Home ట్రెండింగ్ న్యూస్ సిఎం కుర్చీకి మూడు నెలలే టైం… జగన్ బలమేంటి ?

సిఎం కుర్చీకి మూడు నెలలే టైం… జగన్ బలమేంటి ?

117
0
SHARE

ఏపీలో ఎవరికి ఛాన్స్.. !
వైఎస్ జగన్ తన పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.. గతంలో పాదయాత్ర చేసిన వైఎస్, చంద్రబాబు ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు కాబట్టి.. వైఎస్ జగన్ కూడా అధికారంలోకి వస్తారని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది.. దానికి తోడు టీడీపీ పాలనపై ప్రజా వ్యతిరేకత కూడా కలిసివస్తుందని ఆ పార్టీ నమ్ముతోంది. అయితే పాదయాత్రలతో అధికారంలోకి వచ్చే సాంప్రదాయానికి చెక్ పెడతామని టీడీపీ బలంగా చెబుతోంది… ఒకటి మాత్రం నిజం ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో విజయం అటు జగన్ ఇటు చంద్రబాబు ఇద్దరికీ చావో రేవో లాంటిదే…

ఎందుకంటే చంద్రబాబు విషయానికే వద్దాం.. ఈ సారి ఎన్నికలు కేవలం చంద్రబాబు భవిష్యత్తునే కాదు.. టీడీపీ పార్టీ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి.. 68 ఏళ్ల వయసులోనూ ఇప్పటికే అన్ని తానై.. అటు పార్టీని ఇటు పాలనకు జోడెద్దుల స్వారీలా నేర్పుగా నెట్టుకొస్తున్నారాయన… ఈ సారి మళ్లీ అధికారంలోకి వస్తే ఇదే హుషారు కంటిన్యూ అవుతుంది.. లేక పోతే కొంత డీలా పడే అవకాశం ఉంది.. రెండోది పార్టీ ను నడిపేదెవరు అనే విషయంలో తనయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్.. పార్టీకి పూర్తి స్థాయి నాయకత్వం వహించగలడా అన్న సందేహం కొంత పార్టీ శ్రేణుల్లోనూ ఉంది.. ఈ సారి జగన్ అధికారంలోకి వస్తే.. జగన్ కు వయసు ఉంది కాబట్టి.. ఏపీ రాజకీయాల్లో పూర్తిగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందనేది టీడీపీ వర్గాల భావన.. ఈ పరిస్థితుల్లో ఎవరోచ్చినా ఫర్వాలేదు.. వైఎస్ జగన్ మాత్రం అధికారంలోకి రాకూడదనే కోణంలో టీడీపీ వ్యూహాలు రచిస్తోంది..

జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో పాటు జరుగుతాయి కాబట్టి.. మోడీ పై వ్యతిరేకతను సానుకూలత ఓటుగా మల్చుకోవడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని చోట్ల జగన్ కు ధీటుగా ఆర్థిక బలంతో గట్టి పోటీ ఇవ్వాలని యోచిస్తోంది… తాజాగా తీసుకున్న ఫించన్ పెంపు లాంటి కార్యక్రమాలు ప్రజా వ్యతిరేకతను కొంత తగ్గిస్తాయనే భావనలో ఆ పార్టీ ఉంది. అయితే గత ఎన్నికల్లో టీడీపీకి అండగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు ఈ సారి అనుమానమే.. ఇలాంటి పరిస్థితుల్లో బాబు నెగ్గుకురావడం కత్తి మీద సామే….

ఇక వైసీపీ విషయానికోస్తే… 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 8 ఏళ్లు అధికారంలో లేకపోయినా క్యాడర్ ను కాపాడుకుంటూ పార్టీని పోటీలో నిలబెట్టడంతో వైఎస్ జగన్ నాయకత్వాన్ని ప్రశ్నించజాలం.. కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో జంప్ అయినా.. వాళ్ల ఉద్దేశ్యాలేంటో .. ఇలా పార్టీలు మారే నేతల ప్రజా ప్రయోజనాలేంటో ఇప్పటికే ప్రజలకు అవగతమైంది… మొండి మనిషి అని ఆ పార్టీలో కొందరు గిచ్చుకున్నా.. ఆ మొండితనమే మా నాయకుడుని నడిపిస్తోందనేవాళ్లు ఆ పార్టీలో ఉన్నారు..

అయితే పాదయాత్ర అధికారాన్ని తెస్తుందా..?

వైఎస్ జగన్ పాదయాత్రను అందరూ వైఎస్ఆర్ పాదయాత్రతో పోల్చుతున్నారు.. మేం జర్నలిజంలోకి వచ్చిన తొలినాళ్లలో వైఎస్ పాదయాత్ర చేశారు.. అప్పటి కి పదేళ్ల టీడీపీ పాలనపై పూర్తి వ్యతిరే్కతతో ప్రజల్లో మనకో నాయకుడు కావాలంటూ బయలుదేరిన మనో ఉద్యమం .. పాదయాత్రకు బ్రహ్మరథం పట్టేలా చేసింది… దీంతో అప్పటి వరకు కాంగ్రెస్ లో ఓ సీనియర్ నేత వైఎస్ఆర్ అనే స్థాయి నుంచి కాంగ్రెస్ అంటే రాజశేఖర్ రెడ్డి అన్నంత లో ఆయన కీర్తి ఎగబాకింది.. అది కాంగ్రెస్ అధికారంలో రావడానికి ప్లస్ అయ్యింది. అప్పటి పరిస్థితులు వేరు… ఇప్పుడు వేరు… సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర సమస్యల కంటే జాతీయ స్థాయి అంశాలూ ఓటర్ల మదిని తొలిచేస్తుంటాయి… అందుకే 1999లో 2014లో బిజెపి, మోడీ వేవ్ టీడీపీకి బాగా కలిసొచ్చింది..

ప్రస్తుతం రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందనే భావన మెజార్టీ ప్రజల్లో బలంగా గూడుకట్టుకుంది.. అది ఖచ్చితంగా పనిచేస్తుంది.. గత ఐదేళ్ల పాలనపై వ్యతిరేకత ఉన్నా.. దానికి మోడీ వ్యతిరేకత అధిగమించి తిరిగి అధికారంలోకి వస్తామనేది చంద్రబాబు లెక్క… ఇక వైసీపీ విషయానికోస్తే.. ఆ పార్టీ నేతలు ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా.. అనుకున్నంత స్థాయిలో కేంద్రంపై గానీ, మోడీపై గానీ మాట్లాడడం లేదనే భావన ప్రజల్లో బలంగా ఉంది.. అలాగే వైసీపీ ప్రకటించిన నవరత్నాలు మరింత ఆకర్షణీయంగా ఉంటే బావుండేదనేది సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.. ఇక చివరిలో ఆర్థిక పరమైన అంశాలే ప్రాతిపదికగా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పు పార్టీకి మైనస్ అవుతుందని మరికొందరంటున్నారు.. అయితే కొన్ని వర్గాల్లో తమ గ్రాఫ్ పెరిగిందని వైసీపీ లెక్కలేసుకుంటోంది.. ఒకటి మాత్రం నిజం ఇంకా వైఎస్ ఆర్ లెగసీ కొంత ప్రజల్లో ఉండటం వైసీపీ కి సానుకూలాంశమే.. పాదయాత్ర తర్వాత కొన్ని జిల్లాల్లో పార్టీ పరిస్థితి మారిందంటున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తే సరేసరి.. లేకుంటే వైసీపీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమే… మరోవైపు బాబు పనిపడతామంటా జగన్ కు అనుకూలంగా కేసీఆర్, ఒవైసీలు ప్రకటనలు చేయడం తమకు ప్లస్ అవుతుందని టీడీపీ భావిస్తోంది… ఈ విషయంలో వైసీపీ మాత్రం నిజంగా కొంత అనుమానపు చూపులు చూస్తోంది…

2014 ఎన్నికలను నెల రోజుల ముందు వరకు విజయం జగన్ వైపే ఉంది.. అయితే చివరి నిమిషంలో అటు జనసేన ఇటు మోడీని కలుపుకొని చంద్రబాబు వేసిన రాజకీయ ఎత్తుగడలు వైసీపీ విజయాన్ని అడ్డుకున్నాయి.. ఈసారి ఈ రెండు మూడు నెలల్లో జగన్ రాజకీయ వ్యూహామూ.. ఆ పార్టీ విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది..

మరో వైపు జగన్ అధికారంలోకి వచ్చి కేంద్రం మళ్లీ బిజెపి వస్తే చంద్రబాబును ఖచ్చితంగా టార్గెట్ చేస్తారని టీడీపీ నేతలు భావిస్తుంటే.. చంద్రబాబు ఇక్కడ అధికారంలోకి వచ్చినా.. రాకపోయినా.. కేంద్రంలో కాంగ్రెస్ ఆధారిత ప్రభుత్వం ఏర్పడితే జగన్ను టార్గెట్ చేస్తారని వైసీపీ అనుకుంటోంది.. మొత్తానికి ఎవరి సేఫ్ గేమ్ ఎలా ఉన్నా… చివరికి ఈ రెండు పార్టీల మధ్య పోరు హోరాహోరీగానే ఉండేటట్లు కనిపిస్తోంది… ­వార్ వన్ సైడ్ కాదనేది స్పష్టంగా అర్దమవుతోంది.. చూద్దాం..

2019 ఎన్నికల వేళ రాజకీయపరమైన అంశాలపై నా అభిప్రాయాన్ని ఫేస్ బుక్ వేదికగా పంచుకుందామని భావిస్తూ.. ఈరోజు ఏపీ రాజకీయాలపై విశ్లేషణ చేశాను… ఈ సిరీస్ లో ఏపీలో జనసేనకు సీన్ ఉందా.. దాని ప్రభావం ఎంత అనే అంశంపై విశ్లేషణ తర్వాత చూద్దాం..

 

(రచయిత – తద్ది సతీష్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ ఫేస్ బుక్ వాల్ నుంచి…)