‘బ్యాంకు’ నుంచి ఫోన్ చేసి వివరాలు తీసుకుని… 20 వేలు దోచారు

ఆన్ లైన్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులైన ప్రజలకు ఫోన్ చేసి మీకు భారీ ఆఫర్ వచ్చింది బ్యాంకు వివరాలు చెప్పాలంటూ పూర్తి వివరాలు తెలుసుకొని వారి ఖాతాల నుంచి సొమ్ము కాజేస్తున్నారు. తాజాగా నకిరేకల్ లో ఓ వ్యక్తి  నుంచి వివరాలు తీసుకొని తన బ్యాంకు ఖాతా నుంచి రూ.20 వేల రూపాయలు డ్రా చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేతేపల్లి మండలం కొండకింది గూడెం గ్రామానికి చెందిన వంగూరి కరుణాకర్ కు నకిరేకల్ హెచ్ డిఎఫ్ సి బ్యాంకులో ఖాతా ఉంది. మంగళవారం ఉదయం గుర్తు తెలియని మహిళ కరుణాకర్ కు ఫోన్ చేసి  హెచ్ డిఎఫ్ సి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెప్పింది. బ్యాంకు ఖాతాను అప్ డేట్ చేయాల్సిన అవసరం ఉందని మీ యొక్క పూర్తి వివరాలు చెప్పాల్సిందిగా ఫోన్ చేసిన మహిళ కోరింది. ఎటిఎమ్ వివరాలు కూడా తీసుకుంది. ఆ తర్వాత 10 నిమిషాలకే కరుణాకర్ అకౌంట్లోని 20 వేల రూపాయలు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో కరుణాకర్ కంగు తిన్నాడు.

వంగూరి కరుణాకర్

వెంటనే బ్యాంకుకు వెళ్లి సంప్రదించగా బ్యాంకు నుంచి ఫోన్ చేయలేదని ఇది గుర్తు తెలియని వ్యక్తుల పనని మేనేజర్ తెలిపాడు. దీంతో కరుణాకర్ తాను మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఏ బ్యాంకు వారు కూడా ఫోన్ చేసి వివరాలు అడగరని, ఏదైనా సమస్య ఉంటే కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకొని రావాలని చెబుతారని దీనిని ప్రజలు గమనించాలని మేనేజర్ తెలిపారు. ఖాతాదారుని పూర్తి వివరాలు అసలు బ్యాంకు వారు తీసుకోరన్నారు. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు తేలే అవకాశం ఉంది. తాను పేద కుటుంబానికి చెందిన వాడినని తన డబ్బులు తనకు తిరిగి వచ్చేలా చూడాలని బ్యాంకు అధికారులను కరుణాకర్ కోరారు.

ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/warner-reenters-ipl-after-a-ban/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *