తలైవి’ ట్రైలర్ వచ్చేసింది!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయరాం జయలలిత (1948 -2016) బయోపిక్ ‘తలైవి’ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. సినిమా విడుదలకి సరీగ్గా నెల రోజుల ముందు ట్రైలర్ విడుదల చేశారు. తమిళంలో ‘మదరాసి పట్టినమ్’ వంటి బ్రిటిష్ కాలపు అద్భుత పీరియెడ్ మూవీ నిర్మించిన దర్శకుడు ఏఎల్ విజయ్, ‘తలైవి’ తో మరో అద్భుతాన్ని ఆవిష్కరించ బోతున్నట్టు కన్పిస్తోంది. తమిళ తెలుగు హిందీ భాషల్లో పానిండియా మూవీగా విడుదలవుతున్న దీని ట్రైలర్ ని, సరీగ్గాఎన్నికల సమయంలో విడుదల చేయడం గమనార్హం.

        జయలలితగా కంగనా రణవత్ నటించిన ఈ బయోపిక్ ట్రైలర్లో జయలలిత జీవిత ప్రయాణాన్ని నటిగా ప్రారంభించారు. తర్వాత రాజకీయ జీవితం, ఆధిపత్యం, ఎదుగుదల చిత్రించారు. ఇందులో అరవింద్ స్వామి ఎంజిఆర్ గా, ప్రకాష్ రాజ్ కరుణానిధిగా, జిశ్శూ సేన్ గుప్తా శోభన్ బాబుగా కన్పిస్తున్నారు. జయలలితని  రాజకీయాల్లోకి స్వాగతించిన దిగ్గజ ఎంజిఆర్ నిర్ణయానికి కరుణానిధి తన అభ్యంతరం వ్యక్తం చేయడం కన్పిస్తుంది. జయలలిత వక్తృత్వ నైపుణ్యం, ఉన్నతస్థాయి ఇంగ్లీషు మాట్లాడే సామర్ధ్యం ఢిల్లీ నాయకుల్ని ఆకట్టుకున్నట్టుగా చూపించారు. జయలలిత కెరీర్లో ఎంజిఆర్ మరణం తర్వాత ఆమెను ఎలా అవమానించారో భావోద్వేగ భరితంగా ప్రేక్షకుల ముందుంచారు.

       ‘తలైవి’ (నాయకురాలు) ట్రైలర్ ఇప్పటికే వైరల్ అయింది. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్, తిరుమల్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నా ఈ బయోపిక్ ప్రొడక్షన్ విలువలు అద్భుతంగా వున్నాయి. సంగీతం జీవి ప్రకాష్ కుమార్ అందిస్తే, ఛాయాగ్రహణం విశాల్ విఠల్ సమకూర్చారు. ఏప్రెల్ 23 న విడుదలవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *