కవిత చెప్పే కాకరకాయ కథలు నమ్మం: నిజామాబాద్ రైతులు

నిజామాబాద్ రైతులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. మద్దతు ధర కోసం తాము చేసిన పోరాటం దేశమంతా తెలియాలని వారు పార్లమెంటు ఎన్నికల్లో 178 నామినేషన్లు దాఖలు చేశారు. రికార్డు స్థాయిలో నామినేషన్లు వేసి దేశమంతా తమ వైపు చూసేలా చేశారు.

తాజాగా ఎంపీటిసి జడ్పీటిసి ఎన్నికల్లోనూ అదే విధంగా రికార్డు స్థాయిలో పోటి చేస్తామని ప్రకటించారు. పోటీలో ఉన్న రైతు అభ్యర్థులు ఏ పార్టీకి చెందిన వారు కాదని రాష్ట్ర కిసాన్ కేత్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…

“ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ రైతులు అధిక సంఖ్యలో పోటీకి సిద్ధమవ్వాలి. రైతు ఉద్యమాన్ని కించపరిచే వారికి తగిన గుణపాఠం చెప్పాలి. పసుపు ధర క్వింటాల్‌కు రూ.10 వేలకు పెంచకపోతే ఓట్లు అడగనని ఎంపీ కవిత అన్నారు. మద్దతు ధర కోసం కవిత చేసిన పోరాటం ఏమీ లేదు.

కవిత చెప్పే కాకమ్మ కథలు రైతులు నమ్మడం లేదు. పసుపు బోర్డు ఏర్పాటుపై హామీ ఇచ్చిన భాజపా కూడా ఇప్పుడు నోరెందుకు మెదపటం లేదు. రైతు సమస్యలపై పోరాటంలో అన్ని పార్టీలు కలిసి రావాలి” అని ఆయన కోరారు.

రైతులు ఎంపీగా నామినేషన్ వేయడంతో ఎన్నికలు వాయిదా పడుతాయని అంతా భావించారు. కానీ అందుకు ఈసీ, హైకోర్టు ఒప్పుకోలేదు. దీంతో ఏప్రిల్ 11న ఈవీఎంలతోనే ఎన్నికలు జరగనున్నాయి. 178 మంది రైతులు, 7 గురు ప్రధాన పార్టీల అభ్యర్దులు బరిలో ఉండడంతో మొత్తం 185 మంది ఈ ఎన్నికలో తలపడుతున్నారు.

ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు తమ ప్రచారం నిర్వహించారు.  అదే స్పూర్తితో స్థానిక ఎన్నికల్లో కూడా పోటి చేయాలని రైతులంతా నిర్ణయించారు. ప్రతి గ్రామంలో అత్యధిక నామినేషన్లు వేయడంతో పాటు గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు విశ్రమించేది లేదన్నారు. మద్దతు ధర వచ్చే వరకు పోరాడుతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *