లోక్ సభ ఎన్నికల్లో కన్నడ స్టార్ ఉప్పి పార్టీ కూడా ఉందోచ్!

(బి వెంకటేశ్వరమూర్తి)

ఓటరు మహాశయులారా, ఈ లోక్ సభ ఎన్నికల్లో మా పార్టీ కూడా పోటీలో ఉన్నదని గమనించ ప్రార్థన అనంటూ కన్నడ సంచలన నటుడు ఉపేంద్ర సవినయంగా మనవి చేస్తున్నాడు. అన్నట్టు ఉపేంద్ర పార్టీ పేరు ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యుపిపి). ప్రజల కోసం ఉత్తమ రాజకీయాలు చేసే పార్టీ మాదని గతేడాది సెప్టెంబర్ లో తన ఈ రెండో కొత్త పార్టీని ప్రారంభించినప్పుడు ఉపేంద్ర చెప్పుకొచ్చారు. రెండో కొత్త పార్టీ అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, 2016 ఆగస్టులో అప్పటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఓ ఆర్నెల్లు ముందు కర్ణాటక ప్రజ్ఞావంతర జనతా పార్టీ (కెపిజెపి) అనే పార్టీని పెట్టాడు గనుక. అభిమానులు ముద్దుగా పిల్చుకొనే ఉప్పి రాజకీయాల్లో ఎర్రి మాలోకం కావడం వల్లనైతే నేమి, ఆయన గారి పార్టీలో ఆయన కంటే మహా మహా ప్రజ్ఞావంతుల జనాభా మరీ ఎక్కువై పోవడం వల్లనైతేనేమి, ఆ మెజారిటీ మహా ప్రజ్ఞావంతులంతా కలిసి ఓ తీర్మానం ఆమోదించి ఉప్పిని కెపిజెపి నుంచి దిగ్విజయంగా సస్సెండ్ చేసి సాగనంపారు.

అయితే రాజకీయ రంగంలోనూ నా పాత్ర పోషించి తీరవలసిందే నంటూ పట్టుబట్టిన ఉప్పి, పట్టు వదలని విక్రమార్కుడిలా గత సెప్టెంబర్ లో యుపిపి ని ఆరంభించారు. ఈ సారి పార్టీ పేరు కూడా ఆయన ముద్దు పేరుకు దగ్గరి పోలికలతో ఆయన సినిమా టైటిల్ లాగే కొత్తగా విచిత్రంగా వినిపిస్తున్నదని అభిమానలు బోల్డంత సంబరపడిపోయారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి దాకా యుపిపి గురించి తర్వాత ఎక్కడా వినపళ్లేదు సరి కదా ఒక్క ప్రచార చిత్రమైనా కనపళ్లేదు.

కర్ణాటక లో లోక్ సభ ఎన్నికలకు తొలి విడత (ఏప్రిల్ 18) పోలింగ్ కు నామినేషన్ల ఘట్టం కూడా ముగిసి పోయింది. నీ సినిమా స్టయిలు సస్పెన్సు నెత్తిన బండ పడా, ఓటర్లు మన పార్టీ కథే మరిచిపోయేట్టున్నార్రా బాబూ, అని పార్టీ సన్నిహితులెవరో తక్షణ కర్తవ్యం గుర్తు చేశాక గానీ ఉప్పి ఎన్నికల సీన్ లో ప్రత్యక్షం కాలేదు.

ప్రెస్ మీట్ లోకి వచ్చీ రాగానే లైట్స్-కెమెరా ఆన్ అనే గావుకేకల కోసం కాచుకోకుండా మొహంలో చక్కని హావభావాలు పలికిస్తూ, “తొలి విడత పోలింగ్ జరిగే మొత్తం 14 స్థానాల్లోనూ, ప్రతి చోటా మా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నామినేషన్లు కూడా దాఖలు చేశారు (నామినేషన్ వేసిన వాళ్లంతా పోటీ చేస్తున్నట్టు కాదు….ఉపసంహరణ కింకా గడువుంది). నేను మాత్రం ఎక్కడా పోటీ చేయడం లేదు (చాలా మంచిది). ఏప్రిల్ 2 నుంచి మా పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది (ఇంకా నయం…1 నుంచి అన్నారు కాదు, జనం అస్సలు నమ్మేవాళ్లు కాదు)” అని ఉపేంద్ర ప్రకటించారు.

అద్భుతమైన నటుడు, దర్శకుడుగా కన్నడ సినీరంగంలో ఉపేంద్రకు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. అతను నటించి, దర్శకత్వం వహించిన ఉపేంద్ర, ఓం, సూపర్, రక్త కన్నీరు వంటి ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. వీడి సినిమాల్లో కాస్త వెటకారం ఎక్కువని విసుక్కునే వాళ్లు కూడా ఉప్పి కొత్త సినిమా వస్తే చూడకుండా ఉండలేరు. మంచో చెడ్డో మనదంటూ ప్రత్యేకతేం లేకుండా ఫక్తు కమర్షియల్ సినిమాలు తియ్యనంటే తియ్యనని భీష్మించే ఉపేంద్రది కచ్చితంగా ఓ విలక్షణ వ్యక్తిత్వేమే. అయితే అతని రాజకీయ రంగ ప్రవేశం మాత్రం ఇప్పటి దాకా గొప్ప కామెడీ ట్రాక్ గానే కొనసాగింది.

లోక్ సభ ఎన్నికల హడావుడి ఆరంభమైన కొత్తలో ఉప్పి బెంగుళూరు దక్షిణ నుంచి బరిలోకి దిగుతాడని ఓ మాట వినిపించింది. అదే నిజమయ్యుంటే ఆ ఒక్క నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రభావం ఉండేదేమో గానీ ఉప్పి పార్టీ అభ్యర్థులకు కర్ణాటకలో అంత సీన్ లేదనిపిస్తున్నది. ఫ్యాన్ ఫోలోయింగ్ ను ఓట్లుగా మలుచుకోడానికి ఆయన ప్రయత్నమేమిటో, ఉప్పి రాజకీయ పాత్రలో సీరియస్ నెస్ ఏ పాటిదో, రెండో తేదీనుంచి ప్రచారం ప్రారంభించాక కానీ తెలియదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *