కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు కొత్త ఇరకాటం

తెలంగాణ సిఎం కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు కొత్త ఇరకాటం వచ్చి పడిందా? ఫ్రంట్ పేరుతో కేసిఆర్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకులు వచ్చి పడ్డాయా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
జాతీయ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ వర్సెస్ మమతా బెనర్జీ అన్నట్లుగా మారిపోయాయి. ఆదివారం కోల్ కతా లో జరిగిన పరిణామాలు ఒక్కసారిగా నేషనల్ పాలిటిక్స్ ను వేడెక్కించాయి. సిబిఐ అధికారులు పోలీసు ఆఫీసర్ ను విచారించేందుకు వెళ్లడం, తదనంతరం వివాదం రేగింది. సిబిఐ అధికారులను పోలీస్ స్టేషన్ లో నిర్భందించడం వివాదం రేపింది.

మమతా బెనర్జీ ఈ విషయంలో చాకచక్కంగా వ్యవహరించి కేంద్రం తీరుపై సత్యాగ్రహ దీక్ష చేపట్టడం చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వం మమతా బెనర్జీ సర్కారును ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రయత్నం చేస్తోందన్న చర్చను ఆమె సమర్థవంతంగా తెర మీదకు తెచ్చారు. ఈ పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో చక్రం తిప్పాలనుకుంటున్న కేసిఆర్ ఇరకాటంలో పడిపోయారు. కేసిఆర్ ఇటు మమతకు కానీ, అటు మోదీకి కానీ మద్దతు ప్రకటించలేదు. ఎవరి పక్షమో కూడా ఇంకా తేల్చలేదు.
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసిఆర్ ఇప్పటికి రెండుసార్లు దేశ పర్యటన చేశారు. రెండు సందర్భాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో భేటీ అయ్యారు. జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర, బిజెపీయేతర ఫ్రంట్ తన లక్ష్యమని కేసిఆర్ ప్రకటించారు. మమత కేసిఆర్ ఫ్రంట్ కు సానుకూలంగానే కనబడింది. అయితే బిజెపిని దింపాలంటే కాంగ్రెస్ తో స్నేహం అవసరమే అన్నధోరణిలో మమత ఉన్నారు.
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏంటి? అన్నది కేసిఆర్ ఫిలాసఫి. అందుకోసమే ఆయన మమతతోపాటు ఒడిషా సిఎం నవీన్ పట్నాయక్, మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక సిఎం కుమారస్వామి, తమిళనాడులో ప్రతిపక్ష నేత స్టాలిన్ ను, కలిశారు. యూపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ ను కలిసేందుకు ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. కేసిఆర్ ను హైదరాబాద్ వచ్చి కలుస్తానని అఖిలేష్ వెల్లడించారు. కేసిఆర్ మమతను రెండుసార్లు కలిసిన సమయంలోనూ ప్రత్యేక విమానంలో కోల్ కతా వెళ్లి కలిశారు.
కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై విమర్శలు కూడా ఉన్నాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎ ఫ్రంట్ కు కేసిఆర్ పెట్టబోయే ఫ్రంట్ బి టీం అని కూడా విమర్శలు వినిపించాయి. మోదీ కనుసన్నల్లోనే కేసిఆర్ పనిచేస్తున్నారని కొందరు విమర్శలు మొదలుపెట్టారు. కేసిఆర్ ఫ్రంట్ రాజకీయాల్లో ఆంధ్రా సిఎం చంద్రబాబును ఇన్వాల్వ్ కానీయలేదు. ఆయనతో కనీసం మాటమాత్రంగా కూడా కేసిఆర్ చర్చించలేదు. అయితే ఆంధ్రాలో ప్రతిపక్ష నేత జగన్ ను ఫెడరల్ ఫ్రంట్ లోకి తీసుకోవాలన్న ఆలోచనతో కేసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.
కానీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మమత వర్సెస్ మోదీ అన్నట్లుగా మారింది. ఈ నేపథ్యంలో మమతకు కేసిఆర్ బహిరంగ మద్దతు ప్రకటించలేదు. మొన్నటివరకు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఆమెచుట్టూ రెండుసార్లు తిరిగిన కేసిఆర్ ఇప్పుడు ఆమె కేంద్రంతో ఫైట్ చేస్తుంటే కనీసం కర్టసీ రెస్పాన్స్ కూడా ఇవ్వడంలేదు ఎందుకబ్బా అని తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి.

సిబిఐ తీరుపైన కేసిఆర్ కానీ, టిఆర్ఎస్ ఎంపీలు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మమతకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ టిఆర్ఎస్ నుంచి స్పందన రాలేదు. కానీ సిబిఐ వివాదం రేగిన వెంటనే ఎఐసిసి అధినేత రాహుల్ గాంధీ స్పందించారు. మమతకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టిడిపి అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్రం వైఖరిని ఎండగట్టారు. వీరిద్దరే కాకుండా తమిళనాడు ప్రతిపక్షనేత, డిఎంకె అధినేత స్టాలిన్ కూడా మమతకు మద్దతు ప్రకటించారు. కేంద్రం వైఖరిని తప్పు పట్టారు. అలాగే మాజీ ప్రధాని దేవేగౌడ కూడా మమతకు బాసటగా నిలిచారు.
ఈ పరిస్థితుల్లో కేసిఆర్ మాటమాత్రంగా కూడా స్పందించకపోవడానికి కారణాలేంటబ్బా అన్న చర్చ ఉంది. ఒకవేళ కేసిఆర్ స్పందించకపోతే ఫెడరల్ ఫ్రంట్ అనేది మోదీ బి టీం అన్న విమర్శలు మరింతగా మొదలయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి స్పందించారు. కేసిఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలంటూ ఆమె చురకలు వేశారు. మమతకు అనుకూలమా? మోదీకి అనుకూలమా? కేసిఆర్ క్లారిటీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
మొత్తానికి మమత వర్సెస్ మోదీ వ్యవహారంలో కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు కొత్త ఇరకాటం వచ్చి పడిందనేది నగ్న సత్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *