కోట్లు మింగి కొండెక్కిన మూడు సినిమాలు

(C S Saleem)
ఒక సినిమా తీయడం ఎంత కష్టమో మనకు తెలియనిది కాదు. అయితే సినిమా సగంలో ఆగిపోతే మరీ కష్టం. అలా సగంలో ఆగిపోయిన, లేదా కొంత షూటింగ్ తర్వాత ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి . అలా ఆగిపోయిన చాలా సినిమాల వల్ల కొంతమంది నిర్మాతలు రోడ్డు మీద పడితే, మరి కొందరు కనిపించకుండా పోయారు. చాలామంది నష్టం భరించి ముందుకు సాగి ఆ నష్టాన్ని పూడ్చు కో గలిగారు.
మరుద నాయగం
తెలుగులో చాలా కాలం క్రితం భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో 1997 లో కమల్ హాసన్ హీరోగా ఎంజీఆర్ ఫిలిం సిటీ లో ” మరుద నాయగం” సినిమా, బ్రిటన్ మహారాణి సమక్షంలో అట్టహాసంగా ప్రారంభమైంది. అప్పట్లో దాని బడ్జెట్ 20 కోట్ల రూపాయలు. కమల్ హాసన్ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తూ కథను సమకూర్చుకున్న ప్రతిష్టాత్మక చిత్రం అది. బ్రిటీష్ మహారాణి స్వయంగా విచ్చేయడం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆరోజు మహారాణి కోసం ఒక పెద్ద స్క్రీన్ మీద కోటి రూపాయల తో చిత్రీకరించిన కొన్ని యుద్ధ సన్నివేశాలు ప్రదర్శించారు. ఈ ప్రారంభోత్సవ వేదికపై ముఖ్యమంత్రి కరుణానిధి, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, టీఎంసీ నేత మూపనార్ తో పాటు శివాజీ గణేషన్, అమ్రిష్ పురి వంటి నటులు ఉన్నారు. ఈ ప్రారంభోత్సవానికి దాదాపు అర కోటి దాకా ఖర్చు ఉండవచ్చునని అంచనా!
credits: wikimedia
ఈ చిత్రానికి మేకప్ కోసం అమెరికా నుండి ప్రముఖ మేకప్ మాన్ బారీ కూపర్ ని పిలిపించారు. అతని ఆధ్వర్యంలో ఒక మేకప్ వర్క్ షాప్ నిర్వహించారు. మరుద నాయగం వివాదాలు కొన్ని కమల్ ని ఇబ్బంది పెట్టాయి. మరుద నాయగం బ్రిటిష్ వారి కోసం పని చేశాడని, తర్వాత వ్యక్తిగత కారణాలతో వారితో పోరాడాడు అని, అది స్వాతంత్ర పోరాటం కాదని పలువురి అభిప్రాయం. మరుద నాయగం హిందూ మతాన్ని వదిలి ఇస్లాం మతం స్వీకరించాలని ఒక కథ ప్రచారంలో ఉంది.
అంతేకాకుండా మరుద నాయగం ఆర్కాట్ నవాబు తరఫున స్థానిక తిరుగుబాట్లను అణిచి వేయడానికి పని చేశాడని, ఫ్రెంచి వారితో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారికి సాయం చేశాడని కథలు కూడా ఉన్నాయి. కొన్ని ముస్లిం వర్గాలు మాత్రం మరుద నాయగం అసలు పుట్టుకతోనే మహమ్మదీయుడు అని (యూసుఫ్) ముస్లింగా మారిన హిందూ కాదని అతని గురించి ఎలాంటి వక్రీకరణలు ఒప్పుకోమని ప్రకటించాయి. దానికి తోడు “తెవర్” తెగ వారు కూడా మరుద నాయగం ని హీరో గా చూపించడం పట్ల మండిపడ్డారు. తమ తెగకు చెందిన తిరుగుబాటు నాయకుడు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న ‘పులి తేవార్’ అనే వీరుడిని అణిచి వేశాడని చెప్పారు. అంతేకాకుండా ఫెక్సి వర్కర్స్ సమ్మె మళ్లీ చేస్తారు అన్న భయం కూడా కమల్ ని వేదించింది. అయితే ఇవేవీ కాకుండా కేవలం డబ్బులు కొరత వల్లనే సినిమా ఆగిపోయింది! దాంతో కమల్ డబ్బుల కోసం’ హే రామ్’ సినిమా తీయడం, అది కాస్త ఫ్లాప్ కావడం జరిగింది. శ్రీరామ్ సినిమాకు ముందు కమల్ ని అడిగారు “ఇక మీరు nayagan సినిమా వదిలేసినట్లు లేనా’ అని, దానికి కమల్” ఇదేమన్నా లడ్డు నా, లేక ఆపిలా, వదిలేయడానికి? అంత భారీ బడ్జెట్ సినిమా అలా వదిలేయడానికి కుదరదు. దాదాపు గంట నిడివి చిత్రాన్ని చిత్రీకరించాం. ఇటువంటి దాన్ని వదిలే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అలాంటప్పుడు మళ్లీ కష్టపడి హే రామ్ తీయడం ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానం లేదు.
చిరంజీవి ‘అబూ’
సినిమా కెరీర్ లో ఉన్నత స్థాయిలో ఉన్న చిరంజీవి ని హీరోగా పెట్టి 1999లో ఇంగ్లీషు తెలుగు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్ తో “అబూ” చిత్రం ప్రారంభించబడి 40 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ద్వి భాషా భాష చిత్రం బడ్జెట్ దాదాపు 50 కోట్లు. అమెరికాలోని “ఇండస్” కంపెనీ అధినేత కె రమేష్ దీనికి నిర్మాత. ఎంతో మంది హీరోలను పరిశీలించి చివరకు చిరంజీవిని హీరో గా ఎన్నుకున్నారు.
1940లో తీసిన మొదటి సినిమాలో హీరోగా నటించిన సాబూ భారతీయుడు. ఈ సినిమా తీయడానికి ప్రోత్సహించిన వ్యక్తి జాస్మిన్ సాబు. ఈమె సాబు కుమార్తె. అందుకే ఈ సినిమాలో ఒక భారతీయ నటుడిని తీసుకోవాలన్నది ఆమె కోరిక. ‘అబూ బాగ్దాద్ గజదొంగ’ తెలుగు వెర్షన్ కి సురేష్ కృష్ణ దర్శకుడు. “అబూ ది రిట్ర్న్ ఆఫ్ థీఫ్ ఆఫ్ బాగ్దాద్” ఇంగ్లీష్ వెర్షన్ కి దర్శకుడు జెర్సీ. ఈ సినిమా కి ఎంత ఖర్చు చేశారో ఎవరికీ తెలియదు. అయితే నిర్మాణ దశలోనే దాదాపు 12 కోట్లు (తెలుగులో) బిజినెస్ చేయడం విశేషం. ఈ సినిమా కొనడానికి ఆంధ్ర ప్రాంత బయ్యర్లు పోటీ పడడం కూడా విశేషమే. మామూలుగా చిరంజీవికి ఉన్న రేటు కన్నా 50 శాతం అధికంగా రెమ్యునరేషన్ ఇవ్వటానికి నిర్మాతలు సిద్ధపడ్డారు.
అంతవరకూ చిరంజీవి నటించిన ఏ సినిమాకి అంత మొత్తంలో బిజినెస్ జరగలేదని పరిశ్రమ వర్గాల అభిప్రాయం. నేపాల్ నటి మనీషా కొయిరాలా తోపాటు, పెప్సీ మోడల్ సాష ను తీసుకున్నారు. హీరోయిన్ గా చార్లెట్ అయోన ను తీసుకున్నారు. మొదట ఈ చిత్రాన్ని మొరాకో లేదా టర్కీలో తీయాలనుకున్నారు. కానీ ఖర్చు తక్కువగా ఉండటం వల్ల, చిరంజీవి తో చిత్రం కనుక దర్శకుడు ఇంగ్లీష్ వర్షన్ ను భారత్ లోనే తీయాలనుకున్నారు. రాజస్థాన్ ఎడారి లో అర కోటి రూపాయలతో భారీ సెట్ వేసి చిత్రీకరణ జరిపారు. ఔరంగాబాద్, అజంతా ఎల్లోరా ప్రాంతాల్లో ఏకధాటిగా షూటింగ్ జరిగింది.
From Social Media
దాదాపు 300 మంది యూనిట్ సభ్యులు రాత్రింబవళ్లు పని చేశారు. ఈ చిత్రానికి సాంకేతిక తారాగణం దాదాపు హాలీవుడ్ నుంచి తీసుకోవడంతో ఖర్చు పెరిగింది. ఈ సినిమా కోసం రెండు పానావిజన్ కెమెరాలు, ఒక మోషన్ పిక్చర్ కెమెరా ఉపయోగించారు. కేవలం కాస్ట్యూమ్స్ కోసమే కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంత చేసినా ఈ సినిమాని మధ్యలోనే ఆపి వేయడానికి సరైన కారణాలు కనిపించడం లేదు.
బడ్జెట్ గురించి ముందే తెలుసు. పైగా పకడ్బందీ ప్లానింగ్ తో షూటింగ్ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగింది. పైకి డబ్బులే ప్రధాన కారణమని పరిశ్రమ భావిస్తోంది. చిరంజీవిని హాలీవుడ్ కు పంపించే ఈ భారీ చిత్రం ఆగిపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది. చిరంజీవి అంజి చిత్రం కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ అది చివరకు విడుదలైంది. చిరంజీవి తో మాస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ సురేష్ కృష్ణ కి కొంత నిరాశ కలిగింది.
బాలకృష్ణ భారీ చిత్రం
2001లో బాలకృష్ణ హీరోగా ఒక భారీ జానపద చిత్రం ప్రారంభమైంది. భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి సినిమా ఇది. విశాఖపట్నం దగ్గర 17 ఎకరాల స్థలంలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకున్న చిత్రం మధ్యలో ఆగిపోయింది. దీనికి కారణం స్పష్టంగా తెలియదు, అయితే బాలకృష్ణ కి, దర్శకుడు కోడి రామకృష్ణ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లనే ఈ చిత్రం ఆగిపోయిందని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఆప్పట్లో ఆ సినిమా కథ ప్రేక్షకులకు సరిపోదని బాలకృష్ణ అనుకున్నట్లు కూడా కొన్ని కొన్ని వర్గాల కథనం.
Balakrishna (Facebook timeline picture)
ఏమైనా సరే భారీ నష్టాన్ని గోపాల్ రెడ్డి కి ఈ సినిమా తెచ్చింది. భార్గవ్ ఆర్ట్స్ కు బాలకృష్ణకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అందుకే ఈ సినిమా ఎప్పుడో ఒకసారి ప్రారంభిస్తారు అనుకున్నప్పటికీ అది జరగలేదు. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీ లో వేసిన భారీ సెట్లో కొంత షూటింగ్ జరిగినా, తర్వాత కూడా ఆరు నెలల పాటు దానికి అదే చెల్లించారు. రోజు వారి అద్దె కొన్ని వేలల్లో ఉంటుంది. అలా కొన్ని లక్షల రూపాయలు వేస్ట్ అయ్యాయి ఎప్పుడో ఒకసారి మళ్లీ షూటింగ్ ప్రారంభం అవుతుంది అని సెట్ కి అద్దె కడుతూ వచ్చారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయవలసిన ఈ భారీ సినిమా ఆగి పోవడం వల్ల కొన్ని కోట్లు నష్టం వచ్చింది. విశాఖ సమీపంలో “నందగిరి” అని ఊరిని సృష్టించారు. ఖర్చుకు వెనకాడకుండా భవనాలు, ఇల్లు తోటలు సృష్టించారు. ఇంటి కప్పుల కోసం ఎంతో ఖర్చు పెట్టి ప్రత్యేకమైన పెంకులతో తయారు చేయించారు, దాదాపు మూడు వందల టన్నుల సర్వి కర్రలు కొన్నారు. భారీ స్థాయిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను వాడారు. ఈ సెట్ కు ఆయిన ఖర్చుతో ఓ మాదిరి తెలుగు సినిమా చేయొచ్చు అని నిర్మాత స్వయంగా చెప్పడం విశేషం.
అలనాటి దుస్తుల కోసం ఆర్ట్ డైరెక్టర్ ముత్తు రాజ్, నిర్మాత గోపాల్ రెడ్డి కేరళలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి అనేక వస్తువులు సేకరించి తీసుకొచ్చారు. ఈ సినిమా ఆగిపోవడం వల్ల హీరోగా బాలకృష్ణ కు ఎటువంటి నష్టం జరగలేదు. ఈ సినిమా కేవలం డబ్బు లేక ఆగిపోయింది అని మాత్రం చెప్పలేము. ఎందుకంటే భార్గవ్ ఆర్ట్స్ ఒక పెద్ద నిర్మాణ సంస్థ. బాలకృష్ణ తోనే ఎన్నో హిట్ చిత్రాలు . అందించింది. అటువంటి సంస్థకు నిధులు కొరత ఉండదు.
గత రెండు దశాబ్దాలుగా ఈ మూడు సినిమాలు మళ్లీ ప్రారంభమవుతాయన్న ఒక ఆశ కూడా ఆవిరైపోయింది. ఇక ఈ సినిమాలు ప్రారంభించే అవకాశాలు లేవు. ఈ మూడు సినిమాలే కాకుండా ఇంకా అనేకమైన సినిమాలు కూడా ప్రారంభదశలోనే ఆగిపోయాయి. దాంతో కొన్ని కోట్ల రూపాయలు నష్టం కలిగింది.
తెలుగు లో కాకుండా హిందీలో కూడా అలా చాలా సినిమాలు వెండి తెరకు ఎక్కకుండా డబ్బాల్లో, గోడౌన్లలో, ల్యాబుల్లో, స్టుడియో చీకటి గదుల్లో ఉండిపోయాయి. వాటి గురించి మరోసారి వివరంగా తెలుసుకుందాం.. ప్రస్తుతానికి సశేషం.
C S Saleem Basha
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)

 

Like this story?  Share it with a friend