అతని పాట జలపాతం.. ఉరకలు వేసే ఉత్సాహం

(CS Saleem Basha)

(ఈ రోజు, ఆగస్టు 4 హిందీచిత్ర గాయకుడు కిశోర్ కుమార్ జయంతి)

నాలుగు రోజుల క్రితం ప్రశాంతంగా పారే నది గురించి రాసిన తర్వాత, ఉరకలు వేసే జలపాతం గురించి రాయటం ఎంత కష్టమో , మహమ్మద్ రఫీ గురించి రాసిన తర్వాత, అభాస్ కుమార్ గంగూలీ (!) గురించి రాయటం కూడా అంతే కష్టం! జలపాతాన్ని ఒడిసి పట్టడం ఎంత కష్టమో కిషోర్ కుమార్ గురించి నాలుగు ముక్కలు రాయడం కూడా అంతే ! అతని పాట గలగలపారే గోదారి లాంటిది, ఎగిసిపడే కెరటం కన్నా తక్కువ కాదు. రఫీ పాట అంటే గుండెల్లో తడి, కిషోర్ పాట అంటే గుండెల్లో అలజడి. ఈ రోజు కిశోర్ దా (ఆగస్ట్ 4) పుట్టిన రోజు
కిషోర్ దా అనబడే అభాస్ కుమార్ గంగూలీ, కుర్రకారుని వెర్రెత్తించాడు, తనతోపాటు పరుగులు పెట్టించాడు. కిషోర్ ఒక సంచలనం. దాదా ముని అనబడే అశోక్ కుమార్ తమ్ముడిగా కన్నా, పాటల ప్రపంచంలో తనదంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతని పాట , ప్రవర్తన రెండూ వైవిధ్యభరిత మే! బాలీవుడ్ లో కిషోర్ కు ముందు కిషోర్ కు తర్వాత అనబడే కాలాన్ని సృష్టించిన గాయకుడు, నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు కిషోర్ కుమార్. బహుముఖ ప్రజ్ఞాశాలి. మేధావులకి, కళాకారులకి, సృజనాత్మక జీవులకి వేపకాయంత వెర్రి ఉంటుందంటారు. కాకపోతే కిషోర్ కుమార్ కి వెలగ పండు అంత వెర్రి ఉండడంవల్ల వ్యక్తిగతంగా పెద్దగా స్నేహితులు లేనప్పటికీ ( ఒక సందర్భంలో అతనే చెప్పాడు. ఒక రిపోర్టర్ “స్నేహితుల” గురించి అడిగితే, ” నాకు స్నేహితులు లేరు” అని చెప్పి ఆ రిపోర్టర్ ని తన ఇంట్లో ఉన్న చెట్లను స్నేహితులుగా పేరుపేరునా పరిచయం చేశాడట!!) అతని పాటంటే ఇష్టపడే (నాతో సహా) లక్షల మంది అభిమానులు ఉండటం విశేషం!

కిశోర్ కుమార్ పాడని పాట లేదు. అన్ని రకాల పాటలు అలవోకగా పాడటం అతనికే చెల్లింది. కామెడీ,మెలడీ తో పాటు అతనికే ప్రత్యేకమైన ” యోడెలింగ్” (Yodeling is a form of singing which involves repeated and rapid changes of pitch between the low-pitch chest register or “chest voice” and the high-pitch head register) పాటలో జోడించటం కిషోర్ ప్రతిభ. అందాజ్ సినిమాలో “జిందగీ ఏక్ సఫర్ హై సుహానా, “ ప్యార్ కా మౌసం సినిమాలో “తుం బిన్ జావు కహ”, మేరే జీవన్ సాథీ సినిమాలో “చలా జాతాహు కిసికే ధున్ పే” వంటి పాటల్లో ఈ ప్రయోగాన్ని చూడవచ్చు . హాలీవుడ్ గాయకుడు జిమ్మి రోడ్జర్స్, న్యూజీలాండ్ కళకారుడు టెక్స్ మోర్టాన్ వల్ల ప్రభావితమైన కిశోర్ “యోడెలింగ్” ను పాటల్లో ఉపయోగించే వాడు. బాలీవుడ్లో కిషోర్ కుమార్ మాత్రమే దీన్ని ప్రయోగించాడు. కుర్రకారుని హుషార్ ఎక్కించింది, ఈ రకమైన ప్రయోగమే. అయితే కిషోర్ పాడిన ఆణిముత్యాల్లాంటి ఇతర పాటలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. Eccentric పర్సనాలిటీ గా, డబ్బులు ఇస్తే తప్ప పాట పాడని డబ్బు మనిషిగా, పేరు పడినప్పటికీ, అతని గొంతు నుంచి మాత్రం ఆణిముత్యాలే జాలువారాయి. అది కిషోర్ టాలెంట్.
కిశోర్ కు రవీంద్రనాథ్ ఠాగుర్ స్ఫూర్తి, కే.ఎల్.సైగల్, హాలీవుడ్ నటుడు గాయకుడు డాన్ని కాయె ల అభిమాని. అందుకే అయన ఇల్లు “గౌరి కున్” లో వారి చిత్ర పటాలను గోడకి అలంకరించుకున్నాడు. వారికి నమస్కరించటం అతని దినచర్య. తన కెరీర్ తొలినాళ్ళలో కిశోర్ కే.ఎల్.సైగల్ ను అనుకరించేవాడు. ఎస్.డీ.బర్మన్ సలహా మేరకు సొంత బాణిని అలవాటు చేసుకున్నాడు.
1969 లో వచ్చిన “ఆరాధన” తో కొత్తగా వచ్చిన రాజేశ్ ఖన్నా తన ఎంట్రీ ఇచ్చాడు. .. అప్పటికే షమ్మి కపూర్, దేవానంద్ ల రొమాంటిక్ యుగం చివరి దశలో ఉంది. ఈ సినిమాతో కిశోర్ తన సత్తాను ప్రపంచానికి చూపించాడు. ఇద్దరూ కుర్రకారును ఉర్రూతలూగించారు, మనసులని దోచేశారు. అంతవరకూ రాజేశ్ ఖన్నాకు ఒక్క పాటకూడ పాడని కిశోర్ ఈ సినిమాతో “రాజేశ్ వాయిస్” గా మారిపోయాడు. ఈ సినిమాలో పాటలన్ని హిట్. ముఖ్యంగా “మేరి సప్నోంకి రాణి కబ్ ఆయేగితూ” అన్న పాటను హం చెయ్యని యువకులు లేరంటే అతిశయోక్తి కాదు.(ఈ పాటని, 1973 లో వచ్చిన బాబీ సినిమాలో “హం తుం ఎక్ కమ్రే బంధ్ హో” కొంచెం మరిపించింది). ఇప్పటికి కూడా ఇది జనం పాడుకుంటున్నారు. అంతగా జనంలోకి వెళ్ళిన పాట ఇది.
ఈ పాటను అప్పట్లో బుల్ బుల్ తార (బ్యాంజో) నేర్చుకునే వాళ్ళంతా ఈ పాటనే ప్రాక్టీస్ చేసేవారు. నాకు కూడా ఈ పాట నేర్చుకోటానికి ఓ నెల పట్టింది. “కోరా కాగజ్ థా ఏ మన్ మేరా” పాట, బాన్సురి (ఫ్లూట్) నేర్చుకునే వారు ప్రాక్టిస్ చేసేవారు! ఈ సినిమా ఒక నూతన శకానికి నాందీ పలికింది. ఇందులోని “రూప్ తెరా మస్తానా” పాట కిశోర్ కుమార్ కి మొదటి Filmfare award (1970) వచ్చింది. అలాగే అప్పటివరకు కేవలం 6 సినిమాలు మాత్రమే చేసిన ఖన్నాకి “ఆరాధన” చాలా సాయం చేసింది. తిరుగులేని స్టార్ డం సంపాయించి పెట్టింది. అలా భారత సినిమా చరిత్రలో మొదటి సూపర్ స్టార్ ఉద్భవించాడు.
తర్వాత వరసగా.1969-71 మధ్య కాలంలో 15 సోలో హిట్ చిత్రాల రికార్డ్ అతని పేరు మీదే ఉంది. ఇదంతా ఒక్క సినిమా ప్రభావమే మరి! 1966 లొ వచ్చిన “ఆఖ్రీ ఖత్”(చివరి లేఖ) రాజేశ్ ఖన్నా మొదటి సినిమా కావటం యాదృచ్చికం! కిశోర్ అంతకుముందునుంచి ఉన్నప్పటికీ ఈ సినిమాతో తారాపథంలోకి (రాజేశ్ ఖన్నా తొ కలిసి) దూసుకు పోయాడు. ఈ సినిమాకు ఎస్.డీ.బర్మన్ సంగీత దర్శకుడు అయినప్పటికి, సహాయ సంగీత దర్శకుడిగా రికార్డింగ్ మొత్తం ఆర్.డీ.బర్మనే చేశాడు.
అక్కడ్నుంచి RKR యుగం మొదలయ్యింది. RKR అంటే రాజేష్ ఖన్నా, కిశోర్, ఆర్.డీ.బర్మన్. ఈ ముగ్గురి కలయిక ఒక కొత్త వేవ్ ను సృష్టించింది. ఈ కలయికలో ఒక దశాబ్దం పాటు 32 సినిమాలు వచ్చాయి. దాదాపుగా అన్ని హిట్, పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. అప్పటివరకు ఉన్నత స్థాయిలో ఉన్న మహమ్మద్ రఫీని కిశోర్ కుమార్ మ్యాజిక్ వెనక్కి నెట్టింది.
గైడ్ సినిమాలో “గాతా రహే మేర దిల్” (నా ఫేవరైట్)పాట వింటే నిజమేననిపిస్తుంది. ఇంకా ముకద్దర్ కా సికందర్ సినిమాలో “రోతే హుయే ఆతే హై..”, “ఓ,సాథీ రే” విన్నా అలాగే ఉంటుంది. కామెడీ పాటలు ఎన్నో పాడిన కిశోర్, “పడొసన్” సినిమాలో పాటలతో పాటు కామెడి కూడా చెయ్యగలనని చూపించాడు. ” మేరె సామ్నే వాలి ఖిడికి మే” పాట, మహమూద్ పాత్రతో, “ఎక్ చతుర నార్..” వంటివి కిశోరే పాడగలడు. సాఫ్ట్ పాటలు కూడా ఎన్నో పాడాడు. నాకు “ఖామోషి” సినిమాలో ” ఏ షాం కుచ్ అజీబ్..” అంటే ఇష్టం. జహరీలా ఇన్సాన్ లో పాడిన “ఓ హన్సిని..” సుపర్బ్ సాంగ్. రొమాంటిక్ పాటలు సెలెక్ట్ చేసుకోవటం కొంచెం కష్టమే. అయినా మచ్చుకి కొన్ని చూద్దాం.(ఇవి కేవలం నా సెలెక్షన్ మాత్రమే) మేరే జీవన్ సాథి లో ” ఓ మెరే దిల్ కె చయిన్.” పాట చాలా బావుంటుంది. ఆరాధన లో “కోరా కాగజ్..”, కోరా కాగజ్ లో “మేరా జీవన్” (అఫ్ కోర్స్ విషాద గీతం అనుకోండి.) కిశోర్ సిగ్నేచర్ సాంగ్స్.ఇంకా కటి పతంగ్ లో ఆహ్లాదకరమైన “ఏ షాం మస్తాని..మద్ హోశ్ కియె జాయ్”, ప్రేం పూజారి సినిమాలోని “షోకియోమే ఘోలా జాయే”, యారానా (అమితాబ్) లోని “చూకర్ మేరె మన్ కో.” నాకు నచ్చిన పాటల్లో కొన్ని. విషాద గీతాల్లో కూడా కిశోర్ స్వరానికి తిరుగు లేదు. సఫర్ సినిమాలోని, “జిందగీ కా సఫర్..”,అమర్ ప్రేం లో “కుచ్ తో లోగ్ కహేంగే”, “చింగారి కోయి భడ్కే” పాటలు కూడా కిశోర్ సిగ్నేచర్సే! దూర్ గగన్ కీ చావ్ సినిమా లోని “ఆ లేకే చలూ..” పాట కిశోర్ స్పెషల్.(ఈ పాట తనే రాశాడు)
“Kishore’s voice hits the mike, straight, at its most sensitive point — and that’s the secret of his success as a singer without peer!” (source: rediff.com)
(“కిశోర్ స్వరం, మైక్ లోని సున్నితమైన భాగాన్ని నేరుగా తగులుతుంది. అదే అతని విజయానికి కారణం”-) తమ్ముడి గురించి పెద్దన్న అశోక్ కుమార్ అభిప్రాయం. నిజమే! ఇదే కిశోర్ ని గొప్ప గాయకుడిని చేసింది. కిశోర్ గొప్ప గాయకుడిగా గుర్తించబడటానికి 23 సంవత్సరాలు పట్టింది. అదీ ఆరాధనతో(1970) మొదలు. దాని తర్వాత 17 సంవత్సరాలు అతనివే!
బిమల్ రాయ్ తీసిన “నౌక్రి” సినిమాలో కిశోర్ హీరో.అయితే ఆ సినిమా సంగీత దర్శకుడు సలిల్ చౌదరి, కిశోర్ కి శాస్త్రీయ సంగీతం లో ప్రవేశం లేదని పాట పాడించటానికి ఒప్పుకోలేదు. నువ్వు పాడిన ఒక్క పాట కూడా నేను వినలేదు. ఏలా పాడించమంటవు?” అని చెప్పి, ఆ పాటను( చోటాసా ఘర్ హో గా) హేమంత కుమార్ తో పాడించటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు కిశొర్ అతని కాళ్ళావేళ్ళ పడి బతిమాలి తాను “జిద్దీ” సినిమాలొ దేవానంద్ కు పాడిన పాట ” మర్నే కి దువా క్యూ మాంగూ” వినమన్నాడు. చౌదరీ ఆ పాట విన్నాడు.అంతే! మిగతాది చరిత్రే!
అ పాట మీరు వినొచ్చు.( కిశోర్ ని విజయం వైపు నడిపించింది ఈ పాటనే)

ఆ తర్వాత నౌక్రి సినిమాలో “చోటాసా ఘర్..” పాటను సలిల్ చౌదరి కిశొర్ తోనే పాడించాడు. ఈ వీడియో అదే!

తర్వాత సలిల్ చౌదరి ఇలా చెప్పుకొచ్చాడు.”కిశోర్ లోని ప్రతిభను ఎస్.డీ.బర్మన్ ముందుగానే గుర్తించటం మంచిదయ్యింది. మాలాంటి కంపోజర్స్ కిశోర్ ని తక్కువ అంచనా వేశాం. మేరే అప్నే లో కిశోర్ పాడిన “కోయి హోతా జిస్ కో అప్నా హం అప్నా కెహలేతే యారో..” అన్న పాట తర్వాత కిశోర్ ప్రతిభను నేను ఎంత తప్పుగా అంచనా వేశానో అర్థమయ్యింది.”
తమాషా ఏంటంటే అ పాట అర్థం కూడా అదే “మనవాళ్ళూ అని మనం అనుకోటానిక్ మనకు ఒకరు ఉంటే బావుంటుంది మిత్రమా.” అలా కిశోర్ కి ఒకరుండటమే(?) మంచిదయ్యింది.
కిశోర్ సుమారుగా 80 సినిమాల్లో నటించాడు..ఓ పది సినిమాలకు దర్శకత్వం వహించాడు. 12 చిత్రాలు నిర్మించాడు.. ఆ సినిమాలన్నింటికి తనే సంగీత దర్శకుడు.
చివరగా కిశోర్ పాడిన పాటల్లోనుంచి ఒకటి.” చల్తే చల్తే మెరె యే గీత్ యాద్ రక్ నా.. కభి అల్విద నా కెహెనా..” నిజమే. తన పాటతో మనల్ని కూడా అలా నడిపించుకుంటూ తీసుకెళ్ళిన కిశోర్ పాటని ఎలా మర్చిపోగలం?
CS Saleem Basha
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937))