దక్షిణ భారత బృందాల ఢిల్లీరైతు సంఘీభావ యాత్ర పూర్తి

(ఇఫ్టు ప్రసాద్ సిసి)

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి: నూట ముప్పై మందితో కూడిన మా సౌత్ ఇండియా బృందం తన ఐదు రోజుల ఢిల్లీ-హర్యానా సరిహద్దు పర్యటన ఈ రోజు ఫిబ్రవరి 27న ముగించింది. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయచట్టాలను ఉపసంహరించుకోవాలని అక్కడ ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు, ఉద్యమ స్వరూపాన్ని అధ్యయనం చేసేందుకు ఈ యాత్ర జరిగింది.

23న టెక్రీ బోర్డర్, 24న షాజహాన్ పూర్ బోర్డర్, 25న ఘజీపూర్ బోర్డర్, నిన్న 26న సింఘు బోర్డర్ లను సందర్శించింది. పైన పేర్కొన్న ప్రతిరోజు రాత్రి ఆయా బోర్డర్ల వద్ద రైతాంగ ఉద్యమకారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శాలల (makeshift huts) లో బస చేయడం జరిగింది.

కిసాన్ ఉద్యమకారులతో ముఖాముఖి గా ఇంటరాక్టివ్ బేటీల్ని ఈ ప్రతినిధివర్గంలోని సభ్యులు ఇష్టాగోస్థి పద్ధతుల్లో విస్తృతం గా సాగించారు. ఈరోజు ఉదయంతో సౌత్ ఇండియా డెలిగేషన్ ప్రకటిత లక్ష్యం ముగిసింది.

24న షాజహాన్ పూర్ బోర్డర్ ను సందర్శించి, ఆ రాత్రి అక్కడే బస చేసి, మరునాడు 25వ తేదీ ఉదయం దానికి వీడ్కోలు పలికడానికి కొద్ది ముందు, ప్రముఖ రైతు ఉద్యమ ప్రముఖ నేత యోగేంద్ర యాదవ్ సౌత్ ఇండియా బృందంతో బేటీ అయ్యేందుకు అక్కడకు చేరారు. సౌత్ ఇండియా ప్రతినిధివర్గాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రైతాంగ ఉద్యమ గమనంలో వచ్చే మార్పులు, మలుపుల గూర్చి చెప్పి, సౌత్ ఇండియా లో ఉధృతంగా ఉద్యమ నిర్మాణ ఆవశ్యకతను వివరించారు.

పై బృందం నిన్న 26న సింఘును సందర్శించింది. గతరాత్రి అక్కడే బస చేసింది. దానికి ఈరోజు ఉదయం వీడ్కోలు చెప్పడంతో పాటు, సౌత్ ఇండియా బృంద పర్యటన ఈ రోజుతో ముగుస్తున్నట్లు కూడా లాంఛనంగా ప్రకటించింది. దీనికి ముందు ఒకటి జరిగింది. నేటి ప్రఖ్యాత రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న దర్శన్ పాల్ సింగ్ , మరియు జగ్మోహన్ సింగ్ వగైరా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు సౌత్ ఇండియా ప్రతినిధివర్గాన్ని కలవడానికి వారు బస చేసిన చోటుకు వచ్చారు. ఈ ప్రతినిధివర్గంతో సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా గడిపారు. వారి వెంట రైతు ఉద్యమానికి మరో నాయకురాలైన కురుగంటి కవిత కూడా ఉన్నారు.

దర్శన్ పాల్ సింగ్, జగ్మోహన్ సింగ్ లు చెరొక అరగంట పాటు వర్తమాన రైతాంగ ఉద్యమ రాజకీయ ప్రాధాన్యత, మోడీ ప్రభుత్వ విధానం వంటి అంశాలపై సుదీర్ఘంగా సంభాషించారు. సౌత్ ఇండియా ప్రతినిధుల తక్షణ కర్తవ్యాలను ఉద్దేశించి, సందేశమిచ్చారు.

అనంతరం వారు అక్కడ నుండి నిష్క్రమించే ముందు కర్ణాటక, తెలంగాణ, తమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధుల్లోని సోషల్ మీడియా నిపుణుల నుండి ఒక కోరిక వ్యక్తమైనది. తమ దక్షిణాది రాష్ట్రాల సౌత్ డెలిగేషన్ ను ఉద్దేశించి తాజా రైతాంగ పోరాట వెలుగులో సందేశాన్ని ఇమ్మని దర్శన్ పాల్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. దాని మీద స్పందించిన దర్శన్ పాల్ సింగ్ చివరలో వీడియో ప్రచారార్ధం మళ్లీ 25 నిమిషాల సుదీర్ఘ ఇంటర్వ్యూను ఆంగ్ల భాష లో ఇచ్చారు. (ఆ ఇంటర్వ్యూ ని అనేకమంది మిత్రులు రికార్డ్ చేశారు)

ఈరోజు సౌత్ ఇండియా ప్రతినిధి వర్గాన్ని ఉద్దేశించి దర్శన్ పాల్ ఇచ్చిన సుదీర్ఘ సందేశంలోని ముఖ్యమైన రెండు అంశాలను క్లుప్తంగా మిత్రుల దృష్టికి తెస్తాను.

1 -ఫాసిస్టు ప్రమాదం పెరిగే నేటి సంక్లిష్ట కాలంలో తాజా రైతాంగ పోరాటానికి ప్రాధాన్యత ఉంది. రైతాంగ ఐక్యత, దీక్ష, చైతన్యాలతో పాటు, విబ్భిన్న రైతు సంఘాల మధ్య సువిశాల ఐక్యత కూడా నేటి బలమైన సంఘటిత ఉద్యమానికి ఒక ముఖ్య కారణం. నేటి స్థితిలో ఐక్యత అత్యవసర కర్తవ్యం. విభిన్న సంస్థల మధ్య విభేదాల వల్ల ఈ తరహా విశాల ఐక్యత అసాధ్యమనే భావన గతంలో ఉండేది. అది నిజం కాదని తాజా రైతాంగ ఉద్యమం నేడు స్పష్టంగా నిరూపించింది. ఐక్య కార్యాచరణ విషయంలో మాకు చాలా అనుభవాలు వచ్చాయి. నేటి ఈ రైతాంగ పోరాటంలో సాంప్రదాయ మితవాద శక్తుల నుండి, తీవ్ర వామపక్షవాద శక్తుల వరకూ విశాల రైతాంగ సమస్యల మీద ఒకే త్రాటిపై దృఢంగా నిలబడి పనిచేయ గలుగుతున్నాయి. ఇది గతంలో ఊహకు అందనిది. కానీ అది వాస్తవమని నేడు ఆచరణ నిరూపించింది. సౌత్ ఇండియా ప్రతినిధులకు కూడా మేం ఇదే తరహా సువిశాల ఐక్యతను ఓపికతో సాధించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అది సుదూర స్వప్నం కానే కాదని మా స్వీయ అనుభవంతో చెబుతున్నాము. మీరు ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే సమీప భవిష్యత్తులోనే సువిశాల ఐక్యతను సాధించ గలరు. దాన్ని సుసాధ్యం చేస్తారని ఆశిస్తున్నాము.

2 -బీజేపీ రాజకీయ బలం నేడు చాలా వరకు ప్రచార మాధ్యమాలపై ఆధారపడింది. ఫాసిస్తుల బలం చాలా వరకు ఆధునిక టెక్నాలజీలో దాగి ఉంది. అట్టి సాంకేతిక రంగాన్ని ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులు తరచుగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఈ దేశంలో ఆధునిక విద్యా, విజ్ఞానాల్ని గడించిన యువతను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రత్యేక ఐ.టి. సెల్ ద్వారా పెద్ద నెట్ వర్క్ ని నిర్మించింది. ఈ రంగం మీద వెనకబడి ఉన్నంత కాలం విద్యాధిక యువతను మానసికంగా గెలుచుకోలేము. మా అనుభం కూడా నేడు దాన్ని నిరూపించింది. ఐ.టి. టెక్నాలజీ, అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి రంగాలపై మన కేంద్రీకరణ ఉంటేనే, మనకు విజయం సులువు అవుతుంది. ఇది మా స్వీయ అనుభవం నిరూపించింది. జనవరి 26న రిపబ్లిక్ డే రోజు సంఘటనలపై గోదీ మీడియా నిందా ప్రచారాన్ని, ప్రభుత్వ కుట్రల్ని దేశ ప్రజల ఎదుట అదేరోజు సాయంత్రం కల్లా బహిర్గతపరచడానికి కారణం చాలా వరకు ప్రత్యామ్నాయ ప్రచార వ్యవస్థను మేం కూడా నిర్మాణం చేసుకోవడమే. నేడు రైతాంగ పోరాట బలగాల కంటే వాటికి అండగా నిర్మాణమైన మా ఐటి సమాచార, ప్రచార వ్యవస్థల్ని చూసి, వాళ్ళు నేడు ఎక్కువ భయపడుతున్నారు. అందుకే మీ దక్షిణాది రాష్ట్రాల రైతు ఉద్యమ శక్తులకు కూడా మా స్వానుభవం జ్ఞానంతో ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఫాసిస్టు శక్తుల్ని ఓడించే పోరాటంలో ఐటీ, సాంకేతిక రంగాల్లో కూడా నైపుణ్యాన్ని సాధించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

3 -మీరు ఎక్కడో సుదూరం లోని దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ పోరాటానికి సంఘీభావం ప్రకటించడానికి వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీ కృషిని మరింత తీవ్రతరం చేయండి. ఆలస్యం చేసే సమయం కాదిది. రేపు చేయాల్సిన పనిని ఈరోజే చేసి తీరాల్సిన పరిస్థితి నేడు ఉంది. ఈరోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ప్రాతిపదికను మీరు గుర్తించి మీ కృషిని కోనసాగిస్తే, మూడు నల్ల చట్టాల రద్దుకై సాగే పోరాటం సత్వర విజయం సాధిస్తుంది.

గమనిక :–పైన పేర్కొన్న సౌత్ ఇండియా ప్రతినిధివర్గాన్ని 8-2-2021న బెంగుళూర్ లో జరిగిన ఒక సమావేశం ఖరారు చేసింది. అదే రోజు మరో నిర్ణయం కూడా జరిగింది. రైతాంగ పోరాట నేపథ్యంలో “సౌత్ ఇండియా కన్వెన్షన్” ను ఏర్పాటు చేసి, దానికి సంయుక్త కిసాన్ మోర్చా, AIKSCC ల ప్రముఖ నేతల్ని అతిథులుగా ఆహ్వానించాలని నిర్ణయం చేసింది. అది మార్చి 21వ తేదీన కర్ణాటకలో ఏర్పాటు చేయాలని అఖిల భారత రైతు సంస్థల నేతల సూచనల మీద సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. తేదీలు ఒకట్రెండు రోజులు అటు,ఇటు కూడా మారవచ్చు.

ఏది ఏమైనా, సౌత్ ఇండియా ప్రతినిధివర్గం తన ఐదురోజుల ఢిల్లీ పర్యటనను ఈరోజు విజయవంతంగా ముగించుకున్నది. అఖిల భారత రైతాంగ పోరాట సందేశాన్ని తమ గుండెల నిండా నింపుకొని, అది నేడు తిరుగు ప్రయాణం అవుతోంది. అట్టి సమర సందేశం దక్షిణాది భూముల్లో మొలిచి, మొగ్గ తొడిగి పరిఢవిల్లుతుందని ఆశిద్దాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *