తెరకెక్కుతున్న చలం ‘మైదానం’

వేణు ఊడుగుల నిర్మాణంలో… 
తెలుగు సాహిత్యంలోని అత్యుత్తమ నవలలో చలం రాసిన ‘మైదానం’ ఒకటి. అంతర్జాతీయ సాహిత్య ప్రమాణాలు ఉన్న నవల అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ నవల తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా వివిధ భారతీయ భాషల్లో అనువాదమై పాఠకుల ఆదరణ పొందింది. ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాణంలో ఇప్పుడీ నవల తెరకెక్కుతోంది. ఆహా ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం కానున్న ‘ఆహా’ ఒరిజినల్‌ ఇది. ‘మైదానం’ టైటిల్‌తో రూపొందనున్న దీనికి కవి సిద్ధార్థ్‌ దర్శకత్వం వహించనున్నారు. దీపావళి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ నవలా చిత్రం విశేషాలను ప్రకటించారు.

ప్రస్తుతం రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్ ప్రధాన పాత్రధారులుగా ‘విరాట పర్వం’ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఓ వైపు దర్శకుడిగా ఆ సినిమా చేస్తూనే, మరోవైపు నవలా చిత్రం నిర్మాణ పనులు చూసుకోనున్నారు.

ఈ సందర్భంగా ‘మైదానం’ నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘‘చలంగారు 1927లో ఈ నవల రాశారు. చాలామంది మిత్రులతో ఈ నవలను ‘గొప్ప ఆర్టిస్టిక్‌ పీస్‌’ అని ఆయన చెప్పారు. స్వాతంత్య్ర పూర్వ సమాజంలో కుటుంబ సంబంధాల్లో స్త్రీల అమానుషమైన పీడనను చలంగారు ఎంతో కవితాత్మతో, ఆగ్రహంతో ప్రస్తావించారు. ‘మైదానం’లో ప్రతి సన్నివేశం ఆయన జీవితానుభవంలో ఎదుర్కొన్న విషయాలే. ఇందులో ప్రతి సన్నివేశం ఇప్పటికీ స్త్రీ–పురుష సంబంధాలకు కనెక్ట్‌ అవుతూ ఉంటుంది. స్త్రీలను ప్రాణమున్న మనుషులుగా గుర్తించని సమాజాన్ని చలంగారు ఎంతో తీవ్రంగా విమర్శించారు. ఎండగట్టారు. ‘మైదానం’లోని రచనా శైలి ఎంతో వైవిధ్యంగా అన్ని తరాలను ఆకట్టుకుంటుంది. ఈ నవలను ఆ రోజుల్లోనే వచ్చిన ఒక విజువల్‌ నేరేటివ్‌ పీస్‌గా మనం అనుకోవచ్చు. ‘మైదానం’లో ప్రతి పాత్ర రక్తమాంసాలున్న సజీవ పాత్రలు. నిర్మాత, దర్శకులకు… అన్నిటికి మించి తెలుగు సినిమా సంతకాన్ని రీజూవనేట్‌ (చైతన్యం) చేయగలిగే అవకాశం ఇస్తుంది గనుక ‘మైదానం’లోకి దూకే సాహసం చేస్తున్నాం’’ అని అన్నారు.

ఈ ‘మైదానం’… ‘ఆహా’ ఒరిజినల్‌కి

పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్‌ – ఫణి కందుకూరి,
డిజిటల్‌ ప్రమోషన్స్‌: టికెట్‌ ఫ్యాక్టరీ

నిర్మాణ సంస్థ: వేణు ఊడుగుల ప్రొడక్షన్‌ హౌస్‌
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.
కూర్పు: ఎ. శ్రీకర్‌ ప్రసాద్‌
సంగీతం: సురేష్‌ బొబ్బిలి
నిర్మాత: వేణు ఊడుగుల
దర్శకత్వం: కవి సిద్ధార్థ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *