ధోనికి ముందర ఇక ‘కింగ్’ చేర్చాల్సిందే…

(బి.వేంకటేశ్వర మూర్తి)

పసుప్పచ్చ జెండాల సముద్రంలో ధోనీ….ధోనీ అనరుస్తున్న అభిమానుల ఉత్సాహ తరంగాలు పోటెత్తుతున్నాయంటే అక్కడ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్నట్టే లెక్క. అభిమానులు ఇన్నాళ్లూ మర్చిపోయారేమో గానీ ఇప్పుడిక ఐపిఎల్ సీజన్ ఆరంభమవుతున్నది గనుక ఇకపై మహేంద్ర సింగ్ ధోనీ పేరు ముందర కింగ్ అన్న పదం చేరి తీరవలసిందే. ఐపిఎల్ టోర్నీలో కింగ్ అన్న టైటిల్ ధోనీకి ఒక్కడికే సార్థకం.

మొత్తం 11 ఐపిఎల్ ఎడిషన్ లలో ఎనిమిది సార్లు అతను టైటిల్ సమరంలో ఆడాడు. ఏడు ఫైనల్ సమరాల్లో మూడు సార్లు ధోనీ తన సారథ్యంలోని చెన్నై జట్టుకు కప్పు గెలిచాడు. రెండేళ్ల సస్పెన్షన్ తర్వాత గతేడాది తిరిగి ప్రవేశించిన చెన్నైకి చేవ తగ్గలేదని నిరూపిస్తూ మళ్లీ ఘన విజయం సాధించి పెట్టాడు.

కింగ్ ధోనీతో సహా ఎక్కువమంది వయసు మళ్లిన క్రికెటర్ లేనన్న విమర్శలున్నప్పటికీ, ఫీల్డులో అద్వితీయమైన అథ్లెటిక్ విన్యాసాలు అందరి నోళ్లు మూయిస్తున్నాయి. ఇక వికెట్ల వెనకాల ధోనీ కాంతి వేగపు కదలికలకు అమితాశ్చర్యంలో మునిగిపోవలసిందే తప్ప ఎవ్వరైనా చేయగలిగిందేమీ లేదు. అంతగా బలమైన జట్టు కాకపోయినా, సమయానుకూలమైన బౌలింగ్ ఛేంజెస్, బౌలర్ల బలాబలాలకు అనుగుణమైన చక్కని ఫీల్డింగ్ వ్యూహాలు, ఫీల్డులో కొన్ని ఖాళీలను కావాలనే వదిలి, బ్యాట్స్ మెన్ కు సవాలు విసిరినట్టు విసిరి లాఘవంగా ట్రాప్ చేయడం వంటి ట్రిక్కులతో ధోనీ చెన్నై జట్టును నిరంతరం విజయపథంలో నిలపగలిగాడు. ఇక ప్రత్యర్థుల నుంచి సవాళ్లు ఎదురై జయాపజయాలకు సమానావకాశాలున్న ఉత్కంఠ భరిత సన్నివేశాల్లో సంయమనం కోల్పోకుండా సరిగ్గా సరైన సమయాల్లో శౌర్య ప్రతాపాలు ప్రదర్శించి అనూహ్యమైన అద్భుత విజయాలు సాధించడంలో ధోనీ తనకు తానే సాటి. అందుకే మొత్తం ఐపిఎల్ టోర్నీలో కెప్టెన్ మిస్టర్ కూల్ అతనొక్కడే.

అంబటి రాయుడు, ఫాఫ్ డూప్లెసీ చెన్నై బ్యాటింగ్ కు బలం చేకూరిస్తే, అవసర సమయాల్లో షేన్ వ్యాట్సన్, సురేష్ రైనా అండ దండగా నిలుస్తారు. స్లాగ్ ఓవర్లలో బండ బాదుడుకు, ఛేజింగ్ సమయాల్లో చండ ప్రచండమైన బ్యాటింగ్ కు రైనాతో బాటు డేన్ బ్రావో, ధోనీ ఉండనే ఉన్నారు. ఈ ఒక్క అంశంలో ధోనీ శక్తి యుక్తులు క్రమేణా బలహీన పడుతున్నట్టు అడపాదడపా అనిపిస్తున్నది కానీ అంతలోనే ఓ వీరోచిత విన్యాసంతో అతను అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.

సౌతాఫ్రికాకు చెందిన లుంగీ అంగ్డి, శార్దుల్ ఠాకుర్, మోహిత్ శర్మ చెన్నై పేస్ బౌలింగ్ లో ప్రధాన అస్త్రాలు. తొలినుంచి స్పిన్ బౌలింగే బలంగా ఈ జట్టు విజయాలు సాధిస్తూ వస్తున్నది. అనుభవజ్ఞులైన హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజాలకు తోడు కివీ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్, లెగ్ స్పిన్ యువతరంగం కర్ణ్ శర్మ ఈ సీజన్ లో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ పాటవాన్ని పరీక్షించనున్నారు.

జట్టు సభ్యుల్లో ఎక్కువ మంది 30కి అటూఇటూ ఉన్నవారు కావడం వల్ల ఆ ప్రభావం అప్పుడప్పుడూ ఫీల్డింగ్ లో ప్రతిఫలించడం నిజమే గానీ కేవలం మిస్ ఫీల్డింగ్ వల్లనే ఓ పోటీలో పరాజయం కొనితెచ్చుకున్న పరిస్థితి చెన్నైకి ఏనాడూ ఎదురవలేదు.

(రచయిత సీనియర్ జర్నలిస్టు, బెంగుళూరు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *