నాటి అమ్మాయిల్ని ఆకట్టుకున్న ‘సాధనా కటింగ్’ గురించి విన్నారా?

(సిఎస్ సలీమ్ బాషా)
సినిమాలు ఫ్యాషన్ ని సృష్టిస్తాయి. సినిమాల వల్ల సమాజం ప్రభావితం కాదు అనేది అబద్ధం. సినిమా ఎలాగైతే జీవితం నుంచి కథని తీసుకుంటుంతో జీవితమూ సినిమా నుంచి చాలా విషయాలు స్వీకరిస్తుంది. ఇందులో ఫ్యాషన్ ఒకటి.  అభిమాన తారలు తెరమీద  ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం ధరిస్తున్నారు, జుట్టెలా దువ్వుకున్నారు, ఏం తింటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు… ఇలా అన్నీమనల్ని ప్రభావితం చేస్తాయి.
ఇలా వెస్టులో హాలివుడ్ సృష్టించిన ఫ్యాషన్ ట్రెండ్స్ కు లెక్కే లేదు. ఇది  బాలివుడ్ లోనూ ఉంది. అంతగా కాకపోయినా కొంతయినా తెలుగులో కూడా ఉంది.
ఉదాహరణకు బాబి (1973) సినిమాని తీసుకోండి. ఎన్ని ఫ్యాషన్ ట్రెండ్స్ తీసుకువచ్చింది, ఆ చిత్రం!. బాబి రిబ్బన్లు వచ్చాయి. బాబి కాలర్లు వచ్చాయి. ఇవి చాలా కాలం భారత దేశాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏలిన  ఫ్యాషన్ ట్రెండ్స్ అవి .
ఇంకా కొంచెం వెనక్కిపోతే, సాధన కటింగ్   అనే హెయిర్ స్టయిల్ దశబ్దాల పాటు అమ్మాయిల ఫ్యాషన్ ట్రెండ్ అయింది. ఈ ఫ్యాషన్ కు అరవై యేళ్లు పడ్డాయి. ఇపుడూ అక్కడక్కడా కినిపిస్తూనే ఉంటుంది. దీని మీద సినిమా విమర్శకుడు సలీమ్ బాష  విశేషం వ్యాసం ఇది
సలీం బాష
1960-70 మధ్యకాలంలో “సాధనా కటింగ్” అంటే తెలియని కన్నెపిల్లలు లేరంటే అతిశయోక్తి కాదు. అది అమ్మాయిల్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే చాలామంది అలాంటి కటింగ్ ని చేయించుకున్నారు. ఒక దశాబ్దం పాటు ఎన్నో హిట్ సినిమాల్లో తన అందంతో, నటనతో, హెయిర్ కటింగ్ తో ప్రేక్షకులను, అమ్మాయిలను ఉర్రూతలూగించి,  సాధనా శివదాసాని 74వ యేట క్యాన్సర్ తో బాధపడుతూ  2015 డిసెంబర్ 25న కన్నుమూశారు. సాధన బాలివుడ్ స్వర్ణయుగమయిన 1960-70ల మధ్య హిందీ సినిమా సామ్రాజ్ఞి అంటే ఆశ్చర్యం. ఆమె హెయిర్ స్టయిల్ ఇండియాని చుట్టు ముట్టింది. దాని సాధనా కటింగ్.

సాధన హెయిర్ కటింగ్ వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అప్పట్లో నుదుటి మీదికి జుట్టు చివర్లను అలా వదిలేయడాన్ని”fringe haircut” అనేవాళ్ళు. చాలా మంది సాధనను చూసి ఆ కటింగ్ చేయించుకుంటే, ఈసాధనకు ఈ కటింగ్ చేయించడానికి కారణం ప్రముఖ హాలీవుడ్ (బ్రిటీష్) నటి Audrey Hepburn! ఆమె హెయిర్ కట్ అలా ఉండేది.
ఆ విధంగా Audrey Hepburn తో ప్రభావితమై తో ప్రభావితమై సాధన హెయిర్ కటింగ్ మార్చబడి తే, ఆమెను చూసి ఇండియాలో చాలామంది అమ్మాయిలు  తమ హెయిర్ కట్ మార్చుకున్నారు. తల్లితండ్రులు కూతళ్లని  సాధనా హెయిర్ కటింగ్ తో చూసి మురిసిపోయేవాళ్లు  . అలా హెయిర్ కట్ కు అలవాటు పడ్డ అమ్మాయిల్లో మా చెల్లెలు కూడా ఉంది.
( కాకపోతే 2 సంవత్సరాల వయసులో, పై ఫోటోలో కుడిచివర ఉన్న అమ్మాయి ) 1963 లో మా ఇంట్లో కూడా మా చెల్లికి సాధనా కటింగ్ జరిగింది.
మా అమ్మకి సాధన అంటే చాలా ఇష్టం. ఆమె పాట ” లగ్ జా గలే” ను మా అమ్మ తరచూ హమ్ చేసేది! సాధన సినిమాలు చూసిన మా అమ్మ, మా చెల్లికి స్వయంగా తనే సాధన కటింగ్ చేసింది . అప్పట్లో ఆడపిల్లలకి జడ వేయాలన్న, జుట్టు కత్తిరించాలి అన్నా అమ్మనో, పెద్దక్క పెద్దక్క నో చేసేవాళ్ళు.
1960 లో హీరోయిన్ గా తన మొదటి సినిమా “లవ్ ఇన్ సిమ్లా”. అప్పటి ప్రముఖ నిర్మాత ముఖర్జీ తన కుమారుడు జాయ్ ముఖర్జీ హీరోగా ఆ సినిమా తీశాడు. దర్శకుడు ఆర్.కె. నయ్యర్
“నీ నుదురు విశాలంగా ఉంది, దానికి కొంచెం తగ్గించాలంటే (Audrey Hepburn లాగా) నుదురు మీదుగా కొన్ని వెంట్రుకలు అలా వదిలేస్తే, నుదురు చిన్నదిగా ఉంటుంది. చూడటానికి కూడా బాగుంటుంది అని” ఇచ్చిన సలహానే ఈసాధన కటింగ్ కి దారి తీసింది.
ఈ సినిమా (షూటింగ్ సందర్భంగా) దర్శకుడు నయ్యర్, సాధన మధ్య ప్రేమ పుట్టి, పెళ్లికి దారి తీయటం ఒక విశేషం. లవ్ ఇన్ సిమ్లా, అలా తన పేరును సార్ధకం చేసుకుంది.
సాధన ఒక ఒక సింధీ కుటుంబంలో పుట్టింది. తల్లిదండ్రుల ఒకటే కూతురు కావడం వల్ల, ఆమెని గారాబంగానే పెంచారు. నటి బబిత తండ్రి, సాధన తండ్రి అన్నదమ్ములు. సాధన కుటుంబం కరాచీ లో ఉండేది. విభజన సమయంలో ఆ కుటుంబం ముంబై చేరింది. ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా కూడా సాధన రోజుకు రెండు సినిమాలు చూసేది.అలా సాధనకు సినిమా యాక్టర్ కావాలనే కోరిక కలిగింది.
హిందీ సినిమా రంగంలో ఆమె మేకప్ వేసుకున్న మొదటి సినిమా రాజ్ కపూర్ Shree 420. అందులో ” ముడ్ ముడ్ కే న దేఖ్ ” పాటలో కోరస్ డాన్సర్ గా నటించింది. తర్వాత 1958 లో ” అబ్బన” ఒక సింధీ సినిమాలో హీరోయిన్ షీలా రమణికి చెల్లెలిగా నటించింది. ఆమె షీలా రమణిని ఆటోగ్రాఫ్ అడిగినప్పుడు ” ఎప్పుడో ఒకసారి నేను నీ ఆటోగ్రాఫ్ కోసం వస్తాను” అని రమణి చెప్పింది. 1960లో హీరోయిన్ గా నటించిన ” లవ్ ఇన్ సిమ్లా ” ఆమె రీలు జీవితాన్ని, రియల్ జీవితాన్ని కూడా మార్చేసింది.
1960 వ శతాబ్దం బాలీవుడ్ లో గోల్డెన్ ఎరా గా ప్రసిద్ధి చెందింది. అందుకు సాధన కూడా ఒక కారణం. సాధన 1969 – 70 మధ్యలో అప్పట్లో పాపులర్ అయిన హీరోలందరితో నటించింది. 1961 దేవానంద్ హీరోగా వచ్చిన “హం దోనో” సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చింది. దాని తర్వాత రాజేంద్ర కుమార్ తో “మేరే మెహబూబ్” సినిమా సూపర్ హిట్ అయింది. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన “ఆర్జూ” సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధించింది. అలా దశాబ్దం పాటు సాధన బాలీవుడ్ లో ఒక స్టార్ గా వెలిగింది.
1963లో వచ్చిన ” మేరే మెహబూబ్” సినిమా లో రాజేంద్ర కుమార్ మొదటిసారి సాధనను కలిసినప్పుడు బురఖా లోంచి ఆమె కళ్ళను మాత్రమే చూసే సన్నివేశం హిందీ సినిమాల్లో ఒక మరపురాని సన్నివేశం గా చెప్పుకుంటారు . ప్రతినాయక పాత్రలు వేసే Danny Denzongpa ఈ సన్నివేశం చూసి ఫిదా అయిపోయాడు. ఈ సన్నివేశం దర్శకుడు హెచ్ ఎస్ రవైల్ దర్శకత్వ ప్రతిభ కు సాధన అందానికి ఉదాహరణలు.
ఆమెకు మిస్టరీ గర్ల్ అని పేరు. దీనికి కారణం దర్శకుడు రాజ్ ఖోస్లా తీసిన మూడు సస్పెన్స్ థ్రిల్లర్ లు “ఓ కౌన్ థీ’, “మేరా సాయ”, “అనిత” లలో ఆమె నటించడమే. ఆ మూడు సినిమాలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. “ఓ కౌన్ థీ’, మేరా సాయ సినిమాల్లో ఆమె ద్విపాత్రాభినయం చేసింది. మేరా సాయ సినిమా లో “ఝుంకా గిరారే బరేలీకి బాజార్ మే” పాట చాలా పాపులర్ అయింది.

 

ఓ కౌన్ థీ’లో ”లగ్ జా గలే” పాట గురించి చెప్పనవసరం లేదు. ఆ పాటలో అదీ బ్లాక్ అండ్ వైట్ లో సాధన హెయిర్ కట్ తో పాటు, ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

 

థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ బోస్టన్లో చికిత్స పొందిన తర్వాత ఆమె కొన్ని సినిమాలు మాత్రమే చేయగలిగింది.1974 లో గీతా మేరా నామ్ సినిమాను తన దర్శకత్వంలో నిర్మించింది. తర్వాత సినిమా రంగం నుంచి తప్పుకుంది. 1995 లో భర్త ఆర్.కే.నయ్యర్ చనిపోయిన తర్వాత పూర్తిగా వంటరి అయిపోయింది. కోర్టు కేసులు అనారోగ్యం ఆమెను మరింతగా కృంగదీశాయి. 2015 క్రిస్మస్ పండుగ రోజు ఆమె శాశ్వతంగా సెలవు తీసుకుంది.

 

Saleem Basha CS
(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం  ప్రవృత్తి – 9393737937)

 

ఇది కూడా చదవండి
“ఝుంకా గిరారే బరేలీకి బాజార్ మే” పాట వెనక కథ

పడిపోయిన యాబైనాలుగేళ్ల తరువాత బరేలికి దొరికిన జుంకా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *