శుభవార్త, ఎర్రమంజిల్ కు హైకోర్టు అండ…. ఎలా కూలుస్తారని ప్రశ్న

ప్రభుత్వ భవనం అయితే ఎర్రమంజిల్‌ ప్యాలె్‌సను కూల్చివేస్తారా, అజంతా, ఎల్లోరా గుహలు కూడా ప్రభుత్వానివే, కూల్చడం కుదరుతుందా అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
హైదరాబాద్ లో తెలుగు ప్రజలంతా గర్వపడేంత గొప్ప చారిత్రక కట్టడాలున్నాయి. వాటిని కాపాడాల్సిన ప్రభుత్వం, వాటన్నింటి హెరిటేజ్ జాబితాను తొలగించినట్లు హైకోర్టు గుర్తించింది.
ఈ జాబితానుంచి తొలగిస్తే,రాత్రికి రాత్రే కూల్చేయవచ్చు. ఇలా మన చరిత్రను మనంచెరిపేసుకుంటే రేపు రాబోయే తరాలకు చూపేందుకు మాల్స్, హోటళ్లు, మెట్రో స్టేషన్లు తప్ప ఏమీ ఉండవు.
ఈ విషయాన్ని గుర్తించిన హైకోర్టు హెరిటేజ్ జాబితాలోనుంచి ఎర్రమంజిల్ వంటి చారిత్రక ప్రాముఖ్యం ఉన్న భవనాలను (హెచ్ ఎండి ఎ చట్టం నుంచి) ఎలా తొలిగిస్తారని ప్రశ్నించింది.
ఈ చట్టంలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు సంబంధించిన  రెగ్యులేషన్ 13 ను పూర్తిగా లేపేశారు.
ఇది కూడా చదవండి:హైాదరాబాద్ అంటే ముచ్చట పడే వాళ్లకు ఎమర్జన్సీ విన్నపం…
హైదరాబాద్ లో ప్రతి చారిత్ర కట్టడానికి కేంద్రం జనరల్ క్లాజెస్ చట్టంలోని సెక్షన్ 6, తెలంగాణ జనరల్ క్లాజెస్ చట్టంలోని సెక్షన్ 5 కింద భద్రత ఉంటుందని కోర్టు చెప్పింది.
చీఫ్ జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్ ల బెంచ్ ఈ ప్రశ్నలు వేసింది.
ఎర్రమంజిల్ వంటి భవనాలను కూల్చేయాలను ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలయిన పిటిషన్ల మీద రాష్ట ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావు వాదనలను వింటూ బెంచ్ ప్రభుత్వ చర్య పట్ల అసహనం వ్యక్తం చేస్తూ  ఈప్రశ్నలండింది.
ఇంకా కోర్టు ఏమందటే…
*పాతచట్టాన్ని తీసేసి కొత్త చట్టం తెస్తున్నపుడు పాతచట్టం ఎవరైనా వ్యక్తులకు కట్టడాలకు కల్పిస్తున్న భద్రతా చర్యలు కొనసాగాలి.
*కొత్త చట్టంలో హైదరాబాద్ చారిత్రక కట్టడాలకు ఉన్న భద్రత నియమాలను తొలిగిస్తుంటే ఎవరూ పట్టించుకొనకపోవడం ఆశ్చర్యం.
*హెచ్‌ఎండీఏ చట్టంలోని రెగ్యులేషన్‌ 13ను తొలగించినా గతంలో గుర్తించిన 135 హెరిటేజ్‌ భవనాలను ముందస్తు అనుమతులు లేకుండా ముట్టుకోవడానికి వీల్లేదు.
*హెచ్‌ఎండీఏ చట్టంలోని రెగ్యులేషన్‌ 13ను జీవో 183 ద్వారా తొలగించడం సరైన చర్య కాదు.
*దీనిని అనుమతిస్తే , రేపు తెలంగాణ హైకోర్టుకు ఇటువంటి చట్టం ఒకటుందని తెలియదా అని సుప్రీం కోర్టు చివాట్లు పెట్టే అవకాశం ఉంది.
*ఎర్రమంజిల్‌ ప్యాలె్‌సను కూల్చివేయాలంటే ముందుగా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి పొందాలన్న న్యాయవాది నళిన్‌ కుమార్‌ వాదనల సబబే.
గతంలో హుడా యాక్ట్‌ స్థానంలో ప్రత్యేక తెలంగాణ ప్రభుత్వం  హెచ్‌ఎండీఏ యాక్ట్‌ తీసుకువచ్చింది. ఇందులోని 1 నుంచి 12 వరకు ఉన్న రెగ్యులేషన్లు ఖాళీ స్థలాల గురించి వివరిస్తాయి. రెగ్యులేషన్‌ 13 పురాతన కట్టడాల సంరక్షణకు సంబంధించినది. దీనిని జీవో 183 ద్వారా 2015 డిసెంబరు 17న ప్రభుత్వం తొలగించింది. తర్వాత, తెలంగాణ హెరిటేజ్‌ చట్టం, 2017ను తీసుకొచ్చింది అని అదనపు ఏజీ జె.రామచంద్రరావు వివరించారు.
ఈ వివరణ పట్ల ధర్నాసనం తీవ్రంగా స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం 2015 లో తీసుకువచ్చిన చట్టంలో హైదరాబాద్ లో ఉన్న పురాతన కట్టడాలకు భద్రత లేకుండా పోయింది.
నిజానికి హైదరాబాద్ చారిత్రక ప్రాముఖ్యం గురించి ఇపుడు కాదు, ఎపుడో1862లోనే గుర్తించారు. అప్పటి నిజాం ప్రభుత్వం 37 పురాతన కట్టడాలను, ప్రదేశాలనుగుర్తించి వాటికి హెరిటేజ్, చారిత్రక ప్రాముఖ్యం ఉందని వాటిని కాపాడాలనిసూచించింది. తర్వాత 1920 ఈ జాబితాలోకి మరిన్ని కట్టడాలను చేర్చారు. వీటిలోనుంచి కేవలం 26 ను మాత్రమే 2017లో తెచ్చిన తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ లో చేర్చారు. అంటే కొన్నింటిని కూల్చేయవచ్చని భావించే తొలిగించారని అనుకోవలసి వస్తుంది. ఇలా తొలగించిన వాటిలోనే ఎర్రమంజిల్ ప్యాలస్ వస్తుంది.