“ఎవరు” – చూడదగ్గ థ్రిల్లర్! (మూవీ రివ్యూ)

(సలీమ్ బాష)
’ఎవరు‘ ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు బాగానే వస్తున్నాయి.
అడవి శేషు హీరోగా గతంలో “ క్షణం ”, “గూడచారి ” వంటి రెండు విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఈసారి కూడా ఒక అలాంటి సినిమానే ఎంచుకున్నాడు. అయితే ఈ సినిమాకు ఆధారం ఒక స్పానిష్ సినిమా కావడం గమనార్హం.
అంతేకాకుండా ఇదే సినిమా ఆధారంగా అమితాబచ్చన్ తాప్సీ ప్రధాన పాత్రల్లో “బద్లా” అనే హిందీ సినిమా 《మార్చ్ నెల లో) వచ్చింది.!! రెండు సినిమాలు “కాంట్రా టీంపొ”( ఇంగ్లీషులో ” ది ఇన్విజిబుల్ గెస్ట్ ”) ఆధారంగా రూపొందించినా తెలుగులో నే కొంచం బాగా తీశారని చెప్పొచ్చు.
అమితాబ్ బచ్చన్ స్థాయి నటుడితో పోల్చలేము కానీ శేషు కూడా బాగా చేశాడని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చిన పై రెండు సినిమాల్లో శేషు క్యాజువల్ లుక్స్ తో, మంచి డైలాగ్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా సస్పెన్స్ ను పండించడంలో చాలావరకు సఫలమయ్యాడు.
హిందీ సినిమా చూసిన వాళ్లకి కూడా పర్వాలేదు బాగానే తీశారు అనిపించేలా చేసిన దర్శకుడు వెంకట్ రాంజీ (ఇది మొదటి సినిమా!) ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేము.
సాధారణంగా ఇలాంటి సినిమాల్లో ఫైట్లు పాటలు చేజింగ్ లు ఉండవు. అటువంటప్పుడు చివరి వరకు బోర్ కొట్టకుండా ప్రేక్షకులను కుర్చీల్లో కూర్చోబెట్టాలి అంటే చాలా కష్టం. ఈ సినిమా చాలా భాగం ఒక గదిలో ఇద్దరు పాత్రల (రెజీనా, శేషు) మధ్య నడుస్తుంది.
అయితే సరైన నేపథ్య సంగీతం, సంభాషణలు, స్క్రిప్టు ఈ సినిమాను చివరి వరకు చూసేలా చేస్తాయి. అమితాబ్ బచ్చన్ కోసం హిందీ సినిమా చూసి ఉన్నా సరే, “ఎవరు” చూడగలిగేలా ఉండడం విశేషం. రెజీనా ఈ సినిమాలో కొంత నటించింది! బాగా చేసిందని చెప్పలేం కానీ సినిమాకు ప్రధాన పాత్ర ఆమెని కాబట్టి కొంతవరకు పర్వాలేని విధంగా ఆమె నటన ఉండడం సినిమాకు కొంత వరకు బలమే. శేషు మాత్రం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ సినిమాతో తానేంటో రుజువు చేశాడు! అవసరమైన చోట చక్కని పర్ఫామెన్స్ ఇస్తూ సినిమాను నడిపించాడు.
ఈ సినిమా కథ స్థూలంగా ఒక రేప్, ఒక హత్య చుట్టూ తిరుగుతుంది. అది కూడా కూనూర్ లాంటి హిల్ స్టేషన్ లో. ఈ సినిమాకు ప్రధాన బలం చిక్కగా చక్కగా అల్లిన స్క్రిప్ట్! బిగి సడలకుండా చివరి వరకు నడుస్తుంది. ఈ సినిమాలో ఒక సబ్ ప్లాట్ ఉంది. దాన్ని మెయిన్ కథకు కలపడంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ క్రమేణా మళ్లీ క్లారిటీతో తీసుకెళ్లడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సినిమాలో కొంత భాగం చిత్రీకరణ అందమైన లొకేషన్స్ లో జరగడం, దానికి సరైన సంగీతం అందించడం వల్ల ఒక రకమైన సస్పెన్సు థ్రిల్ కలుగుతాయి. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నవీన్ చంద్ర కూడా సినిమా టెంపోను తగ్గకుండా నటించాడు.
సినిమా ప్రధానంగా ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పెద్ద సంస్థకు యజమాని అయిన మహిళ ను రెప్ చేయడం తర్వాత ఆమె ద్వారా హత్యకు గురి కావడం తో మొదలవుతుంది. మొదటి పది నిమిషాలు సినిమా చాలా థ్రిల్లింగ్ గా, హాలీవుడ్ మూవీ స్థాయిలో ఉండడం సినిమాకి బలం. అదే టెంపోను చివరివరకు (అక్కడక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉన్నా) మెయింటైన్ చేయడం విశేషం.
ఈ సినిమాలో కొంతసేపే కనిపించినా మురళి శర్మ, తనదైన శైలిలో నటించాడు. పవిత్ర లోకేష్ ఒకట్రెండు సీన్లే ఉన్నా సినిమాకు ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఈ సినిమాకు సర్ ప్రైజ్ ప్యాకేజ్ నిహాల్ కోదాటి! డిస్టెన్స్ ను ,టెంపోను, ఎమోషనల్ యాంగిల్ ను మైంటైన్ చేయడానికి సరిపడా చక్కని నటనను ప్రదర్శించాడు. ప్రతి సీన్ వేగంగా, క్రిస్ప్ గా నడవడం వల్ల ప్రేక్షకులు సినిమాను చివరి వరకు చూడగలుగుతారు.
మొత్తం మీద సస్పెన్స్ థ్రిల్లర్స్ తీయటంలో ఉన్న ఇబ్బందులను, కాంప్లికేషన్స్ ను అధిగమించి తీసిన ఈ సినిమా నిజంగా చూడదగ్గ థ్రిల్లరే!!

(ఫీచర్ ఫోటో Twitter నుంచి)