దూసుకు పోతున్న జగన్…

రాజకీయాల్లో అనుభవమే కాదు, లౌక్యమూ అవసరమే. లోక్ సభ ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్రాలలో అనూహ్యమార్పులు తీసుకువచ్చాయి.

తెలంగాణ, ఆంధ్రలో ఫలితాలు నేతలు వూహించని విధంగా వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్  తనకు 16సీట్లు, ఎంఐఎంకు ఒకసీటు వస్తాయని, మిగతా పార్టీలకు జీ రో అన్నారు. ఎంఐఎంకు ఒక సీటు వచ్చిన మాట  నిజమే గాని మిగతా పార్టీలకు ఏడు సీట్లొచ్చాయి.

ఇందులో బిజెపి నాలుగు, కాంగ్రెస్ మూడు.  ఇది కెసిఆర్ కు షాకిచ్చింది. ఎంతగా షాకిచ్చిందంటే ఎన్నికలయిపోతూనే చేయాల్సిన ప్రాథమిక స్పందన కూడా మరిచిపోయారు.

ఇంతవరకు ఢిల్లీ వెళ్లలేదు. సాధారణంగా ప్రధాని బాధ్యతలు తీసుకునే టపుడు రూలింగ్ పార్టీకి దగ్గిరగా ఉన్న వాళ్లు తప్పక వెళ్తారు.

ఒక వేళ వెళ్లలేని పక్షంలో తర్వాత వెళ్లి  అభినందనలు చెబుతారు. కెసియార్ ఈ రెండు పనులు చేయలేదు.

అంతకంటే ముఖ్యంగా ఆయన నిన్న జరిగిన అయిదో నీతిఆయోగ్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ కు కూడ వెళ్ల లేదు. కనీసం అధికారులను కూడా పంపలేదు. అంటే దాదాపు బహిష్కరించినంత పనిచేశారు. ఆశ్చర్యం.

లోక్ సభ ఎన్నికల్లో ఆయన అనుకున్నదొక్కటీ నెరవేరలేదు. అవేవిమిటంటే…

1.కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాదు. హంగ్ పార్లమెంటు వస్తుంది. అపుడు తను ఫెడరల్ ఫ్రంటు పేరుతో చక్రం తిప్పడం.

2. ఫెడరల్ ఫ్రంటులో ఎవరూ చేరకపోయినా తన 16 సీట్లు, జగన్ కొక 20 కలిపితే 36 సీట్లతో పెద్ద ఫోర్స్ అవుతాం. పార్లమెంటులో చక్రం తిప్పవచ్చు.

3. తనకు 16 సీట్లొస్తాయి. బిజెపికి కాంగ్రెస్ లకు జీరో.

దీనికితోడు జగన్ 22 ‘సీట్లొచ్చాయ్. దీనితో ముఖ్యమంత్రి కెసిఆర్ బాగా ఇరుకున పడ్డట్లు అర్థమవుతుంది. లేకుంటే ప్రధానిని కలుసుకునేందుకు ఇష్టపడకపోవడమేమిటి?

నిన్నటి నీతి ఆయోగ్ సమావేశంలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తమ రాష్ట్రానికి స్పెషల్ క్యాటగరి స్టేటస్ కావాలని డిమాండ్ చేశారు. ఎపుడూ తుఫాన్ లతో చస్తున్నాం, వీటిని తట్టుకోవాలంటే మాకు మొదట స్పెషల్ ఫోకస్ స్టేటస్  ఇచ్చి, తర్వాత స్పెషల్ క్యాటగరి స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా ఇదే డిమాండ్ చేశారు. సాక్షి పత్రిక ప్రకారం అయిదేళ్లుగా ఆంధ్రలో పరిపాలన కుంటుపడిందని, అవినీతి తాండవించిందని దీని వల్ల చాలా నష్టం జరిగిందని ఆయన సమావేశంలో చెప్పారు.  అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో ఉన్న  ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపేందుకు ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ ఉదార స్వభావంతో ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

జగన్ తొలిసారి ముఖ్య మంత్రి అయినా,రాజకీయాల్లో అనుభవం చాలా తక్కువే అయినా  చాలా లౌక్యంగా వెళుతున్నారని ఆయన కదలికలను చూస్తే అర్థమవుతుంది.

భారతీయ జనతాపార్టీకి అఖండ విజయం రాగానే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్లి అభినందించి వచ్చారు. నిర్మొహమాటంగా బిజెపికి మీరీ అంత మెజారిటీ రావడం తనను ఇబ్బంది పెట్టిందని, దీని వల్ల ప్రత్యేక హోదాకు కోట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు.

తర్వాత ప్రధాని మోదీ తిరుపతి కి వచ్చారు. అక్కడ ఆయన అద్వితీయంగా స్వాగతం చెప్పి, ఆంధ్రను మర్చిపోకుండా చేశారు.  ఇపుడు ఆయన  నీతిఆయోగ్ సమావేశానికి వెళ్లి ఆంధ్ర సమ్యలేమిటో ప్రధాని ముందు పెట్టడమే కాదు, ప్రధాని గతంలో ఏమిచెప్పారో గుర్తు చేసి వాటిని అమలుచేయాల్సిన ధర్మం ప్రధాని మీద ఉందని కూడా గట్టిగా గుర్తు చేశారు.

జగన్ నడుస్తున్నతీరు తో ఆంధ్రలో వైసిపి ఎంత శక్తిగా ఎదిగిందో బిజెపి నాయకత్వం కూడా గ్రహించింది. అందుకే  లౌక్యంగా వ్యవహరిస్తూ ఆ పార్టీకి ఏకంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేశారు. అయితే, అంతే లౌక్యంగా స్పందిస్తూ థ్యాంక్యూ పదవులొద్దు, చేయాల్సింది చేస్తే అదే పదివేలనే తీరులో ఆయన ఆఫర్ ను వద్దన్నారు.

జగన్ దూసుకుపోతున్నట్లు లేదు?