రజినీకాంత్ కి ఆపేరు పెట్టిందెవరో తెలుసా?

(సిఎస్ ఎ షరీఫ్)
చాలా మట్టుకు గొప్ప విషయాల ఆరంభాలన్నీ చిన్నవిగానే వుంటాయి. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగు తోనే మొదలవుతుంది.
ప్రముఖ తమిళ దర్శకుడు కె బాలచందర్ 1975 లో ఓ సినిమా తీస్తున్నప్పుడు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్లాడు. అక్కడి విద్యార్థుల్లో చురుకైన కళ్లు, చెక్కినట్లున్న ముఖం గల ఓ యువకుడ్ని చూసి ఆకర్షితుడై  తన సినిమాలో అతడికి  ఓ వేషం ఇవ్వాలనుకున్నాడు.
అదే విషయం ఆ యువకుడికి చెప్పి, నీకు తమిళం అంత బాగా రాదు కాబట్టి,  దాని మీద పట్టు సాధించి నాకు కనపడు అన్నాడు. ఆ యువకుడు 20 రోజుల్లో తన మిత్రుడి సహాయం తో తమిళం నేర్చుకుని బాలచందర్ ని కలిశాడు.
బాలచందర్ అతడి ఉచ్చారణ విన్న తరువాత ఆ యువకుడికి తన సినిమాలో ఓ చిన్న పాత్ర ఇచ్చాడు. ఇదీ కథ
ఆ సినిమా  అనేక వివాదాలకూ, విమర్శలకూ లోనై అప్పట్లోసంచలనం సృష్టించిన,  “అపూర్వ రాగంగళ్” .  ఆ యువకుడు ఇప్పుడు సంచలాన్ని సృష్టిస్తున్న సూపర్ స్టార్ రజినికాంత్  …వుర్ఫ్ శివాజి రావ్ గైక్వాడ్..
అపూర్వ రాగంగళ్  సినిమా  కథ ఒక బేతాళ ప్రశ్న. ఒక చోట తండ్రీ కొడుకులు, మరో చోట తల్లీ, కూతుళ్లు.  పరిస్థితుల వల్ల ఇక్కడ తండ్రి, అక్కడి కూతురూ, అక్కడి తల్లి, ఇక్కడి కొడుకూ ప్రేమలో పడతారు. ఈ జంటలు పెళ్లి చేసుకుంటే వీరికి కలిగే సంతానం మధ్య ఎలాంటి బంధుత్వం వుంటుంది? ఎవరికి ఎవరు ఏమవుతారు?  అనేదే ఈ సినిమా కథ.
తండ్రీ కొడుకులుగా మేజర్ సుందర్రాజన్, కమల్ హాసన్ నటించగా, తల్లిగా శ్రీ విద్య, ఆమె కూతురిగా జయసుధ నటించారు.
గర్భవతి గా వున్న తన ప్రియురాలిని (శ్రీ విద్య ) వదిలేసి వెళ్లిపోయిన ప్రియుడి పాత్రలో రజిని కాంత్ నటించాడు. ఈ పాత్రతోనే ఆయన సినిమా రంగప్రవేశం జరిగింది. ఇది చాలా చిన్న పాత్ర అని ఎవరో బాలచందర్ తో అన్నప్పుడు, చిన్న పాత్రే కానీ ముఖ్యమైన పాత్ర అన్నాడట ఆయన.
ఒక రకంగా ఇదొక నెగెటివ్ రోల్. దాదాపు సినిమా చివర్లో ఒక పెద్ద గేటు తెరుచుకుని రజినికాంత్ లోనికి వస్తాడు. ఒక కథనం ప్రకారం ఆ సన్నివేశానికి ప్రాముఖ్యత కల్పిస్తూ, బాలచందర్ అది రజినికాంత్ సినీ జీవితానికి సింబాలిజం అన్నాడట.
అంటే మొట్ట మొదటి సారి తెర మీద కనిపించడమే ఒక పెద్ద గేటు తీసికుని లోనికి రావడం, సినీ ప్రపంచం లోకి అడుగు పెట్టడమన్నట్లు.
కవులు కలం పేర్లతో  సినీ కళాకారులు వెండితెర పేర్లతో విరాజిల్లడం పరిపాటి. గైక్వాడ్ అనే మరాఠీ, కన్నడ భాషల పిల్ల వాడికి ఓ వెండితెర పేరును ఇవ్వాలనుకున్నాడు బాలచందర్. అతడిముందు రజినికాంత్, చంద్రకాంత్, శ్రీకాంత్ అనే మూడు పేర్లను పెట్టాడు. వాటిలో మన తలైవా “రజినికాంత్” అనే పేరు సెలెక్టు చేసుకున్నాడు.
అప్పటినుండి, శివాజి రావ్ గైక్వాడ్, రజినికాంత్ గా ఆవిర్భవించాడు. ఈ పేరుకి అర్థం రాత్రి రంగు అని చెబుతారు. ఇది బహుశా తన మేని రంగు గురించి అయివుండవచ్చని అనుకుంటారు చాలా మంది.. ఇది 1975 వ సంవత్సరg హోలీ పండుగ రోజు జరగడం ఓ విశేషం. చాలామంది తమిళులకి హోలీ పండుగను తమ అభిమాన నటుడు రజినికాంత్ పుట్టిన రోజు గా జరుపుకోవడం ఆనవాయితీ.
అయితే సినిమా మొదట్లో,  క్రెడిట్లు  చూపుతున్నప్పుడు ఈ పేరు కాస్తా తెరమీద రజనికాంత్ ( జి బదులుగా జ) గా ప్రకటితమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *