బీజేపీ ఎత్తుకు జగన్ పైఎత్తు : ఒకే ప్రకటనతో చిత్తు

(యనమల నాగిరెడ్డి)
“మేలెంచి కీడెంచడమనేది” పెద్దలు చెప్పిన సామెత. అయితే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం “కీడెంచి మేలెంచడమనేది” అనుసరిస్తున్న ఆర్యోక్తి.  పదవులను అంటిపెట్టుకొని పార్టీ మారడమనే సాంప్రదాయం మంచిది కాదని, పార్టీ మారాలనుకున్న ప్రజా ప్రతినిధులు తమకున్న పదవులకు, పార్టీకి రాజీనామా చేస్తేనే తన పార్టీలో చేర్చుకుంటానని ఘంటా ఫదంగా  చెపుతున్నారు. ఆచరిస్తున్నారు కూడా.
యాంటీ డిఫెక్షన్ చట్టానికి తూట్లు పొడవబోమని, పార్టీ మారే వాళ్ళు పదవులకు రాజీనామా చేసే రావాలని మరోసారి నిన్న శాసనసభలో ప్రకటించారు.
జగన్ మరో అడుగు ముందుకు వేసి “అలా ఎవరైనా పార్టీ మారితే వారిపై అనర్హత వేటు వెంటనే వేయాలని, తన హయాంలో శాసనసభలో అత్యున్నత ప్రమాణాలు నెలకొనాలని, అపార అనుభవం ఉన్న ప్రస్తుత స్పీకర్  సభా గౌరవాన్ని, రాజకీయ విలువలను కాపాడటానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని ” స్పీకర్ ను కోరారు.
రాజకీయ  విధాన పరమైన ఈ ప్రకటనతో జగన్ “ఒక దెబ్బకు రెండు పిట్టలను పడగొట్టి” తన రాజకీయ పరిణితిని, చతురతను చూపారు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని, అలా చేయడానికి ఇదే మంచి సమయమని భావిస్తున్న బీజేపీ ఆశలకు గండి కొట్టారు.
బీజేపీ ఆశలకు లొంగి తన పార్టీ నుండి కానీ, టీడీపీ వైపు నుండి కానీ ప్రజా ప్రతినిధులు గోడ దూకే అవకాశం లేకుండా అడ్డుకున్నారు .
వైసీపీ గెలిచి అధికారంలోకి వస్తే తాము అందలం ఎక్కగలమని  ఆశించి, ఆ అవకాశాలు దొరక్క పోవడంతో నిరాశకు గురై ప్రస్తుతం ఏంతో  కొంత అసంతృప్తిలో ఉన్ననాయకులు, భవిష్యత్తులో తాము ఆశించిన మేరకు పనులు జరగక నిరాశకు గురైన తన పార్టీ సభ్యులు ఒకవేళ గోడ దాటాలనుకుంటే వీలుపడని పరిస్థితిని ఈ ప్రకటనతో ఆయన కల్పించారు.
జగన్ మోహన్ రెడ్డి శాసనసభ మొదటి సమావేశంలోనే “పార్టీ మార్పిడి చేయాలనుకుంటే పదవిని కోల్పోక తప్పదని, అందుకు అనర్హత అస్త్రాన్ని తప్పకుండా ప్రయోగిస్తామని” విస్పష్ట ప్రకటన చేసి  ఆయారాం-గయారాంల కు హెచ్చరిక జారీ చేశారు.
అధికార రాజకీయ చరంగంలో ప్రజా ప్రతినిధులు  పార్టీ మారడం సర్వసాధారణమైన వ్యవహారంగా మారింది. కర్ణాటక రాజకీయాలలో  ఈ వైకుంఠపాళి క్రీడ నాయకులకు నిత్యకృత్యమైంది. జేడీఎస్ నేతృత్వంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం దినదిన గండం నూరేళ్లాయుష్షు లాగా నడుస్తున్నది. ఎపుడు ఎవరు పార్టీ మారుతారో? ప్రభుత్వం ఎపుడు కూలుతుందో అన్నఆందోళనతో కుమారస్వామికి కంటి మీద కునుకు కరువైంది. ఒకవైపు బీజేపీ పాలక పక్ష ఎంఎల్ఏలు తనతో టచ్ లో ఉన్నారని, ఏ నిముషంలో ఏమి జరుగుతుందో చెప్పలేమని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నది.
అలాగే తన పార్టీలోని శాసనసభ్యులు, మిత్ర పక్షం కాంగ్రెస్ లోని ఎంఎల్ఏలు గోడ దూకడానికి రడీగా ఉన్నారన్న వార్తలు స్వామికి చుక్కలు చూపిస్తున్నాయి.
ఇకపోతే తెలంగాణలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎక్కువ మంది శాసన సభ్యులు టీఆరెస్ పంచన చేరి, కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని పూర్తిగా రద్దు చేసి టీఆరెస్ లో విలీనం చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై జరుగుతున్న రగడ గురించి చెప్పనలివి కాదు.
ఈ నేపథ్యంలో సమకాలీన రాజకీయ పరిస్థితులు, ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు, దేశ రాజకీయాలలో ఉన్న చిన్న చేపలను మింగి, తాను దేశ వ్యాప్తంగా బలపడాలన్న లక్ష్యంతో చురుకుగా వ్యవహరిస్తున్న బీజేపీ వ్యవహారశైలి  గమనించిన జగన్ ఒకే ఒక దెబ్బతో అందరికీ చెక్ పట్టారని చెప్పక తప్పదు.
తాను విలువలతో కూడిన రాజకీయాలనే చేస్తానని జనానికి చెప్పడం తోక తిప్పాలనుకునే  ఆలోచన వస్తే ఫలితం తీవ్రంగా ఉంటుందని తన పార్టీ వారికి హెచ్చరిక పంపడమే.
రాజకీయంగా తీవ్రంగా దెబ్బతిని కుప్పకూలిన చంద్రబాబుకు, ఆయన టీడీపీకి రక్షణ కల్పించడం, కొందరైనా ప్రజా ప్రతినిధులను దగ్గరకి తీసుకుని పార్టీని ఏపీలో బలోపేతం చేయాలన్న బీజేపీ దూరాశకు గండి కూడా కొట్టారు జగన్ ఇదే   ప్రకటనతో.