సైరా నరసింహారెడ్డి మూవీ రివ్యూ…

(సలీమ్ బాష)
ఎన్నో అంచనాలతో, ఒక భారీ సినిమాగా బాహుబలి తో పోలిక నేపథ్యంలో వచ్చిన “సైరా” సినిమా చివరకు చిరంజీవి నట జీవితంలో ఒక స్థాయి సినిమాగా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఇంత వరకూ చేయని సినిమాలు, ఇంతవరకు వేయని పాత్రలో చిరంజీవి సినిమాకు మూలస్తంభంగా తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్ తో సైరా ను ఒక స్థాయికి తీసుకెళ్లాడు.
సహజంగానే బాహుబలితో ప్రేక్షకులు దీన్ని పోల్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, సైరా సినిమాను ఒక ప్రత్యేకమైన సినిమాగా రూపొందించడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి సఫలం అయినట్లే.
ఇక మిగిలింది ఈ సినిమా వసూళ్ళ చర్చ మాత్రమే.
సినిమా ప్రారంభంలోనే ఇది  బ్రిటిష్ వాళ్ల మీద తిరుగుబాటు చేసిన కర్నూలు జిల్లా పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై ఆధారపడి తీసిన కాల్పనిక సినిమా మాత్రమే తెలివిగా చెప్పి ఇక వివాదాలకు తావు లేకుండా చేశారు.
ప్రారంభం నుంచి సినిమా మీద ప్రేక్షకులకు, నిర్మాత రామ్ చరణ్ కి. చిరంజీవికి ఎన్నో ఆశలు ఉన్నాయి. చివరికి. ఈ సినిమా ఆశలను వమ్ము చేయలేదు.
ముందే చెప్పినట్లు ఈ సినిమాకు చాలా బలమైన అంశాలు ఉన్నాయి. మొదటిది చిరంజీవే! ఈ సినిమాలో ఫైటింగులు కొరియోగ్రాఫ్ చేసిన విధానం మరొక బలం. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు ఒక బలం.
ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, నేపథ్య సంగీతం మరో బలం. ఇక నటీనటుల గురించి చెప్పడానికి ఏముంది. నయనతార, తమన్నా లకు చాలా కాలం తర్వాత నటించే అవకాశం ఉన్న పాత్రలు దొరికాయి. వాళ్ళు బాగానే నటించారు కూడా!
ఇక కన్న డ నటుడు సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, హిందీ భోజ పురి నటుడు రవి కిషన్, మన జగపతిబాబు ఉన్నారు. ఇంక చిన్నాచితకా నటులు నటీమణులు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టడం కష్టం. మరీ ముఖ్యంగా అమితాబచ్చన్!
తక్కువ నిడివి పాత్రయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాకు, ప్రమోషన్లకు ముఖ్యమైన పాత్ర వహించాడు. ఇన్ని ఉన్న తర్వాత సినిమా బలహీనంగా ఉండే అవకాశాలు తక్కువ!
అయితే అంచనాలు పెరిగిపోవడం వల్ల సినిమా వాళ్ళకి కొంత టెన్షన్ ఉన్నప్పటికీ ఇప్పుడు వాళ్లు కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది.
ఇక సినిమా కథ గురించి ముందే చెప్పినట్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం లోంచి కొన్ని భాగాలను తీసుకొని అల్లుకున్న కథ కాబట్టి సినిమాటిక్ అంశాలను జోడించడం లో దర్శకుడికి చాలా స్వేచ్ఛ దొరికినట్టే. దాంతో ఈ సినిమాను కమర్షియల్ గా తీర్చిదిద్దడానికి అవకాశం కలిగింది.
ఏమాటకామాటే చెప్పుకోవాలి అంటే దర్శకుడు ఈ సినిమాని బాగా తీసినట్లే. చాలా సన్నివేశాల్లో ప్రేక్షకులు లీనమైపోయి ఎమోషనల్ గా ఫీలవుతారు.  చిరంజీవి ఈ చిత్రాన్ని తన మంచి చిత్రాల జాబితాలో కచ్చితంగా పెట్టుకోవచ్చు. చాలాచోట్ల( వయస్సు పై పడినప్పటికీ) విశ్వరూపం చూపించాడు. క్లైమాక్స్ లో చిరంజీవి పలికిన సంభాషణలు సినిమాకి హైలైట్స్. చాలాచోట్ల సంభాషణలు సన్నివేశాలకు ప్రాణం పోస్తే, కొన్నిచోట్ల సన్నివేశాలే సంభాషణలకు బలమయ్యాయి.
ఇతర భాషా నటీనటుల్లో సుదీప్ కి మంచి పాత్ర దొరికింది. దాన్ని సమర్థవంతంగా పోషించాడు కూడా! అమితాబచ్చన్ గురించి చెప్పేదేముంది. ఏ పాత్రలోనైనా ఒదిగి పోయే స్థాయి ఉన్న నటుడు.
నిజానికి బాహుబలి తో పోలిస్తే ఈ సినిమాలో ఫైటింగులు బాగున్నాయి అనిపిస్తుంది. దానికి కారణం చిత్రీకరణతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ తక్కువగా వాడటం కావచ్చు. పైగా బాహుబలి ఒక కాల్పనిక కథ.
ఈ సినిమా కూడా చాలా మటుకు కల్పితమే అయినప్పటికీ, చారిత్రక క్యారెక్టర్ ఆధారంగా తీయడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. దీనికి బాహుబలికి అదే తేడా! పైగా ఈ సినిమాలో చిరంజీవి హీరో. సాహో, బాహుబలి సినిమాల్లో ప్రభాస్ హీరో. ఇతనికి అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ చిరంజీవితో పోల్చలేము.
సినిమా మొదట్లో ఝాన్సీ రాణి పాత్రలో అనుష్క మరోసారి మెరిసింది. అమె పాయింట్ ఆఫ్ వ్యూ లో కథ నడుస్తుంది. అది కొంచెం అతిశయోక్తి అయినప్పటికీ, కొత్తగా అనిపించడం వల్ల ప్రేక్షకులు థ్రిల్లింగా  ఫీలవుతారు.
సినిమాకు పెట్టిన ఖర్చు భారీగానే ఉంది అనిపించేలా సెట్లు ఉన్నాయి. కళా దర్శకత్వం తన ప్రతిభను చూపించింది. మొత్తం మీద కొన్ని బలహీనమైన అంశాలను అనేక బలమైన అంశాల ద్వారా కవర్ చేసి తీసిన సైరా ప్రేక్షకులను మెప్పించడం ఖాయం.
చాలా కాలం క్రితం ఖైదీ సినిమా లో పోలీసులను చితక్కొట్టిన చిరంజీవి ఆ సినిమా హిట్ చేశాడు. ఇప్పుడు మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలు దుర్మార్గంగా పాలించిన బ్రిటిష్ వాళ్లను కత్తి కో కండగా నరకటం ప్రేక్షకుల ఈలలకు కారణం కావడం ఆశ్చర్యకరం ఏమీ కాదు. ముఖ్యంగా, దుర్మార్గుడైన బ్రిటిష్ అధికారి ని వెంటాడి చంపడం ప్రేక్షకులను రంజింప చేయవచ్చు.
తమన్నా ఒక బ్రిటిష్ స్థావరంలో పైట కొంగు కి నిప్పంటించుకుని చేసిన నృత్యం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఆ మొత్తం సన్నివేశం సినిమాకు మరో హైలైట్. ఇలాంటి సన్నివేశాలు అనేకం ఉన్నాయి.
మొత్తం మీద భారీ ఖర్చుతో, అంచనాలతో, మీడియా కథనాలతో విడుదలైన సైరా నటుడిగా చిరంజీవికి, నిర్మాతగా రామ్ చరణ్ కి, దర్శకుడిగా సురేందర్ రెడ్డికి సంతోషాన్ని కలిగించవచ్చు. చివరగా సైరా సినిమా ప్రేక్షకుల చేత “ఔరా” అనిపించుకున్నా ఆశ్చర్యం లేదు.