1857కు ముందే బ్రిటిష్ వారిని ఎదిరించిన కర్నూలు నవాబు

భారతదేశానికి  స్వాతంత్య్ర అనే నినాదం పుట్టడానికి ముందే తెల్ల వాళ్ల పెత్తనాన్ని  వ్యతిరేకించి, దాని కోసం జాగీర్ ను సైతం త్యాగం చేసి మరణించిన వారిలో కర్నూలు చివరి నవాబు ఒకరు.

ఈ విషయం అంతగా ప్రచారంలో లేదు.అయితే, దీని మీద చాలా పరిశోధన సాగింది. పుస్తకాలు వచ్చాయి.  “జాన్ కో దేంగే, వతన్ కో బచాయేంగే” అనే నినాదంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వహాబీ ఉద్యమం (1838) మొదలైన సంగతి తెలిసిందే.  ఇందులో కీలక పాత్ర పోషించి,  చివరికి జాగీర్ ను సైతం త్యాగం చేసి ఉద్యమం కోసమే జీవించి మరణించిన  వాడు  కర్నూలు చివరి నవాబు గులాం రసూల్ ఖాన్ (1823-1839). (పూర్తి వివరాలు ట్రెండింగ్ తెలుగు న్యూస్ లో)

బ్రిటిష్ కు వ్యతిరేకంగా కుట్రచేసిన నవాబుగా ఆయన పేరొచ్చింది. దీని మీద చంద్ర మల్లంపల్లి A Muslim Conspiracy in British India (Politics and paranoia in the Early Ninteenth Century Deccan) అనే పేరుతో పుస్తకం కూడా రాశారు.

 

నవాబ్  అలఫ్ ఖాన్ (1792-1815) కు ఆరుగురు కొడుకుల్లో చివరి వాడు గులాం రసూల్‌ ఖాన్. చిన్న కొడుకు  మీద నవాబుకు  అధిక  ప్రేమ  ఉండేది. దాని వల్ల తనకు బదులుగా అతడిని నవాబును చేసేందుకు అంగీకరించమని గవర్నర్ జనరల్  లార్డ్ మింటోను ప్రార్థించారు.
దీని ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం అంగీకరించింది.  గులాం రసూల్ ఖాన్ ను నవాబును చేశారు. అయితే, నవాబుగా ముజఫర్ ఖాన్ అనే మరొక కొడుకే చలామణి అయ్యే వాడు.
క్రీ.శ.1815లో అలఫ్‌ఖాన్ మరణించడంతో కంపెనీ ప్రభుత్వాధికారులు ముజఫర్ ఖాన్‌ని తొలగించి మునవర్ ఖాన్‌అనే ఇంకొకొడుకు  నవాబు చేశారు. ఆ తర్వాతే 1823 సంవత్సరంలో గులాం  రసూల్‌ ఖాన్ నవాబు అయ్యారు.
1857 లో సిపాయిల తిరుగుబాటు పూర్వమే భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి.
 ఆంధ్రప్రదేశ్  కర్నూలు జిల్లాలో 1857కంటే మునుపే మూడు ముఖ్యమైన తిరుగుబాట్లు జరిగాయి.  1801 లో అపుడు కంపెనీ ప్రభుత్వం పెంచిన భూమి శిస్తుకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా పడమర దిక్కున ఉన్న తెర్నేకల్ (Ternekal Rebellion) గ్రామస్తులు  తిరుగుబాటు ముఖ్యమయినది.  ముత్తుకూరు గౌడప్ప నాయకత్వంలో వారు  వీరోచితంగా పోరాడి అసువులు బాసారని చరిత్ర చెబుతోంది.
ఇక, 1823 లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన వహాబి ఉద్యమంలో రసూల్ ఖాన్ చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిష్ వారి అజమాయిషీ వ్యతిరేకించారు. వాళ్లని దేశంనుంచి తరిమేయాలనే  వాదించేవారు. ఈస్టిండియా కంపెనీ తరిమికొట్టేందుకు  సొంతంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు.
తిరుగుబాటు దారులకు ఆయుధాల కోసం  కర్నూలు పట్టణంలో ప్రాంతంలో రహస్యంగా ఆయుధాల కర్మాగారం నెలకొల్పారు.
తన నవాబు ప్రాసాదాలను కూడా ఆయుధ కర్మాగారాలుగా మార్చేశాడు. తుపాకులు, కత్తులు, బాకులు, ఫిరంగులు మందుగుండు తయారు చేయించారు.
 దీనిని బట్టి ఆయన తెల్లవాళ్ల పెత్తానానికి ఎంత వ్యతిరేకియే అర్థమవుతుంది. ఇది ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి తెలిసింది.
బ్రిటిషు వ్యతిరేక ఉద్యమంలో కర్నూలు నవాబు గులాం రసూల్‌ ఖాన్‌, హైదరాబాద్ రాకుమారుడు  ముబారిజ్ ఉద్దౌలాతో చేతులు కలిపారు.
ముబారెజ్ ఉద్దౌలా హైదరాబాద్ నిజాం సికందర్ జా (1803-1829) రెండవ కుమారుడు. దక్షిణ  భారతదేశంలో మొట్టమొదట వహాబీ ఉద్యమంతో ప్రభావితం అయిన వాళ్ళలో ఆయన ఒకరు.
ఆయనకు డబ్బుకు కొదువ లేదు కాబట్టి సుమారు లక్షమందితో ఒక ప్రయివేటు ఆర్మీ తయారు చేసుకున్నాడు. దక్కన్ లో వహాబీ ఉద్యమాన్ని పటిష్టం చేయాలనుకున్నాడు. చివరకు బ్రిటిష్ వాళ్ల వత్తిడితో ఆయనను తండ్రియే అయిదేళ్లు జైలులో పెట్టాడు.
ఒకే లక్ష్యం, దాదాపు సమాన వయసు ఉన్నందున గులామ్ రసూల్ ఖాన్, ముబారెజ్ చేతులు కలిపారు.
కర్నూలు తయారువుతున్న ఆయుధాలకు ఆర్థిక సాయం ముబారెజ్ అందిస్తూ వచ్చారు. వీళ్లిద్దరు కలసి బ్రిటిష్ వాళ్లను తరిమేయగలమన్న ధీమాతో ఉన్నారు.
ముబారెజ్ దేశంలో ఉన్న వహాబీ తిరుగుబాటు దార్లతో సంప్రదింపులు మొదలుపెట్టారు. ఈవిషయం కంపెనీ ప్రభుత్వానికి తెలిసింది.
 కర్నూలు నవాబు, హైదరాబాద్ రాకుమారుడు తిరుగుబాటుకు కుట్ర చేస్తున్నారనే విషయం బ్రిటిష్ వారికి చేరింది. అపుడు హైదరాబాద్ కు రెసిడెంట్ గా ఉన్న జనరల్ ఫ్రేజర్ హైదరాబాద్ నిజాం నసీర్ ఉద్దౌలా తో మాట్లాడి కుట్ర జరుగుతున్నదని నిర్ధారించుకున్నాడు. ముబారెజ్ ను అరెస్టు చేయాల్సిందేనని నిజాం మీద వత్తిడి తెచ్చాడు. చివరకు ముబారెజ్ ను అరెస్టు చేయించాడు.
కుట్ర కోణం మీద సమగ్రమయిన దర్యాప్తు చేసేందుకు  టి.యల్‌ బ్లేన్‌  నాయకత్వంలో ఆరుగురు సభ్యలతో ఒక జ్యుడిషియల్ కమిషన్ నియమించారు.
ఆ విచారణ లో ముబారెజ్, గులామ్ రసూల్ ఖాన్ కలసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు  ‘కుట్ర’ చేస్తున్నట్లు రుజువయింది.
కుట్రకు  ఒక లేఖని సాక్ష్యంగా చూపెట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం మీద యుద్ధం చేసేందుకు అవసరమయిన ఆయుధాలను పంపాలని కర్నూలు నవాబుకు  ముబారెజ్ రాసినట్లు చెబుతున్న లేఖ ఇది.
ఈ లేఖను ఈస్టిండియా కంపెనీ గూఢచారులు పట్టుకున్నారు. చేతి కంకణంలో దూర్చి పంపుతున్న ఈ లేఖ కర్నూలు నవాబుకు చేరి ఉంటే విపత్కర పరిణమాలు ఎదురయ్యేవి (..the results would have been disastrous)అని తన నివేదికలో  కమిషన్ పేర్కొంది.
దీనితో ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కర్నూలు ‘కుట్ర’చేశాడని రుజువయింది.
ముబారెజ్ కు జీవిత ఖైదు విధించారు.  గోల్కొండ కోటలోని   జైలులో బంధించారు.  1854 జూన్ 25న ఆయన గొల్కొండ జైలులోనే మరణించారు.
కర్నూలు నవాబు మీద దాడి
ఇక కర్నూలు నవాబును అదుపులోకి తీసుకునేందుకు 1839 అక్టోబర్‌ 18న ఆంగ్ల సైన్యాధికారి కర్నల్  ఎ.బి.డైయీ (Col A B Dyee) నాయకత్వంలో బళ్లారి నుంచి  ఆంగ్ల సైన్యం కర్నూలు  మీద దాడి చేసింది.
ఇదే విధంగా హైదరాబాద్ నుంచి కూడా సైన్యాన్ని పంపాలని హైదరాబాద్ రెసిడెంట్ జనరల్ ఫ్రేజర్ ను బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది.
హైదరాబాద్ నిజాం సైన్యం, మద్రాసు ప్రభుత్వం సైన్యం రెండు కలసి కర్నూలు చేరుకున్నాయి.
నవాబ్ కుట్ర ఆరోపణలను విచారించేందుకు బ్లేన్ కమిషన్  1839 సెప్టెంబర్ 12న కర్నూలు వచ్చింది.
విచారణకు నవాబు పూర్తి సహకారం అందిచారు. అయితే, మరొక వైపు సైన్యం కర్నూలు ను చుట్టుముట్టడం ఆయనకు నచ్చలేదు.
ఈ విచారణ నామమాత్రమేనని గ్రహించి. తనని శిక్షిస్తారని ఆయన గ్రహించాడు. ఇక యుద్ధమే మార్గం అనుకున్నాడు.
ఆయన కోట వదలి జోహరాపురంలోని హజ్రత్ సయ్యద్ అహ్మద్ షా ఖాద్రి దర్గాకు వచ్చాడు. ఈ లోపు కర్నులు కమిషన్ నవాబు సేకరించిన ఆయుధాలను స్వాదీనం చేసుకుంది.
కర్నల్ డైయీ సైన్యాన్ని  జొహరాపురానికి పంపించి, షరతులు పెట్టి లొంగిపోవాలని చెప్పింది.
తాను విదేశీ ప్రభుత్వాన్ని నమ్మడం లేదని నవాబు ప్రకటించాడు.
అక్టోబర్ 18, 1839న  జొహరాపురం లో జరిగిన యుద్ధంలో నవాబు సైన్యాలు ఓడిపోయాయి. నవాబును అదుపులోకి తీసుకున్నారు. ఆయనను వెంటనే పదవీచ్యుతిని చేసి అదే  రోజునే తిరుచినాపల్లి జైలుకు పంపారు. ఆరోజు కర్నూలు నవాబుల చరిత్ర అంతబమయింది.  రసూల్ ఖాన్   కర్నూలుకు చివరి నవాబు అయ్యారు.  ఆ రోజున కర్నూలు నవాబు రాజ్యం  బ్రిటిష్ వారి ప్రత్యక్షపాలనలోకి వచ్చింది. నవాబు కుంటుబానికి ఏటా రు. 81 వేల పెన్షన్ మంజూరు.
రాజకీయఖైదీగా తిరుచునాపల్లి జైలులో ఉండగా ఆయన ఇస్లాం నుంచి క్రైస్తవానికి ఆకర్షితులయ్యారని చెబుతారు.
అతను క్రమం తప్పకుండా చర్చికి వెళ్తూ క్రైస్తవాభిమాని కావడం సహించలేని ఓ వ్యక్తి 1840 జూలై 12న పొడిచి చంపాడు.
ఆ ఘాతుకానికి పాల్పడిన గులాం రసూల్‌ హంతకుడికి ఉరిశిక్ష పడింది.
నవాబు మృతదేహాన్ని కర్నూలులోని దర్గా హజ్రత్ మౌళ్వీ  మిస్కిన్  ఆవరణలో సమాధి చేశారు.

 

 

Chandamuri Narasimhareddy(చందమూరి నరసింహారెడ్డి,సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *