కుంచె నుంచి కంచానికి… ఆర్టిస్టు వడ్డించే ‘తెలుగు భోజనం’

(సుమబాల)

జంక్ ఫుడ్స్ తో జిహ్వా చచ్చిపోయిందా? కొత్తరకం వంటకాలతో మొహం మొత్తిందా? అచ్చతెలుగు వంటకాలు తినాలన్న కోరిక కలుగుతోందా? మీలాంటి వారికోసం వెలిసిందే విస్తరి. సంప్రదాయ తెలుగు భోజనం. పాత రుచుల కొత్త అడ్డా. వండడమే కాదు తినడమూ ఒక కళే. ఏది దేనికి కాంబినేషన్ తెలుసుకుని తింటే తినడంలోని మజాను అనుభవించవచ్చు.

 

అమ్మమ్మలు, నాన్నమ్మల కాలంలో చేసుకునే వంటలు..కాస్త టైం, శ్రద్ధ ఎక్కువ పెట్టాల్సిన వంటలు ఇప్పుడు కనిపించడం లేదు. కనీసం వాటి పేర్లు కూడా ఇప్పటివారికి తెలియవు. అయితే నాన్ వెజ్, లేదా పిజ్జా బర్గర్స్, వెస్ట్రన్, కాంటినెంటల్, చైనీస్, థాయ్…ఇలా వరుసగా పేర్లు చదువుతారే తప్ప…ఇష్టమైన వెజ్ వంటకం ఏదీ అంటే చెప్పలేరు. కారణం..వెజ్ లో రకాలు, తినే కాంబినేషన్స్ తెలియకపోవడమే.

ఆవకాయ-వెన్న, ఆవకాయ-కందిపొడి, మాగాయ-పెరుగుపచ్చడి, పచ్చిపెసరపప్పు-పచ్చిపులుసు కాంబినేషన్లు ఎంతమందికి తెలుసు, వెలక్కాయ పచ్చడి, చిలకడదుంప పచ్చడి, కందిపచ్చడి గురించి ఎప్పుడైనా విన్నారా, అవిసెపువ్వు కూర చేస్తారని తెలుసా, కోయతోటకూర దుంపలను సన్నగా తరిగి తెలగపిండితో ఫ్రై చేస్తారని విన్నారా…ఇలాంటి ఎన్నో వంటకాలు కనుమరుగవుతున్నాయి. గోంగూరతో పది రకాల పచ్చళ్లు, పది రకాల కూరలు చేయవచ్చని నేటి తరం వారికి తెలుసా? అంటుపులుసులు పెట్టడం ఎలాగో తెలుసా…అంటే ఏంటీ అని అడుగుతారేమో నేటి జనరేషన్..అందుకే కనుమరుగవుతున్న మన సంప్రదాయ వంటకాలను తిరిగి ప్రచారంలో పెట్టడానికి ప్రారంభించిందే విస్తరి.

ఎవరు, ఎక్కడ…

విస్తరి, సంప్రదాయ తెలుగు భోజనహోటల్ హైదరాబాద్ బంజారాహిల్స్, సాక్షి ఆఫీస్ పక్క గల్లీలో ఉంది. ఐదునెలల క్రితం వాసు దీన్ని ప్రారంభించారు. బైటినుండి చూస్తే విస్తరి పెద్దగా హడావుడి, క్రౌడ్ కనిపించకుండా అతి సామాన్యంగా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి లోపలికి వెళ్లారా…ఆ రుచికి అడిక్ట్ అయిపోతారు.

నీట్ గా సర్దిన టేబుల్లు వాటిమీద కందిపొడి, పేరిన నెయ్యి, దోసకాయో, వెజిటబులో, మామిడికాయో ఏదో ఒక ఆవకాయ పచ్చళ్ల శుభ్రమైన బాటిళ్లు కనిపిస్తాయి. ఇక ప్లేటు ముందు కూర్చోగానే మొదట ఒక కప్పుడు స్పెషల్ రైస్ అంటే లెమన్, పులిహోర, పుదీనా, జీరా, ఇంగువ రైస్ లు వడ్డిస్తారు. ఆ తరువాత వైట్ రైస్…రెండు రకాల కర్రీలు, ఓ రోటి పచ్చడి, రసం, సాంబార్, పాపడ్, స్వీట్, పెరుగు. ఇవి రెగ్యులర్ మెను. ఇందులో కర్రీస్ మీరు వెళ్లినప్పుడల్లా కొత్తగా మారుతుంటాయి. మీ జిహ్వాకు పనికల్పిస్తాయి. కూరగాయల భోజనమే చేశామే అన్న అసంతృప్తి ఉండదు. మరింత కొసరి వడ్డించుకుని తిని మరీ  తృప్తిగా లేస్తారు. మీరిచ్చిన వంద రూపాయలు గిట్టుబాటు అవుతాయి.

అసలెలా….

ఓ పత్రికలో ఆర్టిస్టు పనిచేస్తున్న వాసు మొదటినుండి భోజనప్రియుడు. స్వగ్రామం తెనాలి దగ్గర యలమర్రు. తనకీ భోజనప్రియత్వం తండ్రినుండి వచ్చిందని చెబుతారు. అంతేకాదు ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చాక రుచిలేని వంటకాలతో తన జిహ్వా చచ్చిపోయిందట. వండడమే కాదు తినడమూ ఒక కళే అంటారు వాసు. తనకు తినడంతో పాటు, వండడమూ తెలుసు. ఇష్టమైన రుచి ఎక్కడ తగిలినా ఇంటికి వచ్చి ప్రయత్నించి, సాధించే దాకా వదిలిపెట్టారు. అదిగో అలా 15 ఏళ్ల క్రితం పుట్టిందే హోటల్ పెట్టాలన్న ఆలోచన. కానీ ఉద్యోగబాధ్యతలు, కుటుంబ బాధ్యతలతో ముందుకు రాలేకపోయారు.

చిట్టచివరికి…

చివరికి అన్నీ కలిసి గత నవంబర్ లో విస్తరి ప్రారంభించారు. తన వృత్తికి, ప్రవృత్తికి అనువైన చోటు దొరకడంతో విస్తరి కార్యరూపం దాల్చింది. మొదట్లో 20,30 మంది రోజువారీ వచ్చేవారు..ఇప్పుడు ఈ సంఖ్య 100-140 మధ్యకు చేరింది. వాసుకు దాదాపు వందవరకు కనుమరుగైన వంటలు తెలుసు. ఇక ఇప్పటికీ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో చేసుకునే సంప్రదాయ వంటల గురించి చెప్పనక్కరలేదు.

అయితే ఇవన్నీ రెగ్యులర్ గా ఇక్కడ దొరుకుతాయా అంటే కాదు. నేటి తరానికి తినడం కూడా తెలియదు అంటారాయన. కొత్తగా ఏదైనా పెడితే తినరట. అందుకే వారంలో రెండు, మూడుసార్లు ఓ కొత్త వంటకాన్ని అన్నిటితోపాటు కలిపి అందిస్తున్నానని చెబుతున్నారు.

మెస్ కాంటాక్ట్ నెంబర్ : 9573278439

ఆదివారం సెలవు

చుట్టుపక్కలున్న ఆఫీసువాళ్లే దీనికి రెగ్యులర్ కస్టమర్లు. ఆదివారాలు ఆఫీసులు ఉండవు కాబట్టి హోటల్ మూసేస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆదివారాలు కుటుంబ భోజనాలు ప్రారంభిద్దామనుకుంటున్నారు. రెండు రోజుల ముందు బుక్ చేసుకుంటే…కుటుంబం మొత్తానికి కావాల్సిన సంప్రదాయ వంటకాలు తయారు చేస్తారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *