అన్ని పార్టీలకూ ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే…

(యనమల నాగిరెడ్డి)

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రము లోని రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైస్సార్ కాంగ్రెస్ పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. ఎన్నికల తర్వాత ఓడిపోయిన పార్టీలు ఇపుడున్న రూపంలో పరువుగా బతకగలవన్న నమ్మకం లేదు.

కొత్తగా రంగంలోకి దిగిన ‘జనసేన’ పార్టీ అతి తక్కువ కాలంలోనే టీడీపీ తోక పార్టీగా మారిపోయిందనే విమర్శ వచ్చింది .  ఎన్నికల గోదాలో  ఇటీవల రంగ ప్రవేశం చేసిన కె.ఏ.పాల్  అతి తక్కువ కాలంలోనే టీడీపీకి మరో తోకగా మారి ఎన్నికల  రణరంగంలో ఉత్తరకుమారుడిగా మిగిలిపోయారు.  ఈ రెండు పార్టీలు కూడా ఎన్నికల తర్వాత బతికి బట్టకడతాయన్న గ్యారంటీ లేదు. అందుకే ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యే.

ఇక జాతీయ పార్టీలుగా వెలుగుతూ ప్రాంతీయ పార్టీల వెంబడి పరుగులు తీస్తున్న బిజెపి లోపాయికారిగా వైస్సార్ కాంగ్రెస్ తో జత కలిసిందని వినిపిస్తుండగా , కాంగ్రెస్ టీడీపీతో అంటకాగుతున్నది.   ఇక సుదీర్ఘ పోరాట చరిత్ర ఉన్న కమ్యూనిస్టులు రాజకీయాలలో కుప్పిగంతులు వేస్తూ నిన్న మొన్న పుట్టిన జనసేనకు తోకలుగా రంగంలో దిగారు. ఈ జాతీయ పార్టీలన్నీ “కొండంత రాగం తీస్తూ గోరంత పాట  పాడుతున్న వైనం” ప్రజలకు వింత కొలుపుతున్నది. ఈ నేపథ్యంలో  ఏ.పిలో జరుగుతున్న ఎన్నికలలో పోటీ ప్రధానంగా చంద్రబాబు టీడీపీకి – జగన్ వైస్సార్ కాంగ్రెస్  మధ్యనే హోరాహోరీగా సాగుతున్నదాని చెప్పవచ్చు.

సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్న జగన్- చంద్రబాబు
నామమాత్రపు పోటీలో జాతీయ పార్టీలు
గెస్ట్ ఆర్టిస్ట్ లాాగా కనబడుతున్న జనసేన
కామెడీ ట్రాక్  కెఎ పాల్ 

 

చంద్రబాబు రాజకీయ కలల బేహారి…

“కలలు కను ..  ఆ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయి”. అన్న మాజీ రాష్ట్రపతి అబుల్ కలాం, సూక్తిని అక్షరాలా చిన్నప్పుడే  ఒంట పట్టించుకున్న చంద్రబాబు  ఈ ఎన్నికలలో టీడీపీని గెలిపించి రాష్ట్రంలో తన అధికార స్థానం  సుస్థిరం చేసుకోవడంతో పాటు, తన ఏకైక పుత్రుడు లోకేష్ బాబు రాజకీయ భవిష్యత్తుకు  బంగారు బాట  వేయాలన్న తన జీవిత కాలకలను నిజం చేయదానికి గెలుపే   ప్రధాన ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు.

తన 40 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ ఇచ్చిన అనుభవం ఆధారంగా సామ,దాన,భేద, దండోపాయాలను అత్యంత పరిణితితో ప్రయోగించగలగడం చంద్రబాబు ప్రత్యేకత.  ఆయన ఈ ఎన్నికలలో సామం (అందరిని ఒప్పించడానికి), భేదం (జగన్, మోడీ, కేసీఆర్ లను కలగలిపి విమర్శిస్తూ ప్రజలలో సందేహాస్పదమైన భయం రేకెత్తించడం) దానం ( ఎన్నికలకు ముందు ఆయన అనేక పధకాలు (అమలు చేయడం కష్టమని తెలిసినా ప్రకటించడం, రైతులు, మహిళల ఖాతాలలో ప్రభుత్వ డబ్బును వేయడం, తమ డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేయడం) అమలు చేయాడానికి యత్నించడం, దండోపాయం ( అధికార యంత్రాగాన్ని పోలీసు బలగాలను ఉపయోగించి శత్రుమూకలను (ప్రజాస్వామ్య విధానంలో) ఛీల్చి చెండాడటం) లాంటి అన్ని ఎత్తుగడలను ప్రయోగిస్తున్నారు.

అలాగే  తనకు అనుకూలంగా ఉన్న” మీడియా సంపూర్ణ సహకారానికి తోడు తమ సర్వం ఒడ్డి టీడీపీని గెలిపించడానికి పని చేస్తున్న బాబుగారి స్వకులస్తుల కృషి, నియమ నిభందనలు ప్రక్కన పెట్టి  టీడీపీని  గెలుపించడమే  తమ ఉద్యోగ ధర్మంగా ప్రయత్నిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, ఉన్నతాధికారుల అండదండలు, గ్రామ స్థాయిలో బలంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, వీటికి తోడు పుష్కలంగా ఉన్న ధనబలం  ” లాంటి అస్త్ర, శాస్త్రాలు, చతురంగ బలగాలతో చంద్రబాబు  ఎన్నికల రణరంగంలో వీరవిహారం చేస్తున్నారు. అలాగే  చెప్పుకోదగిన సంఖ్యలో పరివారజనం (ఆశా, డ్వాక్రా, అంగనవాడీ  విభాగాల కార్యకర్తలు)  అండగా ఉండటం కూడా బాబుకు కలసివచ్చే అంశం. రక్షక భట అధికారులను ప్రయోగించి ప్రత్యర్థులను వేధించడం లాంటి అనేక  ఎత్తుగడలు ఆయన అమ్ములపొదిలో పుష్కలంగా ఉన్నాయి.

ఇక రాజకీయంగా ప్రత్యర్థి జగన్ ను దెబ్బతీయడానికి “ఆయనను బీజేపీతో జత కలపడం, జగన్, కేసీఆర్, మోదీలు కలిసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని  తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, జగన్ కు ఓటేస్తే వీరంతా కలిసి  రాష్ట్రానికి అన్యాయం చేస్తారని ప్రతిరోజూ హోరెత్తిస్తున్నారు.   జగన్ అధికారంలోకి వస్తే “రాజధాని అమరావతిని ” తరలిస్తారనే కొత్త అస్త్రాన్ని కూడా తెరమీదకు తెచ్చారు”. ఎన్నికలు చివరి దశకు చేరిన ఈ సమయంలో  చంద్రబాబు ఇంకెన్ని ఆయుధాలు బయటికి తీస్థారో వేచి చూడాల్సిందే!

వైస్సార్ కాంగ్రెస్  అధినేత జగన్

ప్రజల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి  అభిమానుల అండదండలు, తాను ఇటీవల పూర్తి చేసిన పాదయాత్రలో పొందిన ప్రజాభిమానం, 2009 ఏన్నికలతో పోలిస్తే  పెరిగిన రాజకీయ పరిణితి, ఆయనతో పాటు  అయన  తల్లి విజయమ్మ, సోదరి షర్మిల చేస్తున్న ప్రచారం సహకారంతో జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో పోరాడుతున్నారు. పోటెత్తుతున్న ప్రజాభిమానమే ఆయన ప్రధానబలంగా  ఉంది.  జగన్ కూడా అన్ని వర్గాలను, కులాలను ఆకర్షించడానికి  అనేక (ఆచరణ సాధ్యం కాని ) హామీలు గుప్పిస్తున్నారు. అయితే జగన్ మాట చెపితే కట్టుబడి ఉండి  పూర్తి చేస్తాడనే నమ్మకం జనానికి కలిగించడంలో ఆయన విజయం సాధించారు.

ఇకపోతే అనేక వర్గాలలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, అశోక్ బాబు దయవల్ల ప్రభుత్వంపై ఉద్యోగులలో పెరిగిన అసంతృప్తి, రుణమాఫీ పేరుతొ తమను మోసం చేసి  “పావలా వడ్డీ  రుణాలకు తమకు” చంద్రబాబు బంధం తెంచేశారని అత్యధిక సంఖ్యలో రైతులు, ద్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. ఆ మంటను జగన్ బాగానే ఉపయోగించుకుంటున్నారని చెప్పవచ్చు. నవరత్నాలు, పెన్షన్ ల పెంపు లాంటి ప్రజాకర్షక (ఎన్నికల తాయిలాలు) పధకాలను ప్రకటించడం, చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, మరోసారి మోసం చేస్తారని ప్రజలను నమ్మిస్తూ, తనకు  ఒకసారి  అవకాశం కల్పించాలని కోరడం జగన్ అస్త్రాలు.

ఈ ఎన్నికలలో అంగబలం, ఆర్థిక బలం పుష్కలంగా ఉన్న వారితో పాటు, సామాజిక, కుల సమీకరణాలు కూడా లెక్కించి   అభ్యర్థులను ఎంపిక చేయడం, చివరి నిముషంలో టీడీపీని వీడి తన పార్టీలో చేరిన వారికి  “సముచిత స్తానం కల్పించడం” కూడా జగన్ కు అండగా నిలుస్తున్నాయి. ఆయన సామాజిక వర్గం గతంలో కంటే ఈ ఎన్నికలలో అధికంగా మద్దతు పలకడం కూడా ఆయనకు కలసి వచ్చే అంశం.

ఇకపోతే కోస్తా ప్రాంతంలో చంద్రబాబు సామాజిక వర్గం తమ విభేదాలను మరచి ఎన్నడూ లేనంతగా ఏకమై బాబు విజయానికి కృషి చేస్తుండటంతో “మిగిలిన సామాజిక  వర్గాలు  ఏకమై” జగన్ కు మద్దతు పలకడానికి ప్రయత్నిస్తుండటం కోసం మెరుపుగా ఉంది.

బలహీనతలు

పోలీసు బాసులపై  ఆరోపణల యుద్ధం ప్రకటించి అధికారులలో   కొంత వ్యతిరేకత మూత కట్టుకోవడం, పోలింగ్ బూతు స్థాయిలో పార్టీ  కార్యకర్తలు బలంగా లేకపోవడం, టీడీపీకి ఉన్న స్థాయిలో “గోబెల్స్ ప్రచారం చేసే” వ్యవస్థలు లేకపోవడం వైస్సార్ పార్టీకి ఉన్న బలహీనతలు. అలాగే ఎత్తుగడల పరంగా అంత అనుభువం లేకపోవడం, చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని ఆశించిన స్థాయిలో తిప్పికొట్టలేకపోవడం కూడా బలహీనతగా ఉంది. అన్ని ప్రాంతాల అభివృద్ధిని  సమన్వయ పరుస్తూ పధకాలు ప్రకటించలేకపోవడం కూడా ఆ పార్టీకి దెబ్బగా ఉంది.

ఇకపోతే ఎన్నికల నిర్వహణలో పీహెచ్డీ  పొందిన చంద్రబాబుతో  పోటీ పడి జగన్ పోల్ మానేజ్మెంట్ చేయగలడా? అన్నది జనం మనసులో మెదులుతున్న వేయి డాలర్ల ప్రశ్న.

జనసేనాని పవన్ కళ్యాణ్

 దేశం కోసం, రాష్ట్రం కోసం రాజకీయాలలోకి వచ్చానని చెప్పుకుంటూ 2014 ఎన్నికలలో బీజేపీతో, టీడీపీతో  అంటకాగి 2019 నాటికి స్వంత కుంపటి పెట్టిన జన సేనాని పవన్ కళ్యాణ్ మొదట్లో జనంలోనూ, కాపు సామాజిక వర్గంలోనూ పెద్ద ఎత్తున ఆశలు కల్పించగలిగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన  అందరి ఆశలను అడియాసలు చేశారని,  లోపాయికారీగా టీడీపీ కొమ్ము కాస్తున్నారనే అపప్రధ మూటకట్టుకున్నారు. కాపు సామాజికవర్గం ఆయనపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా ఆయన వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పవన్ ఏకధాటిగా భారీ ఎత్తున జగన్ పై విమర్శల వర్షం కురిపిస్తూ, బాబుపై అపుడపుడు పూలబాణాలు విసురుతున్నారని జనం అంటున్నారు. ఆయన బీఎస్పీ. సిపిఐ , సీపీఎం లతో పొత్తు పెట్టుకొని సామాజిక, కుల సమీకరణలు సరి చేయడానికి ప్రయత్నించినా ఆచరణలో విజయం సాధించలేకపోయారనే వినిపిస్తున్నది.

కులసమీకరణలు

చంద్రబాబు సామాజిక వర్గం ఆయన గెలుపు కోసం తన సర్వశక్తులు ఒడ్డుతుండగా , జగన్ మోహన్ రెడ్డి సామాజిక వర్గం  ప్రత్యేకించి రాయలసీమలో చీలి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే జగన్ సామాజిక వర్గ నాయకులు రెండు పార్టీలకు కొమ్ము కాస్తున్నారు.

రాయలసీమలో ఎప్పటి నుండో టీడీపీ వెంట ఉన్న  కాపు సామాజిక వర్గం ఈ ఎన్నికలలో ఏంతో  కొంత రూటు మార్చి జనసేనకు మద్దతు పలికి టీడీపీని దెబ్బ తీస్తుందని,  2014 ఎన్నికలలో కోస్తాలో ఉన్న కొన్ని పరిస్థితుల కారణంగా టీడీపీకి మద్దతు పలికిన పవన్ సామాజిక వర్గంలో ఈ సారి ఏర్పడనున్న  చీలిక వల్ల కూడా టీడీపీ దెబ్బే నాని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ( ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో పేర్కొనడం విశేషం.)

ఇకపోతే నామకః పోటీలో ఉన్న జాతీయ పార్టీలైన బీజేపీ తన ఆస్థాన కార్యకర్తల ఓట్లు (గత ఎన్నికలలో టీడీపీకి మద్దతు) తన ఖాతాలో వేసుకుంటుండగా, కాంగ్రెస్ పార్టీ తన సాంప్రదాయ ఓట్లకు తోడు ఎన్నోకొన్ని  వైస్సార్ కాంగ్రెస్ ఓట్లు కైవసం చేసుకొంటుందని, అలాగే ఉత్తర కుమారుడు కె.ఏ.పాల్ పార్టీ కూడా  వైస్సార్ కాంగ్రెస్ ఓట్లకే గండి కొట్టి, ఆ పార్టీని  దెబ్బ తీస్తుందని పరిశీలకుల అంచనా.

ఏది ఏమైనా అస్తిత్వం కోల్పోయిన జాతీయ, మిగిలిన ప్రాంతీయ పార్టీల విషయం ప్రక్కన పెడితే “పోటీ మాత్రం చంద్రబాబుకు- జగన్ మోహన్ రెడ్డికి” మధ్యన మాత్రమే నని చెప్పక తప్పదు.  ఏ  నియోజకవర్గంలోకూడా  పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరు పోటీలో ఉన్నా, వారిపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉన్నా  జనం పట్టించుకోకుండా ఉండటం విశేషం. అభ్యర్థులు కూడా తమకు కాకుండా తమ అధినేతకు, తమ పార్టీకి ఓటు వేయమని అభ్యర్తించడం, ప్రజలు కూడా అభ్యర్థులకు కాకుండా జగన్ కు కానీ లేదా చంద్రబాబుకు కానీ ఓటు వేస్తామని చెప్పడం ఈ ఎన్నికలలో విశేషం.

(Photo source: Down to Earth)

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *