Home Entertainment తన పాటను రఫీ తో పాడించ మన్న కిశోర్ కుమార్, ఎందుకో తెలుసా?

తన పాటను రఫీ తో పాడించ మన్న కిశోర్ కుమార్, ఎందుకో తెలుసా?

102
0
Pic credit : youtube
(అహ్మద్ షరీఫ్)
“ఎదుటి వారిని ప్రశంసించడమన్నది ఒక మహత్తర మైన విషయం. మనం ఇతరులను ప్రశంసించినపుడు, వారిలోని ఔన్నత్యం మనకు కూడా చెందుతుంది.”
ఒక్కో సారి ఒక్కో పాట సంగీత దర్శకుడు ఊహించినట్లు గాయకుడి నుంచి రాక పోవచ్చు. అంత మాత్రాన పాటను గాయకుడు పాడలేక పోయాడు అనలేం. ఒక మాటలో చెప్పాలంటే పాట రాగానికో, లేక భావానికొ, గాయకుడి గొంతు సూట్ కాలేదు అనుకోవాలి. అప్పుడు వేరే గాయకుడి తో పాట పాడించడం మొదటి గాయకుడిని తక్కువ చేసినట్లు కాదు.
పాట పాటకు గాయకుల గొంతునుండి కమ్ముకునే చాయలు ఎన్నో వుంటాయి అవి వారికే ప్రత్యేకం. అషా భోస్లే పాడిన కొన్ని పాటలు వేరే ఇంకెవరు పాడినా బాగుండవు. ముకేశ్ పాడిన కొన్ని పాటలు ఎలా వుంటాయంటే, పాటల్ని వేరే ఎవరు పాడినా మనకు నచ్చక పోవచ్చు. అలాగే ప్రతి గాయకుడిలో ప్రత్యేకతలుంటాయి.   
బాలీవుడ్ చిత్ర సంగీతానికి, మహమ్మద్ రఫీ, కిశోర్ కుమార్ ఇద్దరూ ధ్వజ స్తంభాల్లాంటివారే. ఎవరి గొప్ప తనం వారికుంది. ఇద్దరూ మంచి స్నేహితులే. ఒకరి మీద ఒకరికి ప్రేమా గౌరవమూ వుండేవి.  
అయితే ఏండ్ల తరబడి, మీడియా, అప్పట్లో వెలసిన కొన్ని పత్రికలు (అవి ఇప్పుడు లేవు) వీరిద్దరి మధ్య  లేని, శతృత్వాన్ని సృష్టించి, ఆ శతృత్వపు కథల మీద బ్రతికాయి.వాళ్లిద్దరు వృత్తిరీత్యా పోటీదారులే తప్ప ఏనాడూ శతృవులు కారు. వారు ఒకరి మీద మరొకరు శతృత్వాన్ని చూపించిన దాఖలాలు ఏవీ లేవు. పైపెచ్చు అభిమానాన్ని, గౌరవాన్ని చూపించిన  తార్కాణాలే ఎన్నో వున్నాయి
ఒక పాట గురించి చాలా రోజులు రఫీ, కిశోర్ అభిమానుల మధ్య వాగ్వాదాలు జరిగాయిఅప్పటి నెగెటివ్ పత్రికలు నిప్పులో తమ వంతు ఆజ్యం పోసాయి.  1971 లో “హాతి మేరే సాథిఅనే సినిమా వచ్చించి. సినిమాలో అప్పటి సూపర్ స్టార్  రాజేష్ ఖన్నా కథా నాయకుడు. సినిమా బాక్షాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ గా నమోదయింది. సూపర్ హిట్ సినిమా ఆరాధనా తరువాత తన సినిమాల్లో కిశోర్ కుమార్ తప్ప వేరే గాయకుడు పాడటానికి వీల్లేదని రాజేష్ ఖన్నా అంక్ష పెట్టాడు. అలాగే ఈ సినిమాలో పాటలన్నీ కిశోర్ కుమార్ పాడాడుఅయితే ఒక పాట దగ్గర తకరారు వచ్చింది. సినిమాలో రామూ అనే ఏనుగు ఇంకో హీరో. సినిమా క్లైమాక్సు లో అది చనిపోతుంది. అప్పుడు ఒక పాట వస్తుంది
నఫ్రత్ కి దునియా కో చోడ్ కే ప్యార్ కి దునియా మే ఖుష్ రహనా మేరే యార్”
(ద్వేష పూరితమైన ప్రపంచాన్ని వదిలి పెట్టి, ప్రేమ లోకం లో సంతోషంగా వుండు నా నేస్తమా)
చిత్రానికి సంగీతం లక్ష్మి కాంత్ ప్యారేలాల్  (LP) జంట. పాట కిశోర్ తో రికార్డయింది కానీ LP కోరుకున్న ఎఫెక్టు వారికి దీనిలో కనిపించలేదు. వీళ్లిద్దరు సందిగ్ధం లో పడ్డారు. తర్జన భర్జనలు జరిగాయి.
లక్ష్మి కాంత్ కి పాటను రఫీ తో పాడిస్తే బావుంటుందనిపించింది. విషయం చూచాయగా రాజేష్ ఖన్నా కు తెలిపితే అతడు ససేమిరా అన్నాడట. ప్యారేలాల్ పాటను అసలు తీసేద్దామన్నాడట. దీనికి రాజేష్ ఖన్నా తో పాటు చిత్ర దర్శకుడు ఒప్పుకోలేదు.   చిత్రానికి పాట చాలా అవసరం. చివరికి పాటను రఫీ తో రికార్డు చేయించారు. పాటా, పాట తో పాటు చిత్రం బాగా పేరు పొందింది

దీని మీద అనేక కథనాలొచ్చాయి. కథనాల్లో ఒక మంచి కథనం ఏమిటంటే, తాను పాడిన పాట విన్న కిశోర్ కే పాటలో రావలసినంత బరువు రాలేదని, ఇది సన్నివేశానికి సూట్ కాక పోవచ్చని అనిపించిందిట. అతడే LP ను కలిసి పాటను మహమ్మద్ రఫీ తో పాడించండి బావుంటుంది అన్నాడట. ఇలా చెప్పడానికి చాలా గొప్ప మనసు కావాలి.
ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే పాట రాసిని ఆనంద్ బక్షి కి  Society for Prevention of Cruelty to Animals (SPCA) నుండి ప్రత్యేక అవార్డు లభించింది.  
కిశోర్ పాడిన పాటే సినిమాలో వుండి వుంటే అంతగా పేరు వచ్చేదో లేదో తెలీదు కానీ, పాట ప్రసక్తి వచ్చినపుడల్లా, కిశోర్ కుమార్ మహామ్మద్ రఫీని అంతర్గతంగా ప్రశంసించిన తీరు, కిశోర్ కుమార్ లోనే ఒక ఔన్నత్యాన్ని ఆపాదించింది అనడంలో  అతిశయోక్తి లేదు.
(అహ్మద్ షరీఫ్, సినిమా విశ్లేషకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here