చెత్త రికార్డుల బెంగుళూరుకు వాస్తుదోషమా?

(బివి మూర్తి)

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపిఎల్ ఎంత మాత్రం అచ్చి రావడం లేదు. తన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు అన్నీ చేదు అనుభవాలూ, చెత్త రికార్డులే నెత్తి కెక్కుతున్నాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థిర నివాసం తప్పించేందుకు ఢిల్లీ లాగే బెంగుళూరు కూడా వాస్తు, జ్యోతిష్య వగైరా క్రికెటేతర మార్గాలేవో అన్వేషించక తప్పేట్టు లేదు.

ఐపిఎల్ లో ఇప్పటి దాకా ప్రతి జట్టూ మూడు పోటీలు పూర్తి చేసే సరికి మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మూడు విజయాలతో అగ్ర స్థానంలో ఉండగా అన్నీ అపజయాలే చవి చూసిన విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ అట్టడుగున అలమటిస్తున్నది. ఆదివారం రాత్రి చెన్నై ఎనిమిది పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచింది. అంతక్రితం మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బెంగుళూరును 118 పరుగుల భారీ తేడాతో మట్టి కరిపించింది.

వరుసగా మూడు అపజయాలు కొని తెచ్చుకున్న ఆర్ సి బి, మొదటి పోటీలో 70కి ఆలౌట్ అయి ఐపిఎల్-2019లో ఇప్పటిదాకా అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఇప్పటి దాకా నమోదైన 231 పరుగుల అత్యధిక స్కోరులో సైతం ఆర్ సి బి పాత్ర ఉండనే ఉంది. నిన్న హైదరాబాద్ లో నమోదైన ఈ స్కోరు ఎస్ ఆర్ హెచ్ ఆర్ సి బి పై  చేసిందే. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో తొలి వికెట్ కు జత చేసిన 185 పరుగుల రికార్డు భాగస్వామ్యం కూడా ఆర్ సి బిపై చేసిందే. ఇక తదుపరి పోటీల్లో మరే జట్టు ఇంత ఘోరంగా ఓడిపోదని ఆశించినట్టయితే ఎస్ ఆర్ హెచ్ చేతిలో చవి చూసిన 118 పరుగుల తేడాతో ఓటమి ఈ ఐపిఎల్ లో బహుశ రికార్డుగా  మిగిలి పోవచ్చు. ఆర్ సి బి తన శక్తి సామర్థ్యాల మేరకు అంతో ఇంతో దీటుగా ఆడిన పోటీ చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగినది. హోరాహోరీగా జరిగిన ఛేజ్ లో ఆర్ సి బి విజయానికి ఏడు పరుగుల దూరంలో ఉండగా లసిత్ మలింగ వేసిన నో బాల్ చివరి బంతిపై, అంపైర్ నో బాల్ కాల్ చేయకుండానే ముగిసి పోయింది. ఇది కూడా అదో రకమైన రికార్డే. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే కంటికి కనిపించని దురదృష్టపు నీలినీడలేవో ఆర్ సి బిని పట్టి పీడిస్తున్నాయోమో నన్న సందేహం కలుగుతున్నది.

పన్నెండు పోటీలతో ఓ వారం పూర్తయ్యేసరికి క్రికెట్ అభిమానులకు ఐపిఎల్ మంచి కిక్కెక్కించింది. దేనికదే సాటి అనిపించే అత్యద్భుత బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విన్యాసాలు ఆవిష్కృతమయ్యాయి, డైరెక్ట్ త్రో తో వికెట్లు ఫట్ మనిపించిన రనౌట్ లు, రెప్ప పాటు వ్యవధిలో బెయిల్స్ గాల్లో కెగిరిన స్టంపింగ్ లు, మెరుపు విన్యాసాల క్యాచ్ లతో బాటు నో బాల్ పై క్యాచ్ కోసం ఇద్దరు ముగ్గురు పోటీ పడి ఒకరినొకరు ఢీ కొట్టి ఆ పై పరస్పరం నిందించుకున్న కామెడీ సీన్ లు అభిమానులకు అద్భుతమైన వినోదాన్ని పంచి పట్టాయి.

అయిన దానికీ కాని దానికీ  తొడ గొట్టే చెత్త తెలుగు సినిమా మ్యానరిజం అలవాటు చేసుకున్న శిఖర్ ధావన్ అంత స్థాయిలో ఆడిపొడిచిందేం లేదు గానీ ఇప్పటి దాకా జరిగిన పోటీల్లో రేపటి ధోనీగా గుర్తింపు పొందుతున్న రిషభ్ పంత్ ఈ సరికే ఓ అత్యద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో అభిమానుల దృష్టి ఆకర్షించాడు. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, కె ఎల్ రాహుల్, క్రిస్ గేల్, నితీష్ రానా, ఏ బి డివిలియర్స్, తదితరులు హీరోచిత బ్యాటింగ్ విన్యాసాలు ప్రదర్శించారు. ఆల్ రౌండర్ లలో ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రావోల అద్భుత బ్యాటింగ్, బౌలింగ్ విన్యాసాలు తమ తమ జట్లకు విజయాలు చేకూర్చాయి. ఏ ఫార్మాట్ లో అయినా బౌలింగ్ యోధుల ప్రాధాన్యం ఏ పాటిదో జస్ ప్రీత్ బుమ్రా, కాగిసో రబడల అద్భుత ప్రదర్శన నిర్ద్వంద్వంగా నిరూపించింది.

ఒక్కో జట్టుకు ఇప్పటికింకా మూడు పోటీలే పూర్తయ్యాయి. అన్ని జట్లు ఇంకా 11 చొప్పున ఆడవలసి ఉంది. బమ్మిని తిమ్మిని, తిమ్మిని బమ్మిని చేయగల థ్రిల్లింగ్ ఎలిమెంట్ క్రికెట్ లో అంతర్గతంగా ఇమిడి ఉంది. రెండో వారంలో విచ్చుకోనున్న మరిన్ని సస్పెన్స్ థ్రిల్లర్ ల కోసం క్రికెటాభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *