ఢిల్లీ రైతాంగ ఉద్యమం ‘ఆతిధ్యం’ అమోఘం

(ఇఫ్టూ ప్రసాద్ (పిపి), ఢిల్లీ నుంచి)
ఢిల్లీ హర్యానా సరిహద్దున సాగుతున్న హైవేల దిగ్బంధన ఉద్యమ స్ధలాలలో వెల్లి విరుస్తోన్న ఆతిధ్య భావం అపూర్వమైనది.
ఆ ఉద్యమ సందర్శన కోసం ఎక్కడి నుండి ఎవరు వచ్చినా, అక్కడ వారికి ఆకలి, దప్పులకు లోటు లేదు. ఉదాహరణకు పొద్దున్నే పళ్ళు తోముకోవడానికి టూత్ బ్రష్, పళ్ళ పుల్లల నుండి, అక్కడే రాత్రి బస చేసే ఆసక్తి ఉన్న వాళ్లకి చలి దుప్పట్ల సరఫరా వరకూ అక్కడ లభ్యం కావడం విశేషం. బ్రష్, పేస్టు ల నుండి రగ్గులు, రజాయ్ ల వరకూ సరఫరా చేస్తారంటే, నిద్ర లేచిన నుండి తిరిగి నిద్రపోయేంత వరకూ అవసరాలన్నీ అక్కడ సాధ్యమౌతాయనేది అర్ధం.
ఆహార పానీయాల విషయానికి వస్తే, రోటీ, చపాతీ, బ్రెడ్డులు, అన్నం (చావల్), పూరీ, పకోడీ,  పాయసం, టీ, కాఫీ, ఫ్రూట్ జ్యూస్, డ్రింకులు, చేరుకురసం వగైరాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. శనక్కాయలు, మూంగ్ దాల్ ప్యాకెట్లు, బిస్కట్ ప్యాకెట్లు, అరటి పండ్లు, కమల కాయలు, ఆపిల్, ఫైన్ ఆపిల్ వగైరాలు కూడా ఉచిత పంపిణీ చేస్తున్నారు.
ఇంకా కోవా, లడ్డు, బాదుషా, సేమియా, జిలేబి, సున్నుండలు వంటి రకరకాల స్వీట్ల పంపిణీ ఉంది. వీటిని వాలంటీర్లు పంపిణీ చేస్తారు. దేని మీద అభిరుచి ఉన్న వాళ్ళు దాన్ని తృప్తి తీరా తినవచ్చు, త్రాగ వచ్చు. అవే కాకుండా ప్రత్యేక సందర్భాలు లేదా సమయాల్లో రగ్గులు, మఫ్లర్లు, శాలువాలు వగైరా చలి దుప్పట్ల ఉచిత పంపిణీ  చేస్తారు. సాక్స్, గ్లవుజులు, టవల్స్ కూడా పంపిణీ చేస్తారు. పంటికి బ్రష్, పుల్ల, పేస్టు, నెత్తికి సాంపు, నూనె; వంటికి సబ్బు,  దువ్వెనలు ఇస్తున్నారు. వాషింగ్ మెషీన్లు ఒకరు తెస్తే, చుట్టుపట్ల ట్రాక్టర్ల జనానికి కూడా సాయం చేసిన దృశ్యాల్ని చూసాం. ఉచిత హెయిర్ కట్టింగ్ సెలూన్ల వద్దకు ఎవరు వెళ్లినా క్యూ లో నిలబడి గడ్డం, హెయిర్ కట్టింగ్ చేసుకోవచ్చు.
     భోజన కేంద్రాలు హైవే మీద  ఒక్క చోట, రెండు చోట్ల లేవు. ముట్టడి సాగే హైవేల మీద ముట్టడి పొడవునా, యాబై లేదా వంద మీటర్లకొక చోట  భోజన వసతి ఉంటుంది. అదే స్థలంలో రోడ్డు పక్కన వంట శాలలు (కిచెన్లు) ఉంటాయి. గ్యాస్ సిలెండర్లతో పాటు, వంటచెరకు ప్రత్యేక ట్రక్కుల్లో గ్రామీణ ప్రాంతాల నుండి రవాణా అవుతోంది. ఆకు కూరలు, కూరగాయలు కూడా ట్రక్కుల్లో వస్తోన్న స్థితి ఉంది.  రోడ్డే డైనింగ్ హాల్స్.  ఎవరైనా నేలపై కూర్చొని తినాల్సిందే. కూర్చోవడానికి కొన్ని చోట్ల పట్టాలు వేస్తారు. కొన్ని చోట్ల అవి ఉండవు. ఐనా ఎవరూ బేషజానికి గురి కాకుండా వినయంగా విస్తరి తీసుకొని,  కింద కూర్చుని తినే దృశ్యాల్ని చూడవచ్చు.

      ఉదాహరణకు సింఘు బోర్డర్ పాయింట్ వద్ద హైవే పై ముట్టడి పది కిలో మీటర్లకు పైగా పొడవు ఉంది. ఆరు లైన్ల విశాలమైన హైవే పై ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి వాటిలోనూ లేదా వాటి మధ్య నేల మీద జనం కూర్చొని రైతు నాయకుల నిరంతర సభా ప్రసంగాల్ని ఆలకిస్తుంటారు.
      ప్రధాన సభా వేదిక బోర్డర్ ముఖద్వారం వద్ద ఉంది. తమతమ ట్రాక్టర్లని వదిలేసి అందరూ ముఖద్వారం వద్ద సభావేదిక వద్దకు రావడం సాధ్యం కాదు. ప్రతి ట్రాక్టర్ కు చెందిన కొందరు తమ స్వంత వాహనాల వద్ద ఉండి, మైకుల్లో ప్రసంగాల్ని వింటుంటే, మరి కొందరేసి ప్రధాన సభా వేదిక వద్దకు వచ్చి నేతల ఎదుట కూర్చొని ఆలకిస్తుంటారు. తమతమ వాహనాల వద్ద వుంటూ ప్రసంగాలు వినే రైతుల కోసం హైవే పొడవునా దారి పక్క కరంటు స్తంభాలపై మైకుల బాకాలు కట్టారు. ముఖద్వారం వద్ద గల ప్రధాన సభావేదికతో పాటు అర కిలో మీటర్ లేదా కిలో మీటరకు ఒకచోట సభా వేదికల నిర్మాణం జరిగింది. ఆయా ఉపసభా వేదికల వద్ద కూడా రోజంతా వక్తల ప్రసంగాలు చేస్తున్నారు.
     పై సింఘు హైవే వెడల్పును మిత్రులు ఊహించుకోవడానికి సౌలభ్యంగా ఒక ఉదాహరణ ఇస్తాం. ఒకదాని పక్కన మరో ట్రాక్టర్ పేర్చిన చోట, రోడ్డు మీద మొత్తం వరసగా ఏడు ట్రాక్టర్లు అమర్చబడి ఉన్నాయి. అలా పేర్చిన దృశ్యాన్ని మా బృందం  స్వయంగా చూసి చెబుతోంది.
      నిజానికి ప్రతి ట్రాక్టర్ కు చెందిన రైతులు దాని పక్కన ఒక టెంట్ వేసుకొని నెల మీద  పట్టాలు పరుచుకొని కూర్చొని పగటి సమయంలో ప్రసంగాలు వింటూ కాలక్షేపం చేస్తున్నారు. రాత్రికి ట్రాక్టర్లలో నిద్రిస్తారు.  (గడ్డ కట్టే చలి తీవ్రత నుండి  కాపాడే విధంగా రైతులు తమ ట్రాక్టర్లను  గూడు బండ్లుగా మలిచిన తీరు చిత్రంగా ఉంది)
       సింఘు బోర్డర్ నుండి వెనక్కి హైవే మీద పది కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరం ఈ బైఠాయింపు ఉంది. ఎంత దూరం నడిచినా రోడ్డు మొత్తం బైఠాయింపు కనిపిస్తుంది. పైన పేర్కొన్న భోజన శాలలు, వంట టెంట్లు, టీ స్టాల్స్, పైన పేర్కొన్న అన్నీ బైఠాయింపు పొడవునా హైవే పై ఎక్కడికక్కడ మనకి కనిపిస్తాయి. మొదటిసారి చూసే సందర్శకులకు ఓ వింత అనుభూతి కలుగుతుంది.
     స్వయంగా అక్కడకు వచ్చి, ప్రత్యక్షంగా కళ్ళతో చూడలేని మిత్రులకు ఆ బైఠాయింపు యొక్క వాస్తవ స్థితిని అర్ధం చేసుకోవడానికి ఇన్ని వివరాల్ని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుటకే సోషల్ మీడియా ద్వారా తెలిసిన మిత్రుల్ని విసిగిస్తే, మన్నించ గలరు. అసలు విషయం ఏమిటంటే, ఈ పది కిలో మీటర్ల పొడవునా, పైన పేర్కొన్న ఆహార, పానీయాలు, వగైరా ఆతిధ్య కార్యక్రమాలు పగటి సమయాలలో నిత్యం నిరంతరంగా కొనసాగుతూనే ఉండటం.
       ఈ మధ్యలోనే ఉచిత వైద్య శిబిరాలు (మెడికల్ క్యాoపులు) ఉంటాయి. ఢిల్లీ ప్రోగ్రెసివ్ మెడికోస్ ఫోరమ్ కు చెందిన వైద్యులు పెట్టినవి వీటి లో కీలక పాత్ర పోషించడం గమనార్హం. ఈ వైద్య శిబిరాల లో వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తారు. మందులతో పాటు రక్త, మల, మూత్ర పరీక్షలు, ఇంకా గుండె, కంటి వంటి పరీక్షలు కూడా చేస్తున్నారు. అంతే కాక, నడుం నొప్పి, కండరాల నొప్పి, మెడ నొప్పి వంటి వాటికి ఉపశమనం కలిగించే నడుం పట్టీ, మెడ పట్టీ వంటివి కూడా ఇస్తున్నారు. ఇవి కొంత విస్మయం కలిగించేవే.
   ఇక్కడ ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. పైన పేర్కొన్న ఆహార, పానీయాల వసతులు అక్కడ ఉన్నాయంటే, కొందరు వాటిని నెగిటివ్ గా తీసుకోవచ్చు. తమ స్వంత ఇళ్లల్లో అనుభవించిన ఆహార వసతుల్ని కలిగిన రైతులకు హైవేల ముట్టడిలో సౌకర్యయుతంగానే వుండి వుండొచ్చనే అపోహ ఎవరికైనా కలగవచ్చు. అది నిజం కాదు. దీనికి నాలుగు వివరణల్ని ఈ క్రింద ఇస్తున్నాము.
   మొదటిది, హైవే దిగ్బంధనం కోసం తమ ఊరు వదిలి ఢిల్లీ చేరిన ఏ ఒక్కరైతు కూడా తిరిగి క్షేమంగా ఇంటికి వస్తామనే ఆశ తో రాలేదు. వారు త్యాగనిరతికి మానసికంగా సంసిదద్దులై ఢిల్లీ వచ్చారు. ఈ తిండి, తిప్పల మీద దృష్టి లేకుండా ఢిల్లీకి చేరడం గమనార్హం. రెండవది, మోడీ ప్రభుత్వం ఢిల్లీకి రైతుల్ని రానివ్వకుండా అడ్డుకున్నదనీ, ఐనా తమ ఊరి నుండి డిల్లీ చేరిన రైతులు మడమ తిప్పని పోరాట చైతన్యంతో చలిలోనే ముట్టడికి దిగారని తెల్సిన తర్వాత గ్రామీణ ప్రాంతాలు అట్టుడికి పోయాయి. ఢిల్లీ రాకుండా గ్రామాల్లో మిగిలి పోయిన గ్రామస్తుల్లో కసి పెరిగి, పైన పేర్కొన్న ఆహార పదార్థాల్ని వండించి ముట్టడి చోటుకు పంపించడం గమనార్హం. మూడోది, ముట్టడిలో రైతులు రాత్రివేళలలో అనుభవించే గడ్డకట్టే చలితో పోల్చితే, ఇలాంటి ఆహార వసతులు లెక్కలోకి రావు. నాల్గవది, బయటి నుండి వచ్చే మా వంటి సందర్శకులలో ఉన్నంత భోజన ప్రియత్వం వాస్తవ ముట్టడి దార్ల లో మాకు కనిపించలేదు. రైతు నేతల ప్రసంగాలు వినడం మీద ప్రదర్శించే శ్రద్దాసక్తులు, తిండి మీద వారికి లేవు. అందుకే పైన పేర్కొన్న ఆహార వసతుల గూర్చి విని అపోహలకు గురై, పొరపాటున కూడా రైతు ఉద్యమకారుల ముట్టడి సవ్యంగా సాగుతుందని భావించారాదు.
    సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే ప్రగతిశీల, లౌకిక,  అభ్యుదయ శక్తులకు, శ్రేణులకు విస్తృతంగా తెలిసి పోయిన ఈ విషయాల గూర్చి నిజానికి మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలని మేము అనుకోవడం లేదు. ఐతే వీటి కారణంగా ముట్టడి స్ధలాలలో వెల్లి విరుస్తోన్న ఆత్మీయతతో కూడిన ఒక నూతన ఉద్యమ  సంస్కృతి రూపొందుతోంది. దాన్ని గూర్చి చెప్పడం మా బృందం యొక్క ఉద్దేశ్యం. అది మిత్రులకు సరిగ్గా అర్ధం చేయించాలంటే, పై విషయాల పట్ల ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇందులో చాలా భాగం కొందరు మిత్రులకు పునచ్చరణ కావచ్చు. కొందరు మిత్రులకు మొత్తం కూడా తెల్సి ఉండొచ్చు. ఆ మిత్రులు చర్విత చరణంగా భావించితే, మా విచారం వ్యక్తం చేస్తున్నాము. ఇప్పుడు అసలు చెప్పాలనుకున్న విషయంలోకి వస్తాము.
     పై ఆతిధ్య సేవలు భారీ స్థాయిలో సాగుతున్నాయి. ఈ సేవా ప్రక్రియ కోట్ల రూపాయల ధనంతో కూడినది. కేవలం ఒక్క సింఘులోనే ఇలాంటి ఆతిధ్య సేవకు కోసం రోజుకు కనీసం ₹కోటి నుండి ₹రెండుకోట్ల ఖర్చు కావచ్చు. ఇదెలా సాధ్యం? ఇది ఎవరికైనా సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిపై     మా ప్రాధమిక పరిశీలనలో కొన్ని వాస్తవాలని గ్రహించ గలిగాం. అవి సమగ్ర పరిశీలన చేసి నిర్ధారణ చేసుకున్నవి కాదని ముందుగా మిత్రులకు స్పష్టం చేస్తున్నాము. మా గ్రహింపు ప్రకారం  వచ్చిన అభిప్రాయాల్ని క్రింద తెలియ జేస్తున్నాము.
     ఆహార, పానీయ, వస్తు పరంగా జరిగే ఈ వితరణ లేదా దాతృత్వ సేవా కార్యక్రమాలకు అవసరమైన భారీ సాయం పొందే వనరులు ఈ కింది విధాలుగా సాగుతుందని మా ప్రాధమిక భావన కలిగింది.
 1-స్వయంగా రైతాంగం నుండి కింది రూపాల్లో సాయం ఇలా:–
    A-తమ కోసం తాము ఇంటి వద్ద వండించుకొని తెచ్చిన వంటలు, పిండివంటలు, ఇతర నిల్వ ఆహార పదార్ధాల నుండి తాము తింటూనే, ఇతరులకు సాయం చేసేవి.
    B-పరిస్కారం కానందున ముట్టడి పొడగింపు జరిగే నేపథ్యంలో వారి ఇళ్ల  నుండి కొత్తగా మిగులుతో వండి పంపించే పాదార్ధాల నుండి ఇతరులకు పంపిణీ.
     C-ఆయా గ్రామాల నుండి బైఠాయింపుకు వచ్చిన వారు తమ తమ గ్రామాలలో మిగిలిన తమబంధు, మిత్రులకి కూడా సూచించి, తమ గ్రామం తరపున సమిష్టి నిధి సేకరణ చేయించి, లేదా గ్రామ సాముదాయక నిధి ద్వారా వంటలు వండించి, ఒక ప్రత్యేక వాహనంతో వంటల్ని తెప్పించి పంపిణీ చేయించడం.
     D-రైతు కుటుంబాల నుండి చదివి ఉద్యోగులుగా మారిన విద్యాధిక మిత్రుల నుండి తమ తరపున ప్రత్యేకంగా వివిధ రకాల పిండి వంటల్ని వండించి లేదా కొని వాటిని స్వయంగా  ముట్టడి వద్దకి వాహనాల్లో  తేవడం లేదా పంపడం కూడా ఒక ప్రబల ధోరణిగా ఉంది.
  2-రైతు మిత్ర వర్గాల నుండి అందుతోన్న ఆతిధ్య పాదార్థిక సాయం యొక్క సరళి ఇలా:–
          A-గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వర్తక, వ్యాపార వర్గాల నుండి,  వ్యవసాయేతర వృత్తిదార్ల నుండి అందే సంఘీభావ పాదార్థిక ఆతిధ్య సేవలు
          B-రైతు కుటుంబాల నుండి పట్టణ ప్రాంతాలకు (ముఖ్యంగా ఢిల్లీ) వలస వచ్చి ఏదో ఒక శ్రమవృత్తిలో స్థిరపడ్డ అర్బన్ శ్రామికవర్గం నుండి అందే పాదార్థిక సాయం.
         C-రైతు ఉద్యమానికి ప్రేరేపితులై రాజకీయ లేదా మానసిక ఆదరణతో రాజకీయ బృందాలు, ప్రజాతంత్ర శక్తులు అందించే పాదార్థిక సాయం.
        D-రైతు కుటుంబాల నుండి ఎదిగి, విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే యువత తమ మూలవాసీ అనుబంధం (AS SONS & DOUGHTERS OF SOIL) తో పంపించే ఆర్ధిక నిధులతో చేసే సాయం.
3-మోడీ ప్రభుత్వం పట్ల రాజకీయ వ్యతిరేకత గల శక్తుల నుండి అందే సాయం ఇలా:–
       A-ప్రతిపక్షాల నుండి లేదా వాటి ప్రేరణతో నిర్దిష్ట రాజకీయ బృందాల నుండి అందే సాయం
      B-స్వచ్చంధ సంస్థల (NGO) నుండి అందే సాయం.
4-కాపీటలిస్టు వర్గంలో వైరుధ్యాల ఫలితంగా:–
అంబానీ, ఆదానీ వంటి బడా కార్పొరేట్ సంస్థల పట్ల మోడీ ప్రభుత్వ ప్రత్యేక అనుకూల చర్యలు తెల్సిందే. దానివల్ల కాపీటలిస్టు వర్గంలోనే పెరిగే అంతర్గత వైరుధ్యాలు కూడా తెల్సిందే. ఫలితంగా అట్టి అసమ్మతి పెట్టుబడిదార్లు కూడా తమ అవసరం కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకో వచ్చునేమో! మేము సేకరించిన సమాచారం మాత్రం దీనికి ఆధారం కాదు. ఇది కేవలం ఊహాజనిత భావన మాత్రమే. చరిత్రగమనం పట్ల అవగాహన, అంచనాల్ని బట్టి ఊహాజనిత అంశంగా పేర్కొంటున్నది. ఈ కోణంలో కూడా ఒకవేళ పై సాయంలో కొంత భాగం అంది వున్నా, అది రైతాంగ ఉద్యమ తక్షణ లక్ష్యాలకు ఉఒకరించే అంశంగానే ప్రాధమికంగా భావించాల్సి ఉండొచ్చు.
       పైన పేర్కొన్న నాలుగు కోవల్ని (categiries) క్లుప్తంగా సింహావలోకనం చేద్దాం. మొదటి కోవలోని , A, B, C, D ఉపకోవల (sub categiries) నుండి అందే మొత్తం సాయం స్థూలంగా రైతులదే. రెండవ కోవలో కూడా తిరిగి A, B, C, D ఉపకోవల సాయం ఉంది. ఇది స్వయంగా రైతులది కాక పోవచ్చు. కానీ రైతుల మిత్ర వర్గాల నుండి అందే సాయమే. అందులో A-ఉపకోవలోని సాయం గ్రామస్థాయి మిత్ర వర్గాల నుండి అందేది. ఇకపోతే ప్రధానంగా B-ఉపకోవలోకి వచ్చే సాయం కార్మిక కర్షక మైత్రీ బంధంతో కూడింది. అది రైతు ఉద్యమం పట్ల సుస్థిరమైన సాయం. C-ఉపకోవ ప్రజాతంత్ర బంధంతో కూడింది. D-ఉపకోవ లో అందే సాయం కూడా రైతు రక్తసంబంధంతో కూడింది. స్థూలంగా ఇవన్నీ రైతుకు విశ్వసనీయ వర్గాలు లేదా రైతాంగ అనుకూల ప్రజా సమూహాల నుండి అందే సానికూల సాయం మాత్రమే.
       మూడో కోవలోని సాయం తాజా రైతాంగ ఉద్యమానికి వాస్తవ విశ్వసనీయమైనది కాదు. ఆ కోవలో A-ఉపకోవ సాయం రాజకీయ అవసరాల కోసం రైతాంగ ఉద్యమానికి అందించేది. B-ఉపకోవలోని సాయం వెనక కూడా ఇతర ప్రయోజనాలు ఉండొచ్చు.
    నాల్గవ కోవలోని సాయం ఉందొ లేదో తెలిసి చెప్పింది కాదు. ఒకవేళ అటీ సాయం ఒకింత అంది ఉంటే కూడా, అది పెట్టుబడిదారుల మధ్య అంతర్గత వైరుధ్య ఫలితమే అవుతుంది. వారితో రైతులు చేతులు కలిపి పొందేది కాదు.
       సింఘు, టెక్రీ ముట్టడి ఉద్యమకారులకు చేసే సాయం లో శిక్ఖు మతముద్ర బలంగా ఉంది. ముఖ్యంగా కెనడా, అమెరికా లలో లక్షల మంది ప్రవాస శిక్ఖు మతస్తుల నుండి  భారీ సాయం అందుతున్నట్లు మా బృందానికి బోధపడింది. ఐతే ఇదంతా మతముద్రతో జరిగే సాయం కాకపోవచ్చు. అందులో ఒకభాగం పై మత ముద్ర ఉంటుంది. మరో భాగం పై మూలవాసి (sons of soil) ముద్ర కూడా ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ఎంత శాతమో చెప్పగలిగేది మేము కాదు. అది సూక్ష్మ పరిశీలన చేయకుండా మూడు రోజుల సందర్శనలో చెప్పగలిగేది కాదు.
    సింఘు, టెక్రీ ల వద్ద సాయం లో శిక్ఖు మత ముద్ర అత్యంత బలంగా ఉన్న మాట నిజమే. ఐతే అదే నిర్ణయాత్మక స్థాయి లో లేదని భావిస్తున్నాం. ఈ భావనకు మేము రావడానికి ఓ కారణం ఉంది. మూడో హైవే ఘజీపూర్ ముట్టడి వద్ద మరో నేపధ్యం ఉంది. ప్రధానంగా అక్కడి రైతులు హిందువులే. హిందూ మత సంస్థల నుండి శిక్ఖు సంస్థల నుండి అందినట్లు హిందూ మత సంస్థల నుండి ఘజీపూర్ బోర్డర్ ముట్టడి వద్ద  సాయం అందడం లేదు. ఐనా ఆహార, పానీయాలతో సహా మిగిలిన అన్ని రకాల వస్తు, పాదార్థిక సాయాలలో పెద్దగా తేడా లేదు. సింఘు, టెక్రీ లతో పోల్చితే ఆతిధ్య సేవలు ఘజీపూర్ లో గుణాత్మక తేడాలు లేవు. ఉంటే, గింటే పరిమాణాత్మక తేడా మాత్రమే ఉంది. అందుకే శిక్ఖు మత ముద్ర నిర్ణయాత్మకం కాదనీ, అదో ఆదనవు ప్రోత్సాహక అంశంగానే ఉండొచ్చని మా బృందానికి ప్రాధమిక అభిప్రాయం కలిగింది.
        ఈ ఆతిధ్య సేవలు, సాయాల నుండి అక్కడ రైతు ఉద్యమంలో ఏర్పడే ఓ ముఖ్య పరిణామం గూర్చి గట్టిగా నొక్కి  చెప్పాలని భావిస్తున్నాం. అదే కుల, మత, ప్రాంత, లింగ బేధాలకు అతీతమైన ఒక లౌకిక సంస్కృతిని నేటి ఆతిధ్య  ప్రక్రియ పెంపొందిస్తుంది. అది మనుషుల మధ్య  ఆత్మీయ అనుబంధాన్ని పెంపిందిస్తుంది. పోరాట బంధాన్ని బలోపేతం చేస్తుంది.  సేవా భావాన్ని పెంపొందిస్తుంది. ఇంతవరకు ఉనికిలోని రైతు దృక్కోణాన్ని విశాలీకరిస్తుంది. రైతు ఉద్యమ కారుల మధ్య ప్రాంతాతర, రాష్ట్రాoతర పరిచయాలు పెరిగి, మానసిక బంధుత్వాన్ని పెంపొందిస్తుంది. కులాంతర, మతాంతర సంబంధాల్ని కూడా ఏదో మేరకు బలపరుస్తుంది.
అతిథులకు ఆతిధ్య సేవల్ని వడ్డించడంలో వాలంటీర్ల సంఖ్య వందలు దాటి వేలకు చేరుతుందంటే కూడా ఆశ్చర్యం ఉండదు. వారు చిరునవ్వులతో అతిధి లోకాన్ని ఆదరిస్తోన్న తీరు అద్భుతమైనది. ఇవన్నీ ఒక మానవీయ సంస్కృతిని పెంపొందిస్తుంది. ఆచరణలో అది బడా కార్పొరేట్ శక్తులపై పోరాట బావుటా ఎగుర వేసిన రైతాంగ ప్రతిఘటనా పంథాకు మానసిక, రాజకీయ, నైతిక బలాల్ని ఇస్తుందని మాబృందం భావిస్తోంది. అది తక్కువ స్థాయిలోనే ఉండొచ్చు. కానీ దాని ప్రభావం ఉద్యమ గమనాన్ని ఏదో మేరకు సహకరిస్తుంది.
ఈ ఆతిధ్య సేవలు కేవలం తాత్కాలికంగా సందర్శకుల భౌతిక ఆకలి దప్పుల్ని తీర్చడానికే పరిమితం కావు. ఇవి ఒకనూతన ఉద్యమ సంస్కృతిని కూడా నెలకొల్పి, రాజకీయ ఉద్యమ గమనంలో ఉత్ప్రేరకంగా ఉంటుందని భావిస్తున్నాం. భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా ఆదర్శ రైతాంగ, ఇతర పీడిత, తాడిత, శ్రామిక వర్గాలు చేపట్టే వినూత్న ఉద్యమాల నిర్మాణానికి కూడా ఉద్యమ స్ఫూర్తిని అందిస్తుందని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *