మథుర శ్రీ కృష్ణుడికి 21 వేల కేజీల చంద్రయాన్ లడ్డు నైవేద్యం

చంద్రయాన్-2 దేశంలో స్పేస్ రీసెర్చ్ మీద, ప్రయోగాల మీద కనివిని ఎరుగని చైతన్యం తీసుకువచ్చింది.
ఇంతవరకు ఎవో పరీక్షల బిట్ క్విశ్చెన్లకు పరిమితమయిన ISRO (ఇస్రో) అనే నాలుగు అక్షరాల ఇంగ్లీష్ మాట పలకని భాతీయుడు లేడేమో ఇపుడు. ఇస్రో భారతీయుల గుండెచప్పుడయింది.
అంతేకాదు, చంద్రయాన్ 2 ల్యాండర్ వైఫల్యాన్ని ఎవరూ వైపల్యంగా చూడటమే లేదు. ఇది ఇస్రోకి కొండంగ నైతిక శక్తి యిస్తుంది.
ఇస్రో చంద్రయాన్ అనే మాటలు ప్రతిధ్వనించని ఇల్లు లేదిపుడు భారత్ లో. చదువుకున్న వాళ్లని, చదువురాని వాళ్లని, విద్యార్థులని… ఇలా అన్ని వర్గాల వారిని  చంద్రయాన్ 2 ఉత్తేజపరిచింది.
ఈ నేపథ్యంలో నాగపూర్ పోలీసులు చంద్రుడి ఉపరితలం మీద ఇస్రో సిగ్నల్ జంప్ చేసిన విక్రమ్ లాండర్ దారికి రావాలని పిలుపునిచ్చారు.  సిగ్నల్ జంప్ చేసినందుకు ఛలాన్ రాయమని హమీ ఇస్తూ ట్విట్టర్ నోటీసు పంపారు.
ఈ  ట్వీట్ సరదాగానే షేర్ చేసినా అది  చంద్రయాన్ అవేర్ నెస్ ఎంత డీప్ గా  ఇండియన్ సైకీలోకి చొచ్చుకుపోయిందో చెబుతుంది.
ఇలాంటి  మరొక మహత్తర సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని శ్రీ కృష్ణ జన్మభూమి అయిన మథుర లో జరగబోతున్నది. ఈ ఏడాది అక్కడ జరిగే ప్రఖ్యాత పండుగ చప్పన్ భోగ్ (Chappan Bhog) మహోత్సవాన్ని చంద్రయాన్ 2 అంకితమిచ్చారు.
ఛప్పన్ భోగ్ అనేది మూడు రోజుల పండగ. ఈ నెల 10 న అంటే ఈరోజు మొదలయింది. ఈ ఉత్సవాలలో భక్తులు 56 (ఛప్పన్) రకాల వంటలను శ్రీకృష్నుడికి ప్రసాదంగా సమర్పిస్తారు. వేలాది మంది భక్తులు , యాత్రికులు  శ్రీకృష్ణుడి రథంతో అక్కడి గోవర్దనగిరి చుట్టూ 23 కిమీ ప్రదక్షిణ చేయడంతో ఈ ఉత్సవాలు మొదలవుతాయి.

https://trendingtelugunews.com/nagapur-police-notice-to-vikram-lander-who-broke-the-signals-on-moon/

శ్రీ గిరిరాజ్ సేవా సమితి ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంది.
ఈ ఛప్పన్ భోగో ఉత్సవాలను చంద్రయాన్ కు అంకితమీయనున్నట్లు చెబుతూ భక్తులంతా భవిష్యత్తులో ఇస్రో జరిపే చంద్రయాత్రలన్నీ విజయవంతం కావాలని ప్రార్థిస్తారని ఈ సంస్థ వ్యవస్థాపకుడు మురారి అగర్వాల్ చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీతో ఇస్రో శాస్త్రవేత్తలందరిని కూడా కుటుంబసమేతంగా రావాలని ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు.
‘‘ ఇక్కడి గర్భగుడిని వజ్ర వైఢూర్యాలో తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అపుడు దీనికి చంద్రయాన్ 3 ఆకారమిస్తాం. ఇక్కడి బ్రిజ్ వాసీలంతా చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు,’’ అని ఆయన చెప్పారు.
ఈ సారి కృష్ణ భగవానుడికి సమర్పించే లడ్డు ప్రసాదాన్ని చంద్రయాన్ 3, రోవర్ అకారంలో తయారు చేస్తున్నారు. దీనికోసం ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఉండే బెంగుళూరు తో పాటు, కలకత్తానుంచి వంటవాళ్లను ప్రత్యేకంగా రప్పించారు
ఈ సారి లడ్డు బరువు 21 వేల కేజీల బరువుటుంది. మథురతో పాటు లక్నో, ఆగ్రా, హర్తాస్, రాట్లామ్, మదురై, ఇండోర్ లనుంచి పాకశాస్త్ర నిపుణులు ఈ లడ్డు తయారుచేసేందుకు రోజుకు పదిగంటల చొప్పున పని చేస్తున్నారు.ఈ లడ్డు తయారీకి కేవలం అవునెయ్యి మాత్రమే ఉపయోగిస్తారు.
ఛప్పన్ భోగ్ ఉత్సవాలు రోజు మొదలయిన మూడురోజుల పాటు కొనసాగుతాయి. సెప్టెంబర్ 11 వ తేదీన శ్రీ కృష్ణుడి మహా అభిషేకం ఉంటుంది.
12 వ తేదీన ఛప్పన్ భోగ్ ఉంటుంది. ఈ ఉత్సవాలకు కనీసం నాలుగు లక్షల మంది యాత్రికులు వస్తారని భావిస్తున్నారు.