భూమన్ ప్రసంగాలకు వశీకరణ శక్తేదో వుండేది…(తిరుప‌తి జ్ఞాప‌కాలు -25)

(భూమన్ అనే తేలిక పాటి ఈ మూడక్షరాలు ఇపుడు ప్రకృతి ప్రేమకు ప్రతీక. ఒకపుడు విప్లవాగ్ని. వామపక్ష ఉద్యమం అందించిన గొప్ప వక్తల్లో భూమన్ ఒకరు. ఆయన గంభీరోపన్యాసం 1977 నుంచి 85 మధ్యలో యువకులకు విద్యార్థులకు గొప్పప్రేరణ.  వశీకరణ శక్తేదో ఆయన మాటల్లో ఉందా అనిపించేది. ఈ  వారం రాఘవశర్మ తిరుపతికి చెందిన రాయలసీమ మేధావి భూమన్ గురించిన పరిచయం అందిస్తున్నారు.) 

 

(రాఘ‌వ శ‌ర్మ‌)

కౌమార ద‌శ‌లో సూర్యోపాస‌కుడు. య‌వ్వ‌నంలో విప్ల‌వ సాహిత్య‌కారుడు. న‌డివ‌య‌సులో రాయ‌ల‌సీమ గురించి కంచు గంటలా మోగిన గొంతు.

ముంచుకొస్తున్న వార్ధ‌క్యాన్ని నిలువ‌రించి, కొండ‌లు, గుట్ట‌లు ఎక్కుతూ, లోతైన లోయ‌ల్లోకి దిగుతూ, నీటి మ‌డుగుల్లోకి దూకుతూ, వాటి అంతు చూస్తూ, ఇప్పుడు ప్ర‌కృతితో మ‌మేక‌మ‌య్యే ట్రెక్క‌ర్‌. ఆయ‌నే ఒక‌నాటి మాట‌ల విస్పోట‌నం భూమ‌న్‌.

భూమ‌న్‌ను తొలిసారిగా చ‌లం సాహిత్య స‌భ‌(1979)లో చూశాను. కాస్త పొట్టిగా, బ‌లంగా, స‌న్న‌ని గ‌డ్డంతో క‌నిపించేవారు.

ఖంగున మోగే గొంతుతో ఉప‌న్య‌సించే వారు.  కాలేజీలో ఆయ‌న చెప్పే పాఠ‌మంటే విద్యార్థుల‌కు అమితాస‌క్తి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో న‌క్స‌ల్‌బ‌రీ ఉద్య‌మంపై ప‌రిశోధ‌క విద్యార్థిగా న‌ల‌భై రెండేళ్ళ క్రితం ప్రొఫెస‌ర్ సుబ్బారావు ఇంట్లో నాకు ప‌రిచ‌యమ‌య్యారు. ఆ ప‌రిచ‌యమే స్నేహంగా ఈ నాటికీ కొన‌సాగుతోంది.

డిగ్రీ చ‌దివే రోజుల్లోనే భూమ‌న్ పై శ‌ర‌త్‌ ర‌చ‌న‌ల ప్ర‌భావం ప‌డింది. సూర్యోపాస‌న నుంచి బైట‌ప‌డి, ఆలోచించ‌డం మొద‌లు పెట్టారు.

చ‌లం అన్నా, చ‌లం ర‌చ‌న‌ల‌న్నా ఆయ‌న‌కు అంతులేని అభిమానం. చ‌లాన్ని చూడాల‌ని టికెట్టు లేకుండా ప్యాసింజ‌ర్ రైలెక్కి తిరుమ‌ణ్ణామ‌లైవెళ్ళారు. చ‌లంతో నెల‌రోజులు గ‌డిపారు.అక్క‌డే సొంతంగా ఆలోచించ‌డం నేర్చుకున్నారు.

శ్రీకాకుళం లో రైతాంగ ఉద్య‌మం ఊపందుకున్న రోజుల‌వి.  న‌క్స‌లిజం వైపు మొగ్గు చూపారు. ప‌రిచ‌య‌మైన ఒక వ్య‌క్తితో శ్రీ‌కాకుళం వెళ్ళిపోవాల‌నుకున్నారు. ఆ సమ‌యంలోనే పంచాది కృష్ణ‌మూర్తి, సుబ్బారావు పాణి్గ్రాహి ల‌ను పోలీసులు చంపేశారు. దాంతో భూమ‌న్ శ్రీ‌కాకుళ ప‌య‌నం ఆగిపోయింది.

రెండ‌వ సారి మిత్రుల‌తో క‌లిసి మ‌ళ్ళీ ర‌మ‌ణాశ్ర‌మానికి వెళ్ళారు. “నేను న‌క్స‌లైట్‌గా మారాను. మీ ద‌గ్గ‌ర‌కు ఇక రాను ” అని అమాయ‌కంగా చ‌లానికి చెప్పేశారు.

” నా ద‌గ్గ‌ర‌కు క‌మ్యూనిస్టులు, న‌క్స‌లైట్లు కూడా వ‌స్తుంటారు. ఎవ‌రైనా రావ‌చ్చు. నక్సలైట్ అయినా నువ్వు కూడా రావచ్చు ” అని చెలం న‌వ్వుతూ అన్నారు.

కానీ, మ‌ళ్ళీ చ‌లం ద‌గ్గ‌ర‌కు వెళ్ళ లేక‌పోయారు. ఎంఏ చ‌దివే రోజుల్లో త్రిపుర‌నేని మ‌ధుసూద‌న రావుతో ప‌రిచ‌యం భూమ‌న్ జీవిత గ‌మ‌నాన్నే మార్చేసింది.

త్రిపుర‌నేని మార్గ‌ద‌ర్శ‌కత్వంలో ఏర్ప‌డిన ప‌న్నెండు మంది ‘లే‘ క‌వుల్లో భూమ‌న్‌ ఒక‌రు. భూమన సుబ్రమణ్యం రెడ్డి అన్న అసలు పేరు లోని భూమన్ అన్న ఇంటి పేరును మాత్రం మిగుల్చుకున్నారు.ఆ పేరుతో నే రచనలు చేయడం, అందరూ పిలవడం పరిపాటి అయ్యింది.

ప్ర‌భుత్వం ‘ లే ‘ ని నిషేధించింది. నిషేధానికి గురైన రెండ‌వ క‌వితా సంక‌ల‌నం ‘ లే’ త్రిపుర‌నేని మ‌ధుసూద‌న రావుతో స్నేహం.విర‌సంలో చేరిక‌. కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా ఎన్నిక‌. ఆనాటి విప్లవ రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో ఒక‌దాని వెంట ఒక‌టిగా జ‌రిగిపోయాయి.

వయసులో తనకంటే చాలా పెద్ద వాళ్లైన కేవీయార్, కొండపల్లి సీతారామయ్య లాంటి వారితో పరిచయాలు. ఎమ‌ర్జెన్సీలో అరెస్టై 18 నెల‌లు ముషీరాబాద్ జైల్లో గ‌డిపారు. జైల్లోనే సైద్ధాంతిక చ‌ర్చ‌లు! సైద్ధాంతిక విభేదాలు!

వ‌ర్గ శ‌త్రు నిర్మూల‌న‌ను భూమ‌న్ వ్య‌తిరేకించారు. జైలు నుంచి విడుద‌ల అయ్యాక‌ విర‌సం నుంచి బైటికి వ‌చ్చేశారు. ఎమ‌ర్జెన్సీలో చాలా మందిని ఉద్యోగం నుంచి స‌స్పెండ్ చేస్తే, భూమ‌న్‌ను డిస్మిస్ చేశారు.అతి క‌ష్టంపైన మ‌ళ్ళీ ఉద్యోగం సంపాదించుకున్నారు.

ఎమ‌ర్జెన్సీ ఎత్తివేశాక జ‌మ్మ‌లమ‌డుగులో ఎన్‌సీసీ తుపాకులను ఎవ‌రో ఎత్తుకెళ్ళార‌ని భూమ‌న్ ను మ‌ళ్ళీ అరెస్టు చేశారు. వ‌ర్గశ‌త్రు నిర్మూల‌న‌పై విర‌సంతో విభేదించి బైటికి వ‌చ్చేసిన వారితో స్నేహం మొద‌లైంది.

జ్వాలాముఖి, నిఖిలేశ్వ‌ర్‌, రంగ‌నాయ‌క‌మ్మ‌, ఓల్గా, ర‌విబాబు, జ‌తిన్, భూమ‌న్ త‌దిత‌రులంద‌రితో క‌ల‌సి జ‌న‌సాహితీ సాంస్కృతిక స‌మాఖ్య ఏర్ప‌డింది. కొంత కాలానికి చ‌లం మ‌ర‌ణం.

తిరుప‌తిలో ఏర్పాటు చేసిన చ‌లం సాహిత్య స‌భ‌లో తొలిసారిగా భూమ‌న్‌ను చూశాను. నాకు ప‌రిచ‌య‌మ‌య్యే నాటికే భూమ‌న్ మంచి వ‌క్త‌గా ప్ర‌సిద్ధులు.

ఎస్వీ యూనివ‌ర్సిటీ ఈ బ్లాక్ హాస్ట‌ల్ 32వ నెంబ‌రు గ‌ది లో ఏ ఎన్ నాగేశ్వర్ రావు ఉండేవారు. డీఎస్‌వో స‌మావేశాలు అక్కడే జరిగేవి.ఆ గ‌దిలో ఉంటున్న నాగేశ్వ‌ర‌రావును క‌ల‌వ‌మ‌ని అప్పుడే భూమ‌న్ చెప్పారు. మా ముగ్గురిలో ఒక్కొక్కరి మ‌ధ్య అయిదేళ్ళ వ‌యోభేదం ఉంది. దాదాపు రోజూ క‌లిసేవాళ్ళం. గాంధీ రోడ్డులో డీల‌క్స్ వ‌ర‌కు న‌డ‌క‌.

టీ తాగి, బాగా పొద్దుపోయేవ‌ర‌కు గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడుకునే వాళ్ళం. ఆ ప‌రిచ‌య‌మే నేను జ‌న‌సాహితీలో చేర‌డానికి దోహ‌దం చేసింది. ఆ స్నేహమే దేవుల‌ప‌ల్లి నాయ‌క‌త్వంలోని విప్ల‌వ సంస్థ‌లో ప‌నిచేయ‌డానికి దారితీసింది.

గుంటూరు జిల్లా జువ్వ‌ల‌పాలెంలో ప‌దిరోజుల పాటు జ‌న‌సాహితీ సాహిత్య‌పాఠ‌శాల జ‌రిగింది. ఆ పాఠ‌శాల‌కు నేను హాజ‌ర‌య్యాను. ఒక అంశంపైన భూమ‌న్ కూడా మాట్లాడాలి. జువ్వ‌ల‌పాలెం వ‌చ్చారు కానీ, తిరుప‌తి దొడ్డాపురం వీధిలో ఉన్న వాళ్ళింట్లో దొంగ‌లు ప‌డ్డార‌న్న వార్త‌తో వెంట‌నే వెనుతిరిగారు.

నాజ‌ర్‌, నిఖిలేశ్వ‌ర్‌, జ్వాలాముఖి, వాకాటి పాండురంగారావు, మా బాబాయి ఆలూరు భుజంగ‌రావు వంటి అనేక మంది సాహిత్య, సాంస్కృతిక రంగ‌ ప్ర‌ముఖులను అక్క‌డే తొలిసారిగా చూశాను. వారి పాఠాలు వినడం గొప్ప అవ‌కాశం. విప్ల‌వ సంస్థ‌ల అనుబంధ సంఘాల్లో చేరిన కొద్ది నెల‌ల‌కే నిలువునా చీలిక‌!

పునాదిలో వ‌చ్చిన కుదుపు గోడంతా బీట‌లు వారేలా చేసింది.విప్ల‌వ క‌మ్యూనిస్టుల్లో వ‌చ్చిన భేదాభిప్రాయాలు వాటి అనుబంధ సంఘాల‌లోనూ పొడ‌చూపాయి. చీలిక ప్ర‌భావం జ‌న‌సాహితి పైనా ప‌డింది.

బ‌హుశా 1980లో అనుకుంటా గుడివాడ‌లో జ‌రిగిన జ‌న‌సాహితీ రాష్ట్ర‌మ‌హాస‌భ‌ల‌కు వెళ్ళాం. అక్క‌డే చీలిక ప్ర‌కంప‌న‌లు క‌నిపించాయి. గుడివాడ స‌భ‌ల త‌రువాత జ‌న‌సాహితీ రాష్ట్ర‌ కార్య‌వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్రాణ‌మిత్రులుగా ఉన్న ప‌ద‌కొండు మంది కార్య‌వ‌ర్గ స‌భ్యులు ఉన్న‌ట్టుండి రెండు శ‌త్రుశిబిరాలుగా విడిపోయారు. ఒక‌రిపైన ఒక‌రు ఆరోప‌ణ‌లతో కార్య‌వ‌ర్గ స‌మావేశం వేడెక్కింది.

ఆ వేడిలో స‌మావేశం చాలా సేపు జ‌రిగింది. భూమ‌న్‌కు విసుగెత్తింది.కార్య‌వ‌ర్గానికి రాజీనామా చేసి బైటికొచ్చేశారు.కొద్ది సేప‌టికి జ్వాలాముఖి, నిఖిలేశ్వ‌ర్‌, జ‌తీన్ కుమార్‌, ముత్యం రెడ్డి కూడా రాజీనామా చేసి బైటి కొ్చ్చేశారు.

తిరుప‌తి యూనిట్‌గా ఉన్న నేను, భూమ‌న్‌, ఏఎన్ నాగేశ్వ‌రావు కూడా జ‌న‌సాహితీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశాం. బైటికి క‌నిపించేవీరెవ‌రూ ఈ చీలిక‌కు కార‌ణం కాదు.చీలిక ఇప్ప‌టికీ మాన‌ని గాయమే.

విద్యార్థి,సాహిత్య, హ‌క్కుల ఉద్య‌మాన్ని ద‌శాబ్దాల‌ వెన‌క్కి తీసుకెళ్ళింది. విప్ల‌వోద్య‌మాన్ని దాదాపు శాశ్వ‌తంగా వాయిదా వేసింది.క్ర‌మంగా, ఏ.ఎన్‌, భూమ‌న్ దూర‌మ‌య్యారు.నేను మాత్రం కొన్నేళ్ళు కొన‌సాగాను.భూమ‌న్‌తో పూర్వ స్నేహం మ‌ళ్ళీ మొద‌లైంది.

రాయ‌ల‌సీమ గురించి భూమ‌న్ బాగా అధ్య‌య‌నం చేశారు.రాయ‌ల‌సీమ వెనుక‌బాటుత‌నం గురించి మాట్లాడ‌డం మొద‌లు పెట్టారు. గ‌తంలో విప్ల‌వోద్య‌మం గురించి ఎంత ఆవేశంగా మాట్లాడారో, అదే ఆవేశం రాయ‌ల‌సీమ స‌మ‌స్య‌ల పైన కూడా క‌నిపించింది.

ఇమాం ఎడిట‌ర్‌గా వ‌చ్చే క‌ద‌లిక‌లో భూమ‌న్ రాయ‌ల‌సీమ గురించి చాలా వ్యాసాలు రాశారు. క‌డ‌ప‌లో పెద్ద ఎత్తున 1985 లో రాయ‌ల‌సీమ మ‌హాస‌భ జ‌రిగింది.

నేను, భూమ‌న్‌, ఏ.ఎన్. నాగేశ్వ‌ర‌రావు వెళ్ళాం.రాయ‌ల‌సీమ సంయుక్త కార్యాచ‌ర‌ణ స‌మితి ఉపాధ్య‌క్షుడుగా భూమ‌న్ ఎన్నిక‌య్యారు.రాయ‌ల‌సీమ ఉద్య‌మంలో భాగంగా మ‌ద‌న‌ప‌ల్లె నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్ వ‌ర‌కు వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డితో క‌లిసి భూమ‌న్ 22 రోజులు పాద‌యాత్ర చేశారు.

నేను ఆ పాద‌యాత్ర‌లో పాల్గొన లేదు.రాయ‌ల‌సీమ సంయుక్త కార్యాచ‌ర‌ణ స‌మితి కార్య‌వ‌ర్గ స‌మావేశం జరుగుతుందని అనుకుంటే భూమ‌న్‌తో పాటు నేను, ఏ.ఎన్‌. కూడా క‌డ‌ప వెళ్ళాం.

అంతా వ‌చ్చారు కానీ,కీల‌క‌మైన‌ వైఎస్‌. రాజ‌శేఖ‌ర రెడ్డి, ఎం.వి. ర‌మ‌ణా రెడ్డి రాలేదు. ఆ రోజుల్లో క‌డ‌ప జిల్లాలో వారిరువురూ రెండు వైరి వ‌ర్గాలుగా ఉన్నారు. ఒక‌రిపైన ఒక‌రికి అనుమానం వ‌ల్ల ఇద్ద‌రూ హాజ‌రు కాలేదు.ర‌మ‌ణారెడ్డిని చూసొద్దాం అన్నారు భూమ‌న్‌. అటు నుంచి అటే ప్రొద్దుటూరు బ‌య‌లు దేరాం.

ప్రొద్దుటూరులో మూత‌ప‌డిన మిల్లులో నే ర‌మ‌ణారెడ్డి బస.మిల్లుకు పెద్ద గేటు. ఆ గేటుకు మ‌ధ్య‌లో మ‌రో చిన్న గేటు. గేటు త‌లుపు కొడితే చిన్న గేటు కొద్దిగా తెరుచుకుని లోప‌ల నుంచి ఓ వ్య‌క్తి త‌ల‌బైటికి పెట్టి ఎవ‌ర‌ని అడిగాడు.

ర‌మ‌ణా రెడ్డిని క‌ల‌వ‌డానికి తిరుప‌తి నుంచి భూమ‌న్ వ‌చ్చార‌ని చెప్ప‌మ‌న్నాం.మ‌ళ్ళీ గేటు వేసేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. చాలా సేప‌టికి లోప‌లికి ర‌మ్మ‌ని పిలుపొచ్చింది. క‌న‌ప‌డ‌కుండా ఆయుధాలతో చుట్టూ మ‌నుషులు.అనుమాన‌పు చూపులు.

ఒక గ‌దిలో ర‌మ‌ణా రెడ్డి కూర్చుని పాత సినిమాలు చూస్తున్నారు.నేను ర‌మ‌ణారెడ్డిని చూడ‌డం అదే తొలిసారి.రాత్రి, ప‌గ‌లు ఆయ‌న అక్క‌డే.న‌మ్మిన మ‌నుషుల మ‌ధ్యే.

మేం అక్క‌డ ఉన్నంత సేపు ఆయ‌న చుట్టూ ఉన్న మ‌నుషులు మ‌మ్మ‌ల్ని త‌దేకంగా చూస్తూనే ఉన్నారు. ఏ క్ష‌ణం ఏం జ‌రుగుతుందో అన్న భ‌యం. అయినా వారిలో తెగింపు.

ఫ్యాక్ష‌నిజం ప‌డ‌గ నీడలో బ‌తుకు ఎలా ఉంటుందో తొలిసారి చూశాను. సిద్ధేశ్వ‌ర ఉద్య‌మాన్ని పెద్ద ఎత్తున నిర్వ‌హించాల‌ని 2017లో బొజ్జాద‌శ‌ర‌థ‌రామిరెడ్డి వంటి రాయ‌ల‌సీమ ఉద్య‌మ నాయ‌కులు పిలుపు నిచ్చారు. కేవ‌లం 600 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో ఈ అలుగు నిర్మించ‌వ‌చ్చ‌ని సుబ్బ‌రాయుడు అనే ఇంజినీర్ ప్ర‌తిపాదించారు.

ప్ర‌భుత్వానికి ఎంత విన్న వించినా ఉప‌యోగం లేకుండా పోయింది.రైతులే ఆ అలుగును నిర్మించాల‌ని కృష్ణా న‌దిలో శంకుస్థాప‌న చేయ‌డానికి న‌డుంబిగించారు.దీని కోసం బొజ్జాద‌శ‌ర‌థ‌రామి రెడ్డి కొన్ని నెల‌ల‌పాటు గ్రామాల‌లో తిరిగి రైతాంగాన్ని కూడ‌గ‌ట్టారు.

ఆ ఉద్య‌మంలో పాల్గొన‌డానికి నేను, భూమ‌న్‌, హైద‌రాబాదు నుంచి హైకోర్టు న్యాయ‌వాది శివారెడ్డి నంద్యాల వెళ్ళాం. చిత్తూరు జిల్లాకు చెందిన శివారెడ్డి ఒక నాటి శ్రీ‌కాకుళ‌ ఉద్య‌మ స్ఫూర్తితో ప‌నిచేసిన వారు. రాడికల్ విద్యార్థి సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరు.

రాయ‌ల సీమ ఉద్య‌మం ప‌ట్ల నిబ‌ద్ద‌త క‌లిగిన వ్య‌క్తి.నంద్యాల నుంచి నందికొట్కూరు వెళ్ళాం.ఒక రోజు ముందుగా నందికొట్కూరులో మ‌హ‌బూబ్‌ బాషా గెస్ట్ హౌస్‌లో విడిది చేశాం.

మ‌ర్నాడు పొద్దున్నే అలుగు శంకుస్థాప‌న చేసే న‌ది మ‌ధ్య‌లోకి వెళ్ళాలి.న‌దిలోకి వెళ్ళ కుండా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అన్ని దారుల‌ను మూసేసింది.ఎద్దుల బండ్ల దారుల‌కు కూడా గండ్లు కొట్టి ఎవ్వ‌రినీ వెళ్ళ‌నీయ‌కుండా పోలీసుల‌ను మోహ‌రింప చేసింది.

నందికొట్కూరు నుంచి ముచ్చు మర్రి మీదుగా వెళ్ళ‌డం చాలా ద‌గ్గ‌ర‌. సాయంత్ర‌మ‌వుతుండ‌గా మేం బ‌స‌చేస్తున్న గెస్ట్ హౌస్ ద‌గ్గ‌ర‌కు పోలీసులు వ‌చ్చి బైటికి రాకూడ‌ద‌ని ఆంక్ష‌లు విధించారు.

మ‌ర్నాటి సాయంత్రం వ‌ర‌కు హౌస్ అరెస్టు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.చుట్టూ పోలీసు కాప‌లా.మేం బైట‌కు వెళ్ళ‌లేక‌పోయాం.వేలాది మంది రైతులు, వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు పోలీసుల‌ను తోసుకుని మ‌రీ అనేక దారుల గుండా న‌దిలోకి ప్ర‌వాహంలా దూసుకెళ్ళారు.

పాత్రికేయుడు, విర‌సం నాయ‌కుడు పాణి త‌దిత‌రులు అన్ని నిర్భందాల నూ అధిగమించి సిద్దేశ్వ‌రం వ‌ద్ద అలుగు నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు.అనేక మందిని అరెస్టు చేసి కేసులు పెట్టారు.

పోలీసు నిర్బంధానికి వ్య‌తిరేకంగా మా గెస్ఠ‌హౌస్ ద‌గ్గ‌ర చేసిన రాస్తారోకోలో మేం కూడా పాల్గొన్నాం.మ‌ధ్యాహ్నం దాటాక పోలీసు సంద‌డి కాస్త త‌గ్గింది.

పోలీసుల క‌ళ్ళుగ‌ప్పి నేను,భూమ‌న్‌, శివారెడ్డి ముచ్చు మర్రి ద‌గ్గ‌ర నుంచి న‌దిలోకి ప్ర‌వేశించాం.అప్ప‌టికీ న‌దిలో జ‌న‌ప్ర‌వాహం త‌గ్గ‌లేదు.

నీటికోసం రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు ఎలా జీవ‌న్మ‌ర‌ణ పోరాటం చేస్తున్నారో సిద్దేశ్వ‌ర ఉద్య‌మంలో క‌ళ్ళారా చూడ‌గ‌లిగాను.తిరుప‌తిలో భూమ‌న్ తో క‌లిసి ఎన్ని స‌భ‌లు, రౌండ్ టేబుల్ స‌మావేశాల్లో పాల్గొన్నానో లెక్కే లేదు.

వార్త‌లో ప‌నిచేస్తుండ‌గానే మిత్రుల‌తో క‌లిసి 1997 నుంచి స‌ర‌దాగా ట్రెక్కింగ్ మొద‌లు పెట్టాను.తిరుపతిలో పాతికేళ్ళ నుంచి ఉంటున్నా ఎప్పుడూ తిరుమ‌ల కొండ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.కుమార ధార‌తో మొద‌లైన ట్రెక్కింగ్ తిరుమ‌ల కొండ ప‌రిస‌రాల‌ను మొత్తాన్ని జ‌ల్లెడ ప‌ట్టేవ‌ర‌కు వ‌ద‌ల లేదు.

క్ర‌మంగా భూమ‌న్ కూడా ట్రెక్కింగ్ మొద‌లు పెట్టారు.పొద్దున్నేశ్రీ‌వారి మెట్టు మార్గం నుంచి వారానికి ఒక సారైనా కొండ ఎక్కి దిగ‌డం మొద‌లు పెట్టాం.

చాలా సార్లు శ్రీ‌వారి మెట్టు మార్గం నుంచి ఎక్కి అలిపిరి మార్గం ద్వారా దిగాం.తొలిసారిగా గాలిగోపురం ద‌గ్గ‌రకు వెళ్ళిన‌ప్పుడు అక్క‌డ నుంచి క‌నిపించే తిరుప‌తి న‌గ‌రాన్ని వీక్షిస్తూ, వీస్తున్న గాలికి, ప్ర‌కృతి శోభ‌కు భూమ‌న్ త‌న్మ‌యులైపోయారు.

వేప పుల్ల న‌ములుతూ ” అబ్బా..ఇంత‌కాలం ఎంత మిస్స‌య్యాం శ‌ర్మా ” అన్నారు.రెండు దారుల్లో అడుగ‌డుగునా క‌నిపించే ప్ర‌కృతి సోయ‌గానికి బందీలైపోయారు. దారి ఉన్న‌దా లేదా అన్న‌దానితో సంబంధం లేకుండా తిరుమ‌ల‌లోని అణువ‌ణువూ తిరిగాం.

హ‌నుమంతుడి విగ్ర‌హంనుంచి తిరుమ‌ల కొండ‌ను నిట్ట‌నిలువునా దిగ‌డానికి దుస్సాహ‌సం చేశాం.సాధ్యం కాక వెనుతిరిగాం.చూసిన తీర్థాల‌న్నీ మ‌ళ్ళీ మ‌ళ్ళీ చూశాం.శేషాచ‌లం కొండ‌ల్లోని ప్రకృతి సోయగాలు అన్నిటినీ క‌రోనా స‌మ‌యంలో భూమ‌న్ ఒక చుట్టు చుట్టొచ్చారు.

 

కొండ‌లు ఎక్కారు, దిగారు.

గుంజన జలపాతం పై భాగం లోని లోతైన నీటి గుండం లోకి దూకుతున్న భూమన్

గుంజ‌న జ‌ల‌పాతం వెనుక వున్న లోతైన వాగుల్లోకి పైనుంచి దూకి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. భూమ‌న్ ట్రెక్కింగ్ సాహ‌సాల ముందు ఏడు పదులు దాటిన వయోభారం కూడా త‌ల‌వంచింది. ట్రెక్కింగ్ మ‌త్తెక్కిచ్చే ఒక కిక్కు.

అల‌వాటు పడ్డారా.. ఇక‌ కాలు నిలువ‌దు. శ‌రీరాన్ని, మ‌న‌సును ఆరోగ్యంగా అదుపు లో పెడుతుంది.భూమ‌న్ గ‌మ‌నించిన‌ట్టుగా ఈ విష‌యాన్ని చాల మంది ట్రెక్కింగ్ వీరులు గ‌మ‌నించినట్టు లేదు. ట్రెక్కింగ్‌లో ప‌డి భూమన్ రాయ‌ల‌సీమ‌ను వ‌దిలేయ‌ లేదు.ఉద్య‌మంలో త‌న శ‌క్తి సామ‌ర్థ్యాలు, ప‌రిమితులు ఏమిటో ఆయన‌కు బాగా తెలుసు.

అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా రాయ‌ల‌సీమ స‌మ‌స్య‌ల‌పై గొంతువిప్పుతూనే ఉన్నారు.చీలిక‌లు పేలిక‌లైన విప్ల‌వోద్య‌మం గురించి ఆయ‌న‌లో ఒక నిర్వేదం గూడుకట్టు కుంది.సామాజిక స‌మ‌స్య‌ల‌పై తిరుప‌తిలో గొంతు విప్పే తొలి పౌరుడు భూమన్.

భూమ‌న్ నిత్య‌విద్యార్థి. నిత్య పాఠ‌కుడు. నిత్య స‌త్యాన్వేషి.

(అలూరు రాఘవశర్మ , సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

3 thoughts on “భూమన్ ప్రసంగాలకు వశీకరణ శక్తేదో వుండేది…(తిరుప‌తి జ్ఞాప‌కాలు -25)

  1. నలభై ఏళ్ళ చరిత్రను స్కాన్ చేసి మా ముందు పెట్టారు సార్..గురువు గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడం ఆనందం

  2. అనుమానం లేదు,రాఘవ శర్మ గారు చెప్పింది కరెక్టే. భూమన్ గారిప్రసంగాలు ఉత్తేజకరంగా ఉండేవి. 1980-83 మధ్య నేను ఎమ్మెస్సీ చదివే రోజులో ఆయన ప్రసంగించిన ప్రతిసభకు వెళ్లాను. తిరుపతి కోనేటి కట్ట మీద జరిగిన సమావేశాలు నాకు బాాగా గుర్తు. ఈ జ్ఞాపకాలలో పేర్నొన్న చాలా మంది నాకు పరిచయం. తెలుగు ప్రాంతాలలో మార్క్సి స్టు ఉద్యమం గొప్ప మేధావులను, వక్తలను అందించింది. నాకు తెలిసి త్రిపురనేని మధుసూదన రావు, యాదాటీ కాశీపతి, జ్వాలా ముఖి, భూమన్ లు అగ్రశ్రేణి వక్తలు. వీళ్లందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్కశైలి. ఇందులో భూమన్ వివరణాత్మక ఉపన్యాస శైలి. జ్వాలాముఖిది ప్రదర్శనా శైలి.. కాశీపతి నవ్విస్తూ, చురకలేస్తూ సిగరెట్ ను పెదాలకు ఆతికించి మాట్లాడేవారు. అందరిలో ఆయన శైలి అనితరం సాధ్యం. అనంతపురం కాలేజీ రోజుల్లో ఆయన సిగిరెట్ స్టైల్ అనుకరించేందుకు అపుడపుడు సిగరెట్ కాల్చేవాళ్లం. ఇక త్రిపురనేని తాత్వికుడు. ఆయన సికిందరాబాద్ కుట్రకేసు ఉపన్యాసం మహాకావ్యవం. ఆయన తత్వ శాస్త్ర సూక్ష్మాలను నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పగల వ్యక్తి. వీళ్లతో కొద్ది సేపు గడిపినా జీవితంలో మర్చిపోలేనంత కొత్త జ్ఞానం అందేది. తెలుగు విద్యార్థి ఉద్యమం, విప్లవోద్యమం, సాంస్కృతికోద్యమం చరిత్రరాస్తే వీళ్లందరికి ఒక చాప్టర్ కేటాయించాల్సిందే. రాఘవ శర్మ భూమన్ గురించి రాసి ఒక ఉజ్వల చారిత్రక ఘట్టాన్నిగుర్తు చేశారు. ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *