హైాదరాబాద్ అంటే ముచ్చట పడే వాళ్లకు ఎమర్జన్సీ విన్నపం…

అడుగు తీసి అడుగేస్తే హైదరాబాద్ లో హిస్టరీ కాలికి తగులుతుంది. ప్రతి గల్లీ పేరుకు, శిధిలావస్థలో ఉన్న ప్రతి భవనానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఈ విషయం ఈ తరానికి తెలిసే లోపు చారిత్రక హైదరాబాద్ అంతరించిపోయే ప్రమాదంలో పడిపోతున్నది. రాబోయే తరాలకు హైదరాబాద్ లో చూసేకి మాల్స్,హైటెక్ సిటి, కాఫీ షాపులు, బార్లు, రెస్టారంట్లు తప్ప ఏమీ మిగలవు.
ఒరిజినల్ హైదరాబాద్ అంతరించిపోతున్నది. దాని స్థానంలోకి జిగేల్ హైదరాబాద్ వస్తున్నది. హైదరాబాద్ ను ఆస్వాదించాలనుకునే వాళ్లంతా ఎప్పుడో గమనించిన బాధాకరయయిన వాస్తవమది.ఒకపుడు చిన్న సమోసాలు తింటో బన్ మస్కా తింటో తీరుబడి హైదరాబాద్ ప్రతిమూలన ఉండిన ఇరానీ హోటల్లో తీరుబడిగా ఉస్మానియా బిస్కట్ తో టీ తాగడం ఒక అద్భతమయిన కాలక్షేపం. ఇపుడు కూర్చుని టీ తాగే వైభోగాన్ని జిగేల్ హైదరాబాద్ తరిమేసింది. పరిగెత్తుతూ టీ తాగాలి.నిలబడి టిఫిన్ చేయాలి. లేదా పార్సిల్ చేయించుకుని మనం ఉడాయించాలి.
కళ్ల ముందు నుంచి ఒక గొప్ప చరిత్ర మాయమై ఇంటర్నెట్ లోకి జారుకుంటూ ఉంది.
హైదరాబాద్ ను చూడాలంటే ఇపుడు గూగులే దిక్క. ఈ ముప్పు రాక ముందే కొన్ని విశేషాలనైనా ఈ తరం స్వయంగా చూడాల్సిన ఎమర్జన్నీ వచ్చేసింది. త్వరగా ఒకసారి వెళ్లి చూసిరండి. ఇపుడు తక్షణం చూడాల్సింది. ఎర్రమంజిల్ (Errum Manzil లేదా Irrum Manzil).

  బిజెపి ఎమ్మెల్యే  రాజా సింగ్ 

నిలబెట్టాలనుకున్న విగ్రహం ఎవరిదో తెలుసా?

రోడ్లను వెడల్పు చేసేందుకు హైదరాబాద్ – వరంగల్ రోడ్ పక్కనున్న వేల చెట్లను నరికేసినట్లు, ఇపుడు అధునిక ప్రభుత్వ భవనాలకోసం హైదరాబాద్ లోని ఉన్న చారిత్రక భవనాలను, పాతవైపోయానే పేరుతో కూల్చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్నెవరూ అపలేరిక.
ఎర్రమంజిల్ కు రోజులు దగ్గరపడ్డాయి. ఒకపుడు చాలా దూరాన్నుంచి కనిపించే ఎర్రమంజిల్ ఇపుడు దగ్గరకు పోతే తప్ప కనిపించదు. కొద్ది రోజుల్లో అసలు కనిపించదు. ఇపుడు వారసత్వ సంపదగా (heritage building)గా పేరున్న ఎర్రమంజిల్ స్థలంలో బ్రహ్మాండమయిన తెలంగాణ అసెంబ్లీ రాబోతున్నది. నిగనిగలాడే హదరాబాద్ చరిత్ర మొదలు కాబోతున్నది. ఈ లోపు ఎర్రమంజిల్ గురించి తెలుసుకుందాం.
1. ఎర్రుమ్ మంజిల్ అంటే పర్షియా భాషలో స్వర్గ ప్రాసాదం (mansion in paradise) అని పేరు.
2.ఖైరతాబాద్ -పంజాగుట్ట రోడ్ పక్క రెడ్ హిల్స్ ఏరియాలో ఒక గుట్ట మీద ఈ భవనాన్ని నిర్మించారు. చుట్టూర ఉండే హైదరాబాద్ మొత్తం కనిపించేలా ఉండాలని ఈ ప్రాంతాన్ని ఎంచుకుని నిర్మాణం చేపట్టారు. దీనికి స్ఫూర్తి ఎత్తయిన కొండమీద ఉన్న ఫలక్ నుమా ప్యాలెస్.
3. దీనిని కట్టించిన వ్యక్తి నవాబ్ సఫ్దర్ జంగ్ ముషీరుద్దౌలా ఫక్రుల్ ముల్క్.
4. ఇండో యూరోపియన్ బరాక్ స్టైల్ లో దీనిని నిర్మించారు. ఈ శైలి ప్రత్యేక ఏమిటంటే విపరీతంగా భవనాన్ని అందంగా నగిషీ చెక్కడం.
5. ఇది రెండంతస్థుల భవనం. దాదాపు 1,13,793 చదరపు అడుగుల విస్తీర్ణం తో నిర్మించారు. గారతో నిర్మించి భవనమంతా కళాఖండంగా డిజైన్లతో తీర్చిదిద్దారు. 15 వ లూయి కాలం నాటిఫర్నిచరతో భవనాన్ని అలంకరించి ఉంచారు. ఇందులో 150 రూమ్ లున్నాయి. సుమారు 150 సంవత్సరాల కిందటే ఈభవన నిర్మాణానికి రు.33,42, 000 ఖర్చయినాయని అంచనా.
6. ఈ భవనం ఆవరణలో ఒకపుడు చెరువు కూడా ఉండింది. దీనితో నైన్ హోల్ గోల్ప్ కోర్స్, ఒక పోలో గ్రౌండ్, 200 గుర్రాల కోసం ఒక గుర్రపు శాల, 100 ఎనుములు ఆవుల కోసం పశువుల శాల కూడా ఉండేవి.
6. ఫలక్ నుమా ప్యాలస్ కు పోటీ గా దీనిని నిర్మించారని కూడా ఒక కథ ప్రచారం లో ఉంది. ఫక్రుల్ ముల్క్ కి నాటి నిజాం నవాబ్ దగ్గిర ప్రధాని అయిన వికార్ ఉల్ ఉమ్రాకు స్నేహపూర్వకమయిన పోటీ ఉండింది. వికార్ ఉల్ ఉమ్ర మంచి వాస్తు శైలి మీద అభిరుచి ఉన్నాడు.ఆయనే పైగా ప్యాలెస్ ను, ఫలక్ నుమా ప్యాలస్ ను నిర్మించింది. అయితే ఫలాక్ నుమా ప్యాలెస్ నిజాం కొన్నారు. వీటికి ధీటుగా తాను భవనం నిర్మించాలనుకుని ఫక్రుల్ ముల్క్ ఎర్రం మంజిల్ నిర్మాణానికి పూనుకున్నారట.
7. 1940 దాకా ఇది నవాబు వారసుల చేతిలోనే ఉండింది. నిజాం భారత యూనియన్ లో విలీనమయ్యాక ఇది ప్రభుత్వం అజమాయిషీలోకి వచ్చింది. తర్వాత ఇందులో నీటిపారుదల శాఖ, ఆర్ అండ్ బి, కమాండ్ ఏరియా డెవెలప్ మెంట్ విభాగాల కార్యాలయాలు వచ్చాయి. అపుడు దాదాపు 2000 మంది ఉద్యోగులు ఇందులో పనిచేసేవారు. 2014లొ తెలంగాణ ఏర్పడిన తర్వాత, వాడకంలో లేని ఈ భవనంలోని రెండు గదులను ఆంధ్రప్రదేశ్ అర్ అండ్ బికి కేటాయించారు.
8. తమాషా ఏమిటంటే, అన్నీ ఇంజనీరింగ్ విభాగాలే ఉన్నా, ఈ అమూల్యమయిన వారసత్వ సంపదను కాపాడుకుందామని ఎవరూ ఆలోచించలేదు. ప్రభుత్వ శాఖలున్నపుడే ఈ భవనం పతనవావస్థకు చేరకుందని చెబుతారు.
9. తొందర్లో ఈ భవనాన్ని కూల్చేయనున్నారు. ఒక చరిత్ర గుర్తు ఇంటర్నెట్ లోకి మాయమవుతుంది
10. ఈ ప్రదేశంలో నూరుకోట్ల ఖర్చుతో ఒక అసెంబ్లీ భవనం రాబోతున్నది.

(ఫోటోలు ఫక్రుల్ ముల్క్ ఫామిలీ బ్లాగ్ నుంచి)

(Healthy Reading కోసం ఈ వార్త నచ్చితే షేర్ చేయండి, trendingtelugunews.com ను ఫాలో కండి)