మోదీ నాలుగేళ్ల జెర్నీ.. చెప్పిందెంత ? చేసిందెంత ?

భార‌త ప్ర‌ధానమంత్రిగా న‌రేంద్ర మోదీ ప్ర‌మాణ స్వీకారం చేసి నేటికి నాలుగేళ్లు. మ‌రో ఏడాది మాత్ర‌మే మిగిలి ఉంది. మ‌రి ఈ నాలుగేళ్ల పాల‌న‌లో మోదీ సాధించిందేమిటీ. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను మోదీ ఎంత‌వ‌ర‌కు నెర‌వేర్చారు. మోదీ ప‌రిపాల‌న‌పై దేశ ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు.మోదీ పాల‌న‌కు నాలుగేళ్లు ముగిసిన సంద‌ర్భంగా ట్రేండింగ్ తెలుగు న్యూస్ ప్ర‌త్యేక క‌థ‌నం. మోదీ పాల‌న‌కు నాలుగేళ్లు ముగియ‌డంతో క‌మ‌లం నేత‌లు దేశ‌వ్యాప్తంగా ఆనందంలో సంబ‌రాలు చేసుకుంటున్నారు.మోదీ పాల‌న మ‌హాఅద్భుతం అంటూ పేర్కొంటున్నారు. అయితే మోదీ పాల‌న నిజంగా అద్భుతంగా ఉందా.. అంటే కాద‌నే స‌మాధానాలే దేశ‌వ్యాప్తంగా ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ముక్త భార‌త్, అచ్ఛేదిన్ అంటూ గ‌త ఎన్నికల్లో విప‌రీతంగా ప్ర‌చారం చేసుకొని అధికారంలోకి వ‌చ్చారు మోదీ. కానీ మోదీ నాలుగేళ్ల‌ పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

మోదీ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా ద‌ళితుల‌పై దాడులు విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో వారు మోదీపై గుర్రుగా ఉన్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌పడుతున్నారు. అంతేకాకుండా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టాన్ని నీరుగార్చ‌డం,గోసంర‌క్ష‌ణ పేరుతో త‌మ‌పై జ‌రిగిన‌ దాడుల‌పై దేశంలో ద‌ళితులు మోదీ స‌ర్కార్ పై తీవ్ర వ్య‌తిరేకంగా ఉన్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక క‌థువా-ఉన్నావ్ సంఘ‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్లో మోదీ ప్ర‌భుత్వంపై పూర్తి వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్ లో బీజేపీ ఎమ్మెల్యేనే మ‌హిళ‌పై అత్యాచారానికి పాల్ప‌డ‌టం, జ‌మ్మూ కాశ్మీర్ లో బీజేపీ ఎమ్మెల్యేలు అత్యాచార నిందుతుల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ ఆందోళనలు చేసిన ఘ‌ట‌న‌లు దేశ‌వ్యాప్తంగా బీజేపీపై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హ‌వేశాన్ని పెంచాయ‌ని రాజ‌కీయ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇక పెద్ద నోట్ల ర‌ద్దు బిగ్ ఫెయిల్యూర్ అవ‌డం జనాల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. జీఎస్టీ అమ‌లులో వైఫ‌ల్యాలు ఎన్డీయే ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక ముద్ర‌ను వేశాయి. అలాగే విదేశాల నుంచి న‌ల్ల‌ధనాన్ని వెన‌క్కి తీసుకొస్తాన‌ని, దేశంలో అవినీతిని లేకుండా చేస్తాన‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఊద‌ర‌గొట్టిన మోదీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రూపాయినైనా తీసుకొచ్చారా. అంటే ఈ ప్రశ్నకు బీజేపీ నేత‌ల ద‌గ్గ‌ర స‌మాధాన‌మే లేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ అవినీతితో విసిగిపోయిన దేశ ప్ర‌జ‌లు మోదీని గెలిపించారు. కానీ మోదీ ప్రత్యేకంగా అవినీతిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకపోవ‌డ‌మే కాకుండా అవినీతి ప‌రుల‌కు కొమ్ము కాస్తున్నార‌నే విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అలాగే మోదీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత రావ‌డానికి అనేక కార‌ణాలే క‌నిపిస్తున్నాయి. ఏటా కోటి ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన మోదీ ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించారో ఆయ‌న‌కే తెలియాలి. మేకిన్ ఇండియా పెద్ద ప్లాప్ అయింది. ఇక నీర‌వ్ మోదీ, విజ‌య్ మల్యా లాంటి వారు దేశం విడిచి పోయినా. వారిని ఇప్ప‌టివ‌ర‌కు స్వ‌దేశానికి తీసుకోరావ‌డంలో వైఫ‌ల్యం, పెట్రోలు ధ‌ర‌లు పెంచ‌డం లాంటివి మోదీ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రావ‌డానికి దారితీశాయి.

నాలుగేళ్ల పాల‌న‌తో మోదీ సాధించిన విజ‌యాలు చూసుకుంటే మాత్రం పెద్ద‌గా లేవ‌నే చెప్పుకొవాలి. ట్రిపుల్ త‌లాక్ ను ర‌ద్దు చేసి ముస్లిం మ‌హిళ‌ల‌ను కాపాడారు. అలాగే పేద‌ల‌కు ఉచిత‌ గ్యాస్ క‌నెక్ష‌న్లు, జీరో బ్యాంక్ అకౌంట్లు నిరుపేద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని చెప్పుకొవ‌చ్చు. కాగా, మొత్తానికి చూసుకుంటే మోదీ పాల‌న‌లో వైఫ‌ల్యాలే ఎక్కువ‌గా ఉన్నాయి. దీంతో ప్ర‌జ‌ల్లో బీజేపీ వ్య‌తిరేక‌తే ఎక్కువ‌గా ఉంద‌ని ఇటీవ‌ల వ‌చ్చిన ఒక స‌ర్వే కూడా వెల్లడించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *