అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు: కెసియార్ డిమాండ్ ను మోదీ అమోదించాలి

ఆర్ధికంగా వెనుకబడిన అగ్ర కులాల వారికి 10 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినేట్ ఆమోదించింది. ఎన్నికలు దగ్గరపడుతున్నపుడు అగ్రవర్ణాల పేదల ను అకట్టుకునేందుకు బిజెపి నాయకత్వంలోని మోదీ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని చెప్పేందుకు పెద్ద గా రాజకీయ పాండిత్యం అవసరం లేదు. నాలుగున్న ర సంవత్సరాలు మోదీ ప్రభుత్వానికి అగ్ర వర్ణ పేదలు కనిపించలేదా అనే ప్రశ్న వస్తుంది. అయితే, చాలా తెలివైన నిర్ణయమే.

అగ్ర వర్ణాలకు రిజర్వేషన్ల కోసం రేపు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతారు. రిజర్వేషన్ల వ్యవహారం కాబట్టి ఇతర పార్టీలు కిమ్మనకుండా బిల్లుకు మద్దతు చెబుతాయి. రిజర్వేషన్లు అమలుచేస్తూ వెంటనే కొందరికి ఉద్యోగాలు కూడా రావచ్చు. ఆతర్వాత ఎవరో కోర్టుకు పోతారు. కోర్టు ఇది చెల్లదని తీర్పు చెప్పవచ్చు.

ఎటయినా బిజెపికి మేలే. రిజర్వేషన్లు అమలయితే ఎవరూ చేయని పని మేం చేశామని మోదీ ప్రకటించి పార్లమెంటు వోట్లకు పరిగెత్తవచ్చు. వ్యవహారం కోర్టు వల్ల ఆగిపోతే, మేం ఎంతో చేయాలనుకున్నాం, కోర్టులు అడ్డొస్తున్నాయని దబాయించవచ్చు.

అయితే, ఇక్కడొక విషయం ఉంది. రిజర్వేషన్లు అమలుచేసేందుకు 50 శాతం సీలింగ్ ను సుప్రీం కోర్టు ఎపుడూ  విధించింది. ఆ సీలింగ్ ను చూపి తెలంగాణ వంటి రాష్ట్రాలు ముస్లింలకు, ఇతర వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెంచడాన్ని కోర్టు కొట్టి వేసింది. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ ఒక డిమాండ్ చేశారు. అదేమిటంటే, రిజర్వేషన్ల గొడవ కేంద్రానికి ఎందుకు అని. ఏ ప్రజలకు ఏమికావాలో, ఎవరికి రిజర్వేషన్లు కావాలో బాగా తెలిసేది రాష్ట్రాలకే. అందువల్ల కేంద్రం జోక్యం మానుకోవాలని.

ఇపుడు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం పూనుకోవడం, రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకువస్తూండటంతో కెసియార్ తన డిమాండ్ ను పునరుద్ఘాటించవచ్చు. ఒక వేల రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారాలు ఇవ్వాలనే దాని మీద మోదీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.ఒక వేళ సీలింగ్ లేదు, రిజర్వేషన్లను పెంచుకునే హక్కు రాష్ట్రాలకు ఇస్తాం దీని మీద చర్చకు సిద్ధమని కెసియార్ డిమాండ్ నేపథ్యంతో మోదీ ప్రభుత్వం ప్రకటిస్తే… అదొక సంచలనం అవుతుంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రకటన అవుతుంది.

ఈ రోజు విద్య ఉద్యోగాల్లో ఆర్ధికంగా వెనుకబడి ఉన్న అగ్రకులాల వారికి ఈ రిజర్వేషన్లు విస్తరింపచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లను 60 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరి కెసియార్ అడిగింది కూడా ఇదే కదా? అరవై కాకుంటే, 70 లేదా 80 శాతం. ఆనిర్ణయమేదో రాష్ట్రాలకు వదిలేయండి అనే కెసియార్ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ప్రకటించినపుడు టిఆర్ ఎస్ ప్రతిపాదిస్తున్నట్లు ముస్లిం బిసిలకు రిజర్వేషన్లు ఎందుకివ్వరాదనే ప్రశ్న వస్తుంది. కెసియార్ ఏమంటారో చూడాలి.

అగ్రవర్గ కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలని దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలల్లో ఆందోళనలు నిర్వహించారు. గుజరాత్ లో పటేల్ లు తమ రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణలో రెడ్లు తమకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడారు. రెడ్డి జాగృతి తరపున అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రెడ్డి జాగృతి తరపున అసెంబ్లీ ముట్టడి కూడా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో కాపులు కూడా తమ రిజర్వేషన్ల పెంచాలని పోరాటం చేశారు. మహారాష్ట్ర, రాజస్థాన్ లలో కూడా ఈ డిమాండ్ ఉంది. దీంతో కేంద్ర కేబినేట్ ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం లోక్ సభలో అగ్రవర్ణాల రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనుంది.

మోదీ నిర్ణయం తప్పు బట్టిన  ఓవైసీ 

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచడాన్నిఎఐ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ తప్పు పట్టారు.
‘దళితులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేసేందుకు రిజర్వేషన్లను తీసుకొచ్చారు. పేదరికాన్ని అరికట్టడానికి చాలా పథకాలు, కార్యక్రమాలు తీసుకునిరావొచ్చు. కానీ రిజర్వేషన్లు అనేవి సామాజిక న్యాయానికి ఉద్దేశించినవి. ఆర్థిక కారణాల ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వలేం’ అని తేల్చిచెప్పారు. ప్రస్తుతం కేంద్రం 49.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ రిజర్వేషన్లు 50 శాతం దాటేందుకు వీలులేదు.” అని ఆయన ట్వీట్ చేశారు.

మరో వైపు బిసి ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య రిజర్వేషన్ల పెంపు పై స్పందించారు. మోదీకి దమ్ముంటే దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఇష్టమొచ్చినట్టు రిజర్వేషన్లు మారుస్తామంటే  ఒప్పుకొమన్నారు.

ఇది ఎన్నికల జిమ్మిక్కంటున్న కాంగ్రెస్

ఎన్నికల జిమ్మిక్కు కోసమే బిజెపి రిజర్వేషన్లు పెంచిందని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించవద్దని సుప్రీం తీర్పు ఇచ్చిందని అటువంటప్పుడు ఇదేలా సాధ్యమవుతుందన్నారు. 2014 నుంచి గుర్తుకు రాని రిజర్వేషన్లు ఇప్పుడే ఎందుకు వచ్చాయని ఆయన ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *