షణ్ముగం సార్ కు నమస్కారం, సర్పంచంటే ఇలా ఉండాలి

(ఎస్ విజయలక్ష్మి)
ఊరంతా పచ్చగా ఉండాలి,వూర్లోని మనుషులంతా సొంత ఇంట్లో నీళ్ల బాధ, కరెంటు బాధ  లేకుండా హాయిగా ఉండాలని కోరుకునే వాళ్లందరికి ఓడంతురై పంచాయతీ గురించి తెలుసుకోవాలి.
ఎందుకంటే, పంచాయతీ అంటే ఎలా ఉండాలో, వూరంటే ఎలా ఉండాలో సర్పంచంటే ఎలా పనిచేయాలో చెప్పే వూరిది.
దీనికి కారణం రెండు టర్ముల సర్పంచ్ (ఇపుడు మాజీ) షణ్ముగం రంగస్వామి. 1996లో ఆయన  సర్పంచయ్యాడు. పదేళ్లలో గుర్తు పట్టలేనంతా ఊరుని మెరుగుపరిచాడు.
ఇదంతా ఎలాచేశావో చెప్పమని టొరంటో యూనివర్శిటీ వాళ్లు షణ్ముగాన్ని కెనడా ఆహ్వానించారు. అనేక దేశాలలో నుంచి ఓడంతురై గ్రామాన్ని చూసేందుకు  వచ్చారు. ఇంకా  వస్తూనే ఉన్నారు. ఓడంతురై తమిళనాడు కొయంబత్తూరు జిల్లాలో ఉంది.
ఇంతకీ ఓడంతురై లో జరిగింది?
కరెంటుకోసం గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిందేనా? వద్దు , ఇక చాలు , మన కరెంటు మనమే ఉత్పత్తిచేసుకుంటే ఏలా ఉంటుందనుకున్నాడు షణ్ముగం సర్పంచవుతూనే.
ఉర్లో వాళ్లందరిని ఒప్పించాడు. వూరికి 120 కి.మీ దూరాన ఉన్న మైవాడి దగ్గిర ఒక విండ్ మిల్ ను పంచాయతీ తరఫున 2006 లో ఏర్పాటుచేయించాడు. దీని వెనక చాలా చరిత్ర ఉంది. అయితే నేం, దీనితో దేశంలో సొంంతంగా ఒక విండ్ పవర్ జనరేటర్ ఉన్న గ్రామంగా ఓడంతురై రికార్డుల కెక్కింది.
ఆ యేడాదే ఆయన సర్పంచు పదవీ కాలం కూడా అయిపోయింది. అయితే, తాను ప్రారంభించిన పనులు పూర్తి చేయడం ఆపలేదు. ఇప్పటికీ ఆయన రెగ్యులర్ ఈ విండ్ మిల్, టర్బయిన్ ఎలా పనిచేస్తుందో రోజూ ఒక సారి వెళ్లి చూసొస్తుంటాడు.
ఈ విండ్ పవర్ జనరేటర్ ఏర్పాటుచేసేందుకు ఆయన కోటిన్నర రుపాయల బ్యాంక్ లోన్ తీసుకువచ్చారు. విండ్ మిల్ జనరేటర్ ఏర్పాటు చేసేందుకు రు.1.55 కోట్లు ఖర్చయింది. కోటిన్నర బ్యాంకు రుణం లభించింది. మిగతాది పంచాయతీ నుంచి సర్దేశారు.ఇతంతా ఆయన నిజాయితీ వల్లే సాధ్యమయింది.
ఈ విండ్ మిల్ ( 350 కిలో వాట్ల ప్లాంట్) నుంచి సంవత్సరానికి ఆరులక్షల యూనిట్ల విద్యత్తు ఉత్పత్తి అవుతుంది. ఇందులో రెండు లక్షల యూనిట్లను కరెంటును తమిళనాడు విద్యత్ సంస్థ (TNEB)కి విక్రమయిస్తున్నారు. మిగతా కరెంటు పంచాయతీ అసరాలకు వాడుతున్నారు.ఇందులో వీధిదీపాలు,వాటర్ పంపింగ్ వగైరా ఉన్నాయి.
విండ్ మిల్ నుంచి సమృద్ధిగా విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నా, ఇదంతా హై టెన్షన్ విద్యుత్తు కాబట్టి ఇళ్లకు నేరుగా వాడుకోలేకపోతున్నారు. ఎందుకంటే, ఈ హైటెన్షన్ విద్యుత్ లో టెన్షన్ విద్యుత్ గా మార్చే ఏర్పాటు ఉండాలి. అది గ్రామానికి సాధ్యపడదు. ఈ ఒక్క విషయంలోనే ఈ గ్రామం ప్రభుత్వం మీద అధారపడాల్సి వచ్చింది.లేకుండా సొంతంగా విద్యుత్ తయారుచేసుకుంటూ రాష్ట్రం మీద ఆధార పడని వూరుగా పేరుపొందేది.
విద్యుత్ అమ్మకం ద్వారా పంచాయతీకి సంవత్సరానికి  ఆ రోజుల్లో రు. 11 లక్షలు రాబడి వచ్చేది. ఈ 13 సంవత్సరాలలో ఈ డబ్బుతో ఇపుడు కోటిన్నర రుపాలయ బ్యాంక్ లోన్ తీర్చేశారు. ఇపుడు ఓడంతురైకి పవర్ కట్ అనేది లేకుండా 24×7 విద్యుత్ సరఫరా ఉంది. ఒడంతురై ని మోడల్ గా తీసుకుని ప్రతి గ్రామం కూడా ఒక విండ్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన రుజువు చేసే చూపించాడు.
ఇది కూడా చదవండి: ఆమ్రపాలి స్కామ్ కష్టాల్లో ఎంఎస్ ధోని, భార్య సాక్షి
ఇపుడు ప్రపంచ బ్యాంకు అధికారులకు, ఇతర గ్రామాల పంచాయతీలకు, ఐఎఎస్ అధికారులకు, విద్యార్థులకు, విదేశీయులకు ఒడంతురై అధ్యయన కేంద్రమయిపోయింది.
అయితే ఇదంతా తన వల్లే జరిగిందంటే షణ్ముగం ఒప్పుకోడు. మేం చేసిందంతా ప్రభుత్వ పథకాన్ని ఉపయోగించుకోవడమేనని నిజాయితీగా చెబుతాడు. ‘ మాగ్రామాభివృద్ధికి ప్రభుత్వ పథకమే పునాది. రెమ్యూనరేటివ్ ఎంటర్ ప్రైజెస్ స్కీం నుంచి విండ్ మిల్ ఏర్పాటుచేసుకున్నాం. ఈ పథకం కిందనే కోటిన్నర రుపాలయ బ్యాంకు రుణం అందింది,’ అని ఆయన చెప్పాడు.
షణ్ముగం యాత్ర ఇలా మొదలయింది
1996లొ ఆయన గ్రామ సర్పంచుగా ఎన్నికయ్యాడు. అప్పటిదాకా ఆయన కూడా గ్రామంలో ఒక రైతు మాత్రమే. సర్పంచు అయ్యాక ఆయనకు గ్రామ సమస్యల మీద అవగాహణ వచ్చింది. ‘ మా గ్రామానికి అపుడు ఏవసతీ లేదు; మంచినీళ్ల వసతి లేదు. రోడ్డు సౌకర్యం లేదు. డ్రయినేజీ లేదు. వీధి దీపాలు లేవు.
‘అంతవరకు ప్రభుత్వం ఏమీ చేయడంలేదని నేనూ అనుకునే వాడిని. అయితే,నేను ప్రభుత్వంలో భాగమయ్యాక చాలా విషయాలు తెలిశాయి. ప్రభుత్వం ముందుకు రావడమే కాదు, మనమూ చొరవచూపాలని అర్థమయింది. మా వూరికి పనికొచ్చే ప్రభుత్వ పథకాలేమిటో చూశాం.మొదట నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ పథకం కింద మంచినీళ్ల పథకం తెచ్చుకోవాలనుకున్నాం. గ్రామస్థులు తమ వాటా రు. 4.80లక్షలు (ప్రాజక్టు ధరలో పది శాతం) ఇచ్చేందుకుముందుకు వచ్చారు. ప్రభుత్వం నుంచి రు.4.80 కోట్లు అందాయి. అంతే, మంచినీళ్ల పథకం పూర్తయింది,’ అని ఆయన చెప్పాడు.
పదకొండు కిలో మీటర్ల దూరాన ఉన్న భవానీ నది నుంచి పైప్ లైన్లు వేసి నీటిని సరఫర చేసే భారీ పథకం 11 నెలల్లో 2000 నాటికి పూర్తయింది. అంతకు ముందు నీళ్లకుచాలాదూరం వెళ్లాల్సి వచ్చేంది. వారంలో ఒక రోజు మాత్రమే బట్టలు ఉతుక్కునే వారు. నీటి పరిష్కారం కావడంతో వూరు కలకలలాడటం మొదలయింది. మహిళల శ్రమ తగ్గింది. పిల్లలను స్కూళ్ల ను పంపడం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు.
ఇదే సమయంలో పంచాయతీలో 500 వీధి దీపాలు అమర్చాం.మంచినీళ్ల ఫిల్టరింగ్ ప్లాంట్ కి బూస్టర్ స్టేషన్లకు కరెంటు అవసరమయింది. దీనితో కరెంటు బిల్లు ఏడాదికి రు. 2 వేల నుంచి రు. 1.5 లక్షలకు పెరిగింది. గ్రామ బడ్జెట్ లో సగం కరెంటు బిల్లుకు పోతూ ఉంది
. దీని వల్ల వూరి ఇతర బాగోగులకు నిధుల్లేకుండా అయింది. అందువల్ల కరెంటు బిల్లు తగ్గించుకోవాలంటే ఏమిచేయాలని ఆలోచించాం. సంప్రదాయేతర ఇంధన వనరులు గురించి విన్నాం. ఆరూట్లో వెళ్లాలనుకున్నాం,’ అని విండ్ పవన్ ప్లాంట్ కు ఎలా బీజం పడిందో వివరించాడు.
మొదట బయోమాస్ గ్యాసిఫయర్ గురించి ఆలోచించారు. బరోడా వెళ్లి ఇదెలాపని చేస్తుందో చూసొచ్చారుు. దీంట్లో ట్రెయినింగ్ తీసుకున్నాక 9 కిలో వాట్ల గ్యాసిఫయర్ కూడా ఏర్పాటుచేశారు. ఇందులో వాడే కొయ్యపొట్టు ధర కిలో అరవై పైసల నుంచి రు. 3.50 అయింది. యూనిట్ విద్యుత్ ధరేమో రు. 1.75 పైసలే. అందువల్ల ఇది గిట్టుబాటు కాలేదు. మళీ తమిళ నాడు విద్యత్ సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలు పెట్టారు.
తర్వాత పంచాయతీ కింద ఉండే రెండు గ్రామాలలో 2 కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుచేశారు. దీనితో నెలకు రు. 5వేల అదా కావడం మొదలుపెట్టింది. ఈ రెండు కూడా అసలు సమస్య పరిష్కరించలేదు. దీనితో విండ్ పవర్ జనరేటర్ గురించిఆలోచించాల్సి వచ్చింది.
షణ్ముగం చేపట్టిన మరొక కార్యక్రమం హౌసింగ్. ఈ వూర్లో ఉండేవాళ్లలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే. అంతా గుడిసెల్లో జీవించే వాళ్లు. వీళ్లకి పక్కాఇళ్లు నిర్మించాలని షణ్ముగం భావించాడు. దీనికి కూడా ఆయన ప్రభుత్వం ప్రకటించిన పథకాన్ని తెలివిగా వాడుకున్నారు.
1997లో సోలార్ పవర్డ్ గ్రీన్ హౌస్ స్కీం (SPGHS) కింద 950 ఇళ్లను మంజూరు చేయించాడు. ఇంటికయ్యే ఖర్చు రు. 2.5 లక్షలు. ప్రభుత్వ వాట రు. 1.80 లక్షలు. మిగతా మొత్తాన్నిలబ్దిదారులు భరించాలి. 300 చదరపు అడుగుల్లో ఇంటిలో హాల్, బెడ్ రూం, కిచెన్, టాయిలెట్, వరండా, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్…అన్నీ వుండేలా షణ్ముగం దగ్గరుండి పూర్తి చేయించాడు. 2006 నాటి కి వూర్లో గుడిసెలనేవి లేకుండా పోయియాయి.
ఇపుడు ఓడుంతురై అర్బన్ వసతులన్నీ ఉన్న గ్రామం. ఇపుడు విద్యుత్ అమ్మకం వల్ల గ్రామా రాబడి సంవత్సరానికి రు. 18 లక్షలకు చేరుకుంది.
వూర్లో అన్నిఇళ్లకు 24×7 నీళ్లు, కరెంటు ఉంటుంది. అందరికి సొంతఇళ్లుంది. వూరికి స్కూులు హైస్కూలు వచ్చాయి. 1996లో షణ్ముగం సర్పంచయ్యేటికి పంచాయతీ జనాభా కేవలం 1650 మాత్రమే. ఇపుడు 9500. అయినా అన్నీ వసతులు చెక్కుచెదరకుండా కొనసాగుతున్నాయి. ఒడంతురై ఎంతపేరొచ్చిందంటే ఈ  వూరి వాళ్లంటే లంచం అడిగే ధైర్యం కూడా ఎవరికీ లేదు.
  అందుకే ఊర్లన్నీ బాగుండాలనుకునే వాళ్లందరికి ఒడంతురై ఒక పర్యాటక కేంద్రమయిపోయింది.
(ఫోటోలు The Better India, The Village Square నుంచి)మె
(మీ ఊరి సక్సెస్ స్టోరీని మీరూ పంచుకోవచ్చు. మీ స్టోరీని trendingtelugunews@gmail.com కు మెయిల్ చేయండి)