో రావు రమేష్ బావున్నాడు.
అయితే సమంత పాత్ర చిత్రీకరణలో కొన్ని లోపాలు ఉన్నాయి.
 సమంత (అంటే లక్ష్మి) శారీరకంగా ఇరవై ఐదేళ్ల వయసు వున్నా మానసికంగా మాత్రం డెబ్భయ్ ఏళ్ళు.
సమంత మొదట ముసలామె లా నడిచినా తర్వాత మామూలుగానే నడవటం, మనవడు మందు సిగరెట్ తాగుతుంటే అల్లరి చేసి నాగ శౌర్య తో ఇంట్లో మందు తాగటం ఏమిటి?  అతని ఆకర్షణ లో  పడుతున్నట్లు అనిపించటం( చివర్లో ఆలా కాదని క్లియర్ చేసినా) చికాకు పెట్టె  లోపాలు. ఆమెకు తన వృద్ధాప్యంలో ఉన్నాన్న స్పృహని అడుగడునా మనకు గుర్తు చేస్తూ , చట్టు వున్న మగపిల్లలందరిని నేనే మీకంటేపెద్దదాన్నయ్యా అన్నట్లు ‘ఓరే అబ్బాయ్’అని పిలస్తుంది. తానేమో ప్రేమలో పడిపోయేంత అంచుకు వెళ్తుంది.
ఇలాగే, సంగీతం అంతగా ఆకట్టుకోలేదు.
క్లైమాక్స్ అంతగా ఎఫెక్టివ్ గా లేదు..
.సినిమాను కొంత ట్రిమ్ చేసి ఉండొచ్చు.
కానీ ఇవేవీ సినిమాను ఇబ్బంది పెట్టలేదు.
ఇలాంటి కొత్తదనం ఉన్న సినిమాల్లో లోపాలు వెతకడం కాకుండా ఇంటిల్లిపాదీ కలిసి సినిమా చూడటం బెటర్!