ఆదిలోనే చిత్రసీమను వదిలేసిన తెలుగు స్టార్ హీరో

(త్రిభువన్ )

ఇది తెలుగు సినిమా తొలి రోజుల మాట. ఆయన 1940లో మొదటి సినిమాలోనే ఆనాటి గొప్ప దర్శకుడి దర్శకత్వంలో అప్పటి డ్రీమ్ గర్ల్, స్టార్ హీరోయిన్ తో హీరోగా నటించారు. ఆ పైన వరసగా పెద్ద బ్యానర్లలో, అగ్రదర్శకుల సినిమాలు మరో మూడు. 

అంతే. ఆ తరువాత ఆయన కొన్ని సినిమా పోకడలతో రాజీపడలేక అంతా వదిలేసుకుని సాధారణజీవితం గడపడానికి మద్రాసునుంచి వెళ్లిపోయాడు. ఆ విలక్షణమైన వ్యక్తే వెల్లాల ఉమామహేశ్వరరావుగారు. అలాంటి అరుదైన వ్యక్తిగురించి ఈ తరం వాళ్లు తెలుసుకోవాల్సిన అవసరంవుంది. 

ఉమామహేశ్వరరావుగారు 1940 నుంచి 1946 వరకు నాలుగు సినిమాల్లో నటించారు. అవి ఇల్లాలు(1940), భాగ్యలక్ష్మి (1943), పంతులమ్మ (1943), నారదనారది (1946). అందులో రెండింటిలో అప్పటి స్టార్ హీరోయిన్లతో హీరోగా. 

చాలా అందమైన కథానాయకుడిగా, మంచి నటుడుగా పేరుతెచ్చుకున్న ఉమామాహేశ్వరరావు నటించిన మొదటి సినిమా ‘ఇల్లాలు’లో కథానాయిక, గ్లామర్ లో అప్పటికే డ్రీమ్ గర్ల్ గా ఎదిగిన కాంచనమాల గారు. అంతేకాదు, ఆ సినిమాకు ఆనాటి ప్రముఖ దర్శకుడైన గూడవల్లి రామబ్రహ్మంగారు దర్శకత్వం చేసారు.  

ఆ తరువాత ఆయన నటించిన సినిమా ‘పంతులమ్మ’కు పి. పుల్లయ్యగారు దర్శకులు., కథానాయిక అప్పటికే పేరెన్నికగన్న లక్ష్మీరాజ్యంగారు. ఈ లక్ష్మీరాజ్యంగారు ఆ తరువాత అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి, నిర్మాతగా మారి ‘నర్తనశాల’ నిర్మించారు.

ఉమామహేశ్వరరావుగారు చిత్తూరు నాగయ్యగారి ‘భాగ్యలక్ష్మి’, సి. పుల్లయ్యగారు దర్శకత్వం చేసిన ‘నారదనారది’లో మంచి ప్రాముఖ్యమున్న పాత్రలలో నటించారు. నారదనారది చిత్రంలో ఆయన కృష్ణపాత్రలో అందంగా కనిపించారు. ఆ నాలుగు చిత్రాల దర్శకులూ అలనాటి గొప్ప దర్శకులే, బ్యానర్లూ పెద్దవే. 

గాంధేయవాది ఐన ఉమామహేశ్వరరావుగారికి అప్పటికే సినిమారంగానికి చెందిన కొన్ని పోకడలమీద అయిష్టత కలిగింది. మంచి విలువలతో తానే ఒక మంచి సినిమా తీయాలని ఉద్దేశించి తనకంత ఆర్థిక స్థోమత లేకపోయినా మిత్రుల సహకారంతో అప్పటి ప్రఖ్యాత హీరోయిన్ భానుమతి కథానాయికగా ‘కలికాలం’ అనే సినిమా మొదలుపెట్టారు.

     సమాజ సంస్కరణకు సినిమా ఒక శక్తివంతమైన సాధనమని గుర్తించిన విషయంలో ఆయనను బియెన్ రెడ్డి గారు, గూడవల్లి గారి లాంటి దర్శకులతో పోల్చవచ్చు.

ఐతే ‘కలికాలం’ కారణాంతరాలవల్ల సగంలో ఆగిపోయింది. దాన్ని ఎలాగైనా పూర్తిచెయ్యాలని చాలా ప్రయత్నించి విఫలమయ్యాక అన్నీ వదిలేసుకుని ఆయన మద్రాసు వదలి వెళ్లిపోయారు. సాధారణంగా సినిమారంగం నచ్చక నటీమణులు వెళ్లిపోతూంటారు. ఇలా నటులు వెళ్లిపోవడం అరుదు.

 మధ్యతరగతి కుటుంబానికి, కడపజిల్లాకు చెందిన ఉమామహేశ్వరరావు చక్కటి రూపంతో, ఎత్తుగా, ఆరోగ్యంగా సినిమా హీరోకు ఉండాల్సిన అన్ని లక్షణాలను కలిగివుండిన మనిషి.  ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, రచయిత, రంగస్థల నటుడు. ఆయన 1911లో చిత్తూరు సమీపంలోని పుంగనూరులో జన్మించారు. ఆయన ప్రాధమిక విద్యాభ్యాసం చిత్తూరులో, హైస్కూలు చదువు కడపలో, ఇంటర్ మద్రాసులో, డిగ్రీ అనంతపురంలో పూర్తిచేసి మద్రాసులో లాకోర్సు చదివి అక్కడే లాయరుగా ప్రాక్టీసు ఆరంబించారు.

  ఉమామహేశ్వరరావుగారు మంచి కవి, రచయిత. అనంతపురంలో 1932 ప్రాంతల్లో డిగ్రీ చదువుతున్నప్పుడే ఆయన ఇతర సాహితిమిత్రులతో కలసి కవికుమారసమితి అనే సాహిత్య సంఘాన్ని ఏర్పరచి ‘క్రొక్కారు మెరుగులు’, ‘తొలకరి చినుకులు’ అనే ఖండకావ్యాలను రాసారు. ఆరోజుల్లోనే ఆయనకు ప్రముఖ కవి పుట్టపర్తి నారాయణాచార్యులుగారు మంచి స్నేహితులయ్యారు. ఆతరువాతికాలంలో వాళ్లిద్దరూ కడపలో ఒకేవీధిలో నివసించడం విశేషం.

బ్రిటిష్ వారి కాలంలోని మద్రాసురాష్ట్ర మంత్రిమండలిలో మంత్రిగారైన కడప కోటిరెడ్డి గారు ఒక సినిమా కంపెని ప్రారంభించి దానికి ఉమామహేశ్వరరావుగారిని లీగల్ అడ్వైజర్ గా తీసుకున్నారు. కోటిరెడ్డి గారు సినిమా నిర్మించదలిచి గూడవల్లి రామబ్రహ్మంగారిని దర్శకుడిగా, అప్పటి సూపర్ హీరోయిన్ కాంచనమాలగారిని కథానాయికగా తీసుకుని హీరో పాత్రధారికోసం అన్వేషణ మొదలుపెట్టారు. 

 ఆయన దృష్టి వారి లీగల్ అడ్వైజరైన ఉమామహేశ్వరరావుగారి మీద పడి, ఆయనకు నాటకానుభవంకూడా వుందని తెలిసి ఆయన్ను ఒప్పించి కథానాయకుడిగా తీసుకున్నారు. ఆ సినిమాయే ‘ఇల్లాలు’. ఆ సినిమా విజయవంతమైంది. ప్రముఖుల దృష్టి ఉమామహేశ్వరరవుగారిమీద పడి ఆ తరువాత ఆయనకు వరసగా మూడు సినిమాల్లో అవకాశాలొచ్చాయి.

  కోటిరెడ్డి గారికంటే ముందే 1939లో పి.పుల్లయ్య గారు ఉమామహేశ్వరరావుగారిని చూసి తను తీస్తున్న ‘బాలాజి’ (వెంకటేశ్వరమహత్యం)లో కథానాయకుడుగా తీసుకోవాలనుకున్నారనీ, కాని ఆయన ఆసక్తి చూపించలేదని అంటారు.

సినిమాలు మధ్యలో ఆగిపోవడం అసహజం కాదు. స్వంతంగా ప్రారంభించిన ‘కలికాలం’ సినిమా మధ్యలో ఆగిపోయిన తర్వాత తిరిగి నటుడిగా కొనసాగివుంటే నిలదొక్కుకునేవారు. సినిమారంగంలో అప్పటికే ఆయనకు స్టార్ స్థాయి వచ్చింది. కాని సినిమా రంగంమీద విరక్తి కలిగి ఆయన మద్రాసు వదలి వెళ్లిపోయారు.  

అలా వెళ్లిపోకుండా ఆయన మద్రాసులోనే వుండి అవకాశాలను అందిపుచ్చుకునివుంటే బహుశా మనకు మరో అందమైన కృష్ణ పాత్రధారి, నాగయ్యగారిలాంటి పెద్దహీరో, ఉండివుండేవాడు.

ఆయనకేమీ ఆస్తిపాస్తులు లేకపోయినా భార్యాపిల్లలతో సహా తన స్వంతవూరైన కడప జిల్లాలోని మన్నూరు అనే గ్రామానికి వెళ్లిపోయారు. ఆయన నటుడే కాదు మంచి రచయితకూడా. జీవనోపాధికోసం స్కూలు పిల్లలకు పుస్తకాలు రాసి ప్రచురించి వాటిని పాఠశాలల లైబ్రరీలకు అందించే పని చేసారు. 

ఆ సమయంలోనే ఆయన షేక్స్పియర్ నాటకాలను ఏమాత్రమూ పట్టు సడలకుండా, వాటి స్థాయి తగ్గకుండా తెలుగులోకి అనువదించారు. గాంధీజీ పుస్తకాలను అనువదించడమే కాక ‘మహాత్ముని అంతరంగము’ అనే పుస్తకాన్ని రాసారు. అవన్నీ చాలా ప్రజాదరణ పొందాయి. ఆ తరువాత ఆయన కడపకు మారి అక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకుని శేష జీవితం గడిపారు. 

ఆయన 1972 ప్రాంతాల్లో ‘లేపాక్షి’ అనే ఒక డాక్యుమెంటరీ చిత్రం నిర్మించారు. దీనికి ఘంటసాల మాస్టారు పద్యాలు పాడి వ్యాఖ్యానం చేయడం, సాలూరి రాజేశ్వరరావుగారు సంగీతం సమకూర్చడం విశేషం.

మద్రాసునుంచి వచ్చేసిన తరువాత ఆయన ఎక్కడా తాను ఆ కాలంనాటి స్టార్ హీరోయిన్లతో గొప్ప దర్శకులతో తీసిన సినిమాల్లో హీరోగా నటించిన వ్యక్తిగా ఏనాడూ డాబు ప్రదర్శించలేదు. తన  నివాసప్రాంతం మోచంపేటలోగాని, కడప నగరంలోగాని ఒక అతి సామాన్య వ్యక్తిగా జీవించారు. ఆతరువాతి తరంవారికి అయన ఒక రచయితగా మాత్రమే తెలుసు.

ఆయన తనువు చాలించిన 1991 వరకూ రచనా వ్యాసంగంలోనే గడిపారు. గొప్ప హీరోగా ఉన్నతస్థాయి సుఖవంతమైన జీవితం గడపాల్సిన ఉమామహేశ్వరరావుగారు కేవలం సినిమారంగంలోని కొన్ని పోకడలు నచ్చని ప్రధాన కారణంచేత అవన్నీ వదిలేసుకుని వచ్చి ఒక సాధారణ జీవితం గడపడం వింత గొలిపే విషయమైతే, తను సరైందనుకున్న గాంధేయ వాద జీవిత విధానంపట్ల, ఆదర్శాలపట్ల నిబద్ధతతో ఆపని చెయ్యడం ఆయన ధీటైన వ్యక్తిత్వానికి నిదర్శనం.

 

 

One thought on “ఆదిలోనే చిత్రసీమను వదిలేసిన తెలుగు స్టార్ హీరో

  1. May be we can call him the rarest of the rare actors. It’s good to know there were atleast few such people in the cinema field.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *