Home Politics ఒంట‌రిపోరా? లెఫ్ట్ తో పొత్తా? తేల్చ‌ని ప‌వ‌న్: త‌ల ప‌ట్టుకుంటున్న కామ్రేడ్లు

ఒంట‌రిపోరా? లెఫ్ట్ తో పొత్తా? తేల్చ‌ని ప‌వ‌న్: త‌ల ప‌ట్టుకుంటున్న కామ్రేడ్లు

124
0
SHARE

అమ‌రావ‌తిః వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం నోటిఫికేష‌న్ వెలువ‌డింది. పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ఆరంభ‌మైంది. రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌మ‌ర‌శంఖాల‌ను పూరిస్తూ ఎన్నిక‌ల పోరాటానికి సిద్ధ‌ప‌డుతున్నాయి. జ‌న‌సేన పార్టీ కూడా తొలిసారిగా ఎన్నిక‌ల‌ను ఎదుర్కొన‌డానికి స‌న్నాహాలు చేసుకుంటోంది. రాష్ట్రంలో వామ‌ప‌క్షాల‌తో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేయాలా? లేక ఒంట‌రిగా పోటీ చేయ‌లా? అనే విషయంపై ఎటూ తేల్చుకోలేక పోతోంది జ‌న‌సేన పార్టీ నాయ‌క‌త్వం.

అదే నిల‌క‌డ‌లేమి..

తాము 175 అసెంబ్లీ, 25 లోక్ స‌భ స్థానాల‌కు పోటీ చేస్తామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న చేసిన కొద్దిరోజుల‌కే మ‌రో మాట మాట్లాడారు. వామ‌పక్షాల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌నీ వెల్ల‌డించారు. దీనితో పార్టీ శ్రేణుల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. వామ‌ప‌క్షాల‌తో పొత్తు అనే విష‌యాన్ని కొద్దిరోజుల కింద‌టి వ‌రకూ జ‌న‌సేన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు మ‌రిచేపోయారు. ఒంట‌రిపోరాట‌మే ఉంటుందంటూ జ‌న‌సేన పార్టీ మీడియా విభాగం కూడా ప‌రోక్షంగా సంకేతాలు ఇస్తూ వ‌చ్చింది. వాట‌న్నింటినీ ప‌క్క‌న‌పెడుతూ మ‌రోసారి వామ‌ప‌క్షాల‌తో పొత్తు వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది.

సోమ‌వారం వామ‌ప‌క్షాల నాయ‌కులు విజ‌య‌వాడ‌లోని జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో భేటీ అయ్యారు. నాలుగు గంట‌ల పాటు ఈ భేటీ కొన‌సాగ‌డం కొస‌మెరుపుగా చెప్పుకోవ‌చ్చు. పొత్తు అంశం లేక‌పోతే.. ఇంత సేపు భేటీ కొన‌సాగే అవ‌కాశాలు ఉండ‌వు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శులు పీ మ‌ధు, వీ శ్రీనివాస్‌, సీపీఐ త‌ర‌ఫున ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌, ముప్పాళ్ల నాగేశ్వ‌ర‌రావు, అక్కినేని వ‌న‌జ ఈ భేటీలో పాల్గొన్నారు.

సుదీర్ఘంగా స‌మావేశం కొన‌సాగిన‌ప్ప‌టికీ.. సీట్ల వ్య‌వ‌హారం మాత్రం తేల‌లేదని స‌మాచారం. సీట్ల స‌ర్దుబాటు కొలిక్కి రాక‌పోవ‌డంతో మ‌రోసారి భేటీ కావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. నోటిఫికేష‌న్ వెలువ‌డ‌టం, పోలింగ్‌కు నెల‌రోజుల వ్య‌వ‌ధి కూడా లేక‌పోవ‌డంతో వామ‌ప‌క్ష పార్టీలు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. సీట్ల స‌ర్దుబాటును త్వ‌రగా తేల్చాలంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నాయి.

రాష్ట్ర విభజన తరువాత ఉనికి కోల్పోయిన వామపక్ష పార్టీలు ప్రత్యామ్న్యాయ రాజకీయ వ్యవస్థ కోసమంటూ జనసేన పార్టీతో చేతులు కలిపాయి. జనసేనతో పొత్తు ద్వారా సార్వత్రిక ఎన్నికల్లో ప్రాతినిధ్యం కోసం ఆరాట పడుతున్నాయి. సీట్ల సర్దుబాటుపై ఇంకా క్లారిటీకి రాలేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఊగిస‌లాట ధోర‌ణి త‌మ‌ను ఇబ్బందుల పాలు చేస్తోంద‌న్న అభిప్రాయం వామ‌ప‌క్షాల్లో క‌నిపిస్తోంది.

త‌ప్పు చేస్తున్నామా? వామ‌ప‌క్షాల్లో అంత‌ర్మ‌థ‌నం

జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటామ‌ని ముందుగానే ప్ర‌క‌టించి త‌ప్పు చేశామా? అనే భావ‌న వామ‌ప‌క్ష నేత‌ల్లో వ్య‌క్త‌మౌతున్న‌ట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు జరగకపోవడం దీనిపై పవన్‌ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు వామపక్షాలు అంత‌ర్మ‌థ‌నంలో పడ్డాయి. రాష్ట్రంలో జిల్లాకు రెండు నియోజకవర్గాల చొప్పున సీట్లు కేటాయించాలని వామపక్షాల నేతలు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్ద ప్ర‌తిపాదించిన‌ట్లు తెలుస్తోంది. ఇది పాత ప్ర‌తిపాద‌నే. దీనిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ నాన్చుడు ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. సోమ‌వారం నాటి భేటీలోనూ దీనికి భిన్న‌మైన వైఖ‌రిని క‌న‌ప‌ర్చ‌లేద‌ని అంటున్నారు. దీనితో వామ‌ప‌క్ష నేత‌ల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మౌతోంది.