ఈ.సి.ని వదల బొమ్మాలీ అంటున్న నిజామాబాద్ రైతులు

పసుపు బోర్డు, పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కోసం నిజామాబాద్ జిల్లా రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని రాజకీయ వత్తిళ్లు వచ్చినా, ప్రలోభాలు పెట్టినా లొంగలేదు… బెదరలేదు. అంతిమంగా 178 మంది అన్నదాతలు నిజామాబాద్ పార్లమెంటు బరిలో నిలబడ్డారు. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం నెలకొల్పారు. తాజాగా మరో కీలక స్టెప్ వేశారం రైతులు.
నిజామాబాద్ ఎన్నికల బరిలో 178 మంది రైతులతో కలిపి మొత్తం 185 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారందరికీ ఎన్నికలు ఎలా జరపాలన్నదానిపై ఎన్నికల కమిషన్ తర్జనభర్జన పడి తుదకు భారీ ఈవిఎం ల ద్వారా ఎన్నికలు జరుపుతామని నిర్ణయం తీసుకుంది. దానికోసం భారీ ఏర్పాట్లే చేస్తున్నది. కానీ ఈవిఎం లపై రైతులకు డౌటనుమానాలున్నాయి. ఈవిఎంలను మొదటి నుంచీ రైతులు వ్యతిరేకిస్తూ వచ్చారు. తాజాగా దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. హైకోర్టు తలుపు తట్టారు. మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ స్థానంలో ఎన్నికను వాయిదా వేయాలని, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని పిటిషన్ లో కోరారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు అన్నదాతలు.  ఈ పిటిషన్ పై మధ్యాహ్నం వాదనలు జరగనున్నాయి.
ఈవిఎంలు వద్దు.. బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిజామాబాద్ ఎన్నికలు జరపాలని కొన్నిరోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎన్నికలకు పట్టుమని పదిరోజులు కూడా లేదని ఇప్పటి వరకు తమకు ఏ గుర్తులు వచ్చాయో? వాటి బొమ్మలు ఎలా ఉన్నాయో కూడా సరిగ్గా అవగాహన కల్పించలేదని రైతులు వాపోతున్నారు. అసలే అంతంతమాత్రం చదువుకున్న తమకు గుర్తులను ఆలస్యంగా చూపిస్తే వాటిని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో తమ గుర్తులను జనాలకు ఎట్లా ప్రచారం చేసుకుంటామని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు ప్రధానమైన డిమాండ్లతో నిజామాబాద్ రైతులు కోర్టు మెట్లెక్కేశారు.
రెండు డిమాండ్లు ఇవే
నిజామాబాద్ రైతు అభ్యర్థులు ప్రధానంగా లేవనెత్తుతున్న రెండు డిమాండ్లలో మొదటిది తక్షణమే నిజామాబాద్ ఎన్నికను వాయిదా వేయాలి.  7 దఫాలుగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున తదుపరి జరగనున్న ఏదో ఒక ఫేస్ లో నిజామాబాద్ ఎన్నికను జరపాలని కోరుతున్నారు.
ఇక రెండో డిమాండ్ విషయానికి వస్తే ఈవిఎం ల మీద తమకు నమ్మకం లేదని అంటున్నారు. అందుకోసమే వారు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు పెట్టాలని కోరుతున్నారు. ఈ రెండు డిమాండ్ల పరిష్కారం కోసం హైకోర్టులకు వెళ్తారు రైతు అభ్యర్థులు.
మొత్తానికి ఇటు కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులనే కాకుండా అటు ఎన్నికల సంఘానికి కూడా నిజామాబాద్ పోరుబిడ్డలైన అన్నదాతలు చెమటలు పట్టిస్తున్నారు. మరి కోర్టు ఏరకమైన డైరెక్షన ఇస్తుందో చూడాలి.

నిజామాబాద్ రైతుల తాలూకు ఈ వార్త కూడా చదవండి…

https://trendingtelugunews.com/police-arrest-in-nizamabad-farmers/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *