బాలివుడ్ సూపర్ ఖాన్ త్రయం షో ముగిసినట్లేనా?

బాలివుడ్ సూపర్ హిట్ లకు మారు పేరు ఖాన్ త్రయం. నిర్మాతల పాలిట దేవుళ్లుగా పేరొందిన హీరో త్రయం షారూఖ్ , సల్మాన్, అమీర్ ఖాన్ లకు 2018 కలిసి రాలేదు. బాలివుడ్ లో వారి షో ఖతం అయినట్లేనా? మళ్లీ విజృంభిస్తారా?

(మల్యాల పళ్లం రాజు)

చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత షారూఖ్ ఖాన్ కు ఆ స్థాయిలో హిట్ కరవైంది. ఇక దంగల్ తర్వాత హిందీ చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోలు ఖాన్ త్రయం. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్. రెండున్నర దశాబ్దాలుగా బాలివుడ్ ను ఏలుతూ కలెక్షన్ కింగ్స్ గా పేరుపొందిన ముగ్గురు హీరోలు ఈ మధ్య ఫ్లాప్ ల బారిన పడ్డారు. 2018 సంవత్సరం ముగ్గురికీ కలిసి రాలేదు. ఖాన్ త్రయం నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ ముందు బోల్తా పడడం నిజంగా షాకింగ్ న్యూస్. ముగ్గురు ఖాన్ లకు ఇది బ్యాడ్ ఇయర్ అనక తప్పదు. ముగ్గురు సూపర్ హీరోల చిత్రాలు ఎత్తిపోవడంతో బాలివుడ్ లోని బడా నిర్మాతలు కూడా నివ్వెరపోయారు. ఖాన్ త్రయానికి ఏమైంది వయస్సు పై బడిందా.. కాలం కలిసి రాలేదా.. అని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

అమీర్ ఖాన్ కు కూడా ఆ రేంజ్ లో హిట్ దొరకలేదు. సల్మాన్ ఖాన్ నటించిన రేస్ 3, దీపావళి కానుకగా వచ్చిన అమీర్ ఖాన్ చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, షారూఖ్ ఖాన్ నటించిన జీరో చిత్రాలు ఫ్లాప్ కావడంతో ముగ్గురు సూపర్ హీరోలు చతికిల బడ్డారు. దీంతో బాలివుడ్ లో ఖాన్ త్రయం షో ముగిసిందా.. అన్న అనుమానాలు షికారు చేస్తున్నాయి. 50వ పడిలో పడినా 25 ఏళ్ల పాత్రల్లో రాణిస్తూ సాగిన వీరి విజయ యాత్ర.. ఈ మధ్య డీలా పడింది. ఇందుకు ప్రధాన కారణం నాసిరకం స్క్రిప్ట్ లు, కథలేకుండా కథనం పైనే ఆధారపడడం, డైరెక్టర్లు ఊహించిన స్థాయిలో చిత్రాలను ఆవిష్కరించలేకపోవడమే.

హిట్.. ఫ్లాప్ యే జీవితం… అని పాడుకోవడానికి బాగుంటుంది కానీ, పెద్ద హీరోల చిత్రాలు ఫ్లాప్ అయితే .. వచ్చే నష్టం కూడా కోట్లలో ఉంటుంది. నిజానికి కథ, స్క్రీన్ ప్లే పటిష్టంగా ఉండి భారీ పెట్టుబడితో నిర్మిస్తే.. కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ ఖాయం అని ముగ్గురు సూపర్ హీరోలు గతంలో నిరూపించారు. కాలం మారుతోంది. కాలంతో పాటు సినీ ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. డాన్స్ లు, పాటలు, నాలుగు డిష్యూం, డిష్యూం ఫైట్లతో రీళ్లు చుట్టేసి జనం మీదకు విసిరేస్తే, జనం కూడా తిరిగి అదే స్పీడ్ తో వెనక్కి కొట్టేయడం ఖాయం అని ఇటీవల తేలిపోయింది. బాలివుడ్ లో ఇప్పటికీ ఖాన్ త్రయం సూపర్ హీరోలే. వారు నటించిన చిత్రాలు ఫ్లాప్ అయినా, మినిమమ్ కలెక్షన్ గ్యారంటీ అనే పేరు ఉంది. పెట్టుబడికి ఢోకా ఉండదనే నిర్మాతలు లేకపోలేదు. నిజానికి వీరి చిత్రాలు ఫ్లాప్ అయినా నిర్మాతకు పెట్టుబడిలో సగం వచ్చిందనే అర్థం. రేస్ 3, థగ్స్, జీరో చిత్రాలను భారీ బడ్జెట్ తో అంగరంగ వైభవంగా, నిర్మించారు. అంత పెట్టుబడితో నిర్మించిన చిత్రాలు వందలకోట్లు వసూళ్లు సాధిస్తేనే సూపర్ హిట్ అంటారు. అంతెందుకు రేస్ 3 ఫ్లాప్ అయినా రూ.169కోట్ల మేరకు కలెక్షన్లు సాధించింది. ఇక థగ్స్ఆఫ్ హిందుస్తాన్ రూ. 145 కోట్లు వసూలు చేసింది. జీరో మరీ జిరో వసూళ్లు కాకుండా రు. 97కోట్లు రెవెన్యూ రాబట్టింది.

2018లో బలమైన కథ, కథనంతో నిర్మించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పండుగ చేసుకున్నాయి. ఖాన్ త్రయంతో పోలిస్తే చిన్న హీరోలు, యువ హీరోలు నటించిన పద్మావతి, సంజు, సింబా వంటి సూపర్ హిట్ చిత్రాలు, హిట్ చిత్రాలు 15 పైగా ఉన్నాయి. నిర్మాతలకు కనకవర్షం కురిపించి పెట్టాయి. ఖాన్ త్రయం చిత్రాలే బోల్తా పడ్డాయి. ఇందుకు కారణం విశ్లేషించాల్సిందే.

నిజానికి షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ పటిష్టమైన కథ, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ ఉండి, హిట్ దర్శకుడు, ఆర్థికంగా బలమైన నిర్మాత వస్తే తప్ప చిత్రాలను అంగీకరించేవారు కాదు. కానీ, ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ, ముగ్గురు ఖాన్ లు తప్పులో కాలు వేశారు. రేస్ 3, థగ్స్, జిరో చిత్రాలను ప్రేక్షకులు తిరస్కరించింది చెత్త స్క్రిఫ్ట్ ల వల్లే కానీ, ఖాన్ త్రయాన్ని కాదను కోవాలి. ఖాన్ వంటి హీరోలు నటించినా, నటించకపోయినా ఇలాంటి చెత్త చిత్రాలను జనం తిప్పికొడతారన్నది నిజం. అయితే ఎంత సూపర్ హీరోలైనా ఒక్కో సారి ప్రయోగాలు చేద్దాం అనుకుని దెబ్బతినడం ఖాయమే.
అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రాన్ని అంగీకరించడానికి కారణం యష్ రాజ్ ఫిల్స్మ్ అయి ఉండడం. అమితాబ్ బచన్ వంటి మహా నటుడితో కలిసి పనిచేసే ఛాన్స్ వచ్చిందని అనుకోవడం. అందువల్లే చిత్రంపై అంచనాలు పెరిగాయి. అయితే థగ్స్ చిత్రం అంగీకరించి తప్పు చేశానని ఇప్పుడు అనుకుని లాభం లేదు. తారే జమీన్ పే వంటి చిత్రాన్ని నిర్మించి అవార్డులు కొట్టిన అమీర్ ఖాన్ నిజానికి గతంలో ధూమ్ 3, పికె, దంగల్ వంటి వరుస హిట్ లను సాధించాడు. దంగల్ లో 50 ఏళ్ల వయస్సు ఉన్న పాత్రలో నటించినా జనం బ్రహ్మరథం పట్టారు. షారూఖ్ ఖాన్ జిరోలో వికలాంగుడి పాత్రలో నటించడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారేమో అన్పిస్తోంది. ఇక సల్మాన్ ఖాన్ కూడా కిక్, భజ్ రంగీ భాయిజాన్, సుల్తాన్ వంటి వరుస హిట్లు సాధించాడు. ఈ ఏడాదే ఫ్లాప్ బారిన పడ్డారు. వీరందరితో పోల్చి చూస్తే షా రూఖ్ ఖాన్ పరిస్థితి కాస్త ఆందోళనగా ఉందనే చెప్పాలి. ఫాన్, జబ్ హరీ మెట్ సేజల్, జీరో వంటి వరుస ఫ్లాప్ లను చవిచూశాడు. కానీ ముగ్గురు హీరోలు చక్కటి కథ, స్క్రిప్ట్ లతో కూడిన సరైన పాత్రలు లభిస్తే.. మళ్లీ సూపర్ హిట్ లు సాధించడం గ్యారంటీ.

2018 యంగ్ హీరోలకు కలిసివచ్చిందనే చెప్పాలి. రణవీర్ సింగ్, రణ్ బీర్ కపూర్ హిట్ లు సాధిస్తూ, సూపర్ స్టార్ అనిపించుకునేందుకు పోటీ పడుతున్నారు. కొత్తగా పరిశ్రమకు వచ్చిన అన్షుమాన్ ఖురానా, రాజ్ కుమ్మార్ రావు, వికీ కౌశల్ వంటి వారికి బాలివుడ్ శుభారంభం ఇచ్చింది. ఈ ఏడాది సూపర్ డూపర్ హిట్ లలో పద్మావతి ఒకటి. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 270 కోట్లు వసూలు చేసి, రణ్ వీర్ సింగ్ కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. రణ్ వీర్ మరో చిత్రం సింభా కలెక్షన్లు కూడా రూ.200 కోట్లను దాటాయి. రణ్ బీర్ కపూర్ నటించిన సంజు అనూహ్యంగా రూ.370 కోట్ల మేరకు కలెక్షన్ల వర్షం కురిపించింది. రణ్ బీర్ ను సూపర్ హీరో చేసింది. ఇక అన్షుమాన్ నటించిన బదాయిహో, వికీ కౌశల్ నటించిన రాజీ, రాజ్ కుమ్మార్ నటించిన స్త్రీ కనకవర్షం కురిపించాయి. వారిని విజేతలుగా చేశాయి.

ఖాన్ త్రయం మారుతున్న కాలానికి అనుగుణంగా చిత్రాలను అంగీకరించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అమితాబ్ బచ్చన్, దక్షిణాది సూపర్ స్టార్ రజనీ కాంత్ లను, వారి విజయాలను చూసి నేర్చుకోవాలి. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మేన్ గా పేరొందిన అమితాబ్ బచన్ 102 నాట్ ఔట్ వంటి చిత్రంలో నటించి.. అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. ఇక రజనీ కాంత్ రోబో, 2.0, కబాలి, కాలా, లింగ, తాజాగా పేట చిత్రాలతో విజయ పరంపర సాగిస్తున్నారు. ఖాన్ త్రయం అమీర్, సల్మాన్, షారూఖ్ కూడా సరైన స్క్రిప్ట్ , కథ, కథనం పై దృష్టి పెడితే వారి స్టార్ డమ్ కు ఢోకా ఉండదు. ఖాన్స్ … ఎప్పటికీ ఖాన్స్ అని రుజువు చేసుకోగలరు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *