Home English కర్ణాటక సంక్షోభం: ఏం జరుగుతోందక్కడ     

కర్ణాటక సంక్షోభం: ఏం జరుగుతోందక్కడ     

110
0
SHARE
(బి వి మూర్తి)
సంక్షోభంలో కూరుకుపోయిన కర్ణాటకలో కాంగ్రెస్ పైచేయిగా కొత్త సీసాలో పాత సారాలా మరో కొత్త సంకీర్ణ ప్రభుత్వమో, బిజెపి తిరిగి అధికారం లోకి రావడమో అనివార్యంగా తోస్తున్నది. అయితే ఇంకో
వారం పది రోజులు ధర్నాలు, నిరసనలు దద్దరిల్ల వచ్చునేమో గానీ కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి మాత్రం యథావిధిగా కొనసాగే సూచనలే కనిపిస్తున్నాయి. అనిశ్చితిని తొలగించడంలో రాష్ట్ర గవర్నర్, అసెంబ్లీ స్పీకర్ కీలక పాత్ర నిర్వహించవలసి ఉంది. వీరిద్దరూ తక్షణం స్పందించి త్వరిత గతి నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. అయితే స్పీకర్ రమేశ్ కుమార్ గానీ, గవర్నర్ వజూభాయ్ వాలా గానీ అలా స్పందిస్తున్న దాఖలాలేవీ కనిపించడం లేదు.
సంకీర్ణంలోని 14 మంది (కాంగ్రెస్ 12, జనతా దళ్ ఇద్దరు, ఈ సంఖ్య ఇంకా ఇంకా పెరుగుతున్నది) శాసనసభ్యులు రాజీనామా చేశారన్నది అధికారికంగా అర్ధ సత్యం. ఈ ఎమ్మెల్యేలు స్వదస్తూరీతో రాసిన రాజీనామా లేఖలను తీసుకెళ్లి స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ వ్యక్తిగత కార్యదర్శికి స్వయంగా అందజేసి వెళ్లారు. వీళ్లు వెళ్లేసరికి స్పీకర్ తన కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం పథకం ప్రకారమే జరిగిందో, లేక కేవలం కాకతాళీయమో మీడియా ప్రతినిధుల కల్పనాశక్తికి వదిలివేయబడింది.
ఎమ్మెల్యేల రాజీనామా లేఖలను చూసి, పరిశీలించి, సాంతం చదివి అర్థం చేసుకున్న స్పీకరుగారు సీరియస్ గా మొహం పెట్టి, సదరు ఎమ్మెల్యేలందరికీ నోటీసులు జారీ చేయవలసిందిగా తన కార్యదర్శిని ఆదేశించారు. ఆ ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరుగా వచ్చి తన ఎదురుగా కూర్చుని ఎందుకు రాజీనామా చేస్తున్నారో ముఖతః వివరిస్తేనే తప్ప వారి రాజీనామాలపై తాను ఏ నిర్ణయమూ తీసుకోజాలనని నోటీసులో స్పీకరు తేల్చి చెప్పారు.
స్పీకరు సారు ఆమోదించి అస్తు అంటేనే ఎమ్మెల్యేల రాజీనామాలు అధికారికమవుతాయి. అలా చేయడానికి, కొంత సమయం పడుతుంది. ఎంత అంటే స్పీకరు దయతలిచినంత. రాజీనామాలు వెంటనే ఆమోదించే ఉద్దేశ్యం స్పీకరుకు లేదని స్పష్టంగానే తెలుస్తున్నది. ఎంతయినా ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన పెద్ద మనిషి.
ఎమ్మెల్యేలు, స్పీకరు మధ్య నలుగుతున్న ఈ వ్యవహారంలో ఇరు పక్షాలకూ ఎవరి ఉద్దేశ్యాలు వారి కున్నాయి. ఈ వ్యవహారాన్ని ఇలాగే నానబెట్టి లాలనలు, బుజ్జగింపులతో సంకీర్ణ పక్షాలు తమ తమ ఇళ్లు చక్కదిద్దుకుని మళ్లీ రాజీకి వచ్చేదాకా సాగదీయడం స్పీకరు సారు ఉద్దేశ్యం కావచ్చు.
అసలు ఆ పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేశారని అడిగితే, వారు తమ లేఖల్లో పేర్కొన్నవి కాక విడివిడిగా ఎవరి కారణాలు వారి కున్నాయి. రాజీనామా చేస్తా, చేసేస్తా నని లోక్ సభ ఎన్నికలకు ముందుకాలం నుంచే గారాలు పోతున్న కాంగ్రెస్ `సీనియర్’ అసమ్మతి సభ్యుడు రమేశ్ జర్కిహొళి ప్రస్తుత కుమారస్వామి మంత్రి వర్గంలో పనిచేసి తీసేసిన మంత్రి. వాళ్లన్న సతీష్ జర్కిహొళి ఈ సరికే మంత్రి. బెల్గాం జిల్లా జర్కిహొళి ఫ్యామిలీకి ఒక్క పదవే వీలవుతుంది బాబూ అని నచ్చజెప్పబోతే, ఏం, ఎందుకు వీలు కాదు, దేవే గౌడ ఫ్యామిలీలో ఇద్దరు మంత్రులు లేరా, మా ఫ్యామిలీకే ఎందుకంత దురన్యాయపు రేషను? అని నిగ్గదీస్తున్నాడు రమేషు. ఇలా అందరూ మంత్రి పదవి కావాలంటూ తేల్చిచెప్పడం లేదు కానీ లోలోపల ఉద్దేశ్యం మాత్రం అదే. ప్రభుత్వం తమదే అయినా తమ పనులు ఒక్కటీ చక్కబెట్టుకోలేక పోవడం కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కనీవినీ ఎరుగని వింత అనుభవం. పేరుకు ప్రజా పనుల మంత్రి అయినా జనతా దళ్ పెద్దన్న హెచ్ డి రేవణ్ణ అన్ని శాఖల్లోనూ వేలు పెడుతూ పూర్తి స్థాయిలో డామినేట్ చేస్తున్నాడని మరికొందరికి మండిపోతున్నది. అసమ్మతి గోడకు అటువేపు దాక్కుని మూగసైగలు చేస్తూ రా రమ్మని కన్ను గొడుతున్న బిజెపి బ్రోకర్ల హామీలకు స్పందించి రాజీనామాలు చేసిన వాళ్లూ లేకపోలేదు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు జిగ్రీ దోస్తు మాజీ మంత్రి రామలింగారెడ్డి కూడా రాజీనామా ఎమ్మెల్యేల క్లబ్బులో చేరి బుజ్జగింపులు, బేరసారాలకు దొరక్కుండా మొహం చాటేయడం ఈ సారి అందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. రామలింగారెడ్డి కుమార్తె, బెంగుళూరు నగరంలోని జయనగర్ ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డి కూడా అప్పుడో ఇప్పుడో రాజీనామా చేయవచ్చని తెలుస్తున్నది. బెల్గాం జిల్లాలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా లేఖలు పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్నారని కొన్ని టివి ఛానెల్స్ నమ్మకంగా చెబుతున్నాయి.
ఈ నెల 12 నుంచి శాసనసభ సమావేశాలు ఆరంభం కావలసి ఉంది. ఆ లోగానే ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారాన్ని స్పీకర్ తేల్చవలసి ఉంది. తేల్చలేకపోతే సమావేశాలను వాయిదా వేయడం కూడా ఆయన చేతిలోని పనే.
అయితే 12 లోగానే బిజెపి నాయకులు, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి స్పీకర్ పై ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నారు. అయితే దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. శాసనసభ, శాసనసభ్యుల వ్యవహారాల్లో స్పీకర్ దే నిర్ణయాధికారం.
మరోవైపు అలిగిన ఎమ్మెల్యేలను తిరిగి దారికి తెచ్చుకోడానికి కాంగ్రెస్, జెడి(ఎస్)లు నానా పాట్లూ పడుతున్నాయి. కాంగ్రెస్ మంత్రులు 21 మంది, జెడి(ఎస్) మంత్రులు 9 మంది రాజీనామాలు చేసేసి అసమ్మతి సభ్యులందరికీ పదవులు వచ్చేలా మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఉభయ పార్టీల నాయకులు ప్రకటించారు. ఈ ప్రతిపాదనతో ముంబైకి వెళ్లి, అసమ్మతి సభ్యులతో వారు బస చేసిన స్టార్ హోటల్ లోనే చర్చించి వారిని ఒప్పించి సగౌరవంగా బెంగుళూరుకు తీసుకురావాలని సంకీర్ణం పెద్దలు పథకం వేశారు.
ఇక్కడ మరో తిరకాసు ఉంది. జెడి(ఎస్) మంత్రులు రాజీనామా చేస్తారని అంటున్నారే తప్ప సిఎం పదవికి కుమారస్వామి రాజీనామా సంగతిని ఎవరూ ప్రస్తావించక పోవడం గమనార్హం. కాంగ్రెస్ కు సిఎం పదవిని అప్పగించడం అటు కుమారస్వామికి గానీ ఇటు దేవేగౌడకు గానీ ఎంత మాత్రం ఇష్టం లేదు. ఒకవేళ కాంగ్రెస్ కు సిఎం పదవిని వదులుకోవడం అనివార్యమైతే సిద్ధరామయ్యకు ఆ పదవి దక్కకుండా చేసేందుకు దేవేగౌడ తుదిదాకా ముక్కుచీది పోరాడటం తప్పనిసరి. ఇప్పటికైతే సిద్ధరామయ్యతో పాటు మల్లికార్జన ఖర్గే ఒక్కడి పేరే వినిపిస్తున్నది కానీ నిజంగా ఆ శుభ ముహూర్తమే ఆసన్నమైతే కాంగ్రెస్ లో నాయకులకు కొదువ లేదు.
సంకీర్ణ పక్షాల చాణుక్య పథకాలేవీ పారకపోతే మళ్లీ సిఎం నేనే నంటూ బిజెపి నేత యడ్యూరప్ప ఉవ్వళ్లూరుతున్నాడు. పేకాటలో జోకర్ లాంటి ఇద్దరు ఇండిపెండెంట్ లలో మంత్రి నాగేష్ రెండ్రోజుల క్రితమే మంత్రి పదవికి రాజీనామాను, బిజెపికి మద్దతు తెలియజేసే లేఖను కూడా గవర్నర్ కు అందజేసి అసమ్మతులందరితో కలిసి ముంబైకి వెళ్లారు. మరో స్వతంత్రుడు శంకర్ మాత్రం మంత్రి పదవికి మాత్రం రాజీనామా చేసి ముంబై బస్సెక్కారు.
ఎమ్మెల్యేల రాజీనామాలకు ఆమోదముద్ర పడి మొత్తం శాసనసభ్యుల సంఖ్య 224 నుంచి దిగుముఖం పట్టి 210 అంత కంటే తక్కువ స్థాయికి చేరితే పరిస్థితి బిజెపికి కలసి వస్తుంది. పోయేవారంతా సంకీర్ణం సభ్యులే కాబట్టి సింపుల్ మెజారిటీ మ్యాజిక్ నంబర్ బిజెపికి అత్యంత అనుకూలమవుతుంది. సభలో బిజిపికి 105 మంది సభ్యులున్నారు.
మొత్తమ్మీద, రోజూ చచ్చే వాడి కోసం ఏడ్చే వాడెవడు అన్నట్టుంది కర్ణాటక ప్రభుత్వం పరిస్థితి.
కాంపిటీషన్ లో ఎక్కడ వెనక బడి పోతామోనని భయపడి చచ్చిపోతున్న టెలివిజన్ ఛానెళ్లు ఏదో కొంపలంటుకుపోతున్నట్టు తాజా రాజకీయ పరిణామాలపై గంటల పంచాంగం చెబుతూ నానా హడావుడీ చేస్తున్నాయి గానీ సగటు మనిషి మాత్రం ఈ ఛండాలంపై ఇంకా చర్చ అవసరమా అన్నట్టు అసహ్యంగా మొహం పెడుతున్నాడు. ఏడాది క్రితం హంగ్ తీర్పు ఇచ్చినందుకు ముక్కు చెంపలేసుకుంటూ, మధ్యంతర ఎన్నికలొస్తే మాత్రం చచ్చనా ఇలాంటి తప్పు చేయకూడదని తనలో తాను గొణుక్కుంటున్నాడు.